Previous Page Next Page 
శిక్ష పేజి 4


    గత ఏడాదిగా రంగారావు ఆ స్థితిలో వున్నారు. కొడుకుని ఎలాగైనా మళ్ళీ మనుష్యులలో పడేయాలని జమీందారిణి మళ్ళీ వివాహం చేసుకోమని ఎన్ని విధాల నచ్చ చెప్పి బతిమిలాడింది. వంశం నిరంశం అయిపోతుందని ఎంతో వ్యదగా చెప్పింది. తల్లి మాటలకి రంగారావు విషాదంగా నవ్వి తల అడ్డంగా ఆడించి వెళ్ళిపోయాడు. మరీ తల్లి బతిమిలాడగా 'అదిజరిగేపని కాదమ్మా చెప్పి నన్ను విసిగించకండి అని మొహం తిప్పుకొని వెళ్ళిపోయాడు. ఇంకా ఏం చెయ్యగలదు? ఆ లంకంత భవనంలో తల్లి ఒక మూల, కొడుకు ఒక మూల, రోజులు గడప సాగారు.
    నాలుగు రోజుల క్రిందట మద్రాసు నుంచి వచ్చిన రంగారావు మళ్ళీ ప్రయాణం అవుతున్నాడన్న వార్త విని జమీందారిణి ఊరుకోలేక కొడుక్కి కబురంపింది. "పెద్దమ్మ గారు తమర్ని వచ్చి కనబడమన్నారు బాబూ దాసి వచ్చి కబురు చెప్పింది- డ్రెస్సు అవుతున్న రంగారావు "వస్తున్నానని చెప్పు అన్నాడు. బాబూ ఏమిటిది నలుగు రోజుల క్రితం పదిరోజులు తిరిగి తిరిగి వచ్చావు. యిప్పుడు మళ్ళీ ఎక్కడికి ప్రయాణం అలా తిరుగుతూంటే నీ ఆరోగ్యం ఏమవుతుందో ఆలోచించావా-మిగిలిన వాడివి నీ ఒక్కడివీ నాకళ్ళముందే నీవిలా అయిపోయితూంటే నేనెలా సహించాను" వృద్ధ జమీందారిణి గొంతు రుద్దమయింది.
    "రంగారావు దోషిలా తలదించుకున్నాడు." అద్దంలో ఒకసారి నీ మొహం చూసుకోబాబూ-ఆ కళ్ళకింద నలుపు చూడు- ఆ కళ్ళెంత లోతుకు పోయాయొ-నిన్నిలా చూస్తూంటే నా గుండె తరుక్కు పోతుంది. పోయినవాళ్ళతో మనమూ పోలేం బాబూ-గుండె దిటవు పరుచుకోవాలిగాని బిత్తిగా యిలా అయిపోతే ఎలా నాయనా-సంవత్సరం అయింది యింకెన్నాళ్ళు యిలా నిద్రాహారాలు లేకుండా కృంగిపోతావు- మరచిపోవాలి బాబు. "ఎలా మరిచిపోనమ్మా-కళ్ళు తెరిచానా మూసినా బాబే కనిపిస్తున్నాడు-రమనాతో ఒక్కమాట చెప్పకుండానే వెళ్ళిపోయింది. యిదంతా ఎలా మరవను- ఎవరి కోసం బతకాలమ్మా యింకా" అంత దృఢమైన మనిషి, అంత ఆజాను బాహువు పసివాడిలా కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు. "నేనింకా బ్రతికే వున్నారా బాబూ-నాకోసం, నాకు కొరివి పెట్టాల్సిన నీవేయిలా మాట్లాడితే నేనేమై పోవాలి నాయనా, చెట్టంత కొడుకుని వంశాకురమైన పసివాడిని మహాలక్ష్మి లాంటి కోడల్ని పొట్టన పెట్టుకుని నేనింకా బతికెవున్నారా నాయనా నా కోసమైనా నీవు సంతోషంగా వుండాలి నాయనా, "హు ఆనందం ...... సంతోషం ...... అవి ఇంక ఈ జన్మకి మళ్ళీ దొరకవమ్మా "జమీందారిణి యింకే మనగలదు నిట్టూర్చింది "అస్తమానం యిలా యిల్లు పట్టకుండా తిరగకు నాయనా. నా మాట విని ప్రయాణాలు మానుబాబూ." "లేదమ్మా ఈ ఇంట్లో నేనుండ లేనమ్మా- యీ నిశ్శబ్దం నన్ను పిచ్చివాడ్ని చేస్తూంది. నన్ను వెళ్ళనీయండి అడ్డు చెప్పకండి" రంగారావు తల్లికి మరోమాట అనే అవకాశం యీయకుండా చరచర వెళ్ళిపోయాడు. బయట కారు శబ్దం విని జమీందారిణి నిట్టూర్చి పక్కమీద వాలింది.
    మద్రాసులో రంగారావుగార్కి చాలామంది స్నేహితులున్నారు. ఆయన ఎప్పుడూ ఓ పెద్దహోటల్లో బసచేస్తారు. ఆయనకి కల్గిన దుఃఖం మరిచి పోవడానికి అలా తరుచు వస్తున్నాడన్న సంగతి వాళ్ళకి తెలుసు, అంచేత ఆయనచుట్టు మిత్రబృందం వుంటూనే వుంటుంది-డబ్బుండాలేగాని, విలాసాలకి, వినోదాలకి ఏంలోటు!  ఆయనచేత తాగుడు- పేకాట-డాన్సులు-పార్టీలకు ఖర్చు పెట్టిస్తూ ఆయన ఖర్చుతో వారంతా వినోదిస్తూ ఆయన్ని వినోదింపచేస్తున్నాం అని తృప్తిపడేవారు. ఆయన ఆనందిస్తున్నట్టు పైకి కనిపించేది అంత నటన అని ఆయన అంతరాంతరాలలో ఆయన బాధ మరిచిపోలేదన్న సంగతి వాళ్ళకు తెలియదు. ఎన్నోసార్లు ఆయన గదికి ఎందరో అందమైన విలాసవతులను పంపేవారు. రంగారావు కెప్పుడూ అలాంటి భోగలాలసలేదు. ఈనాడు భార్య లేకపోయినా ఆయన దృష్టి మరే స్త్రీ మీదకి మళ్లేదికాదు. అలాంటి సుఖం కావాలని ఆయన కోరుకోనూ లేదు. అంచేత రానురాను ఆ మిత్రులు వారి పార్టీలు వారి సహకారంపట్ల ఆయనకీ విముఖత కల్గింది. అంచేత ఈ మధ్య ఆయన తన బస మరొక హోటలుకి మర్చేశాడు. తాగడం లేదా బీచిపడ్డున వచ్చిపోయేవారిని చూస్తూ కూర్చోడం-కారు తీసుకుని రోడ్డు అన్ని తిరగడం-దైనందిన కార్యక్రమం అయింది.
    ఆ రోజు అలా గమ్యం లేకుండా పరధ్యానంగా కారు నడుపుతూ వెళుతున్నారాయన. వీధి మలుపు దగ్గర హారన్ మోగించకుండానే చటుక్కున కారు తిప్పేశారు. అట్నించి అప్పుడే మలుపు తిరుగుతున్న ఓ యువతి కెవ్వున కేకేసి కారు క్రింద పడడం అన్నీ ఒక్క క్షణంలో జరిగిపోయాయి. అప్పటికి గాని రంగారావు స్పృహకి రాలేదు. చటుక్కున కారాపి గబగబా దిగారు. అప్పటికే కారు చుట్టూ గుంపు మూగింది. అందరూ కలిసి కారుకింద పడిన యువతిని పైకి లాగారు. దెబ్బలు చాలా చోట్లు కనిపించాయి. ఆ హఠాత్ సంఘటనకి మతి పోయి నిలబడ్డాక రంగారావు-అంతా తలో మాట అనడం మొదలు పెట్టాక చటుక్కున కర్తవ్యం గుర్తించి ఆమెని కారులో పడుకోపెట్టించి గబగబ తనకు తెల్సిన ఒక నర్శింగ్ హోముకి తీసికెళ్ళారు. తగిలిన గాయాలు అట్టె ప్రమాదకరమైనవి కాదని డాక్టర్ ధైర్యం చెప్పేవరకు ఆయన మనసు స్థిమితి పడలేదు. ఏక్సిడెంటు అంటే ఆయనకి ఎంతో గుండెదడ! ఈ రోజు మళ్ళీ ఏక్సిడెంటు జరగడం-రక్తసిక్తమైన యువతి! ఆయన కళ్ళు తిరిగినట్లయి అలా కుర్చీలో వాలిపోయారు. ఒక గంట గడిచి ఆ యువతికి తెలివి వచ్చిందన్న వార్త డాక్టరు చెప్పేవరకు ఆయన కోలు కోలేదు అప్పుడు డాక్టరు వెంట ఆమెని చూడటానికి బయలుదేరాడు. ఆ యువతి వంటిని గాయాలకి దూది పెట్టి వుంది. మోపుగాతగిలిన చోట బ్యాండేజ్ వేశారు. డాక్టర్ యింజక్షన్ యిచ్చాక కాస్త తగ్గింది. ఆమెని చూడగానే రంగారావుకి ఎక్కడో తెల్సిన మొహంలా చూసిన మొహంలా అన్పించింది, ఎంత ఆలోచించినా ఎక్కడ ఎప్పుడు చూసింది. ఆయనకి గుర్తురాలేదు. బాధగా కళ్ళు మూసుకొని పడుకున్న ఆమె అడుగుల చప్పుడుకి కళ్ళు తెరిచింది. రంగారావుని చూడగానే ఆమె కళ్ళలోనూ ఆశ్చర్యం కన్పించింది. పోలిక గుర్తుదొరకగానే సంభ్రమంగా లేవబోయింది. "ఆ.....ఆ.....కదలకు పడుకో అమ్మా-యీయన రంగారావు గారు వీరి కారు కిందే నీవు పడ్డావు. డాక్టరు పరిచయం చేశాడు ఆమె తడబడ్తూ నమస్కారం చేసింది. "మీరు.....మీరు.....అంది రంగారావు ఖిన్నుడై "క్షమించండి పరధ్యానంగా చూసుకోకుండా డ్రైవ్ చేశాను. నా వల్ల మీకు కలిగిన కష్టానికి చాలా విచారిస్తున్నాను. క్షమాపణ కోరుతూ అన్నాడు రంగారావు. ఆమెతో మాట్లాడుతున్న ఆయన ఆమెను ఎక్కడ చూశావా అని ఆలోచిస్తూనే వున్నాడు. "అలా అనకండి-నాదీ తప్పే-నేనూ తల దించుకుని పరాకున నడుస్తున్నాను" ఆ యువతి ఆయన క్షమాపణకు సిగ్గు పడ్తున్నట్లు బిడియంగా అంది. "ఇలా అనుకోకుండా మళ్ళీ మీ దర్శనం లభించింది." ఆమె చాలా భక్తిగా, కృతజ్ఞతతో మరోసారి నమస్కరించింది. రంగారావు ఆశ్చర్యంగా "నేను మీకు తెలుసునా-మీ రెవరు? నాకూ ఎక్కడో చూసిన గుర్తు వస్తూంది!" "నన్ను మీరు అనకండి-మీ ఆశ్రయంలో బతికిన దానిని-మీ అన్నపూర్ణ అనాధాశ్రమంలో పెరిగి పెద్దదాన్నయ్యాను, నా పేరు శ్యామల. మాలాంటి నిర్భాగ్యులను ఆదుకునే పుణ్యాత్ములు మీరు. ఇన్నాళ్ళకి మీ దర్శనం లభించింది, యీ ఏక్సిడెంటు వలన-" అంది శ్యామల రంగారావుకి చటుక్కున గుర్తువచ్చింది. ఆయన మొహం విప్పారింది..... "ఆ......ఆ.....నిన్ను అనాధశరణాలయంలో.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS