Previous Page Next Page 
ఖడ్గసృష్టి పేజి 3


    మానవుడు పెరుగుతున్నాడు
    పరిసరాల నర్థం చేసుకుంటున్నాడు
    ప్రకృతి శక్తులను జయిస్తూ
    ఘన విజయాలు సాధిస్తున్నాడు.


    
        ఏదో నిరాశగా నేను
        ఇంతసేపూ వాగాను కదూ?
        ఇంకో వేపునుంచి చూస్తే
        ఎంత వెలుగు కనబడుతుందో?

 

    ఏమో బహుశా త్వరలో
    మీ ఇంటికే రావచ్చు మేము
    స్వాగతం ఇస్తావు కదూ
    ఆతిథ్యాని కర్హులమే మేము

 

        చంద్రమండలానికి ప్రయాణం
        సాధించరాని స్వప్నంకాదు
        గాలికన్న బరువైన వస్తువుని
        నేలమీద పడకుండా నిలబెట్టలేదూ?

 

    పరమాణువు గర్భంలోని
    పరమ రహస్యాలూ
    మహాకాశ వాతావరణంలోని
    మర్మాలూ తెలుసుకున్నాక

 

        సరాసరి నీ దగ్గరకే
        ఖరారుగా వస్తాంలే
        అప్పుడు మా రాయబారుల్ని
        ఆదరిస్తావుకదూ నువ్వు?        

 

    చిరకాలం అజేయంగావున్న
    ఎవరెస్టు ఇటీవలే లొంగింది
    చికిత్స లేదనుకున్న వ్యాధులు
    చిత్తగిస్తున్నాయి పరారీ

 

    పదార్థ విజ్ఞానశాస్త్రం
    అమోఘంగా వికసిస్తోంది
    ప్రాణం స్వభావం ఏమిటో
    పరిశోధనలు సాగుతున్నాయి

 

        మహానదుల గమనాలను
        మళ్ళించ గలుగుతున్నాం
        ఉత్తర ధ్రువంలో వ్యవసాయం
        ఒకప్పుడు జరిగి తీరుతుంది.

 

    సంహారం సంగ్రామం అంటే
    జనంలో అసహ్యం పుట్టింది
    ప్రశాంతంగా జీవించాలని
    ప్రజలంతా ఆశిస్తున్నారు.

 

    ఇదీ మా భూలోకం కథ
    ఇదీ మానవుడి Propress Report
    ఇందులో అతిశయోక్తు లేవీ లేవని
    ఎవరైనా ఒప్పుకుంటా రనుకుంటా.

 

    అంతా బాగానే వుందని
    అంత సుఖంగానే ఉన్నారని
    అన్నానంటే మాత్రం అది
    అబద్ధమే అవుతుంది.

 

        జనాభా లెక్కలు నాకు
        సరీగా తెలియవుగాని
        దరిద్రాల శాతం ఇంకా
        చిరాకు కలిగిస్తూనే ఉంది.

 

    ప్రపంచం మొత్తంమీద
    భయం పెత్తనం చేస్తోంది
    ఇరుగువాడు పొరుగువాణ్ణి చూసి
    ఎందుకో బెదిరిపోతున్నాడు

 

    ఇక్కడ మా భారతవర్షంలో
    ఎక్కువగా కబుర్లేగాని
    సమాజ స్వరూపం మార్చే
    సాహసం కనిపించకుండా వుంది.

 

    మొన్ననే ఆంధ్రరాష్ట్రం
    పుట్టినరోజు పండుగ చేసుకొంది
    పన్నెండు నెలల అభ్యుదయం
    పర్యాలోకనం చేసుకొంది.

 

        ఏడాదిలో ఏమవుతుంది
        ఇంకా కొన్నాళ్ళాగమంది
        చెల్లాచెదరైన తెలుగువారంతా
        తెల్లబోయి చూశారు!

 

    ఇవన్నీ చెప్పుకుంటూ
    ఎందుకు నిన్ను విసిగించడం శశీ!
    ఇప్పటికే ఆలస్యమయింది
    ఇంతటితో విరమించవా?

 

        చంద్రునికో నూలుపోగన్న
        సామెత వుండనే ఉంది
        తీసుకో ఈ దారంలాంటి
        తేలికైన గీతాన్ని.

 

    ఇంతకుముందే చెప్పానుగా
    ఏమీ పెగల్లేదని -
    ఇలాంటివెన్నో నువ్వు
    ఇదివరకు వినేవుంటావు.

 

        శరత్కాల గగనంలో
        చందమామ కనిపిస్తే
        సరదాగా కొంతసేపు
        సంభాషణ సాగించా.


    
    సంతాపం కొంతసేపు
    సంతోషం కొంతసేపు
    సాగించిన సంభాషణలో
    సారాంశం మరేముంది?

 

        ప్రసంగవశాత్తూ ఏ
        ప్రగల్భాలు పలికానో
        అసందర్భమైనా ఏ
        అడ్డదారి తొక్కానో

 

    వెనుక తిరిగి చూసుకొనే
    అలవాటే లేదు నాకు
    అరానిమిషం దాటేసరి
    కదే నాకు గత శతాబ్ది.    

 

        కావున ఓ జాబిల్లీ !
        రాబోయే యుగంలో
        కాలక్షేపం చేద్దాం
        కలుస్తావుగా మళ్ళీ?

 

    అప్పుడు బహుశా నాలో
    అరాజకం పోతుందనుకుంటా
    ఇప్పుడు బాధిస్తూన్న
    హృదయవేదన లుండవనుకుంటా

 

        శాఖా చంక్రమణం మాని
        చెప్పేదేదో సూటిగా
        బల్లగుద్దిన మాదిరిగ
        కుండ బద్దలుకొట్టిన బాపతుగా


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS