Previous Page Next Page 
లక్ష్యం పేజి 2

 


    సాయిబు సంపాదన... బూబు కుట్టుకూలికి సరిపోతే ఏం సాధించినట్లు?

 

    సాయంత్రానికి ట్రిమ్ముగా తయారయి- సుష్టిగా తిని, మత్తుగా తాగి, అర్థరాత్రి ఇంటికొచ్చి ఆపసోపాలతో పడకలెక్కేస్తారు- తిరిగి సూర్యుడు క్రుంగే సమయానికి లేస్తారు.

 

    పాపం వారి జీవితం ఏమిటో...?

 

    వాళ్ళ ధ్యేయం ఏమిటో ఎవరికీ అర్థంకాదు.

 

    ఎదిగే సమాజాన్ని, దేశాన్ని ఎదగకుండా చేసే చెదపురుగులు వాళ్ళు- వారిపై మానసిన క్రిమిసంహారక మందులు వాడక తప్పదు.

 

    ఈదేశం బాగుపడదని ఎవరన్నారు? ఎవరంటారు?

 

    సోమరిపోతులు...

 

    మన ఖర్మంతే అని ఎవరు వాపోతారు? మెంటల్ ఇంపోటెంట్స్.

 

 

    బాగుపడుతుంది... మనదేశం ఎంతయినా బాగుపడుతుంది. ఎప్పుడంటే, ఖాళీగా కూర్చునేవాళ్ళు కాళ్ళు ఇరగ్గొట్టినప్పుడు... పనీపాటా లేక ఊసుబోని కబుర్లు చెప్పే ఉత్త బడుద్దాయిల్ని ఉరితీసినప్పుడు.

 

    రండి... కదలండి... కదనరంగానికి ఉరకండి...

 

    తెలివితేటల్ని ఉపయోగించండి... రాత్రింబవళ్ళు శ్రమించండి.

 

    ఎదుగుదల తల వంచక ఏం చేస్తుంది?

 

    విజయం వరించక ఎక్కడ ఉరేసుకుంటుంది?

 

    India...

 

    The Great India...

 

    Love it...

 

    Do it...

 

    Or Leave it...

 

    Let's Make India Great Again.

 

    Let's Get India Moving Again But.

 

    Our Future is in indian politician Hands-

 

    అది ఇక సంభవింపరాదు.

 

    రాజకీయ నాయకులు నిలబడేది- గెలిచేది వారికోసం- వాళ్ళ వాళ్ళ కోసం- మన కోసం కాదు- వాళ్ళు మనకేమీ చేయరు-

 

    మనకు మనమే ఏదో ఒకటి చేసుకోవాలి.

 

    బ్రతికున్నవాడు ఏదో ఉద్ధరించినట్లు బర్త్ డేలు, చచ్చినవాడు ఏదో ఊడబొడిచి వెళ్ళినట్లు తద్దినాలు... పురుడ్లు పుణ్యకార్యాలు... పండుగలు... పబ్బాలు... ఫంక్షన్స్... చచ్చినా సంబరమే... బ్రతికినా పండుగలే... వాటిని భరించే స్థితి ఈ దేశానికి యిప్పుడు వుందా? లేదు.

 

    ప్రతి సంవత్సరం వీటికి దేశవ్యాప్తంగా ఐదువేల కోట్లు ఖర్చు అవుతున్నాయట- సిగ్గుగా లేదు మనకు-

 

    ఎన్నిసార్లని, ఎన్నిటికని మనం మాత్రం సిగ్గుపడతాం? మనం పడే సిగ్గుసే స్థితి-

 

    మనమీద మనమే జాలిపడే స్థితి....

 

    అందుకే Let's get Indian youth moving again....

 

    ఇతరుల చేతుల్లో నలుగుతున్న మన జీవితాల్ని మనం లాగేసుకుందాం....

 

    మన భవిష్యత్ పగ్గాలు మన చేతుల్తో లాక్కుందాం...

 

    Let's Move...

 

    Let's Drive...

 

    Let's Dig...

 

    For our fortune....

 

                                                    *    *    *    *    *

 

    బెంగుళూరు మహానగరం....

 

    గార్డెన్ సిటీ... రహదారుల కిరువైపులా పెరిగిన మహావృక్షాలు, వాస్తు కళకే ఛాలెంజ్ గా నిలిచే పురాతన కట్టడాలు ... వాటి పరిసరాల్లో పుట్టుకొచ్చిన అధునాతనమైన బంగ్లాలు... ప్రతి రెండు కిలోమీటర్లకొక పార్క్... ప్రతి ఇంటి ముందు పూలపొదలు... ఖాళీ అనుకునే ప్రతిచోట పుట్టుకొచ్చిన వృక్షాలు... ఓహో... ఎక్కడ చూసినా పచ్చదనం... కనుల పండుగగా కన్పించే రంగు రంగుల గులాబీలు... రన్ అవుట్ అయ్యేవరకు కెమేరా గురించి పట్టించుకోకుండా అలా ఆ అందాలకేసి చూసేలా ఛాయాచిత్ర గ్రహకుల చూపుల్ని నిలవేసే అందాలు.

 

    అప్పుడు ఉదయం ఆరుగంటలు...

 

    చామరాజ్ పేటలోని ప్రకాష్ కేఫ్ కి దగ్గర్లో ఉన్న టిప్పుసుల్తాన్ సమ్మర్ ప్యాలెస్ ముందు ఒక టూరిస్టు బస్ వచ్చి ఆగింది.

 

    ఆ చుట్టుప్రక్కల వున్న హోటల్స్ లో ఆక్స్ ఫర్డ్ కాలేజీకి చెందిన డిగ్రీ స్టూడెంట్స్ సుమారు నలభైమంది దాకా బసచేసి వున్నారు.

 

    వాళ్ళని అక్కడ నుండి కూర్గ్ జిల్లాకు తీసుకెళ్ళి కాఫీ తోటల్ని, తిరుగు ప్రయాణంలో నాగర్ హోలేఫారెస్ట్ గుండా తీసుకువస్తూ, ఆ దట్టమైన అడవిని, వేల సంఖ్యలో సంచరించే ఎలిఫెంట్స్ ని చూపించటమే ఆ బస్ డ్రైవర్ ప్రస్తుత బాధ్యత.

 

    "ఏరా! ఈ పిల్లకాయలింకా రాలేదు?" డ్రైవర్ గేర్ ని,బ్రేక్స్ ని చెక్ చేసుకుంటూ అడిగాడు.

 

    "ఈపాటికి బయలుదేరే వుంటారు" క్లీనర్ రేడియేటర్ లో వాటర్ పోస్తూ అన్నాడు.

 

    రోడ్డంతా దాదాపు నిర్మానుష్యంగా వుంది.

 

    వుండుండి ఒక్కో వెహికల్ ఫాగ్ లైట్స్ వెలుగులో వెళ్ళిపోతోంది.

 

    పదడుగుల తరువాతేముందో కనిపించనంత దట్టమైన పొగ మంచు... ఒకింత చలిగా కూడా వుంది... పూర్ విజన్... 

 

    బెంగుళూరు మొదలు, పశ్చిమ పర్వత శ్రేణులను కలుపుకొని, ఆరేబియా సముద్రాన్ని తాకే మంగళూరు, ఉడిపి వరకు చిక్కటి పొగ మంచు.... అలలు అలలుగా, తెరలు తెరలుగా సాగిపోతూ హిమాలయాల మృదుత్వాన్ని స్మరింపజేస్తోంది.

 

    సిమ్లా, ముస్సోరి, నైనిటాల్ ని మరిపించేలా వుంది బెంగుళూరు నగర ఉషోదయం.

 

    టెంపరేచర్ బాగా దిగిపోయివుండటంతో ఉదయాన్నే జాగింక్ కు వెళుతున్న వాళ్ళు ఆ కోల్డ్ వేవ్ ని తట్టుకొనేందుకు హెవీటాడ్ సూట్స్, లెదర్ జాకెట్స్, ప్రలోవర్స్ వేసుకుని రోడ్డువారగా పరుగులు తీస్తున్నారు.

 

    "ఇప్పుడు మనం వెళ్ళబోయేది ఎక్కడికో తెలుసా...?" సన్నగా, పొడుగ్గా, బంగారు గోధుమరంగు ఛాయతో, నల్లటి చిక్కటి పొడవాటి జుత్తుతో అందానికే వంక పెట్టేలా వున్న మహతి అంది. ఆమె కంఠం సితారని మీటినట్లుగా శ్రావ్యంగా వుంది.

 

    "కూర్గ్ జిల్లాకి..." పెదాలకి లిప్ స్టిక్ రాసుకుంటున్న సుధారాణి అంది చాలా కేజువాల్ గా.

 

    అద్భుతమైన ప్రదేశానికి వెళుతున్నామన్న ఎక్సైట్ మెంట్ ఆమె కంఠంలో తొంగిచూడకపోవటంతో మహతి ఆశ్చర్యపోయింది.

 

    "అది అందరికీ తెలుసు... కూర్గ్ జిల్లాకి మరో పేరుంది- అదే కొడగు. పరుగుల రాణి అశ్వనీ నాచప్ప పుట్టింది అక్కడే. పరుగు పరుగున ప్రవహిస్తూ కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల బంజరు భూముల్ని సస్యశ్యామలం చేసే కావేరీ నది పుట్టింది ఆ కొడగులోనే... తెలుసా?" తన్మయంగా అంది మహతి.

 

    సుధారాణి తను చేస్తున్న పనిని పూర్తిచేసి, తన రెండు పెదాల్ని ఒత్తిడికి గురి చేసుకుంటూ నోటి లోపలకు ఒంచుకొని, తిరిగి అద్దంలో చూసుకొని సంతృప్తిపడింది.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS