Previous Page Next Page 
రక్తచందనం పేజి 3


    డాక్టర్ లేచి కిట్ తీసుకొని అదురుతున్న గుండెలతో కారుకేసి వేగంగా వెళ్ళిపోయాడు.
    ఆ మరుక్షణం కారు స్టార్టయి వేగాన్నందుకొని ముందుకు దూసుకుపోయింది. ఆ ముగ్గురూ చీకట్లో అదృశ్యమైపోయారు.
    కారు అరగంట ప్రయాణించాక అన్నాడు డ్రైవర్.
    "వాళ్ళెవరో తెలుసా?" అని.
    డాక్టర్ అర్థంకానట్లుగా చూశాడు.
    "వాళ్ళు వీరూ అనుచరులు" అన్నాడు డ్రైవర్ పొడిగా.
    డాక్టర్ అపరిమితమైన భయాద్వేగంతో వేయబోయిన కేక గొంతులోనే ఆగిపోయింది. వెయ్యి మెగావాట్ల విద్యుత్ షాక్ తగిలినవాడిలా అయిపోవటమే అందుక్కారణం. వీటితో సంబంధం లేనట్లుగా కారు సుడిగాలిలా దూసుకుపోతోంది.


                                           *    *    *    *


    న్యూఢిల్లీ....
    సెంట్రల్ సెక్రటేరియట్....సౌత్ బ్లాక్....
    పర్యావరణం, అడవుల సహాయమంత్రిత్వశాఖ కార్యాలయం....
    ఏ మంత్రిత్వశాఖకులేని విశాలమైన కార్యాలయంలో, విశేష అధికారాలను స్వంతం చేసుకున్న మంత్రి తన ఛాంబర్ లో సీరియస్ గా పచార్లు చేస్తున్నారు.
    అప్పుడు సమయం రాత్రి తొమ్మిది గంటలు.
    మంత్రి అప్పటివరకు ఆఫీసులోనే ఉండటం అధికారులకు ఇబ్బందిగా వున్నా సీరియస్ మేటరేదో డిస్ కస్ చేయటానికే ఆగిపోయుంటారని అర్థంచేసుకొని ఆయన ఆజ్ఞల కోసం ఎదురుచూస్తున్నారు.
    కాలం భారంగా గడుస్తోంది. ఆ మంత్రికి పచ్చదనమంటే ప్రాణం. వన్యప్రాణులంటే మరీ ప్రాణం.... కాంక్రీట్ జంగిలంటే విరుచుకుపడతారు. పచ్చదనాన్ని, పూలతోటల్ని ప్రేమించనివాడు మనిషే కాదని ఆయనకో స్థిరమైన అభిప్రాయం.
    ఇంటి ముందు ఆహ్లాదం కోసం, ఆరోగ్యం కోసం, వాతావరణ సమతౌల్య స్థితి కోసం నాలుగు మొక్కల్ని కూడా పెంచుకునేందుకు బద్దకించేవారంటే పైకే అసహ్యించుకుంటారు. వార్ని దేశద్రోహుల కింద జమకడతారు.
    బెంగుళూరులో లాగా ముందు మొక్కల్ని, మానుల్ని పెంచి హార్టీ కల్చరల్ డిపార్టుమెంట్ సర్టిఫికెట్ ప్రొడ్యూస్ చేయనివారికి, ఇల్లు కట్టుకొనేందుకు పర్మిషన్ ఇవ్వకూడదనే నిబంధనను దేశంలోని నగరపాలక సంస్థలన్నీ ఖచ్చితంగా అమలుపరిచే చట్టాన్ని తేవాలని, ఖాళీగా ఉండే ప్రైవేట్ వ్యక్తులు, సంస్థల భూముల్లో చెట్లు పెంపకాన్ని కూడా చట్టబద్ధం చేయాలని ఆయన తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
    మొక్కల్ని పెంచండి _ అవి మిమ్మల్ని రక్షిస్తాయి.
    నేటి మొక్కలే రేపటి మహావృక్షాలంటూ రేడియోలో, టీ.వీ.లో ఇచ్చే ప్రకటన అంటే ఆయనకు ఒళ్ళుమంట.
    "మనిషికి ఒక మాట" అనే స్థాయిని చాలామంది భారతీయులు ఎప్పుడో దాటిపోయారు. మనిషికో దెబ్బంటే తప్ప ఏ మంచిపనీ చేయరు. కనుక చట్టాన్ని తెచ్చితీరాలనే మొండి పట్టుదలతో వున్న ఆయన ఆ రోజు ఆగ్రహావేశాలతో ఊగిపోతున్నారు.
    పచార్లు చేస్తున్న ఆయన చటుక్కున ఆగిపోయి _"మంచి గంధం చెట్ల గురించి మీకేమన్నా తెలుసా?" తన శాఖ సెక్రటరీని ప్రశ్నించారు సూటిగా.
    సడన్ గా ఆయనలా అడిగేసరికి సెక్రటరీ, ఆయనతోపాటున్న మిగతా అధికారులు కూడా కలవరపడ్డారు. వారికంతగా వాటి గురించి తెలీదు. అందుకే మౌనంగా ఉండిపోయారు.
    "పల్లె ప్రాంతాల్లోని ప్రజలు వరదలొచ్చి తుఫానులొచ్చి కొట్టుకుపోయినా, దుర్భిక్ష పరిస్థితులేర్పడి ఆకలికి అలమటించిపోయినా మీ జీతాలు మీకు రావాలి. అలవెన్స్ లు కావాలి. అన్ని సౌకర్యాలు కావాలి. నిత్యం జీతాలు పెంచుకుంటూ పోవాలి. చాటుగా నాతాలూ కావాలి, లేదంటే సమ్మెలు హర్తాళ్ళు.... బందులు....
    ఒళ్ళువంచి పనిచేయటం నచ్చదు. ఫైళ్ళన్నీ నత్త నడకలు నడిపిస్తారు. జీతాలు పెంచాలని సంఘటితమవుతారు. ఒళ్లువంచి పనిచేసి దేశాభివృద్ధికి పాటుపడదామనే విషయంపై సంఘటితంకారు.
    మీ డిపార్టుమెంట్ గురించి మీకు తెలీదు. తెలుసుకొనే ప్రయత్నం చేయరు. ఎందుకంటే చేయకపోయినా మీ జీతాలు మీకొస్తాయి. లేదంటే సమ్మె ఉందిగా....? మంత్రి అగ్నిపర్వతంలా బ్రద్దలయిపోయారు.
    అధికారులు బిక్కచచ్చిపోయారు.
    "ప్రపంచం మొత్తంమీద తమిళనాడు అడవుల్లో తప్ప మరెక్కడా మంచి గంధం దొరకదు. సత్యమంగళం, బర్గూర్ రేంజెస్ లో నీలగిరి నుంచి ధర్మపురి వరకు వున్న పదివేల హెక్టార్ల అటవీ ప్రాంతంలో మంచిగంధం వృక్షాలున్నాయి. అక్కడ మాత్రమే అవి పెరుగుతాయి.
    రిచ్చెస్ట్ రిజర్వ్ ఆఫ్ సాండల్ ఉడ్....
    అపూర్వమైన అటవీ సంపద....
    ప్రకృతినే పరిమిళభరితంచేసే చందన వృక్షాలు....
    భారతీయుల సంస్కృతి, సాంప్రదాయాలతో ప్రగాఢమైన అనుబంధాన్ని పెంచుకున్న అతి విలువైన వృక్షాలు నానాటికి అంతరించిపోతున్నాయి.
    సత్యమంగళం. బర్గూర్ అడవులు తమిళనాడులోని పెరియార్ జిల్లాలో ఉన్నాయి. కర్ణాటక సరిహద్దులోని కొల్లెగాల్ వరకు, సేలమ్, ధర్మపురి పర్వత శ్రేణుల్లో పాలార్ నదికి సమాంతరంగా చందన వృక్షాలున్నాయి. ఆ ప్రాంతం దాదాపు ఐదువందల చదరపు కిలోమీటర్లుంటుంది.
    మూడొందల కిలోమీటర్ల పొడవునా, నూటయాభై కిలోమీటర్ల వెడల్పున విస్తరించుకొని ఉన్న చందన వృక్ష సంపద క్రమంగా క్షీణించి పోతోంది. కావేరీ నదికి ఉపనది అయిన పాలార్ పరివాహక ప్రాంతాలిప్పుడు స్మగ్లర్ల చేతుల్లోపడి సర్వనాశనమైపోతున్నాయి. ఇప్పుడక్కడ ఆర్గనైజ్డ్ స్మగ్లర్ గ్యాంగ్స్ మూడు పనిచేస్తున్నాయి.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS