Previous Page Next Page 
త్రినేత్రుడు-1 పేజి 2


    పల్చని వాసమ్మ శరీరం చలికి ముడుచుకుపోయి ఓ వుండలా అయింది. డొక్కలో కాళ్ళు పెట్టుకొని పాత గొంగళి చివర్లు క్రిందకు దోపుకొని నిద్రలో జోగుతోంది.

    చిన్న శబ్దానికే కదిలిపోతోంది. కళ్ళముందు అడ్డంగా వున్న గొంగళిని కాస్తంత పక్కకు ఒత్తిగించి చూస్తోంది ఆశగా. ఆమె నిరీక్షణ మరో అరగంటకి, తెల్లవారుతుందనగా ఫలించింది.

    లోపల చీకటితో కలిసిన వెన్నెల వెలుగులో అస్పష్టంగా ఓ ఆకారం వచ్చి గడపవద్దే ఓ క్షణం ఆగి లోపలకు వచ్చింది.

    లేచి అన్నం పెడదామనే అనుకొని కోపంతో ఆ పని చేయలేక పోయింది.

    ఆ ఆకారం నెమ్మదిగా ఆమెకు దగ్గరయి, ఆ చాపమీదే ఓ పక్కకు జరిగి వాలిపోయింది.


                     *    *    *    *


    ప్రతిరోజూ ఉదయం ఆరుగంటలకే లేవటం వాసమ్మకు ఈనాటి అలవాటు కాదు. రాత్రిళ్ళు ఎంతసేపు మెలకువగా వున్నా, అనంతమైన ఆలోచనలు చుట్టుముట్టి పడుకునే ఆ కొద్ది సమయాన్ని సైతం మింగేసినా, ఆరుగంటలకే లేవటం, ఆ పాక ముందూ, వెనుకా వున్న ఖాళీ స్థలంలో పెంచుకుంటున్న మొక్కల్ని, పాదుల్ని సరిచేసి నీళ్ళు పోయటం, ఆరోజు వంటకు సరిపడా కూరగాయల్ని కోసుకొని లోపలకు వెళ్ళి వంట ప్రారంభించడం ఆమె దినచర్య.

    పక్కకు తిరిగి కొడుకువైపు చూసి ఓ క్షణం నిర్ఘాంతపోయింది.

    బోర్లా పడుకుని గాఢ నిద్రలో వున్న కొడుకు వీపుమీద రక్తపు మరకలు.

    ఆ దృశ్యం ఆమెనో క్షణం కుదిపివేసింది. తల్లి ప్రేమ కదా!

    దగ్గరకు చేరి చొక్కాను నెమ్మదిగా పైకినెట్టే ప్రయత్నం చేసింది. కాని లాభం లేకపోయింది. రక్తంతో కలిసి ఒంటికి అతుక్కుపోయి వుంది చొక్కా.

    గట్టిగా కొడుకుని ఓసారి కదిపింది. చలనమే లేదు.

    మరోసారి ఇంకాస్త గట్టిగా కదుపుతూ "ఒరేయ్ నాన్నా..." అంది కాస్త గట్టిగానే.

    ఓసారి చిన్నగా మూలిగి, అలాగే వుండిపోయాడు.

    "ఒరేయ్ వెధవా"

    .... ....

    "ఒరేయ్ గాడిదా"

    .... ....

    "దున్నపోతు లేవరా" అని గట్టిగా అరిచింది. ఆ కేకకి కాస్తంత ఒత్తగిలి, తల పైకెత్తి బద్ధకంగా కనురెప్పల్ని సగం మాత్రం పైకి లేపి చూశాడు.

    ఎదురుగా తల్లి... కొద్దిగా నవ్వాడు.

    "అదే... ఆ నవ్వే వాసమ్మ ఎంత కోపంలో వున్నా సంభాళింపజేస్తుంది.

    "ఏడ్చావ్ గాని- ఏమిటి ఒళ్ళంతా ఈ రక్తం?"

    కళ్ళు తెరిచే వున్నా కదలలేదు.

    "మరలా ఎవర్ని కొట్టిచ్చావ్?"

