Previous Page Next Page 
నివేదిత పేజి 2


    "అంతేనా? అదేం?"

 

    "ఏముంది? మా నాన్నగారు ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు. పెళ్లి రోజున తెర తొలగించగానే పిల్లని చూసి హతోస్మి అనుకున్నాను. మంచి సంబంధమంటే పిల్ల బాగుండకూడదు కాబోలనుకున్నా నప్పుడే తరువాత మూడు రోజులు కలిసి ఉన్నాం. నా కెందుకో యీ దేశంలో ఉండాలనిపించలేదు. విరక్తే అనుకుంటాను. యింకనీరింగ్ లో విదేశంలో సీటుకోసం అంతకు ముందునుంచే ప్రయత్నిస్తున్నాను. ఆ సమయానికి అదీ వచ్చింది. తల్లినీ, తండ్రినీ, భార్యనూ వ్యతిరేకించి ఆనందంగా విమాన మెక్కాను" అని ఆమె యేమంటుందోనని ఆసక్తిగా చూశాడు శేషశాయి.

 

    ఆమె యేమీ అనలేదు. తలఊపి ఆలోచిస్తూ ఊరుకుంది.

 

    తన విదేశయానాన్ని గురించి ఉత్సాహం కనబరుస్తుందని ఆశించిన అతడు ఆశాభంగం చెంది "నిన్ను చూసి ఎనిమిదేళ్ళు గడిచిపోయాయి. వేటకని బయల్దేరిపోతూ ఒకసారి గుడిలోకి తొంగిచూడాలనిపించి లోపలకు వచ్చిన నాకు, దైవ దర్శనం కాదు. దేవతా దర్శనమే అయినట్ల యింది, యే దేవతో క్రిందకి దిగి వచ్చి, కోనేటిలో జలకమాడి విశ్రాంతి తీసుకుంటున్నట్లు భ్రమ కలిగింది. నీ ముఖంలోకి తదేకంగా కొన్ని క్షణాలు చూశాక, నీ కంఠస్వరం విన్నాక గుర్తుపట్టేశాను మా వేదికవేనని."

 

    అతని ప్రతి మాటలోనూ కావాలనో, కాకతాళీయంగానో యెంతో చనువు ప్రస్ఫుటమవుతున్నా, అతని అభినందన విని ఆమె చలించనూ లేదు ముఖం యెరుపెక్కునూలేదు, తల ఆడించి ఊరుకుంది.

 

    "నీ పరధ్యానానికి కారణాన్ని తర్వాత  చెప్పుదువుగాని... అతిథుల్ని బయటనే నిలబెట్టి మాట్లాడడం మన దేశపు పల్లెటూళ్ళు యీ మధ్య కొత్తగా సంతరించుకున్న సంప్రదాయమా యేమిటి?" ఆమె తన మాటలకు జవాబివ్వకపోవటం చూసి అతను అసహనంగా అడిగాడు.

 

    ఆమె ఉలికిపడి "కాదు కాని స్త్రీ వంటరిగా ఉన్నప్పుడు పురుషుడ్ని లోపలకు ఆహ్వానించటం మాకు సంబంధించిన ఆచారం కాదు." అంది నిశ్చల కంఠంతో.

 

    "ఓ! ఆయామ్ సారీ! లేని చొరవ తీసుకున్నట్లున్నాను." అని అతను ఒక క్షణమాగి "అయితే వేదితా! నువ్వీ ఊరినుంచి కదలనే లేదా? లేక యీ మధ్యనే యిక్కడికి వచ్చావా?"

 

    "ఎక్కడికి పోతాను?" ఆమెలో చిత్రమైన మార్పు వచ్చింది.

 

    ఈ మార్పుకి అతను చలించి , ఆమెను ఆ సాంతం ఒకసారి పరిశీలించి చూశాడు. కాంతిరేఖల్ని విరజిమ్ముతూ విరబూచిన యవ్వనం ప్రకృతి ముద్దకట్టినట్లు ఏ ప్రేమికుడి తపస్సో, కాముకుడి కలో ఫలించినట్లు సిద్ధించిన సౌందర్యం, ఆకర్షణ.... కాని యేదో పెద్దలోటు కొట్టొచ్చినట్లు కనబడుతోంది. ప్రకృతికి యేదో వికృతి జరిగింది. సలక్షణంగా అమరిన యీ సహజరూప విశేషంలో విలక్షణమైన ఓ అసహజత్వం దోబూచులాడుతోంది. అంతలో అతన్ని ఓ దెయ్యపు అనుమానం ఆవహించింది.    

 

    "అత్తారింటికి...." అన్నాడు అస్వభావికమైన కంఠంతో.

 

    ఆమె చిత్రమైన నవ్వు నవ్వింది. వాడిపోయిన పూలు రాలిపడినట్లు ఎండుటాకులు గలగలమన్నట్లు ధ్వనించింది.

 

    "అత్తారిల్లు ఎక్కడుంది శేషుబాబూ!" అంది వేదిత ముఖంలో కాంతి అంతరించిపోతూండగా. "నేనిప్పుడు పూర్వ సువాసినిని. గార్హస్థ్యం గతంలో కలిసింది. ఇంకా వినండి. నే నిప్పుడు ఓ పరిచారికను. వేణుగోపాల స్వామి సేవలకై నియోగించబడిన ఒక సేవికను."  

 

    ఇదీ దెయ్యపు అనుమానం కాదు. పిశాచపు సత్యమే. అతనివళ్ళు ఝల్లుమన్నట్లయింది... తేరుకుని తల యెత్తి చూసేసరికి వేదిత తమ కుటీరంవైపు చర చరమని వెళ్ళిపోతూ కనిపించింది.

 

                                            * * *

 

    వేదిత తమ యింటికి వచ్చి తలుపు తీసుకుని లోపలకు ప్రవేశించింది. అది యిల్లులా లేదు. ఓ కుటీరంలా ఉంది. కుటీరం కూడా అంటే సరిపోదు. ఓ ఆశ్రమంలా ఉంది.

 

    శుభ్రంగా వూడ్చిన గదులు, కృష్ణాజినం వేసి దైవప్రార్థనకు అనుకూలంగా సమస్త సామాగ్రి అమర్చిపెట్టిన పూజామందిరం. అనవసర సామాను ఒక్కటి లేకుండా నిత్య జీవితానికి బొటాబొటిగా సరిపోయే వస్తువులు తీర్చిదిద్దినట్లుగా వేటి స్థానాల్లో అవి యిమిడి యిస్తోన్న నిశ్చల, నిర్లిప్త వాతావరణం, ఎక్కడో సంపాదించి యింట్లో అక్కడక్కడా అందంగా అమర్చిన గోపాలకృష్ణుని వివిధ రూపాలు ప్రదర్శించే శిల్ప ప్రతిమలూ, తెరిచివున్న కిటికీలలోంచి లోపలకు పడుతున్న స్వచ్ఛమైన వెల్తురూ, గుండెలనిండా పీల్చుకోవటానికి శుభ్రమైన గాలీ...

 

    వేదిత లోపలకు వచ్చి నేలమీద జారిపోయింది. ఆమెకు ఇవాళ ఎక్కడ లేని దుఃఖం, తనమీద తనకు కోపం కలిగాయి. చల్లటి నేలమీద ముఖం ఆనించి నిశ్శబ్దంగా ఏడుస్తోంది.

 

    అప్పుడప్పుడూ అంతే. హృదయక్షేత్రంలో ఏదో ఉరిమినట్లు అవుతుంది. గాలివాన కురిసినట్లు, సముద్రం ఉప్పొంగినట్లు విపరీతమైన సంచలనం. అప్పుడామె ఏడుస్తుంది. కాని ఏడుస్తుందని ఎవరికి, ఆఖరికి ఆమె తండ్రికి కూడా తెలీదు. అంతా 'ఆమెకేం? అదృష్టవంతురాలు' అనుకుంటారు. ఆ కొద్ది కాలంలోనే ధైవారాధనలో ఆమె ఎనలేని యేకాగ్రత సాధించిందనీ. భగవంతునికి ఆమె చాలా చేరువగా వచ్చిందనీ చాలామంది నమ్మకం. ఆమె పూజలో ఉన్నప్పుడు, భగవత్ ప్రార్థనలో ఉన్నప్పుడు. చూసినవారు భక్తి పారవశ్యంలో మునిగి అప్రయత్నంగా చేతులెత్తి మోకరిల్లుతారు, ఆ ఊళ్ళో ఆ బాలగోపాలమూ ఆమెను "అమ్మ!" అని పిలుస్తారు. ఆమె పేరు 'అమ్మ' ఆమె భక్తిని గురించీ ఆరాధన గురించీ ఎవరికీ సంశయం లేదు. ఆమెలో అతీతశక్తులు కూడా చాల ఉన్నాయని కొంతమంది విశ్వసిస్తారు. ఆమె గంభీరంగా వున్నప్పుడు దగ్గరకు పోవటానికి భయపడినా, ఆమె మామూలుగా వున్నప్పుడు, నవ్వుతూ వున్నప్పుడు అందరి హృదయాలూ సంతోషంతో వికసిస్తాయి. అంతా ఆమెను సరళ హృదయాలతో ప్రేమిస్తారు. ఆమె మనసారా నవ్వటమేగాని, కంటినుండి ఒక నీటి బిందువు రాల్చగా ఎవరూ చూడలేదు. అవును, ఆమెకు విలపించే అవసరమేముంది! మనసంతా ఆనందసాగరం లాంటి ప్రేమ, ఆమె సర్వ ప్రపంచాన్నీ ప్రేమిస్తుంది. పసిపిల్లల్ని, వృద్ధుల్ని, రోగుల్ని, పశు పక్ష్యాదులనూ, ఈ భూమినీ, నీలాకాశాన్ని, ప్రకృతిని, సృష్టిని ప్రేమిస్తుంది. దైవత్వంలో మానవత్వాన్నీ మానవత్వంలో దైవత్వాన్నీ దర్శించగల జ్ఞాననేత్రం ఆమె కుంది. కాని పొంగే ఆనందంలో కూడా ఒక్కోసారి ఏడవాలనిపిస్తుంది. అవధుల్లేని ప్రేమ మనుషులను ఏడ్పిస్తుంది. మితిమీరిన నిశ్చలత, అతిదృఢమైన మనస్సు, ఉండవల్సిన దానికన్నా ఎక్కువ పరిధిలో ఆక్రమించుకున్న శాంతి, యితరులకు అందకుండా ఉన్నతంగా ఎదిగిన గుండె ఒకానొక సమయంలో భళ్ళున ఏడ్చేస్తాయి. చిన్న కదలికే ఆ సమయంలో మహాశక్తితో కూడిన కదలికలా వారిని స్పర్శించి ఊపివేస్తుంది. కాని ఆ ఏడుపే వారికి బలం. అదే వారికి మరింత దృఢత్వం, ఆత్మవిశ్వాసం, విశాలత్వం ప్రసాదిస్తుంది.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS