Previous Page Next Page 
బ్లాక్ మాంబా పేజి 2


    అహోరాత్రుల ఆయన తపస్సు, అకుంఠిత దీక్ష గురించీ తెలిసిన శృతి వారంరోజులుగా ఆయనలో అసాధారణమైన మార్పును చూసింది. ఆ మార్పు ఈ రోజు ద్విగుణీకృతంగా వుంది.

    తన జీవితంలో చాలా భాగాన్ని ప్రయోగశాలలకి అంకితం చేసిన డాక్టర్ సంఘమిత్ర కేవలం ఇప్పుడు తెలుసుకోబోయే ఫలితం పైన ఆయన భవిష్యత్తు కార్యక్రమమూ, ఆయన భవిష్యత్తు సహితం ఆధారపడి వుంది...ఈ విషయం ఆయనకి మాత్రమే తెలుసు.

    "శృతీ" అలసటగా ఆమె వైపు చూశాడు. "జీవిత సత్యాన్ని క్షుణ్ణంగా అర్ధం చేసుకున్న తాత్వికుడు ప్రపంచంతో సంబంధాలు తెంచుకుని సమాధిలోకి వెళ్ళిపోతాడు. కాని నేను బిడ్డ మరణంతో తాత్వికుడిలా మారినా ప్రపంచంతో సంబంధాలు తెంచుకోలేకపోయాను. నా ఆవేదన్ని ఎవరితోనూ పంచుకోవాలనుకోలేదు. ఒక ఫలితాన్ని సాధించి అందరికీ పంచాలనుకున్నాను. దానికిది చివరిరోజు..."

    టాక్సికాలజీ, ఫార్మకాలజీ, ఇమ్యునాలజీల్లో లోతుగా మాటాడగలిగే ఓ శాస్త్రజ్ఞుడి గొంతులోనుంచి ఆమెకర్ధం కాని కొత్త వాక్యాలు వినిపిస్తున్నాయి. ఎన్నడూలేని భయం ఆమెను నిలువునా కుదిపేస్తూంది.

    నీరెండలో మెరిసే సంపంగిలా అనిపిస్తున్న శృతి లేలేరక పొలాలపై తుషార బిందువుల్లా అలుముకున్న స్వేదాన్ని తుడుస్తూ అన్నాడు. "నాకు తెలుసు శృతీ...వాడి మరణంతో నువ్వెంత కృంగిపోయావో నేనూహించగలను. ఆ గతాన్ని మరచిపోవాలని రేయింబవళ్ళూ ఈ వృద్ధుడికి ఆసరాగా ఇలా తలమునకలవుతున్నావనీ తెలుసుకోగలను."

    "కాని..." దాగని ఓ నీటిబొట్టు ఆమె కనుకొలకులలో నుంచి జారిపడుతుంటే ఉద్విగ్నతని కప్పిపుచ్చుకుంటూ అంది. "ఇప్పుడు నాకేమైందని...డాక్టర్ని చేశారు. ఒక తండ్రిలా..."

    "అవును...కోడలు కావాల్సిన నువ్వు ఇప్పుడు కూతురిగా మారావు" నన్ను జన్మయివ్వని తండ్రిగా మార్చావు. కాని ఏ తండ్రీ తన కూతురి బ్రతుకు ఈ ప్రమాదకరమైన పాములమధ్య ఇలా గడిచిపోవాలని కోరుకోడు...నన్ను మాటాడనియ్ శృతీ" ఇంతకన్నా మరో అవకాశం రానట్టు ఆయన చెప్పుకుపోతున్నాడు. "ఇక నిన్ను శ్రమపెట్టను శృతీ...ఇదిగో అతి ముఖ్యమైన ప్రయోగం...ఒకవేళ నేనీ ప్రయోగంలో విఫలమైతే..."

    "అంకుల్" ఓ పసికందు కళ్ళలోకి తల్లి చూసినంత ఆశ్చర్యంగా అతడి మాటల్ని అర్దోక్తితో వారిస్తూ ఆయన ముందుకు నడిచింది. "ఎందరికో ముఖ్యంగా నాకు మార్గదర్శకులు కావాల్సిన మీరిలా మాటాడితే నేనేంకాను..." ఆమె నిర్వేదంగా నవ్వుతూనే అతడి బడలికని చెరిపేసింది...ఆయనకి తెలుసు అదే శృతిలో వున్న గొప్ప కళని... కంటివెనక నీళ్ళని క్రీనీడల్ని సులభంగా దాటేసి తన అందోళన్నీ నవ్వుల కేజ్ వెనుక వున్న ఓ సర్పంగా మార్చేస్తుంది.

    వాచీ చూసుకున్నాడు... తెల్లవారు జామున మూడున్నర కావస్తూంది.

    ఓ కేజ్ లోవున్న కుందేలు పిల్లని తీసుకొచ్చాడు. "ఇప్పుడు కోబ్రడిన్ వైపరిక విషాలు దీని శరీరంలోకి ప్రవేశించాలి..."

    కోబ్రా కాటుతో 'కోబ్రడిన్' రక్తపింజరి కాటుమూలంగా వైపరిక 'విషం' కుందేలు రక్తంలో కలియాలి...ఆమె వెంటనే v ఆకారంగల ఓ స్టిక్ ని చేత్తో పట్టుకుని విషనాగువున్న కేజుపై మూత తీసింది.

    కుందేలుని కేజ్ లోకి జారవిడిచారాయన-బుస్ మన్న చప్పుడుతో పాటు సుమారు అయిదడుగుల పొడవున్న హ్రాచు వరుసగా రెండుసార్లు కాటువేసింది.

    ఓ మూల భయంతో నక్కిన కుందేలు సన్నగా మూలుగుతుంటే వాగు కేజ్ లోంచి బయటపడాలని బుసకొడుతూ ఎగిరెగిరి పడుతూంది.

    ఓ అరనిముషం ప్రయత్నించి స్టిక్ అంచునవున్న v ఆకారం వొక్కుతూ నాగు తలను ఒత్తి పట్టుకుంది ఒడుపుగా. 

    కుందేలు పిల్లని బయటికి తీసారాయన...ఇప్పుడు రక్తపింజరి వున్న కేజ్ లో అదే ఆపరేషన్ పునరావృతమైంది.

    ఈ మొత్తం కార్యక్రమం పూర్తి కావడానికి వారికి పట్టింది నాలుగు నిముషాలు...ఇప్పుడు కేజ్ మూతల్ని యధాస్థానంలో వుంచిన శృతి టెస్ట్ ట్యూబ్స్ ని టేబుల్ పై వుంచింది.

    మరో మూడు నిముషాలు గడిచేసరికి కుందేలులో చైతన్యం నశించి క్రమంగా స్పృహ కోల్పోయింది.

    "అంకుల్" కుందేలుని తదేకంగా చూస్తూ అంది. "దాని నోటి నుంచి రక్తం కారుతూంది. అప్పుడే హిమోటాక్సిన్ కార్టియో టాక్సిన్స్ పని చేస్తున్నాయనుకుంటాను."

    పరిశీలనగా కుందేలుని గమనించాడు. వై పరిన్ మూలంగా బ్లడ్ రావడంతో బాటు కోబ్రడిన్ దాని శ్వాసక్రియనీ మందగింప చేస్తూంది.

    "విషాల్లోని ఎరిజైమ్స్ అయిన 'ప్రోటియోలైసిన్స్' 'ఫాస్పోడై ఎస్టిరేసిస్' 'లెసిథినేసిస్' టిస్యూలని కరిగించడంతోబాటు ఇంటర్నల్ హిమరేజ్ మొదలైంది." అదే అతడు తన ప్రయోగం ప్రారంభించాల్సిన తుదిక్షణం.

    వీనమ్ క్రిస్టిల్స్ కల ద్రావకాన్ని టెస్ట్ ట్యూబ్ తో సహా అతడు అందుకుంటుంటే చేతులు వణికాయి కొద్దిపాటి ఆందోళనతో.

    కుందేలు కాటుపడి గాయాలపై నెమ్మదిగా ద్రవాన్ని ఒంపాడు. అప్పటికి కుందేలు శరీరంలో విషయం ప్రవేశించి పదినిముషాలైంది.

    ఒకవేళ తన ప్రయోగంలో ఏంటీడోట్ పనిచేస్తే కనీసం పదిహేను నిముషాలలో అది మామూలు స్థితికి రావాలి. రక్తప్రసరణ గడ్డకట్టించే హెమోటాక్సిన్ గాని గుండెను ఆపే కార్డియో టాక్సిన్ కి తన మందు విరుగుడే అయితే పదినిముషాల వ్యవధిలో కుందేలులో ముందు చలనం ఏర్పడాలి.

    విడివిడిగా పాము జాతినిబట్టి ఏంటీవీనమ్ ఆయింట్ మెంటును కనుక్కోవడంలో ఎప్పుడో సఫలీకృతులడైన ఆ ప్రొఫెసర్ ఇప్పుడు రెండు పాముల విషాన్ని సమ్మేళన పరచి చూస్తున్నాడు.

    ఇది జయప్రదం అయితే పాము విషంలో మూడవది చివరిదీ అయిన 'న్యూరోటాక్సిన్' పై తన చివరి ప్రయోగాన్ని నిర్వహిస్తాడు. కేంద్ర నాడీమండలాన్ని విచ్చిన్నంచేసే ఈ విషం అమితంగా వున్నది. ప్రపంచ సర్పాలన్నింట్లోనూ అతి ప్రమాదకరమైన "బ్లాక్ మాంబా"లో

    ఇదంతా సాధించగలనన్న నమ్మకంతోనే ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి కేంద్ర ప్రభుత్వ అనుమతితో ఆఫ్రికానుంచి 'బ్లాక్ మాంబా'ని త్వరలో దిగుమతి చేయిస్తున్నది కూడా.

    అలసటగా ఓ మూల కూర్చున్నాడాయన కుందేలునే చూస్తూ... నిముషాలు గడుస్తున్నాయి...బహుశా రెండు దశాబ్దాల అతడి అనుభవంలో ఇంత టెన్షన్ ఏనాడూ అనుభవించలేదు.

    పది...పదిహేను...ఇరవై...ఇరవై అయిదు నిముషాలు గడిచాయి...తిరుగులేని తన నమ్మకాని కిక్కడే గండి పడిపోయింది. అనూహ్యమైన నిస్త్రాణ.

    ముందు తేరుకున్నది డాక్టర్ శృతి. "అంకుల్..." ఏదో నచ్చచెప్పబోయింది.

    "అయిపోయింది శృతి" భావరహితంగా అన్నారాయన. "నా నిర్విరావ ప్రయాణం శూన్యంలోకే అన్నది ఈ క్షణంలో అర్ధమైపోయింది."

    "కానీ మరోసారి ఈ ప్రయోగాన్ని చేసి..."

    "లేదమ్మా...నా అనుభవాల్ని మేధస్సునీ క్రోడీకరించి చేసిన ఈ ప్రయోగం తర్వాత ఇక నేను చేసేదేమీలేదు" నిర్వేదమో నిర్లిప్తతతో కిటికీ వారగా నడిచి చీకటిలోకి చూస్తూ అన్నాడు. "ఎన్ని కలలు కన్నాను. ఇక్కడ గెలుపుతో బ్లాక్ మాంబాలాంటి రెప్డెయిల్ విషానికీ ఏంటిడోట్స్ ని కనుక్కుని ఏ పాము కాటేసిందీ అన్న విషయంతో సంబంధం లేకుండా 'పోలీవీనమ్ సిరమ్' స్థానంలో పటిష్టమైన ఆయింట్ మెంటు తయారు చేయాలనుకున్నాను. ఏ మనిషీ ఇక హాస్పిటల్ కి వెళ్ళాల్సిన అగత్యం లేకుండా తన ఇంట్లోనే ఆ ట్యూబ్స్ ని దాచుకోవాలని తండ్రిగా ఒకనాడు నేను అనుభవించిన మనోవ్యధ మరెవ్వరికీ రాకూడదనుకున్నాను. బట్..." ప్రపంచమంతా నిశ్శబ్దంగా నిద్రపోతున్న ఆ నిశీధివేళ ఒక తపస్సులా ఎన్నో నిద్రలేని రాత్రుల్ని గడిపిన ఆ ప్రొఫెసర్ మానసికమైన ఆందోళన కేవలం ఆ స్థితిలో ఉన్న వ్యక్తికి మాత్రమే అర్ధమయ్యేది.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS