Previous Page Next Page 
చిక్కలేదు చిన్నదాని ఆచూకీ... పేజి 2


    "ఎవరు మీరు ?" చికాగ్గా అడిగాడు శ్రీధర్.

 

    "ఎంతో చక్కగా ఓ ఆడపిల్ల గొంతు విన్పిస్తే అంత చిరాగ్గా అడుగుతావేంటయ్యా మగాడా...?" అనే మాటలతోపాటు చిన్నగా నవ్వు కూడా వినిపించింది.

 

    "ఆడపిల్లని తెలుస్తూనే వుంది కానీ.... మీకేం కావాలి .... ఎవరు కావాలి?"

 

    "ఏదో కావలసి వస్తే, ఎవరో కావలసివస్తే....నేనీ నెంబరుకెందుకు ఫోన్ చేస్తాను.... నాక్కావలసింది ఇదే నెంబర్...?"

 

    "యూ వాంట్ దిస్ నంబర్ .... ఆర్యూ ష్యూర్...."

 

    "ష్యూర్.... ష్యూరున్నరా.... నా దగ్గరున్న నెంబర్ కే నేను ఫోను చేస్తాను తప్ప, అడ్డమైన నెంబర్లన్నిటికీ ఫోన్ చేస్తాననుకున్నారా...."

 

    "అయితే.... మీకెవరు కావాలి?"

 

    "అలా రండి....దారికి... అక్కడ రావున్నాడా?"

 

    "ఏ రావు... ఎన్టీ రామారావా?" తిక్కగా అడిగాడు శ్రీధర్.

 

    "ఆయనే కావాలని వుంది. ఆయన్ని కోరుకోని ఆడదెవరయ్యా బాబూ! అయినా ఆయన్ని కలవాలంటే నేను పైకెళ్ళాలి. అదిప్పుడే కుదిరేపని కాదు."

 

    "అయితే పి.వి. నరసింహారావా?"

 

    "ఆయనతో నాకు లంకె కుదరదులే. ఏదడిగినా దేఖేంగే... లెటజ్ సీ... చూద్దాం... అని ప్రతిదాన్ని నాన్చేస్తుంటాడు. అలా ప్రతిదాన్ని నాన్చేస్తే, నాలాంటి వయసులో వున్న అమ్మాయి ఏమయిపోవాలి! ఇంతకీ రావు... నీకు తెలీదా... రావు నీకు తెలీకపోతే ఎలాగయ్యా బాబూ?"

 

    ఆ అమ్మాయి మాటలు, ఎక్స్ ప్రెషన్స్ వింటుంటే ఏదో టీజ్ చేయడానికే ఫోన్ చేసిందా? అనే అనుమానంవచ్చింది శ్రీధర్ కి.

 

    "ఏయ్... మగాడా... నేను టీజ్ చేస్తున్నానని అనుకుంటున్నావు కదూ!"

 

    దాంతో కొంచెం ఆశ్చర్యానికి లోనయ్యాడు శ్రీధర్.

 

    ఈ అమ్మాయి ఎవరో కాని... కొంచెం షార్ప్ అండ్ బ్రిలియంట్... మనసులోనే అనుకున్నాడు శ్రీధర్.

 

    "అయితే రావు తెలీదా నీకు?"

 

    "తెలీదు... రావు అనే వ్యక్తి ఎవరూ ఇక్కడ వుండరు."

 

    తట్టుకోలేని అసహనంతో అన్నాడు శ్రీధర్.

 

    "అంత కోపమెందుకయ్యా బాబూ... సౌమ్యంగా చెప్పొచ్చుగా" మార్దవంగా అందామె.

 

    శ్రీధర్ చికాకుతో మాట్లాడలేదు.

 

    "ఇంతకీ ఇది 366999 నెంబరేనా?"

 

    "అవును తల్లి... ఆ నెంబరే ఇది."

 

    "అయితే రావు వుండాలే."

 

    "ఉండాలని నువ్వు అనుకుంటే సరిపోతుందా?"

 

    "నీకు ఆడపిల్లలతో స్నేహం చేయడం బాగా తెలిసినట్టుందే."

 

    "నాకా! అదెలా కనిపెట్టావ్?"

 

    "మొదట్లో మీరని సంబోధించి, తర్వాత నువ్వులోకి దిగావేంటి... అందమైన ఆడపిల్లల్ని మచ్చిక చేసుకోవడంలో ఎక్స్ పర్ట్ లాగున్నావే."

 

    ఆ అమ్మాయి సమయస్ఫూర్తికి శ్రీధర్ ఒక క్షణం విస్తుపోయాడు.

 

    "అమ్మ మహాతల్లి... నాకంత సీనూ లేదు, సమయస్ఫూర్తి లేదు. నన్ను వదిలేయ్."

 

    "అక్కడికి నేనేదో నిన్ను పట్టుకున్నట్లు మాట్లాడతావేంటి? నీ మాటలెవరైనా వింటే నాకు మగాళ్ళ పిచ్చి వుందనుకునే ప్రమాదముంది. అయినా నన్ను తల్లి అంటావేంటి? అలాంటి ప్రయత్నమేదీ చెయ్యకుండానే" పెద్దగా నవ్వుతూ అందామె.

 

    శ్రీధర్ కి పిచ్చి పట్టినట్టయిపోయి టెన్షన్ తో జుట్టంతా చెరిపేసుకున్నాడు.

 

    ఆపైన చేతి వాచీ కేసి చూసుకున్నాడు.

 

    "జుట్టు పీక్కునే పని చెయ్యకు. పెళ్ళి కాకుండానే బట్టతల అయిపోతుంది. తిరిగి నీ తలపైన జుట్టు మొలిపించడానికి నా దగ్గర కేరళ ఆయుర్వేదం మందులేం లేవు."

 

    ఎడంచేత్తో ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని, కుడిచేత్తో తలంతా చిందర వందర చేసేసుకుంటున్న శ్రీధర్ మరోసారి ఉలిక్కి పడ్డాడు.

 

    "ఎందుకయ్యా బాబూ .... ఊరికే అలా మాటిమాటికి ఉలిక్కిపడుతుంటావు? ఇంతకీ అక్కడ రావు అనే వ్యక్తి లేడంటావు."

 

    "రావు లేడు"

 

    "గౌడ కూడా లేరా?"

 

    "గౌడ ఎవరు?"

 

    శ్రీధర్ ప్రశ్నించాడు.

 

    "మనదేశ ప్రధానమంత్రులయ్యా బాబు."

 

    "పోనీ ఆయన నెంబరిస్తాను నన్నొదిలేస్తావా?"

 

    "ఆయనతో పెట్టుకుంటే ఈ జన్మకి ఇక తల్లినయ్యే భాగ్యం నాకుండదు."

 

    "ఎందుకలా" ఆశ్చర్యపోతూ ప్రశ్నించాడు శ్రీధర్.

 

    "దేశం గురించి ఆలోచించాల్సిన టైంలో జిల్లా గురించే ఆలోచిస్తాడు. సంసారం చేయవలసిన టైంలో నిద్రపోతాడు. అలాంటప్పుడు తల్లి నెలా అవుతాను నేను" నవ్వుతూ ప్రశ్నించిందామె.

 

    అపర్ణ ఫోనుకోసం ఆతృతగా ఎదురుచూస్తుంటే మధ్య ఈ అపరిచితురాలి గోలేంటో అర్థం కావటంలేడు శ్రీధర్ కి.

 

    అసలే అపర్ణకి ముక్కుమీద కోపం. తనకోసం ఫోన్ ట్రైచేసి చేసి విసుక్కుని కోపం తెచ్చుకుని, వారంరోజులు ఫోనే చేయదు.

 

    అపర్ణ వారంరోజులు ఫోన్ చేయకపోతే తన మనసంతా వెలితిగా అయిపోతుంది.

 

    పోనీ ఈ ఫోన్ ని డిస్ కనెక్ట్ చేసేస్తే... అని శ్రీధర్ ఆలోచిస్తున్నంతలో-

 

    ఫోనుకు ఆవైపునుంచి అమ్మాయి కంఠం వినిపించింది.

 

    "ఫోన్ చేసింది నేను. నువ్వు ఫోన్ పెట్టేసినంతమాత్రాన ఫోన్ డిస్ కనెక్ట్ కాదు. ఈ మాత్రం కూడా టెలిఫోన్స్ గురించి జనరల్ నాలెడ్జి లేకపోతే ఎలాగా? నిన్ను బాగుచేయడం నావల్ల కాదయ్యా బాబు."


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS