Previous Page Next Page 
మారణహోమం పేజి 4

 

    "ఈ నిఖిల్ చేసిన మిగతా హత్యల గురించి....."   
    "ఈ నిఖిల్ ఎవరో నాకు తెలియదు. ఇతను హంతకుడని నాకు తెలియదు. అసలు ఇతన్ని నేనెప్పుడూ చూడలేదు."   
    కోర్టులో మళ్ళీ ఒక్కసారిగా అలజడి. పెద్ద పెద్దగా మాటలు.   
    "ఆర్డర్.....ఆర్డర్...." అన్నారు జడ్జిగారు.   
    "నేను చాలా దొంగతనాలూ, దోపిడీలు చేశాను. అంబాసిడర్ కార్లు దొంగిలించడంలో నేను స్పెషలిస్టుని. ఆ వివరాలన్నీ చెబుతున్నాను. కానీ ఇతను ఎవరో నాకు తెలియదు. ఇతని సంగతి నన్ను అడక్కండి" అని ఆగి "సాబ్! నామీద దయ ఉంచి నాకు పదేళ్ళు జైలుశిక్ష వెయ్యండి. నన్ను జైల్లోనే ఉండనివ్వండి. బయటకుపంపకండి" అన్నాడు జగ్ మోహన్ వణికిపోతూ.   
    ఆ కోర్టులో ఉన్న అంతమంది మనుషుల్లోనూ, జరుగుతున్నది చూస్తున్నా ఎగ్జయిట్ కానిది ఒక్కడే.   
    అతను నిఖిల్.   
    జరిగినదీ, జరుగుతున్నదీ, జరగబోయేదీ, తన కొక్కడికే తెలుసు అన్నట్లు అందరినీ నిర్లక్ష్యంగా పరికిస్తూ నిలబడి ఉన్నాడు అతను. ఈ పరిస్థితిని ఎన్ జాయ్ చేస్తున్నట్లు అతని పెదిమలు సన్నటి నవ్వుతో వంకర తిరిగాయి.   
    "వాటిజ్ దిస్...వాటీస్ దిస్.....వాట్ హాపెన్డ్" అంటున్నారు పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఆగ్రహంతో ఆయన ముక్కుపుటాలు పెద్దవయ్యాయి. బట్టతలమీద అంతా చెమట పట్టింది.   
    నోటమాట రాకుండా తెల్లబోయి చూస్తోంది అమూల్య.   
    ఈ వార్త క్షణాలమీద రోడ్లెక్కేసింది. అక్కడ నిలబడి ఉన్న వాళ్ళంతా అసహనంగా కేకలు వెయ్యడం మొదలెట్టారు. ఒకళ్ళిద్దరు రాళ్ళేసారు కూడా. హుటాహుటీన పోలీసువాన్లు వచ్చాయి. పోలీసులు రంగంలోకి దిగారు.   
    హఠాత్తుగా మారిపోయిన పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కోర్టుని వాయిదా వేసారు జడ్జిగారు.   
    నిప్పు తొక్కినట్లు గెంతులేస్తున్నాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్. మామూలుగానే ఆయన చిరాకు మనిషి. ఇవాళయితే అసలు మనిషిలాగే లేడు.   
    "సార్! సార్" అని పరిగెత్తుకువచ్చి ఆయనకు ఒక కవరు అందించాడు స్టాఫ్ మెంబరు ఒకతను.   
    అది తీసుకుని చూశాడు ప్రాసిక్యూటర్.   
    దానిలో ఒక ఫోటో మాత్రం ఉంది. ఫోటోలో మనిషికి తల లేదు. మెడదగ్గర నీటుగా కత్తిరించేసి ఉంది ఆ ఫోటో!   
    అది జగ్ మోహన్ ది!  
    
    సాక్ష్యం చెబితే మెడ నరికేస్తానని బెదిరింపు అది! జగ్ మోహన్ కి ఎలా చేరింది? అంత కట్టుదిట్టమయిన రక్షణ ఏర్పాటుచేసినా అంత ధైర్యంగా జగ్ మోహన్ ని సమీపించి బెదిరింపుని ఎలా అందజెయ్యగలిగారు? ఎవరు అందజెయ్యగలిగారు? ఎవరు అందజేసారు.  

    "ఎక్కడ దొరకింది ఇది?" అన్నాడు ప్రాసిక్యూటర్ పళ్ళు పటపట కొరుకుతూ.   
    "జగ్ మోహన్ ని ఉంచిన రూంలో! ఇది చూడగానే వాడు షాకయిపోయాడు. అక్కడే వదిలేసినట్లున్నాడు దీన్ని!"   
    "ఎవరెవరు వెళ్ళారు జగ్ మోహన్ దగ్గరికి?"   
    ఆ కవరు తెచ్చిన అతను కొంచెం తటపటాయించి అన్నాడు "ఒక్కరే అతన్ని కలుసుకుంది"   
    "ఎవరు?"   
    "మిస్ అమూల్య!"   
    "అమూల్య! అమూల్యా? నువ్వెందుకెళ్ళావ్?"   
    పెదిమలు తడిచేసుకుంది అమూల్య. 

    "ఆ కవరు ఇవ్వడానికి"   
    "వ్వాట్?"       
    "మీ స్టెనో తెచ్చి ఇచ్చింది ఆ కవరు నాకు. మీరు బిజీగా ఉన్నారనీ, నేను వెళ్ళి దాన్ని జగ్ మోహన్ కి ఇవ్వాలని చెప్పింది"   
    "నా స్టెనోనా? ఎవరు?" 

    "జమున" 
    
    "జమునా లేదు. యమునా లేదు. నాకసలు ఆడస్టాఫే లేరు నువ్వు తప్ప! ఆడవాళ్ళు ఫూలిష్ గా ఉంటారని నాకు తెలుసు. అందుకే ఎప్పుడూ పెట్టుకోను. పొరబాటున మొదటిసారిగా నిన్ను పెట్టుకున్నాను.  దుంపనాశనం చేసిపారేశావ్!" అని హఠాత్తుగా ఏదో గుర్తువచ్చినట్లు ఆగాడు.  

    "మీది ఏ ఊరన్నావ్?"   
    "వరంగల్" అంది అమూల్య భయంగా.

    పళ్ళన్నీ బయటపెట్టి సంతోషం లేని నవ్వు నవ్వాడు ప్రాసిక్యూటర్. "అర్ధమయింది! నిఖిల్ తో నీ కెప్పటినుండి పరిచయం? మీ ఊరివాడేగా?"  

    "నాకా? అయ్యో! నాకు అతనెవరో తెలియనే తెలియదు!"   
    "తెలియదూ?" 
    
    "అంటే ఇదివరకు పేపర్లలో చదివాను. ఇప్పుడు కేసు సందర్భంగా చూసాను."   
    "కేసు పూర్తయ్యాక మళ్ళీ మళ్ళీ చూస్తూనే ఉంటావు అతన్ని. అవునా? చెప్పు! ఏమిటి మీ అండర్ స్టాండింగ్? ఎంత ఇచ్చాడు అతను నీకు? లక్షా? రెండు లక్షలా? చెప్పు! మొహమాటంలేదు? లేదు. ప్రతివాళ్ళకీ ఒక రేటు ఉంటుందనీ, ఎవరినైనా ఎంతరేటుకైనా తను కొనెయ్యగలననీ అంటూ ఉంటాడు నిఖిల్! చెప్పు! నువ్వు ఎంతకు అమ్ముడుబోయావ్?"   
    చివ్వున కళ్ళలో నీళ్ళు తిరిగాయి అమూల్యకి.   
    "పొరబాటయి పోయింది. ఇలా ఇంకెప్పుడూ జరగనివ్వను" అంది మెల్లిగా.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS