Previous Page Next Page 
మోదుగుపూలు పేజి 2


    సంభాషణ వింటూ నుంచొన్న జనాన్ని చూచి పెట్టె చేతిలోనుంచి లాక్కొని ఆఫీసులోకి సాగిపోయాడు జవాను. అతడు అనుసరించాడు. జనం వెళ్ళిపోయారు.

 

    వచ్చినవానిని చూచి "బైటో మారాజ్! నీకు ఖానూన్ చెప్పేటంతోణ్ణి కాను. ఇది జాగీర్ మారాజ్ జాగీర్! అక్బార్ ఈడపడెయ్యి. సందుక పట్కపో. హైదరాబాద్ కెల్లిరా బొంబాయి కెల్లిరా ఎతరాజ్2 లేదు. ఈడ పడెయ్యి. సందుక పట్కపో. హైదరాబాద్ కెల్లిరా బొంబాయి కెల్లిరా ఎతరాజ్ లేదు. ఈడ తాసిల్దారున్నాడు సూశినవా? వాడు సైతాన్ మారాజ్ సైతాన్. అక్బార్ పట్కపోతివా బత్కనీయడు. ఇగ కైరియత్3 ఉండదనుకో. అవునుగని మారాజ్? పట్నం కెల్లి వస్తున్నవుగదా మా జీతాలు సంగతేమన్న తెల్సినాదీ? ఏమన్న పెంచుత డంటనా హుజూర్4? లడాయి ఎన్నడై పోతదోగని సౌదలన్నీ పిరమైతాండె5, జీతాలేమో పెంచడాయె హుజూర్."

 

    "ఈ పత్రికమీద నిషేధంలేదు. అందరు చదివేదే. జాగీరు అయితే ఎక్కువా? నైజాంలో భాగంకాదా! పత్రిక తీసుకునే పోతే ఏమైతదో చూస్త"

 

    "నా పానం మీది కెందుకు తెస్తవు మారాజ్! అక్బార్ అంటావా సందుకిచ్చెడ్డిలేదు. ఇగనీమర్జీ ఏమి చేస్కుంటవో చేసుకో."

 

    "సందుక ఉంచుకుంటె రాశీదియ్యి. పేపరు మాత్రం తీస్కపోయేదే."

 

    "రశీద్ గిశీద్ ఏమ్ లగాయించినవ్? ఎన్నడన్న యిచ్చినమా? సందుక ఇడిచిపో మాసూలేసి పంపుతం. శాన ఖానూన్లు మాట్లాడ్తన్నవుగని. సందుకియ్యనంటే ఏమ్ చేస్కుంటవ్? ఆఁ ఆ మాటకొస్తె అక్బార్ కూడా ఆడనే యేయించి పంపుత ఏమన్న సర్కారనుకొన్నావా? దిల్లకా?"

 

    "అచ్ఛా ఉంచుకో. సందుక నువ్వే పంపుతవు. ఎట్ల పంపవో చూస్త. సర్కారంటే సతాయించెటంద్కు ఉన్నదనుకున్నవా?" అని పేపరందుకొని సాగిపోతుంటే పిలిచాడు జవాను.

 

    "ఏమో శాన గరమైతున్నవ్ మారాజ్! గరీబోల్లం మే మెట్ల బతకాలె. చా నీల్లకు పైసలు పారేసి సందుక తీస్కపో, మేమేం చేస్కుంటం నీ సందుకు" అని చేయి చాచాడు.

 

    అతడు పావలా జవాను చేతిలో వేశాడు. జవాను వంగి సలామ్ చేసి "మీ కైరియత్ కోసం చెప్పుతున్న. అక్బారీడ పడేసి పోరి" అని మళ్ళీ సలాం చేశాడు జవాను.

 

    అతడు సూట్ కేసు, పేపరు తీసుకొని కత్తుల బోను నుంచి బయట పడ్డాడు. సాగిపోతున్నాడు. వీధుల్లో జనం అతణ్ణి వింతగా చూడసాగారు. చౌరస్తాల పక్కలకు పడివున్న విరిగిన దేవాలయాల స్తంభాలమీద కూర్చొని ఈ విషయమే మాట్లాడుకుంటున్న తలగుడ్డల పెద్దమనుషులు తమకు తెలియకుండానే లేచి నుంచున్నారు. వింతగా అతనివైపు చూచారు. పద్మవ్యూహం నుంచి గెల్చి బయటపడే అభిమన్యుణ్ణి చూసినట్లు చూచారు.

 

    అతడు సాగిపోతున్నాడు. రాతి స్తంభం కనిపించింది. అది తాడిచెట్టు కంటే ఎత్తైంది. దాని మీద చిన్న గుడిలాంటిది ఉంది. అందులో గరుత్మంతుని విగ్రహం వుంది. ఆ గుడికి వ్రేలాడుతూ గంటలున్నాయి. గాలికి ఊగుతూ సన్నగా మ్రోగుతున్నాయి. అది ఒక కాలంలో మహావైభవం చూచిన గోపాలస్వామి ఆలయపు ధ్వజస్తంభం. ఆలయం ఉండినచోట కోనేరు తప్ప ఏదీ మిగులలేదు. ఆ ఊరినిండా ఆ దేవాలయం బాపతు స్తంభాలూ విగ్రహాలే పడివుంటాయి. ఆ దేవాలయాన్ని ఔరంగజేబు దండయాత్ర సమయంలో కూల్చాడో, ముసల్మానుల జాగీరు అయిం తరువాత కూల్చారో చెప్పడానికి చారిత్రాత ఆధారాలు లేవు.

 

    ఆ గ్రామం ప్రతాపరుద్రుని కాలంలో వైభవోపేతమైన మహానగరం అని చెపుతారు పెద్దలు. అందుకు నిదర్శనముగా వేయి స్తంభాల గుడికి నమూనాలు అనదగిన అనేక చిన్న చిన్న శిధిల దేవాలయాలు ఆ ఊరి చుట్టుపట్లల్లో ఉన్నాయి. ప్రతాపరుద్రునిచే నిర్మించబడినవి అనబడుతున్న సముద్రాల వంటి మహా తటాకాలు కూడా ఉన్నాయి.

 

    ఆ గ్రామానికి మరొక ఐతిహ్యం కూడా వుంది. పాండవులు వనవాస కాలంలో కొంతకాలం అక్కడ ఉండిరట! ఇప్పటికీ పాండవుల విగ్రహాలు ద్రౌపది సహితంగా ఉన్నాయక్కడ! వానలు పడనప్పుడు గ్రామస్థులు ఆ విగ్రహాలవద్ద పెద్ద ఉత్సవం జరుపుతారు. ఘటాభిషేకం చేస్తారు. అలా చేస్తే వాన పడుతుందని గ్రామస్థుల విశ్వాసం.

 

    ప్రస్తుతం ఆ గ్రామం జాగీరుకు రాజధాని నగరంలాంటిది. అక్కణ్ణుంచే జాగీరు వ్యవహారాలన్నీ నడుస్తుంటాయి. రోడ్ల పేరుతో చలామణీ అవుతూన్న దుమ్ములోంచి సాగిపోతున్నాడతను.

 

    అతడు ఊరిలోంచి సాగిపోతున్నాడు. పెద్ద బజారునుంచి వెళుతున్నాడు. దుకాణాల్లో జనం విరివిగా ఉన్నారు. అమ్మేవారు అమ్మకం మాని అతణ్ణి చూస్తున్నారు. కొనేవారు కొనుగోలు మాని చూస్తున్నారు. హోటళ్ళలో టీ తాగుతున్న వారు వదిలివచ్చి అరుగులమీద నుంచుని చూస్తున్నారు.

 

    అతడు సాగిపోతున్నాడు. వారంతా తననే చూస్తున్నారని కూడా ఎరగడతను. ఉత్తరం సైతం రాయకుండా వస్తున్నాడు తాను. తాను ఇంట్లో వాళ్ళందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తాడు. పేపరును గురించి ఎందుకు అంత గ్రంథం నడిచింది... ఇలాంటివే ఇంకేవేవో ఆలోచనలు మెదడులో మసలుతుండగా సాగిపోతున్నాడు.

 

    ఒక బుర్ర మీసాల వ్యక్తి కృతంగా, పెద్దగా దగ్గాడు. అతడు కట్టుకొన్నది ధోవతి, వేసుకొన్నది ఖాకీ హాఫ్ షర్టు. తలకు కుచ్చుటోపి ఉంది. చేతిలో ఒక చేతికర్ర వుంది. కళ్ళు ఎర్రగా వున్నాయి. అతడు సయ్యద్ జమాల్-పోలీసు అమీను.

 

    గొంతు సరిచేసుకోవడానికా అన్నట్లు మరొకసారి పెద్దగా దగ్గాడు. తాను వస్తున్నానని చెప్పడానికి అతడు యిచ్చే సంకేతం అది. దాని అర్థం అక్కడి వారందరికి తెలుసు. అరుగుల మీద నుంచున్న వారు హోటళ్ళలో దూరారు. దుకాణాల్లో వారు వ్యాపారంలో నిమగ్నులైనారు.

 

    మూడవసారి దగ్గాల్సిన అవసరం అతనికి ఎప్పుడూ ఏర్పడలేదు. మూడవసారి దగ్గినా ప్రయోజనం లేకపోయింది. అతడు సాగిపోతూనే ఉన్నాడు.

 

    "కౌన్ హై? ఠైరో" కేకవేశాడు అమీను.

 

    సాగిపోయేవాడు వెనక్కు తిరిగి చూచాడు. తనను కాదన్నట్లు మళ్ళీ సాగిపోతున్నాడు.

 

    "క్యోఁబే సున్తానై, ఠైరో."

 

    మళ్ళీ వెనక్కు తిరిగి చూచాడు పేపరు మనిషి.

 

    "ఏమ్. మస్తీ ఎక్కిందా? నిల్వమంటే నిల్వకపోతున్నవ్" అని తనవైపు వస్తున్న వాణ్ణి చూస్తూ దిగ్భ్రమచెంది నిలిచిపోయాడతను. అతనికేమి తోచలేదు. వచ్చేవాడు ఎందుకు అరచాడో అర్థంకాలేదు. తానెందుకు నిలిచాడో కూడా తెలియలేదతనికి, సయ్యద్ జమాల్ దగ్గరికి వచ్చేశాడు.

 

    "ఏమ్ ఖానూన్ జతాయిస్తన్నవట*?" అని చేతిలోని పేపరును లాగాడు.

 

    అతడు పేపరును నొక్కిపట్టాడు. జమాల్ చేతికి రాలేదు. అమీను మండిపోయాడు. లాగి లెంపమీద కొట్టాడు. పేపరు లాక్కున్నాడు. పరపరా చింపేసి బూటుకాలితో తొక్కి "మస్తీ చర్ గయా హరామ్జా దేకో అబ్ జావ్" అని చరచరా సాగిపోయాడు.

 

    అంతా మెరుపులా జరిగిపోయింది. క్షణంలో జరిగిపోయింది. వింతగా జరిగిపోయింది. అనూహ్యంగా జరిగిపోయింది.

 

    అతనికి కళ్ళు చీకట్లు కమ్మాయి. తూలాడు. మళ్ళీ వెలుగు కనిపించేవరకు చేతిలోని పేపరు ముక్కలుగా నేలమీద పడివుంది. ముందు మనిషెవడూ లేడు. చిరిగిపడిన పేపరు ముక్కలన్నీ తీసుకున్నాడు.సాగిపోయాడు.

 

    ఊరు చివరి ఇంటి అరుగుమీద కూర్చొని చుట్ట కాల్చుకుంటున్న వీరయ్యగారు అతనిని చూచి గభాల్న లేచి "కారటన్న యెయ్యకుండ వచ్చినవు?" అని యింటివైపు తిరిగి "జానకమ్మా! రఘు వచ్చిండు. బావ వచ్చిండు - పట్నంకెల్లి. కంచు చెంబుల నీళ్ళుతే తల్లీ కాళ్ళు కడుక్కుంటడు" అని తిరిగి రఘును చూచి విస్తుబోయాడు. చెంప పొంగి ఉంది. ఏమీ అర్థం కాలేదతనికి.

 

    "ఎందు కిట్లయింది?"

 

    "ఏమైంది?"

 

    "ఎవడు కొట్టిండు" బాణంలా దూసుకు వచ్చాయి ప్రశ్నలు వీరయ్యగారి నోటినుంచి.

 

    "మొదలు లోపలికి పాండి" గుమ్మంలో అడుగుపెట్టాడు రఘు.


    
    అనుసరించాడు వీరయ్యగారు.

 

    "బావ వచ్చిండు" అనే మాటవిన్నది జానకి. ఆమెలో సముద్రం పొంగింది. ఆటూ పోటూ వచ్చాయి. ఉబ్బితబ్బిబ్బైంది. అమాంతంగా లేచింది. అద్దం చూచుకొని తల సవరించుకుంది. చీర చూచుకుంది. బాగనిపించలేదు. క్షణంలో చీర మార్చుకుంది. చెంబుతో చల్లనీళ్ళు తీసుకుని బయలుదేరింది.

 

    ఆమెలో సెలయేళ్ళు జలజల పారేయి!

 

    బావ! తన బావ వచ్చాడు. ఎంత కాలానికి వచ్చాడు? ఎలా ఉంటాడో? ఎప్పుడో చిన్నతనంలో చూచింది తాను! బొడ్డు మల్లెపూలు దోసిళ్ళతో తెచ్చి తన నెత్తిన పోసేవాడు!

 

    ఆ అనుభూతే ఆమె ఒడలు జలదరింపజేసింది. చిరు చమటలు పోసినట్లనిపించింది. చెంబు బల్లమీద పెట్టి మళ్ళీ అద్దం చూచుకుంది. చెమటలు తుడుచుకుంది. చెంబు తీసుకొని బయలుదేరింది.
________________________________________________

    *శాసనాలు వల్లిస్తున్నావట.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS