Next Page 
ట్రిక్ ... ట్రిక్ ... ట్రిక్ పేజి 1


                                   ట్రిక్ ... ట్రిక్ ... ట్రిక్
    
                                                                     -----వసుంధర

                             
    
    ఆరోజు శకుంతల రోజూకంటే పెందరాళే లేచింది. త్వరగా ముఖం కడుక్కుని స్నానంచేసి మంచిబట్టలు వేసుకుంది. అప్పటికి ఆమెతల్లి పార్వతమ్మ, చెల్లెలు విశాల లేచారు.
    విశాల అక్కను చూసి ఆశ్చర్యపడుతూ- "అప్పుడే స్నానం కూడా చేసేశావా? పక్కలో నీకోసం ఎంతలా తడుముకున్నానో తెలుసా?" అన్నది.
    విశాలకు అక్కఅంటే ప్రాణం. ఆమె శకుంతలకంటే పదిసంవత్సరాలు చిన్నది. శకుంతలకిప్పుడు పదహారేళ్ళు.
    శకుంతల నవ్వి-"నువ్వింక పసిపాపవు కాదు. ఒక్కర్తివీ పడుకోవడం అలవాటు చేసుకోవాలి-" అన్నది.
    "నేను చేసుకోను-" అన్నది విశాల పెంకిగా.
    "నేనులేకపోతే ఏంచేస్తావ్?" అన్నది శకుంతల.
    "నువ్వెందుకుండవు?"
    వీరిసంభాషణ ముచ్చటగా వింటున్న పార్వతమ్మ- "ఎలాఉంటుందే-పెళ్ళీడుకొచ్చినపిల్ల-ఏదోరోజున అత్తవారింటికెళ్ళిపోతుంది...." అన్నది.
    "అలాగేం. అప్పుడు నేనూ అక్కతో అత్తవారింటికి వెళ్ళి పోతాను......" అన్నది విశాల అమాయకంగా.
    శకుంతల మనసులో నవ్వుకుంది. తనన్న మాటలభావం విశాలకు తెలియదు. తెలిసే వయసులో కూడా అలాంటి మాటంటే మగాడు మెచ్చుకుంటాడు. కానీ శేఖర్ అలాంటి మగాడుకాదు.
    శేఖర్........
    ఆ పేరు మనసులో మెదలగానే ఆమె లేతమనసు పులకరించింది. కన్నె హృదయం పరవశించింది.
    శేఖర్ ఎంత అందంగా ఉంటాడు! అందానికి తగ్గ తెలివితేటలు.....వాటికితగ్గ సరసత....
    అసలు అతడెవరో, తానెవరో ....
    కాని వారంరోజుల్లో తామిద్దరూ ఎంత దగ్గరయ్యారు....
    తలచుకుంటేనే సిగ్గేసింది శకుంతలకు. ఆమె ముగ్ధ.
    "ఎక్కడికో ప్రయాణమైనట్లున్నావ్!" అన్నాది పార్వతమ్మ. అప్పటికి శకుంతల ఆలోచనల్లోంచి బయటపడింది. తల్లివంక చూసింది.
    అప్పుడక్కడ విశాలలేదు. కాలకృత్యాలకు వెళ్ళింది.
    శకుంతల పరీక్షగా తల్లినీ, ఇంటినీ మరోసారి చూసింది.
    అయిదు సంవత్సరాల క్రితం పార్వతమ్మకు భర్తపోయాడు. తన ఇద్దరుపిల్లలే ప్రాణంగా బ్రతుకుతున్నది పార్వతమ్మ ఒకప్పుడాయిల్లు ఎంతో అందంగా వుండేది. భర్త ఉన్నప్పుడు పార్వతమ్మ ఇంటిని రోజుకో రకంగా ముస్తాబుచేసేది. అందుకు భర్త ఆమెను మెచ్చుకునేవాడు. ఇంటికివచ్చిన వారందరూ ఇల్లుచూసి ఇల్లాలిని చూడాలన్న సామెతను గుర్తుచేసుకొనేవారు.
    భర్తపోగానే ఆ యింటికి కళ పోయింది.
    "అమ్మా-ఇంటినిదివరకటిలా ముస్తాబు చేయవేం?" అని అప్పుడప్పుడు శకుంతల అడిగితే- "ఎవరికోసం!" అనేది పార్వతమ్మ.
    పార్వతమ్మ తనకోసం ఎప్పుడూ బ్రతకలేదు. ఒకప్పుడు భర్త కోసం బ్రతికింది. ఇప్పుడు పిల్లలకోసం బ్రతుకుతున్నది.
    వారి భవిష్యత్తు ఓ దారిలోకి రావడానికి ఆమె అమితంగా శ్రమిస్తున్నది. అటువంటితల్లి పిల్లలకు వరం.
    శకుంతల తల్లివంకచూస్తూ- "నేను అమ్మవద్ద ఈ రహస్యాన్నెందుకు దాస్తున్నాను? నిజం చెప్పడంవలన నాకు కలిగే నష్టమేమున్నది?" అనుకున్నది.
    "ఎక్కడికో ప్రయాణమైనట్లున్నావ్!" పార్వతమ్మ మళ్ళీ అన్నది.
    "అవునమ్మా-విశాలకు చెప్పకు. తిరిగిరాగానే మీ అందరికీ మంచి వార్తచెబుతాను-" అన్నది శకుంతల.
    "దానికి చెప్పకుండా వెడితే అది నాప్రాణాలు తీస్తుంది. ఎలాగో దానికి నచ్చజెప్పివెళ్ళు-" అన్నది పార్వతమ్మ.
    "లేదమ్మా- దానికి నచ్చజెప్పటం నావల్లకాదు. తనూవస్తానంటుంది. ఎలాగో నువ్వే నచ్చజెప్పాలి. ప్లీజ్ అమ్మా-" అన్నది శకుంతల. అప్పుడే ఆమె మనసులో- "ఎంతవిచిత్రం- ప్రేమలోపడితే అయినవాళ్ళే ప్రతిబంధకాలనిపిస్తారా?" అనుకున్నది.
    ఎక్కడికీ-అని అడుగబోయి మానేసింది పార్వతమ్మ. కూతురు కానిపని చేస్తుందన్న అనుమానమే ఆమెకులేదు. తిరిగివచ్చేక అదే చెబుతుందిలే అనుకున్నదామె.
    శకుంతల వెళ్ళిపోయింది. ఆమె ఇలా వెళ్ళగానే అలా వచ్చింది విశాల.
    "అమ్మా-స్నానానికి వెడుతున్నాను. మంచిబట్టలు తీసివ్వు. అక్క ఎక్కడికో బైటకు వెళ్ళేలావుంది. నేనూ వెడతాను-" అంది విశాల.
    "అక్క అప్పుడే వెళ్ళిపోయింది...."
    "అబద్దం. నాతోచెప్పకుండా అక్క ఎక్కడికీ వెళ్ళదు...."
    "నీతో చెబుదామనే అనుకుంది కానీ నువ్వు ఎప్పటికీ రాలేదు. అర్జంటుపని అని వెళ్ళిపోయింది...."
    విశాల ఏడుపుముఖంపెట్టి- "అయితే నేను అప్పుడే స్నానం ఎందుకు చెయ్యాలీ-చెయ్యను. అసలది వచ్చేదాకా పాలుకూడా తాగను-" అన్నది.
    "అలా అనకూడదమ్మా-తప్పు! నువ్వు తనగురించి పాలుతాగలేదని తెలిస్తే అక్క ఎంత బాధపడుతుంది!" అన్నది పార్వతమ్మ సానునయంగా.
    "అది బాధపడాలనే నేను పాలు తాగనంటున్నాను- ఏం- నన్నెందుకు వదిలేసి వెళ్ళిపోవాలీ-నాతో చెప్పనేనా చెప్పకుండా వెళ్ళిపోయిందే-నాకు బాధ కలుగదా-" అన్నది విశాల కోపంగా.
    పార్వతమ్మ కూతురిని సమీపించి - "నాన్న నీకు విశాల అని ఎందుకు పేరు పెట్టారో తెలుసా?" అన్నది.
    విశాల తల అడ్డంగా ఊపింది.


Next Page 

  • WRITERS
    PUBLICATIONS