Previous Page Next Page 
బుద్ధిజీవి పేజి 2

రెప్ప వెయ్యకుండా అతనివైపే చూస్తున్న అపురూపకి కాలింగ్ బెల్ చిన్న వెండి గంటలా మోగడం కొద్దిక్షణాల దాకా వినబడలేదు. మెయిన్ గేటు దగ్గరకు ఎవరన్నా వస్తే దానంతట అదే యాక్టివేట్ అయి మోగుతుంది కాలింగ్ బెల్.
అందుబాటులోనే ఉన్న రిమోట్ కంట్రోల్ స్విచ్ నొక్కింది అపురూప.
గేటు, ఆ తర్వాత సింహద్వారం ఆటోమాటిక్ గా తెరుచుకున్నాయి.
యూనిఫారంలో ఉన్న ఒక పోలీసు ఆఫీసరూ, తనకి రెండు సైజులు పెద్దదైన సూటు వేసుకున్న ఒక ప్రొఫెసరూ లోపలికి అడుగుపెట్టారు.
వాళ్ళని అనుసరించి వచ్చాడు మరో యువకుడు. పొడుగ్గా బలంగా ఉన్నాడు.
అపురూప అతన్ని చూడగానే ఉలిక్కిపడి సంభ్రమంగా టీవీ స్క్రీన్ వైపు చూసింది. అతనే! టీవీలో కనబడుతున్న సంజీవ్ కొడుకు అజితే అతను. హఠాత్తుగా తమ ఇంటికి ఎందుకు ...
"సారీ ఫర్ ద డిస్టబెన్స్ మేడమ్!" అంటూ దగ్గరకు వచ్చి తన ఐడెంటిటీ కార్డు చూపించాడు పోలీసాఫీసరు. "అయామ్ కమిషనర్ విక్రమ్. వీరు ప్రొఫెసర్ నవీన్ అండ్ దిస్ యాంగ్ మాన్ ఈజ్ అజిత్. డాక్టర్ సంజీవ్ గారి అబ్బాయి. మీరు న్యూస్ ఐటెమ్ వినే ఉంటారు."
ఒక్క గుటక వేసింది అపురూప. "ఏ న్యూస్ అయిటెమ్? తప్పించుకుపోయిన రాబొట్...అదేనా?" అంది.
"అవును! డాక్టర్ సంజీవ్ ని చంపేసి తప్పించుకుపోయిన రాబొట్ బహుశా మీ ఇంట్లోనే ప్రవేశించి ఉండవచ్చుననీ, లేదా ప్రవేశించడానికి ప్రయత్నం చేయవచ్చుననీ మాకు ఇంటర్ పోల్ సంస్థ మెసేజ్ పంపింది."
"ఐసీ!" అంది అపురూప అస్పష్టంగా - ఐసు ముక్కని మింగేసినట్లు ఉక్కిరిబిక్కిరి అయిపోతూ.
క్షణాల క్రితం టి.వి.లో చదివిన వార్త తాలూకు సమస్య ఇలా నేరుగా తమ డ్రాయింగ్ రూంలోకే చొచ్చుకు వచ్చెయ్యడం ఆమెకు దిగ్భ్రమ కలిగించింది. సోఫాలో ఠీవీగా కూర్చుని, టీవీ చూస్తూ, తప్పించుకు పోయిన రాబొట్ ని తలుచుకుని సన్నటి భయంలాంటి థ్రిల్ ఫీలవుతూ, ప్రపంచం మీద జాలిపడినట్లు కాదు ఇది!
తమ ఇంట్లోనే! రాబొట్! నరహరి!
అతి కష్టం మీద గొంతు స్వాధీనంలోకి తెచ్చుకుంది అపురూప.
"రాబోటా? మా ఇంట్లోనా? ఎందుకు?" అంది బలహీనంగా.
"ప్లీజ్! టైంలేదు. వివరాలు తర్వాత చెబుతాం! డాక్టరుగారి లేబోరేటరీ ఎక్కడ?" అన్నాడు కమీషనర్ విక్రమ్.
చూపించింది అపురూప.
"మీ మమ్మీని పిలవండి. త్వరగా!"
"లేబ్ లో ఉన్నపుడు డిస్టర్బ్ చేస్తే మమ్మీకి చాలా కోపం వస్తుంది."
తను ఎక్స్ పెరిమెంట్సులో మునిగిపోయి ఉన్నప్పుడు ధ్యాస మళ్ళిస్తే డాక్టర్ శోధనకి వెర్రికోపం వస్తుంది. ఆ అనుభవం నాలుగైదుసార్లు జరిగింది అపురూపకి.
"ఫర్ హెవెన్స్ సేక్!" అంటూ అసహనంగా లేబొరేటరీ దగ్గరికి వెళ్ళి దబదబ తలుపు బాదాడు విక్రమ్.
సమాధానం లేదు.
మళ్ళీ...మళ్ళీ...మళ్ళీ...తలుపు కొట్టాడు.
నిశ్శబ్దం.
అతను ప్రొఫెసరుగారివైపు ఆదుర్దాగా చూశాడు.
"అనుకున్నంతా అయింది!" అన్న నిస్పృహ కనబడుతోంది ప్రొఫెసర్ గారి చూపుల్లో. తలుపు దగ్గరికి వెళ్ళి పరీక్షగా చూశాడు. "సోనిక్ లాక్! ఈ తాళం డాక్టర్ శోధనగారి కంఠ స్వరానికే ట్యూన్ అయివుంటుంది. ఆమె స్వయంగా 'తెరు' అంటే తప్ప తెరుచుకోదేమో బహుశా!
అవునన్నట్లు తల ఊపింది అపురూప. ఆమెకి అంతా అగమ్యగోచరంగా ఉంది. ఆ రాబొట్ అమ్మని ఏమీ చెయ్యదు కదా?
"మే ఐ హెల్ప్ యూ?" అంటూ ముందుకు వచ్చాడు అజిత్. జేబులోనుంచి చిన్న లేసర్ గన్ తీసి తలుపువైపుకి గురిపెట్టి కాల్చాడు. వర్ణించలేనంత పదునుగా ఉన్న కాంతి కిరణం ఒకటి అందులో నుంచి వెలువడి ఆ ఉక్కు తలుపుని కేకుని కోసినట్లు కోసేసింది. ఒరిగి కింద పడిపోయింది తలుపు.
'ఉడుకు రక్తం!' అన్నట్లు నొసలు చిట్లించి చూశాడు విక్రమ్. అసలు ఈ కుర్రాడికి 'లేసర్ గన్' లాంటి ప్రమాదకరమైన ఆయుధం జేబులో పెట్టుకుని తిరగడానికి లైసెన్సు వుందా?
అతనికి లైసెన్సు వున్నా లేకపోయినా తనేమీ చెయ్యలేడనీ, అతను అమెరికన్ పౌరుడనీ, పైగా వరల్డ్ ఫేమస్ సైంటిస్ట్ సంజీవ్ గారి కొడుకనీ గుర్తుంది విక్రమ్ కి. అందుకని మొహం అప్రసన్నంగా పెట్టుకుని, "మిస్టర్ అజిత్! ఏమి చెయ్యాలో మమ్మల్ని నిర్ణయించనివ్వండి. చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోకండి" అన్నాడు తీవ్రంగా.
అప్పటికే అజిత్ లోపలికెళ్ళిపోయాడు. అతన్ని అనుసరించారు అందరూ.
లోపల కాలం స్థంభించినట్లు ఉంది. స్థబ్దంగా ఉంది లేబొరేటరీ.
డాక్టర్ శోధన లేదు అక్కడ!
"అమ్మా!" అని పిలిచింది అపురూప సన్నగా వణుకుతూ. "అమ్మా! అమ్మా!"
ఆ పిలుపుకి సమాధానం చెప్పడానికిగానీ, తనను డిస్టర్బ్ చేసినందుకు తిట్టడానికి గానీ డాక్టర్ శోధన అక్కడ లేదు!
లేబొరేటరీ వెనుకవైపు గోడకి మనిషి ఆకారంలో ఒక కంత ఏర్పడి వుంది.
ఆ రాబొట్ పశుబలంతో, అతి సునాయాసంగా గోడలో నుంచీ లోపలికి చొచ్చుకు వచ్చేసి డాక్టర్ శోధనని పసి పాపాయిని ఎత్తుకున్నట్లు ఎత్తుకుని అవలీలగా తీసుకెళ్ళిపోయి వుండాలని అర్ధమైపోతోంది ఆ కంతని చూస్తుంటే.
"మైగాడ్!" అన్నాడు అజిత్. కొద్దిక్షణాల పాటు అందరూ కర్తవ్య మూఢుల్లా నిలబడిపోయారు.  
"నౌ టెల్ మీ! ఏమిటిదంతా? ఏమయింది మా అమ్మ? చెప్పండి! దిస్ ఇన్ స్టన్ ట్!" అంది అపురూప దుఃఖంతో వివశురాలైపోతూ.
ప్రొఫెసర్ నవీన్ కర్చీఫ్ తో నుదురు తుడుచుకుని చెప్పడం మొదలెట్టాడు.
"అయామ్ సారీ అపురూపా! కొన్ని నిజాలు మీకు తెలుసో తెలియదో గానీ ఇప్పుడు చెప్పక తప్పదు. మీరు టెస్ట్ ట్యూబ్ బేబీ అని మీకు తెలుసా?" అన్నాడు.
ఆయనకీ తన సబ్జెక్టులో తెలివి ఉందే తప్ప లౌక్యముగా, నాజూగ్గా మాట్లాడటం చేతకాదు.
"తెలుసు! నాలాంటి టెస్ట్ ట్యూబ్ బేబీస్ ఈ ఊళ్ళోనే లక్షమంది వున్నారు అందులో వింతేముంది?" అంది అపురూప పదునుగా.
తన తల్లి అవివాహిత అని తెలుసు అపురూపకి. ఎవరో గుర్తు తెలియని 'దాత' తాలూకు వీర్యంతో స్త్రీ అండాన్ని కలపగా లేబొరేటరీలో, పరీక్ష నాళికలో సృష్టింపబడ్డ అమ్మాయినని తెలుసు తనకి.
అయినా ఎవరన్నా ఆ ప్రసక్తి ఎత్తితే ఎందుకో కంపరంగా వుంటుంది.
పెళ్ళీ, సంసారం , మొగుడూ, బంధువులూ - ఈ తాపత్రయం అంతా తన పరిశోధనలకి అడ్డం అని అమ్మ అభిప్రాయం. కానీ పిల్లలంటే మాత్రం ప్రాణం అమ్మకి.
అందుచేత మగ 'తోడు' లేకుండానే లేబొరేటరీలోనే 'కన్నది' తనని.
అది వీళ్ళు ఎత్తి చూపడం ఎందుకు? ఈ రోజుల్లో పెళ్ళి అనేది అంత అత్యవసరం కాదే! పెళ్ళికీ, పిల్లలని కనడానికీ అవినాభావ సంబంధం లేదే! అయినా ఎందుకు వీళ్ళిలా-?
ఆ అమ్మాయి అప్ సెట్ అయిపోవడం గమనించి స్నేహంగా ఆసరా ఇస్తున్నట్లు ఆమెకి కొద్దిగా దగ్గరికి జరిగి నిల్చున్నాడు అజిత్.
ప్రొఫెసర్ గొంతు సవరించుకుని మళ్ళీ చెప్పడం మొదలెట్టాడు.
"జెనెటిక్ ఇంజనీరింగ్ టెస్ట్ ట్యూబ్ బేబీస్ ని తయారుచేసే స్టేజిని దాటి క్లోనింగ్ వైపు సాగిపోయింది. క్లోనింగ్ అంటే చెట్టుకి అంటుకట్టి కొత్త చెట్టుని సృష్టించినట్లు, కార్బన్ కాపీలలాంటి మనుషులని తయారు చెయ్యడమన్నమాట!
ఇన్నాళ్ళనుంచీ డాక్టర్ శోధనగారు అలాంటి ఎక్స్ పెరిమెంట్సులో నిమగ్నమయి ఉన్నారని అనుకున్నాం అందరం. కానీ ఈ మధ్య సైంటిఫిక్ సర్కిల్స్ లో ఒక పుకారు వచ్చింది. ఎక్స్యూజ్ మి! డాక్టర్ శోధనగారు తను ఈ మధ్య చేస్తున్న వర్క్ గురించి మీకేమైనా చెప్పారా అపురూపా?"
"వైది హెల్! నాతో ఎందుకు చెబుతుంది?"
విచారంగా తల ఊపాడు ప్రొఫెసరు.
"అవును! మీకేకాదు. మరే ప్రాణికీ చెప్పలేనంత రహస్యమైన పరిశోధన అది! బాక్టీరియల్ వార్ ఫేర్ కి పనికివచ్చే భయంకరమైన విషక్రిమిని, మనకు ఇంతవరకూ తెలిసిన ఏ యాంటీ బయోటిక్స్ కిగాని, విరుగుళ్ళకి గానీ లొంగని విషక్రిమిని మీ మమ్మీ సృష్టించే ప్రయత్నంలో ఉన్నారని గుసగుసలు బయలుదేరాయి. ఏ కారణం వల్లో డాక్టర్ శోధన హఠాత్తుగా మారిపోయారు. స్త్రీ పురుషుల సృష్టికార్యంతో నిమిత్తం లేకుండానే మనుషులని సృష్టించడం పర్ ఫెక్టు చేసి సులభతరం చేసిన డాక్టర్ శోధన ప్రాణం తీసే ప్రాణులని సృష్టించడం కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు - దాదాపు ఆరు నెలల నుంచీ! ఆ క్రిమిని ప్రయోగిస్తే దేశాలకు దేశాలే నిర్జీవమై పోతాయి ఒక్క రోజులో! డాక్టర్ శోధన హఠాత్తుగా ఎందుకు ఇలాంటి పరిశోధన మొదలెట్టారో ఎవరికీ ఊహకి అందటం లేదు."
అజిత్ చిన్నగా దగ్గాడు.
"ప్రొఫెసర్! మీకు గుర్తుండే ఉంటుంది. ఇప్పటికి సరిగ్గా ఆరునెలల క్రితమే ఆకాశంలో ఒక యూ.ఎఫ్.ఓ. కనబడింది - చాలా సంవత్సరాల తర్వాత! మళ్ళీ మా నాన్నగారు చనిపోయిన రోజున కూడా ఆ యూ.ఎఫ్.ఓ. కనబడింది."
"షిట్!" అన్నాడు కమీషనర్ విక్రమ్ పెదాల బిగువున. "నేను అలాంటి సిల్లీ థింగ్స్ ని నమ్మను."


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS