Previous Page Next Page 
జీవనయానం పేజి 3


    ఆకలి ముందు సామ్రాజ్యాలు కొరగావన్నావు. ఒక జాగీరు ఇచ్చి అన్నం కొనాలనుకుంటున్నావు. మేము ఫకీరులం; అన్నం అమ్ముకోము, ఆకలి తీర్చుతాము. రొట్టెలు తెస్తాను, నిలువు" అని ఆ ఫకీరు ఒక పళ్లెంలో రొట్టెలు మడతలు తెచ్చాడు. ఖమ్రుద్దీన్ కు ఒక్కొక్కటీ ఇచ్చాడు. అతను ఆకలిగా ఉన్నాడు. ఏడు రొట్టెలు తిన్నాడు. మరొక రొట్టె తినమని ఫకీరు బలవంతం చేశాడు. ఖమ్రుద్దీన్ తినలేకపోయాడు.

 

    ఖమ్రుద్దీన్ విశ్రమించాడు. మేలుకున్నాడు. ప్రయాణానికి సిద్ధం అయినాడు.

 

    అంతవరకూ అతణ్ణి గురించి ఫకీరు అడగలేదు. ఎవరో ఆకలితో వచ్చాడు అనుకున్నాడు. అన్నం పెట్టాడు. అప్పుడు అడిగాడు.

 

    ఖమ్రుద్దీన్ తాను సుల్తానును అని తెలియపరచాడు. కావలసింది కోరుకొమ్మన్నాడు.

 

    "ఇచ్చేవాడు అల్లాహ్ నాయనా! నీకు సామ్రాజ్యాన్ని ఇచ్చాడు. నాకు ఈ కుటీరాన్ని ఇచ్చాడు. నాకు ఇంతవరకే అర్హత ఉంది. ఇంతకుమించి కోరే అధికారం లేదు. నాయనా, ఆసిఫ్జాహీ వంశం ఎంతకాలం ఏలుతుంది అనుకుంటున్నావు?"

 

    "సూర్య చంద్రాదులున్నంతకాలం!"

 

    "పిచ్చివాడా! ఈ విశ్వంలో అల్లాహ్ తప్ప ఏదీ శాశ్వతం కాదు. ఆసిఫ్జాహీ వంశం ఏడు తరాలు మాత్రం ఏలగలదు."

 

    "జనాబ్! అట్లు అనకండి. నా వంశం కలకాలం నిలవాలని దీవించండి."

 

    "వెర్రివాడా! నీవు ఏడు రొట్టెలే తిన్నావు కదా? బలవంతం చేసినా మరొకటి తినకపోతివి. నీవు ఏడుతరాలు అడుక్కున్నావు. అల్లాహ్ నీకు అంతే ఇచ్చాడు. తృప్తి చెందు. వెళ్లిరా."

 

    ఖమ్రుద్దీన్ హైదరాబాదు చేరుకున్నాడు. కథ ఎంత నిజమో తెలియదు. కాని, ఆసిఫ్జాహీ రాజ్యం ఏడవ తరంతో అంతం అయింది!

 

    ఎంతటి వానికయినా తప్పనిది మృత్యువు.

    జీవితంలో ఏదీ నిశ్చితం కాదు - మృత్యువుతప్ప.

 

    నిజామ్ -ఉల్ -ముల్క్ తొలి ఆసిఫ్జాహీ ఖమ్రుద్దీన్ కూ అవసానకాలం సమీపించింది అతడు తన ప్రభావాత్మకమైన జీవితాన్ని గురించి సుదీర్ఘంగా రాశాడు. తన వారసులకు కొన్ని సలహాలు ఇచ్చాడు.

 

    1. సాధ్యమయినంతవరకు తమంతటతాము యుద్ధానికి ఉపక్రమించరాదు.

 

    2. తగాదాలు, శత్రువులు తలెత్తినపుడు సామరస్యంగా పరిష్కరించుకోవాలి.

 

    3. విధిలేని పక్షంలోనే యుద్ధానికి దిగాలి. భగవంతుని సాయం అర్థించాలి. యుద్ధరంగంలో శత్రువును ఓడించాలి. అతణ్ణి లోబరుచుకోవాలి.

 

    అవసాన సమయం ఆసన్నం అయినపుడు భార్యలను - సర్దారులను - నవాబులను - ఏడుగురిలో ఆరుగురు కొడుకులను సమీపించుకున్నాడు. వారందరి సమక్షంలో గతాన్ని తలుచుకుంటూ, అల్లాను స్మరిస్తూ - తొంభైఒక్క సంవత్సరాల వయసులో నిజామ్ -ఉల్ -ముల్క్ ఆసిఫ్జాహీ ఖమ్రుద్దీన్ దివంగతుడైనాడు.  

 

    కారేరాజులు రాజ్యముల్ గలుగవే గర్వోన్నతింబొందరే
    వారేరీ సిరిమూట కట్టుకొని పోవంజాలిరే భూమిపై
    బేరైనంగలదే శిబిప్రముఖులం బ్రీతిన్ యశః కాములై
    యీరే కోర్కులు వారలన్ మరచిరే యిక్కాలమున్ భార్గవా!

 

    ఇది శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కందంలోని పద్యం. రాజులూ, రాజ్యాలు వస్తాయి - పోతాయి. కాని, సత్కార్యం చేసినవాణ్ణి ప్రజలు గుర్తుంచుకుంటారు అంటాడు.

 

    ఆసిఫ్జాహీలు చేసిన మంచి పనులు లేవు. ఇది వాస్తవ సత్యం.

 

    ఖుతుబ్ షాహీలు చాల సత్కార్యాలు చేశారు. అందుకు కారణం వారు విజయనగరం రాజుల ప్రాపకం కలవారు. అందువలన వారికి మత సహనం, భాషాభిమానం కలిగాయి. వారు తెలుగు భాషను పోషించారు. ఇబ్రాహిమును తెలుగు కవులు "ఇభరాముడు" చేశారు. ఇభరాముడు కందుకూరి రుద్రకవికి రెంటచింతల అగ్రహారంగా ఇచ్చాడు.  

 

    రాసుతుడైన మల్కియిభరాముని కీర్తియు వెండికొండయున్
           ద్రాసున బెట్టితూన్ప రజతాచల మెత్తున దాకయుండినన్
    భాసురలీల నిల్చె నల బ్రహ్మ సదాశివు జాహ్నవీపతిన్
    వాసుకి కంకణున్ రుషభవాహను జంద్రకళావతంసునిన్

 

    అన్నాడు రుద్రకవి. మల్కిభరాముని కీర్తిని ఒకవైపు, కైలాసాన్ని ఒకవైపు త్రాసులో ఉంచాడు. వెండికొండ ఉన్న త్రాసు వంగలేదు. అప్పుడు బ్రహ్మ శివుణ్ణి వెండి కొండమీద నిలిపాడు. మల్కిభరాముడు అంతటి కీర్తిశాలి అని కవి వర్ణన.

 

    ఇభరాముడు గంగాధరకవి తపతీ సంవరణోపాఖ్యానం, తెలగనార్యుని యయాతి చరిత్ర కృతులు అందుకున్నాడు.

 

    ఇభరాముని కొడుకు ఖులీఖుతుబ్ షా, అతడు సౌందర్యారాధకుడు రసహృదయుడు. స్వయంగా కది. భాషాపోషకుడు. మతాల గోడలను - కోటలను కూల్చి భాగమతిని ప్రేమించాడు. ఆమె పేర భాగ్యనగరం నిర్మించాడు. భాగ్యనగర నిర్మాణ ప్రణాళిక అతని సౌందర్యారాధనకు మచ్చుతునక. దీనిని ఉద్యానాల నగరంగా నిర్మించాడు. చరిత్రలో ఒక ప్రియురాలి పేర సజీవ నగరం నిర్మించినవాడు ఖులీకుతుబ్ షా ఒక్కడే.

 

    "జవరాలు ప్రేమకై యువరాజు నిర్మించె
    పన్నీటి కాన్కగా భాగ్యనగరమ్ము" అన్నారు భాయ్ జాన్ నార్ల చిరంజీవి.

 

    ఖుతుబ్ -దక్కనీ ఉర్దూలో అనేక కవితలు వ్రాశాడు. ఖులీ తన దక్కనీ భాషలో అనేక తెలుగు పదాలు వాడాడు. తెలుగు పండుగలను గురించి తెలుగు సంస్కృతిని గురించీ వ్రాశాడు. ఖులీ తెలుగులోనూ అనేక కవితలను వ్రాశాడని వదంతి. అతని గ్రంథాలయం అగ్నికి ఆహుతి అయినపుడు అన్నీ దగ్ధమైనా యంటారు.

 

    ఖుతుబ్ షాహీలలో చివరివాడు అబుల్ హసన్ తానాషాహ్. అతనినే మనం తానీషా అంటాం. అక్కన్న - మాదన్నలు అతని ఆస్థానంవారు. రామదాసు భద్రాద్రి ఆలయం నిర్మించింది అతని కాలంలోనే.

 

    ఔరంగజేబు అబుల్ హసన్ను ఓడించాడు. గోలకొండను వశపరచుకున్నాడు. అప్పుడు అతని సైన్యాలు నిలిచిన చోటునకు ఫతెహ్ మైదాన్ అని పేరు పెట్టాడు. అంటే విజయస్థలం అని అర్థం. అక్కడనే ఇప్పుడు లాల్ బహదూర్ స్టేడియం ఉంది. కొండమీద నగరా మ్రోగించి ఔరంగజేబ్ తన విజయం ప్రకటించాడు. అదే ప్రస్తుతపు నౌబత్ పహాడ్.

 

    ఆసిఫ్జాహీలు మత దురహంకారి అయిన ఔరంగజేబ్ ప్రాపకంలో పెరిగారు. అందువలన వారికి అన్ని దుర్లక్షణాలు ప్రాప్తించాయి.

 

    1. వారు సంస్కారహీనులు.

 

    2. వారికి పరమత సహనం అతి తక్కువ

 

    3. తెలుగును వారు భాషగా గుర్తించలేదు. తెలుగును దిగజార్చిన యశస్సు వారిది.

 

    4. సత్కార్యాలు చేసిన జాడలు కనిపించవు.

 

    5. వారు అసమర్థులు, బలానికి దాసోహం అన్నారు.

 

    6. అత్యాశాపరులు.

 

    అందువల్లనే ఆంధ్రదేశాన్ని వారు సుమారు 200 సంవత్సరాలు పాలించినా ఆంధ్రులు గర్వంగా చెప్పుకోదగిన కార్యం ఒక్కటి కూడా చేయలేదు.

 

    అందుకే "వారేరీ సిరిమూట కట్టుకొని పోవంజాలిరే భూమిపై?"

 

   క్షీణదశ:

    ఏదీ ఎవడూ తన కోసం మాత్రమే సాధించదు. సంపాదించడు. సమకూర్చడు
    ప్రతివాడూ తన వంశంకోసం - తన వారసులకోసం సాధిస్తాడు.
    సంపాదించడం దుష్కర కార్యం. ఎన్నో బాధలు పడి సాధిస్తాడు - అది రాజ్యమైనా - సంపద అయినా.
    సాధించడం ఎంత కష్టమో - సాధించినదానిని వారసులు నిలుపుకోవడం అంతకంటే కష్టం.

 

    తాతలు సాధించినదానిని నిలుపుకున్నవారు అతితక్కువ.

 

    పులికడుపున పిల్లి పుడుతుందా? అనేది సామెత కాని, వీరాధివీరునికి పిరికిపందలు - మహాపండితులకు శుంఠలు పుడ్తున్నారు.

 

    సరిగ్గా ఖమ్రుద్దీన్ సంతానానికి ఆ గతే పట్టింది. తండ్రి సంపాదించుకున్నది నిలుపుకోలేకపోయారు. చాలావరకు పోగొట్టుకున్నారు.

 

    ఖమ్రుద్దీన్ కొడుకులు రాజ్యం కోసం కొట్టుకున్నారు. ఈ కీచులాటలో ఇంగ్లీషు - ఫ్రెంచివారు ప్రయోజనం పొందారు. 'కోతులు - రొట్టెముక్కలు' కథ పాతదే! నీతి గొప్పదే! అందరూ ఎరిగిందే! అయినా ఆచరణశూన్యం.

 

    నాసిర్ జంగ్ ఖమ్రుద్దీన్ రెండో కొడుకు. అతడు బ్రిటిషువారి సాయం తీసుకున్నాడు. తన మేనల్లుడు ముజఫర్ జంగ్ మీద యుద్ధం ప్రకటించాడు. ముజఫర్ ఫ్రెంచివారివెంట పడ్డాడు. ముజఫర్ ఓడాడు. చెరసాలకు చేరాడు. అయితే, నాసిర్ కు ఫలితం దక్కలేదు. ఒక పఠాను వీరుడు నాసిర్ ను ఓడించాడు. సమయం కనిపెట్టి ఫ్రెంచివారు ముజఫర్ ను గద్దె ఎక్కించారు. అయితే అతడూ కలకాలం ఉండలేదు. మరొక పఠాను ముజఫర్ ను తొలగించాడు. ఫ్రెంచివారు ఖమ్రుద్దీన్ మూడవ కుమారుడు సలాబత్ జంగ్ ను గద్దెకు ఎక్కించారు.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS