Previous Page Next Page 
అనూహ్య పేజి 2

        వయసువాకిళ్ళు తెరవి, మనసు లోగిళ్లలో, వలపుగొబ్బిళ్లు పెట్టి, తలపులన్నీ పాటలుగా మార్చి మలుపు మలుపులో కింద తనుపరువాలని దోచే దొంగ కోసం ఆశగా చూసే  చూపులే..... పెళ్లి చూపులు! ఆ రోజు నాకు పెళ్లిచూపులు!
    బాల్యానికి జనగణమన పాడి, యవ్వన ద్వారాలు తెరిచి మ్రోగించే గంటల గణగణ!
    చాపమీదకూర్చుని నా ఊహల్లో నేను వుండగానే-
    "అమ్మాయిని ఏమైన అడుగు తావా బాబూ!" అన్న బాబాయ్ గొంతు వినిపించింది.
    "అఖ్ఖర్లేదు! లోపలికి తీసుకెళ్ళండి" అన్నాడు.
    "ఆ కంఠం.... అతనిదే.... పెళ్లి కొడుకుది! నేను కళ్లేత్తి అతనివైపు చూడకుండా వుండలేకపోయాను. అతని  కంఠంలో అంతు లేని చిరాకు కనిపించింది.
    అతని స్పురద్రూపం నా గుండెల్లో సూటిగా గుచ్చుకుంది. చూపు మరల్చుకోవడం కష్టమై పోయింది.కానీ అతని   చూపులో చిరాకు....నా మనసుని రంపంతో పరపరా కోసేసినట్లనిపించింది.
    నా కళ్ళు విస్మయంగా అతన్నె  చూస్తున్నాయి. నా చూపులు....ప్రథమ చరుని కదిలించిన సుమబాణాల్లా రసరాగరంజితాలై.... ఎదలో మ్రోగే కళకూజితాలై... పారిజాత జలపాతాలై.... అతన్ని కదిలించలేదనడానికి తార్కాణంగా అతను లేచి నిలబడి-
    వాళ్ళమ్మతో పదమ్మా.... వెళ్దాం!" అన్నాడు.
    ఈ మాట నా అహం దెబ్బతింది.
    నా అందం  గూర్చి నాకు అద్దం  చెప్తుంది. ఆకర్షణ గురించి కాలేజిలో నాకు వచ్చిన అసంఖ్యాకమైన ప్రేమలేఖలు చెప్పాయి! తెలివితేటలు గురించి పరిక్షల్లో వచ్చిన మార్కులు ధృవపరిచాయి
    అటువంటి.... ఇతడు గడ్డిపోచలా నన్ను తీసి పారేసి, ఇంత చిరాగ్గా చూస్తాడేందుకు? నేను అతనికి నచ్చలేదా? ఆ భావనే నాకు జిర్ణంకాలేదు.
    బాబాయ్ కి  కంగారేసినట్లుంది. డాక్టర్ సంబంధం తప్పిపోయిందేమోనని!" అమ్మాయ్ ని  ఏమైనా అడగండి బాబూ!" అన్నాడు.
    "అడగటానికి ఏంలేదు" అతను నిర్లక్ష్యంగా జావాబిచ్చాడు.
    "వివేక్...." మెత్తగా మందలిస్తున్నట్లుగా వినిపించింది అతని తల్లి కంఠం.
    నేను ఆవిడవైపు చూశాను. చాలా 'మదర్లీ' గ వుంది
    తల్లి మందలింపును అర్ధం చేసుకున్నట్లుగా అతను స్దిమితంగా కూర్చుని- "అనూహ్యగారూ మీరు హైద్రాబాద్ లో గ్రాడ్యుయేషన్  చేశారని  విన్నాను. నిజమేనా?" అన్నాడు.
    "ఔను" అనడానికి గొంతు పూడుకుపోయినట్లయి గబగబా తల  ఊపేశాను.
    అతను సీరియస్ గా "డిగ్రీ సర్టిపికెట్ మీ దగ్గర వుందా?" అని అడిగాడు.
    దెబ్బతిన్నట్లుగా చూశాను.
    నాకు  విజయ గుర్తొచ్చింది. చాపమీద పూలజడ భారానికి తల వంచుకుని కూర్చునే నిన్నూ, పరీక్షాధీ కారిలా ప్రశ్నలు వేసే అతన్నీ దగ్గరుండి చూడాలనే వుందికానీ, పరీక్షలవల్ల రాలేకపోతున్నాను!' అని ఎంత  హేళనగా  రాసిందది ఉత్తరం! ఇతని ప్రశ్నలూ వాటం తేలిస్తే, అగ్గిమంటై పోతుంది!
    "అమ్మాయ్ , నీ డిగ్రీ  సర్టిఫికెటట....పట్రా బాబాయ్ హడావుడి పెట్టేస్తున్నాడు.
    నాకు బావురుమని ఏడవాలనిపించింది. పక్కనే  కూర్చున్న పక్కింటి పిన్నిగారివైపు సాంత్వన కోసం  చూశాను. ఆవిడ ముఖంలో సినిమా చూస్తున్నంత సరదా ఫీలింగ్ కన్పించింది. తలతిప్పి తలుపు వారగా నిలబడ్డ అమ్మవైపు చూశాను.
    అమ్మ కళ్ళల్లో దిగులు కనిపించింది.
    నేను కళ్ళతోనే  అమ్మమ్మకోసం  వెదికాను ఆవిడ అమ్మ వెనుకనుండి వస్తూ "ఏం భయంలేదు' అన్నట్లు కళ్ళతోటే నాకు  అభయం ఇచ్చింది.
    "మీకుమా పాప డిగ్రీ పాసవలేదని అనుమానమా నాయనా?" అంది.
    "ఔను!" ఠకిమని చెప్పాడు వివేక్.
    నేనింక ఓర్చుకోలేకపోయాను.
    రోషంతో నా  ముక్కుపుటాలు అదుర్తుండగా అతనివైపు సూటిగా  చూస్తూ-
    "మేము అబద్దాలు చెప్పేవాళ్ళలా కానీపిస్తున్నామా? నాకు బి.ఏ.లో  ఫస్టుక్లాసు వచ్చింది. గొప్ప డాక్టర్! ఎమ్.డి అని విని చాలా సంస్కారవంతుడనుకున్నాము. కానీ ఇలా  పెళ్లిచూపుల పేరిట ఓ ఆడపిల్లని  అవహేళన  చేస్తారానుకోలేదు. అసలు మీ ఉద్దేశం ఏమిటి?" అని అడిగాను.
    "అనూ...."అమ్మ ఆందోళనగా పిలిచింది.
    "తప్పమ్మా! అలా మాట్లాడకూడదు" బాబాయ్ అడ్డుపడ్డాడు.
    నేను  గభాల్న లేచి నిలబడి "అసలు పెళ్లిచూపులకని ఇలా గంగిరెద్దులా అలంకరించుకుని కూర్చోనడం, మీ అడ్డమైన ప్రశ్నలకి జవాబు లివ్వడం నాదే తప్పు!" అన్నాను.
    "ఎగ్జాట్లి!" వెంటనే అన్నాడు వివేక్.
    నేను అనబోతున్న మాటని మింగేసి అతనివైపు ఆశ్చర్యంగా చూశాను.
    అతను చిన్నగా నవ్వి "ఇప్పుడు  నమ్ముతున్నాను. మీరు చదువుకున్నారని! పెళ్లిచూపులు అనగానే ఒద్దికగా పెద్దవాళ్ళు తయరనమన్నట్లుగా తయారయి పోవడం. అతివినయంగా  ఏదో తప్పుచేసినదాన్లా చాపమీద తల వంచుకుని కూర్చోవడం చూసి నాకు  డౌట్  వచ్చింది! ఈ  రోజుల్లో  ఇలా  అవసరంలేదేమో.... నేను  కుర్చీలో . మీరు చాపమీదా కూర్చోవడానికి మీరేమైనా ఎలిమెంటరి స్కూలు విద్యార్ధివా.
    పెళ్లిచూపులు అనగానే....వంట చెయ్యడంవచ్చా? పాటలు పాడడం వచ్చా? కుట్లూ  అల్లికలూ తెలుసా? అవే ప్రశ్నలకన్నా పాలిటిక్స్ గురించి  ఎవేర్ నెస్  వుందా? ఒంటరిగా అన్నిపనులూ మేనేజ్ చేసుకునే చౌకచక్యం వుందా? చుట్టూ వున్న మనుషులతో మింగిల్  అయి బతకడం  చాతనవుతుందా? అని తెలుసుకోవడం అవసరం అనుకుంటాను నేను" అని నా కళ్ళలోకి చూశాడు.
    అప్పుడు నాకు మొదటిసారిగా చచ్చేటంత సిగ్గేసింది. గిరుక్కున వెనక్కి తిరిగి లోపలికి వెళ్ళిపోయాను. అమ్మమ్మ పెట్టిన వడ్డాణం, అమ్మ బెనారస్ సీల్క్ చీరా ఒంటికి ముళ్ళలా గుచ్చుకొంటున్న అనుభూతి! అద్దంలో చూసుకుంటే నా ప్రతిరూపం  నాకే జాతరలో నూకాలమ్మలా కనిపించింది.
    పాపిటిచేరూ, చెవులకి రాళ్ళబుట్టలూ, తలనిండా  బుట్టెడుపూలూ.... అమ్మమ్మ బాధపాడ్తుందేమోనని, కోపం తెచ్చుకుంటుదేమోననీ చేయించుకున్న అలంకరణలు ఎంతటి అవమానాన్ని  తెచ్చిపెట్టాయి! తలుపు గడియ పెట్టుకుని , ఒంటిమీద వున్నవాన్ని విప్పి, విసిరికొట్టి, నైటి వేసుకుని  పడుకున్నాను. బుగ్గలమీద తడితడిగా....కన్నీరు! ఎందుకో?
    అమ్మా, అమ్మమ్మా  బయటనుంచి పిలుస్తున్నారు.
    "నన్ను సాయంత్రందాకా  పిలవకండి. నేను పడుకోవాలి!" అని అరిచాను.
    మాటిమాటికి అతని  రూపం, సన్నగా మీసం చాటునుండి వెక్కిరింతగా నవ్వినా నవ్వూ గుర్తొస్తూన్నాయి. నోటికి వచ్చినట్టల్లా  తిట్టుకున్నాను. బాధ ఎక్కువైంది కానీ తక్కువవలేదు.
    అతను  కాకపోతే ఇంకోడు వస్తాడు!చీ! అసహ్యంగా 'నాకు అవసరం లేదు. నేను పోతాను' అన్న వాడిగురించి ఆలోచన ఏమిటసలు? నాకేం తక్కువని?
    ఆలోచనలతో  తల నొప్పోచ్చింది. దిండంతా కన్నీళ్లతో తడిసిపోయింది. జీవితంలో తొలి అన్న మాటకి ఎంతో ప్రత్యేకత వుంది! తొలిసారి.... తొలి చూపు... తోలివలపూ  అని కానీ  అతను  తొలిచూపులోనే నామీద విసుగుని ప్రదర్శించాడు! ఒకవేళ అతనితో జీవితం పంచుకోవడం జరిగితే .... అమ్మో! బయటనుండి బాబాయ్ పిలుస్తున్నాడు-             "అనూహ్య .... తల్లీ అనూహ్య....ఒక్కసారి తలుపు తెరువు తల్లీ!"
    నేను లేచే ప్రయత్నం  చెయ్యలేదు అందరిమీదా కోపంగా ఉక్రోషంగా ముఖ్యంగా మివేక్ అనబడే ఆ పెద్దమనిషి మీద పికల దాకా  కసిగా వుంది!
    "నువ్వు  ఏ అఘాయిత్యమైనా చేసుకుంటే నేను  బ్రతకను!" అమ్మ ఏడుపుగొంతుతో అంటోంది
    ఆ మాటకి నాకు చిర్రెత్తుకొచ్చింది. గతుక్కున లేచి "పెళ్ళిసంబంధం తప్పిపోతే ఆత్మహత్య చేసుకునేటంత పిచ్చిదాన్ని కాదు! పోతే పోనీ వీడ్ని మించినవాడు ఇంకొకడు....
    అసలు ఏమనుకుంటున్నాడు? పెద్ద ఎమ్.డి. అంటే మెడకో డోలు అని అర్ధం....వీడి కాళ్ళమీద పడిపోతానని అనుకుంటున్నాడా?" అని  అరుస్తూ తలుపు తిసి బొమ్మలా  వుండిపోయాను.
    వివేక్  ద్వారబంధానికి అటూ ఇటూ  తన రెండు  చేతులూ   ఆన్చి నవ్వుతూ  నిలబడివున్నాడు!
    "మీకు సారీచెప్పి వెళ్దామని వెనక్కివచ్చాను. బై ది బై మీరు  నాకు చాలా నచ్చేశారు. ఇప్పుడు కాదు  నిన్న సాయంత్రమే! గుడి అరుగుమీద ముగ్ధలా కూర్చుని పారిజాతాలు మాల గుచ్చుతున్నారు చూడండి....అప్పడే నచ్చేశారు!
    ముగ్ధ అంటే  మూగమొద్దులా వుండటం కాదని నా అభిప్రాయం అందుకే  కాస్త షేక్ చేశాను! మిగతాది తర్వాత చేస్తాను మీకు నేను నచ్చితే...."అని కోంటేగా కన్నుకొట్టాడు.
    అదిరిపడి అటూ ఇటూ చూశాను.   
    అతను కన్నుగీటడం ఎవరికీ కనిపించదు.
    బాబాయ్, అమ్మా, అమ్మమ్మ, వెలిగిపోతున్న ముఖాలతో అతని వెనుకగా నిలబడివున్నారు.                      
    "నేను మీకు నచ్చితే కనుక నా చేతిలో మీ చేతిని వుంచండి. లేదా...." అంటూ చెయ్యి జాపాడు.
    నేను క్షణం  కూడా ఆలోచించకుండా చటుక్కున నా చేతిని అతనిచేతిలో వేసేశాను. ఆలోచించివుంటే ఏమయ్యేదో మరి! తొలిసారిగా మగస్పర్శ! వెచ్చగా....గరుకుగా....హాయిగా, మత్తుగా అనిపించింది. అతను నా చేతిని కొద్దిగా నొక్కి వదిలేస్తూంటే, 'వద్దు.... ఇంకాసేపు అలాగే పట్టుకోండి' అని చెప్పాలనిపించింది.
    "యూ ఆర్  బ్యూటిపుల్!" అని పెదవులు సున్నాలా చుట్టాడు.
    ఆ చేష్టలకి తట్టుకోలేకపోయాను. స్వర్గం అంటే ఇతని సమక్షంలోనే, ఇతనితో నరకానికైనా  నవ్వుతూ వెళ్ళిపోవచ్చు అనిపించింది. బహుశా ప్రతి ఆడపిల్లకి ఈ స్టేజ్ వస్తుందనుకుంటా!
    అతను చెయ్యి ఊపి వెళ్ళిపోతూవుంటే నా ప్రాణాలన్నీ మూటగట్టుకుని అతనితో పట్టుకుపోతునట్లుగా అనిపించింది.
    లోపలికి పరిగెత్తి అద్దంలో ముఖం  చూసుకున్నాను. ఏడ్చి ఏడ్చి ఉబ్బిన బుగ్గలూ ఎర్రబారి కలువరేకుల్లా వున్న కళ్ళూ! ఇవాఅతనికి' బ్యూటిపుల్ గా కనిపించినవి! ఫారెన్ రిటర్న్ డ్ ట కదా....అనే అందంగా కనిపించాయేమో అని సరిపెట్టుకున్నాను

                                            *         *        *


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS