Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda


 

15.    యత్రామృతంచ మృత్యుశ్చ పురుషేధి సమాహితే |
    సముద్రో యస్య నాడ్యాః పురుషేధి సమాహితాః || "స్కంభం తం....."

   
16.    ఎవని ప్రధాన నాడులందు నాలుగు దిశలు నిలిచి ఉన్నవో, ఏవి యజ్ఞ పరాక్రాంతములో "స్కంభం తం...."
   
17.    బ్రహ్మను పరమేష్టిని ఎరింగినవారు, పరమేష్టిని ప్రజాపతిని ఎరింగినవారు, జ్యేష్టబ్రహ్మను ఎరింగిన నరులు "స్కంభం తం....."
   
18.    వైశ్వానరుడు ఎవని శరమో, అంగిరసులు ఎవని నేత్రములో 'యాతు' ఎవని అంగములో "స్కంభం తం...."
   
19.    ఎవని ముఖమును బ్రహ్మ అనుచున్నారో, ఎవని జిహ్వను 'మధుకశ' అనుచున్నారో, ఎవని 'ఏన' మును విరాట్టు అనుచున్నారో "స్కంభం తం....."
   
20.    దేనినుండి ఋక్కులు 'అపాతక్షన్', యజుస్సులు 'అపాకషన్', ఎవని లోమములు సామములగుచున్నవో, అథర్వము ఎవని ముఖమగుచున్నదో "స్కంభం తం...."
   
21.    అప్రకటిత శాఖ ప్రతిష్టితమైనపుడు నరులు దానిని "పరమమివ" విశ్వసించుచున్నారు. ఇతరులు దానిని ఉపాసించినపుడు దానిని సత్ అని నమ్ముచున్నారు.
   
22.    యాత్రాదిత్యాశ్చ రుద్రాశ్చ వసవశ్చ సమాహితాః |
    భూతం చ యత్ర భవ్యంచ సర్వే లోకాః ప్రతిష్టితాః "స్కంభం తం....."

   
23.    ఏ నిధిని సర్వధా ముప్పది ముగ్గురు దేవతలు రక్షించినారో, ఆ నిధిని ఇప్పుడు ఎవడు తెలియుచున్నాడు? ఏ దేవతలు రక్షించుచున్నారు?
   
24.    ఎచట బ్రహ్మావేత్తలగు దేవతలు బ్రహ్మజ్యేష్టుని ఉపాసించుచున్నారో, ఎవరు అతనిని ప్రత్యక్షముగా తెలుయుచున్నారో, వారు బ్రహ్మ విదులు అగుచున్నారు.
   
25.    బృహత్ నామదేవత అసత్ నుండి పుట్టినాడు. అతడు స్కంభుని ఒక అంగము అగుచున్నాడు. ఇతర జనులు అతనిని 'అసత్' అనుచున్నారు.
   
26.    స్కంభుడు పుట్టిన చోట 'పురాణమ్' వ్యవహరింప చేసినాడు. స్కంభుని ఆ అంగమును 'పురాణమ్' ఎరుగుచున్నది.
   
27.    ఎవని యందు ముప్పది ముగ్గురు దేవతలు అంగ రూపమున శోభిల్లుచున్నారో ఆ ముప్పది మూడు దేవతల 'ఆనీక' మును బ్రహ్మవిధులు ఒక్కనిగా ఎరుంగుచున్నారు.
   
28.    పరమ హిరణ్యగర్భుడు అనిర్వచనీయుడని జనులు తెలియుచున్నారు. ఆ హిరణ్యగర్భుని స్కంభుడే ప్రథమమున లోకములకు వ్యక్తము చేసినాడు.
   
29.    స్కంభునందే లోకములు, స్కంభునందే తపము, స్కంభునందే ఋతము చేరియున్నవి. ఇంద్రుడు మాత్రమే స్కంభుని ప్రత్యక్షముగ దర్శించినాడు. స్కంభుని యందే "సర్వం సమాహితమ్"
   
30.    ఇంద్రే లోకా ఇంద్రేతప ఇంద్రేధ్యృతమాహితమ్ |
    ఇంద్రం త్వా వేద ప్రత్యక్షస్కంభే సర్వం ప్రతిష్టితమ్ ||

   
31.    ఉషస్సుకు పూర్వము, సూర్యునకు పూర్వము పేర్లతో పిలిచినవాడు. ఎట్టి ప్రాణులు లేనప్పటి, తొలుత 'అజుడు' ఉన్నప్పటి స్వరాజ్యమును చేరుచున్నాడు.
   
32.    భూమి ఎవని 'ప్రమ' యో, అంతరిక్షము ఎవని ఉదరమో, ద్యులోకము ఎవని మూర్ధమో "తస్మై జ్యేష్టాయ బ్రహ్మణేనమః ||

33.    యస్య సూర్యః చక్షుః చంద్రమా శ్చ పువర్ణవః |
    అగ్నిం యః చక్ర ఆస్యం తస్మైజ్యేష్టాయ బ్రహ్మణేనమః ||

   
34.    ఎవని ప్రాణాపానములు వాయువో, అంగిరులు ఎవని నేత్రములో, దిశలు ఎవని ప్రజ్ఞానములో "తస్మై జ్యేష్టాయ బ్రాహ్మణేనమః"
   
35.    స్కంభుడే ద్యావాపృథ్వులను ధరించినాడు. స్కంభుడే ఉర్వి, అంతరిక్షములను ధరించినాడు. స్కంభుడే షడుర్వులను, ప్రదిశలను ధరించినాడు. స్కంభునందే సమస్త విశ్వములు చేరియున్నవి.
   
36.    ఎవడు శ్రమించు తపమునకు వ్యక్తమగుచున్నాడో, ఎవడు సమస్త లోకములను అనుభవించుచున్నాడో "తస్మై జ్యేష్టాయ బ్రాహ్మణే నమః"
   
37.    వాయువు ఏల ప్రేరణ కలిగించకున్నది? మనసు ఏల ఆనందించకున్నది? ఏ సత్యము కొరకు జలము చేష్టలుడిగి ఉన్నది?
   
38.    భువన మధ్యమున ఒక మహా పదార్ధము ఉన్నది. అది సలిల పృష్ఠమున విరాజిల్లుచున్నది. తపస్సు వలన లభించుచున్నది. చెట్టు మొదలును ఆశ్రయించి కొమ్మలు వ్యాపించినట్లు సమస్త దేవతలు ఆ పదార్ధమునే ఆశ్రయించి నిలిచినారు.
   
39.    దేవతలు ఎవని కొరకు హస్తములు, పాదములు, వాక్కు, నేత్రములు, చూపును సదా సమర్పించుకొనుచున్నారో, ఎవడు పరిమిత దేహమున అమితముగ ఉన్నాడో "స్కంభం తం బ్రూహి కతమః స్విదేవ సః"
   
40.    పై విషయములు తెలుసుకున్న వాని అంధకారము నష్టమగుచున్నది. పాపములు దూరమగుచున్నవి. ప్రజాపతి యందున్న మూడు జ్యోతులు పూర్తిగా అతని యందు చేరుచున్నవి.
   
41.    ఎవడు జలములందున్న "వేతసం హిరణ్యయం" తెలియుచున్నాడో "సవై గుహ్యః ప్రజాపతిః" అతడే గుహ్యమగు ప్రజాపతి యగుచున్నాడు.
   
42.    రూప విరూపములవి రాత్రింబవళ్ళు. అవి ఆరు రుతువుల సంవత్సరమునకు అధీనములు. ఈ రెంటిలో ఒకటి దారములను పెంచి ధరించుచున్నది. రెండవది వానిని విడువకున్నది. రాత్రింబవళ్ళకు అంతము లేకున్నది.
   
43.    నాట్యము చేయు రాత్రింబవళ్ళలో ఏది గొప్పదో నాకు తెలియకున్నది. పగలు పురుషుడై దారము తీసి ధరించుచున్నాడు. ఆ పురుషుడే స్వర్గమును భరించుచున్నాడు.
   
44.    ఈ మయూఖములు దినమును నిలిపినవి. సామములు వాయువును ప్రసరింపచేసినవి.
   
                                         రెండవ సూక్తము - 8
   
వినియోగము :-
పూర్వ సూక్తము వలె.
   
1.    భూత, భవిష్యత్తులును సమస్తము ఎవనియందు అధిష్టితములై ఉన్నవో, ఎవనిది మాత్రము స్వర్గమై ఉన్నదో "తస్మై జ్యేష్టాయ బ్రహ్మణే నమః"
   
2.    స్కంభుని వల్లనే ద్యులోక భూలోకములు నిలిచి ఉన్నవి. ఊపిరి పీల్చునట్టి రెప్పవాల్చునట్టి సకలాత్మలు స్కంభుని యందే ఉన్నవి.
   
3.    మూడు విధముల ప్రజా ప్రాప్తవ్యుడగు ఇతనిని పొందుచున్నారు. మరొక రీతిగా ఇతడు సూర్యుని యందు ప్రవేశించి ఉన్నాడు. భూలోక నిర్మాతయగు బ్రహ్మ శాశ్వతుడు. అతడు 'హరితో హరణి' యందు ప్రవేశించుచున్నాడు.
   
4.    పన్నెండు "ప్రధ" లు, ఒక చక్రము, మూడు నాభులు, దీనిని ఎవడు ఎరుంగును? దీనికి మూడు వందల అరువది మేకులున్నవి. దీని 'ఖీల' ములు అవిచలములు.
   
5.    సవితా! ఈ విషయములు తెలిసికొనుము :-
   
    ఆరు రుతువులు రెండు రెండు మాసములవై ఒకే సంవత్సరము అధీనమున ఉన్నవి. ప్రాణులు ఏ ఒక్కని నుంచి వచ్చినవో ఆ ఒక్కనిలోనే లీనమగుచున్నవి.
   
6.    ఆత్మ గుహారూపమగు శరీరమందున్నది. శరీరము 'జరత్' అను మహా స్థానమగుచున్నది. దీనియందే సకల ప్రాణులు కాపురమున్నవి.
   
7.    ఏక చక్రము, ఏకనేమి, సహస్రాక్షరము వెనుకకు, ముందుకు తిరుగుచున్నది. దీని అర్ధభాగము భువనములను ప్రకాశింపచేయుచున్నది. రెండవ అర్ధభాగము ఎచట ఉన్నది?
   
8.    దీని అగ్రమును 'పంచవాహి' వహించుచున్నది. పృష్ఠములు కూడ 'అనువహనము' చేయుచున్నవి. దీని 'ఆయాతము' కనిపించును. 'యాతము' కనిపించదు. ఇది అతి దగ్గర కన్న దగ్గరది. అతి దూరమున కన్న దూరపుది.
   
9.    ఊర్ధ్వ మూలము, తిర్యక్ బిలము గలది చమసము. అందు విశ్వరూపము నిహితమై ఉన్నది. అందు ఏడుగురు ఋషులు కలిసి ఉందురు. వారు దీనికి రక్షకులు అగుచున్నారు.
   
10.    మొదలు వినియోగమగునది చివరకు వినియోగమగునది. సర్వసమయములందు వినియోగపడునది. యజ్ఞమును విస్తరింప చేయునది ఋక్కులలో ఏ ఋక్కు అగుచున్నది?
   
11.    కదలువాడు, పడువాడు, నిలుచువాడు, ప్రాణిక్రియ చేయువాడు, చేయనివాడు, కనురెప్పలు వాల్చువాడు, వాల్చనివాడు ఈ పృథివిని భరించుచున్నాడు. అతడు అనేకుడయ్యు ఏకమగుచున్నాడు.
   
12.    అతడు అనంతుడై అనేక స్థలములందు వ్యాపించి ఉన్నాడు. దగ్గరలోనే అనంతుడయ్యు అంతవంతునిగ గోచరించుచున్నాడు. స్వర్గము కోరు జీవి అతనిని అన్వేషించుచున్నాడు. అతడు విద్వాంసుడు. అతడే భూత భవిష్యత్తులు అగుచున్నాడు.
   
13.    అతడు ప్రజాపతి గర్భమున సంచరించుచున్నాడు. అంతరమున అదృశ్యుడై ఉన్నాడు. అనేక విధములుగ వ్యక్తమగుచున్నాడు. అతడు తన అర్ధభాగమున విశ్వములను వెల్లడించినాడు. మిగిలిన సగభాగము ఎట్టి జ్ఞానమగుచున్నది?
   
14.    కుండచే పైకి తోడగల నీటిని వలె బయట నింపు వానిని అందరు కంటితో చూచుచున్నారు. మనసుతో తెలియకున్నారు.
   
15.    అతడు పూర్ణమునకు దూరమున ఉంటున్నాడు. న్యూనమునకు దూరమున దాగుచున్నాడు. భువన మధ్యమున ఒక మహా పదార్ధము ఉన్నది. రాష్ట్రభ్రుత్ దాని కొరకే బలులను నింపుచున్నాడు.
   
16.    సూర్యుడు  దేనియందు ఉదయించుచున్నాడో, దేనియందు అస్తమించుచున్నాడో దానిని జ్యేష్టముగ భావించుచున్నాను. అతనిని అతిక్రమించ గలవాడు లేడు.
   
17.    అతడు పురాణుడు విద్వాంసుడు. సకల దిశలందుండు వాడు. కొందరు అతనిని మధ్యనున్న వాడని వెనుక ఉన్నవాడని చెప్పుచున్నారు. అట్టి వారు ఆదిత్యుని గురించియు, అన్యఅగ్నిని గురించియు, 'త్రివృత్' హంసను గురించియు అట్లే వర్ణించుచున్నారు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.