    ఆమె ఆందోళన ఆమెది. ఆమె లెక్క ప్రకారం మరో గంటలోపే ఆ దెబ్బలు తిన్నవాళ్ళ తాలూకు మనుషులు వచ్చిన తిట్టిన తిట్టు తిట్టకుండా తనను దులిపేసి పోవాలి.

    ఓసారి నిస్పృహగా తల విదిలించింది.

    అమ్మ తనను వదలి వంటపనిలోకి వెళ్ళి వుంటుందని భావించి తిరిగి నిద్రకు ఉపక్రమించాడు తిమ్మడు.

    అంతలో ఒళ్ళు చురుక్కుమంది.

    లేచి చూస్తే ఒళ్ళంతా తడిసిపోయి వుంది.

    అమ్మ చేతిలో నీళ్ళ బక్కెట్.

    చిరాగ్గా వున్న తల్లివేపు చూస్తూ కొంటెగా నవ్వుతూ కన్ను గీటాడు.

    "చంపేస్తాను వెధవా... ఎవర్ని కొట్టొచ్చావ్ రాత్రి? ఆ ఒళ్ళంతా రక్తం ఏమిటి? బండ వెధవా..." తిడుతూ బక్కెట్ ని ప్రక్కన పడేసి కొడుకు గడ్డం పట్టుకుని "నా కోపం తగ్గించే ప్రయత్నం తరువాత చేద్దూగాని ముందేం జరిగిందో చెప్పు...." అంది సముదాయిస్తున్నట్టుగా.

    "ఆ... ఏం లేదమ్మా..."

    "చెప్పమంటున్నాను" గట్టిగా అడిగింది.

    "రాత్రి సినిమాకి వెళ్ళానా?"

    "అసలా థియేటర్ అంత డొక్కు థియేటర్ నేనెక్కడా చూడలేదు..."

    "మాట మారిస్తే చంపేస్తాను."

    "ఛా... ఊరుకో! కొడుకునెక్కడన్నా తల్లి చంపేస్తుందా...? అన్నీ జోకులు. పొద్దున్నే ఎవరన్నా జోకులేస్తారా? చద్దన్నం పెడతారా?"

    "ఒరేయ్...." గట్టిగా అరిచింది.

    "అదిసర్లే... నేనూ, సిద్ధప్పా సినిమాకెళ్ళాం. వెళ్ళామా?"

    "నాకు తెలియదు. జరిగింది సూటిగా చెప్పు" ఆమె కళ్ళు కోపంతో పెద్దవయ్యాయి.

    "వెళ్ళాంగదా. వెళితే, అవును- రాత్రి నాకు భోజనం పెట్టలేదేం?"

    తారాస్థాయికి చేరుకున్న కోపాన్ని తల్లి కళ్ళలో చూసాడు తిమ్మడు.

    "రాత్రి సినిమాకని వెళ్ళాం. బుకింగ్ కౌంటర్ దగ్గర చిన్న గొడవ..."

    "ఎవరితో...?" సడన్ గా అడిగింది.

    "ఆ... ఎవరో ఒకరితో... సినిమా నువ్వు చూడలేదుగాని... అద్దిరి పోయిందనుకో..." ఆవలిస్తూ లేచి చేతులు సర్దుకోబోయి ఆగిపోయాడు.

    ఇప్పుడిప్పుడే రాత్రి తగిలిన దెబ్బ తాలూకు నొప్పి ప్రారంభమైనట్టుంది.

    "ఒరేయ్... నన్ను ఏడిపించక ఏం జరిగిందో చెప్పు" అంది అర్ధింపుగా.

    "ఏం లేదు- లైన్ లో నిల్చున్నాం రూల్స్ ప్రకారమే. ఒకడు నా ముందున్నాడు. 'క్యూ' పెద్దదయిపోయింది. మరికొంత సేపటికి మరొకడు వచ్చి వాడిముందు నిల్చోబోయాడు. వీల్లేదన్నాను. ఇతన్ని నేనే నిలబెట్టి వెళ్ళాను అన్నాడు... నీకు బదులుగా కదా? నువ్వు కూడా ఎలా నిల్చుంటావ్ అన్నాను. వాడు విసురుగా నా చేతిని లాగిపడేశాడు. సిద్దప్ప కోపంగా ముందుకొస్తే వాడ్ని ఒకటి వేశాడు.

    నువ్వే చెప్పావుగా తనను వెన్నంటి వుండేవార్ని అనుక్షణం కాపు కాయాలని. అందుకే...." అన్నాడు తిమ్మడు. మాటల్ని మింగేశాడు.

    ఆమెకు అర్ధమైపోయింది విషయం.

    తనను నమ్ముకున్న వార్ని రక్షించడంలో చూపే తెగువ తనను రక్షించుకొనేప్పుడు లౌక్యంగా మారాలని లక్షసార్లు చెప్పింది.

    వీడిలో వున్న ధైర్యం, తెగువ, పట్టుదల, కసి, కోపం చూస్తుంటే ఆనందం- వాటిని తెలివిగా బయట పెట్టుకోలేని పిచ్చితనంపై కోపం.

    వీడికి నిజంగా తెలివితేటలు లేవా? జీవితంలో ఎందుకూ పనికి రాకుండా పోతాడా?

    అలా జరిగితే తను బతికి, వాడ్ని బతికించుకున్నందుకు అర్ధమే వుండదు. ఆలోచిస్తూనే నిమిషాల్లో రాత్రి మిగిలిన చద్దన్నం తెచ్చి కొడుకు ముందు పెట్టింది.

    "త్వరగా డాక్టర్ దగ్గరకు వెళ్ళి కట్టు కట్టించుకో... ఈరోజు పనిలోకి వెళ్తావా? పోని వద్దులే" అంటూ వంటలో మునిగిపోయింది. 

    తిమ్మడు తయారయి తల్లి దగ్గర బలవంతాన రెండు రూపాయలు తీసుకొని బయటపడ్డాడు. నాలుగడుగులు వేసేసరికి సిద్ధప్ప ఓ చెట్టు చాటునుంచి ముందుకొచ్చాడు.

    "ఎలా వుందిరా? నెప్పిగా వుందా? అమ్మ ఏమంది?" ప్రశ్నల వర్షం కురిపించాడు సిద్ధప్ప.

    "పొద్దుటే వచ్చావ్ గదూ?" తిమ్మడు అడిగాడు.

    "అవున్రా. చెయ్యి దెబ్బ ఎలా వుందోనని నాకు నిద్ర పట్టలేదు- అని పైకి చెప్పలేదు సిద్ధప్ప. అతనిలో వున్న ప్రత్యేకత అదే. మనసులో ఏం వున్నా అది చేతలద్వారా బయటపెడతాడు.

    "అమ్మ మందలించి బాధపడింది..." అంటూ ముందుకు నడిచాడు తిమ్మడు.


                     *    *    *    *


    పగలంతా రోడ్లన్నీ తిరిగాడు తిమ్మడు. అప్పుడే ఇంటికి వెళ్ళాలనిపించలేదు. ఊరికి ఆనుకొని వున్న మామిడితోపులోకి వెళ్ళాడు. తోటలో మధ్యగా పారే చిన్న సెలయేరు దగ్గరకు వెళుతూ, చేతికి అందిన నాలుగు మామిడి కాయలు కోసుకున్నాడు. అవి తిని ఓ రెల్లుపొద ప్రక్కన పడుతున్నాడు.

    ఆకాశంలోకి చూస్తూ నిమిషాల్లో నాలుగు కాయల్ని తినేశాడు. ఇంకా ఆకలి తీరలేదు. లేచి కోసుకోడానికి బద్ధకం వేసి అలాగే వుండిపోయాడు.

    పొద్దు వాలిపోయింది.

    చుట్టూ పచ్చని పొలాలు, ఆ పొలాల మధ్య చెట్టునీడన అతను ప్రక్కన గుడ్డమూటలో రెండు రొట్టెలు. చల్లని గాలికి విడిచేసిన చొక్కాని, పాంటుని అక్కడే ఉతికి ఆరేసుకున్నాడు.

    నునుపు తేలిన దేహం, మెలితిరిగిన కండలు, కళ్ళలో ఆకలి, ఏ లక్ష్యం లేని చూపులు. లేచి కూర్చుని మూట విప్పదీసి ఆ రొట్టెలవేపు ఆశగా, ఆకలిగా చూస్తూ ఒక్కో ముక్క తెంపి తింటున్నాడు.

    పేగులు మెలితిరిగే ఆకలితో వుండడం మూలంగా అతను పరిసరాలను గమనించే స్థితిలో లేడు.

    "భౌ... భౌ... భౌ..."

    ఎక్కడ నుంచో వచ్చింది ఓ చిన్న కుక్కపిల్ల. బక్కగా వుంది. ప్రాణాన్ని కళ్ళల్లో పెట్టుకున్నట్టుగా వుంది. మరోసారి మొరిగింది. ఆకలితో వున్న తిమ్మడికి కోపం ముంచుకొచ్చింది.

    "ఛీ... ఛీ... ఛీ..." అదలించాడు కుక్కపిల్లను. కుక్క మొరగటం ఆపలేదు.

    "భౌ... భౌ... భౌ..."

    తనకున్నదే రెండు రొట్టె ముక్కలు. అందులో భాగం కావాలా నీకు అనే భావంతో చెయ్యెత్తి కొట్టబోయినట్లు నటించాడు.

    అది కొంచెం వెనక్కు తగ్గి మరలా మొరిగింది.

    ఈసారి తిమ్మడికి కోపం రాలేదు. అనుమానం వచ్చి ప్రక్కకు తిరిగి చూశాడు, అది ఎవర్ని చూసి మొరుగుతుందా అని.

    తనకు బారెడు దూరంలో పడగవిప్పి బుసలు కొడుతున్న త్రాచు. కోడెత్రాచు- ఏ క్షణాన్నైనా కాటు వేసేందుకు సిద్ధంగా వుంది.

    అంతే... మెరుపులా పక్కకు దూకాడు.

    కుక్క మొరగటం ఆపింది. తిమ్మడివేపే చూస్తూ తోకాడిస్తోంది.

    తిమ్మడు దానివేపు కృతజ్ఞతగా చూసి మెల్లగా పిల్లిలా ఆ పాము వెనుకవేపుకు చేరాడు. అదను చూసుకొని చటుక్కున దాని తోక పట్టుకొని దాంతో సహా గిర్రున తిరిగాడు. అలా తిరుగుతూనే, ఒడుపుగా దాని తలను దగ్గర్లో వున్న మామిడిచెట్టుకేసి బాదాడు. దాని తల పగిలి అదక్కడికక్కడే చచ్చిపోయింది. దాన్ని దూరంగా విసిరేసి తన మూట దగ్గరకు వచ్చాడు.

    కుక్క తనవేపే చూస్తోంది. మిగిలిన రొట్టెను దాని నోటికి అందించాడు. ఆకలిమీద వుందేమో- క్షణాల్లో నమిలిపారేసింది.

    ఒక్కక్షణం ఆలస్యమై వుంటే?

    కుక్కపిల్ల కాలువ దగ్గరకు వెళ్ళి నీళ్ళు తాగి తిరిగి తిమ్మడి వద్దకు వచ్చింది.

    దాన్ని ఓసారి దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకోబోయి ఆగిపోయాడు. దాని ఒళ్లంతా గజ్జి. అది ప్రేమగా తిమ్మడి చేతినే నాకుతోంది.

    దాన్ని చేతుల్లోకి తీసుకొని ఇంటికి బయలుదేరాడు.

    దారి పొడవునా రానున్న ప్రమాదం గురించే ఆలోచిస్తున్నాడు. చదువూ, సంధ్యా లేక బలాదూర్ గా తిరుగుతున్నానని తిడుతున్న అమ్మ ఈ బుజ్జి ముండను చూస్తే వూరుకుంటుందా...? ఊరుకోకపోతే సిద్దప్పగాడి పాకలో వుంచాలి కొన్నాళ్ళు.

    ఓ టీ కొట్టు ముందుకు వచ్చాక కుక్కపిల్ల చెంగున ఎగిరి దూకి ఎదురుగా బల్లమీద పెట్టున్న బన్ రొట్టె ఒకటి నోట కరచుకొని తిమ్మడి దగ్గరకు పరిగెత్తుకు వచ్చింది. 


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS