Previous Page Next Page 
అందమైన అపశృతి పేజి 2



    "ఓ.కె....." అంది శృతి డగ్గుత్తికతో.

    "గుడ్ గరల్! ధైర్యంగా ప్రవర్తించు. నావల్ల నీకేం అపకారం జరగదని మరోసారి మాటిస్తున్నాను" అన్న అతని చూపులు నేలమీద పడ్డాయి. వెంటనే ఉలిక్కిపడ్డాడు.

    అతని ఉలికిపాటు, కంగారుచూసిన శృతిచూపులుకూడా నేలమీద కెళ్ళాయి. గచ్చునేల తడి బురదతో వుంది. అతను వర్షంలో తడిసి రావడంవల్ల ఆ  తడి, బురద ఏర్పడ్డాయి.

    "వెంటనే నేల శుభ్రంగాతుడిచెయ్యి. నువ్వు లేదన్నా పోలీసులు  నమ్మరు. ఈ నీళ్ళు, బురద ఏమిటి? బైటనుంచి ఎవరొచ్చారని యక్షప్రశ్నలేస్తారు. క్విక్. ఏమాత్రం ఆలస్యం చేసినా నీకు నాకు ఆపదే. కానియ్! శిలాప్రతిమలా అలా నుంచున్నావేం?" గట్టిగా గద్దించి అతను లోపలి గదిలోకి వెళ్ళిపోయాడు.

    శృతికి ఏడుపోచ్చింది. గట్టిగా బిగపట్టుకొని పెద్ద పాతచెరొకటి పట్టుకొచ్చింది. ఇల్లు తుడిచే చిన్న గుడ్డతో అయితే ఆ రాత్రంతా తుడిచినా తడి ఆరదు. పుల్  స్పీడులో ఫ్యాను ఆన్ చేసి  చీరతో అతని గది దగ్గరనుంచి తుడుచుకుంటూ వీధి తలుపు దగ్గరకు వచ్చి తక్కున ఆగిపోయింది.

    అతను లోపలికి రాగానే ఆ తలుపు నానుకునే నుంచున్నాడు. అక్కడ అతని వంటినుంచి కారిన వర్షం నీరు మడుగులా వుంది. ఆ మడుగులో బూట్లకయిన బురద వుంది అంతేగాక తిలకం సీసా పగిలితే తిలకం వలికినట్లు రక్తం మడుగు అరచేతి వెడల్పున వుంది.

    దడదడలాడుతున్న గుండెని చిక్కబట్టుకుని తలుపువద్ద తడి, బురద, రక్తం చీరమొత్తం లుంగజుట్టి తుడిచేసింది. ఆ చీరని తీసుకెళ్ళి బక్కెట్లోపారేసింది. ఆతర్వాత దిగాలుగా ఆలోచిస్తూ మంచంమీద కూర్చుంది.

    తను సరిగా  గమనించలేదు. అతను భారీమనిషయినా, బలంగా వున్నా స్టేడీగా నుంచొని లేడు. తలుపుని ఆధారం చేసుకుని నించొని వున్నాడు. చాలా వేగంగా పరుగెత్తుకు రావటంవల్ల ఆయాసపడుతూ  నుంచొని వున్నాడనుకుంది. కాదు అతనికెక్కడో దెబ్బతగిలింది. ఎక్కడన్నాపడుంటాడు. చీకట్లో పరిగెత్తితే ఏమవుతుంది, బోర్లాపడక. తను  ఇప్పుడాలోచిస్తుంటే అనుమాన మొస్తున్నది. సరిగా తడపడబడుతుంటే వెళ్ళాడు. "ఒక చీకటిరాత్రి" సినిమాలోలాగా తనిని ఇతనేమైనా చేస్తే, అమ్మో!

    శృతి ఆలోచనలు ఆపై సాగలేదు. గజగజ వణుకుతూ కూర్చుంది. ఆ హడావుడి కంగారులో ఫాన్ ఆపడం మర్చి పోయింది.

    చాలామందికి ఆపదలోనే భగవంతుడు గుర్తుకు వచ్చినట్లు శృతికి ఈ సమయంలో భగవంతుడు గుర్తుకు వచ్చాడు.

    సరిగా అప్పుడే తలుపుపై మళ్ళీ దబదబ బలంగా తడుతున్న శబ్దం అయింది.


                                                  2

    శృతి మొండిదైర్యంతో మంచంమీదనుంచి లేచి "ఎవరది?" అంది గట్టిగా.

    "త్వరగా తలుపుతీయండి." ఈ తఫా టక్ టక్ మని కర్రతో తలుపుపై శబ్దం, బైటనుంచి పురుషకంఠం వినిపించాయి.

    "అర్థరాత్రప్పుడు పిలిచేది ఎవరంటున్నాను?" కిటికీ వద్దకొచ్చి అడిగింది శృతి.

    "పోలీసులం, తలుపుతీయండి."

    కిటికీ తలుపులు తీసింది శృతి, పోలీసులని చూసింది. వెంటనే తలుపులు తెరిచింది.

    ఇద్దరు పోలీసులు లోపలికొచ్చి గుమ్మంలో నిలబడ్డారు.

    "మీ రెందుకొచ్చారు?" అంది శృతి.

    శృతికి వాళ్ళు పరుగెత్తుకొచ్చారా?" అని అడిగారు.

    "నాకు తెలియదు నే చూడలేదు."

    "ఇంట్లో మీరొక్కరే వున్నారా?"

    "ఊ.....మాఅన్నయ్య రైల్వేఉద్యోగి. నైట్ డ్యూటీకి వెళ్ళాడు. అమ్మ ఉదయమే ఊరెళ్ళింది. మేం ముగ్గురమే మా యింట్లో వుండేది. అర్థరాత్రిపూట దేనికి మీరివన్నీ అడుగుతున్నారు?" మొండిధైర్యంతో శృతి మామూలుగానే అడిగింది.

    "ఓ హంతకుడు పారిపోయి ఇటుగా వచ్చాడు" ఓ పోలీసు చెప్పాడు.

    "హంతకుడా?" తెల్లబోయింది శృతి.

    "ఊ! హంతకుడే-అతను మామూలు హంతకుడుకాదు నరరూపరాక్షిసుడు, అందమైన హంతకుడు! ఎన్ని మారువేశాలో, ఎన్ని దొంగతనాలో, ఎన్ని హత్యలో, ఎన్ని మానభంగాలో, అబ్బబ్బ చెప్పలేం. ఊసరవెల్లిలా రంగులు మారుస్తాడు, రేసుగుర్రంలా పరుగెత్తుతాడు. ఎదుటివాడి కళ్ళలో దుమ్ము కొట్టడానికి వాడి మాయమాటలు ఎన్ని రకాలో చెప్పలేం. వాడొక......"

    "వచ్చినపని కానియ్యి" రెండోపోలీసు గుర్తుచేయటంతో మొదటి పోలీసు ఆగిపోయాడు. ఓసారి గదంతా పరీక్షగా చూసి తల  పంకించాడు.

    "అర్థరాత్రిదాకా లైటు అర్పలేదేమిటమ్మాయ్!

    "ఒంటరిగా పడుకుంటే నిద్రపట్టలేదు. వర్షమంటే నాకు తలనొప్పి నవల చదువుతూ ఉండిపోయాను. టైము తెలియలేదు" మంచంమీదవున్న నలవవైపు వేలుపెట్టి చూపుతూ అంది శృతి.

    "చచ్చే చలిపుడుతుంటే ఫాను స్పీడుగా పెట్టుకున్నావ్?"

    "దో.....దోమలు, వానకి బైట దోమలుకూడా వచ్చి ఇంట్లో తగలడ్డాయి" ఫానార్పనందుకు చింతిస్తూ మరోపక్క తన  సమయస్పూరిక్తి తనే ఆశ్చర్యపోతూ చెప్పింది శృతి.

    ఇంక వాళ్ళకేం అడగాల్సినవి కనబడలేదు.

    "ఎవరొచ్చి తలుపుకొట్టినా తియ్యొద్దు. వంటరిగా వున్నావు. ఆ హంతకుడు మారువేషా లేయ్యటంలో దిట్ట. రక రకాలుగా గొంతుమార్చి మాట్లాడుతాడు. పొరపాటునాకూడా తలుపు తియ్యొద్దు. కోరి ఆపద కొనితెచ్చుకోటమే" అతిగా బాగే పోలీసు అన్నాడు.

    "అలాగేనండి" అంది శృతి.

    "ఇప్పుడు మనమేం చేద్దాము?" ఒక పోలీసు రెండో పోలీసు నడిగాడు.

    "ఏం చేసేదేముంది? మళ్ళీ కాళ్ళకి బుద్దిచెప్పటమే. ఈ వానొకటి మన ప్రాణానికి. వాణ్ణి పట్టుకుంటే ప్రమోషన్ ఖాయం. డ్యూటీ చేశామని అబద్దం ఆడదామా అంటే మన యస్సైకి వెయ్యికళ్ళు. ఆవేధవొక్కడిరకు ఈ పేటంతా వీధివీధికి మనవాళ్ళని కాపలా పెట్టాడు. రైల్వేస్టేషను, బస్సు స్టాండు, కాపలా లేనిచోటు లేదు. ఈ వెధవ్వాస లేకపోతే ఆ వెధవని పారిపోనిచ్చేవాళ్ళమా? ఈ పేటలో ఎవరింట్లోనూ గబురైన చెట్లుగాని పొదలుగాని లేవు. వెధవ ఏ మూలో నక్కి వుండాలి. లేక ఏ ఇంట్లోనో దాగుండాలి. దెబ్బకూడా తిన్నాడు ఎస్సై చేతిలో, దూరం పారిపోవడం వాడి తరంకాదు, వాడబ్బ తరం కాదు. ఒక్కో ఇల్లు వెతుకుతూ హెచ్చరిక చేస్తూ పోవడమే మన పని" ఉసూరుమని నిట్టూరుస్తూ చెప్పాడు రెండో పోలీసు.

    "జాగ్రత్తమ్మా! ఎవరు తలుపుకొట్టినా పేరడిగి కిటికీ లోంచి చూసి ఆపై తలుపు తియ్యి."

    "అలాగేనండి. ఒక్కమాట అతను నిజంగా హంతకుడాండి?" భయం దాచుకుని అమాయకంగా అడిగింది శృతి.

    పోలీసు ఫక్కున నవ్వాడు. "మనం దోమల్ని చీమల్ని చంపినంత తేలిగ్గా వాడు మనుషుల్ని చంపుతాడు. మాటల్లో చెపితే నీకర్థం కాదమ్మా పోరపాటునకూడా వాడి కంట పడరాదు. అందమైన ఆడపిల్లలు వాడి కామానికి, వాడి  పగకి బలయిపోయారు." అంటూ శృతిని ఎగాదిగా చూశాడు.

    "పద పద, వాడు ఏమూల దాగున్నాడో, ఏ ఇంట్లో దాగున్నాడో" అని "వస్తామమ్మా తలుపేసుకో, అసలే ఒంటరిగా వున్నావు" శ్రుతికి జాగ్రత్త చెప్పి వెళ్ళిపోయారు పోలీసులు.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS