Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda


 

3.    నిన్ను శిక్వ చెట్టునుండి కొట్టినాడు. వడ్రంగి బాడితతో నరికినాడు. నీవు శుచివంతవే. అయినను జీవనదానము చేయు జలము నిన్ను పావనము చేయును గాక.
   
4.    ఈ మణి 'హిరణ్యస్రక్' ఇది శ్రద్దాయజ్ఞముల సహితముగ అతిథి వలె మా ఇంట వసించును గాక.
       
5.    ఆ మణికి ఘ్రుతము, సుర, మధ్వన్నము, అన్నము అర్పించుచున్నాము. అది మమ్ము తండ్రి పుత్రులను వలె మరల మరల శ్రేయస్సులు కలిగించును గాక. దేవతల నుంచి వచ్చి మాకు శుభములు కలిగించును గాక.
   
6.    ఈ మణిని బృహస్పతి కట్టినాడు. ఇది ఖాదిర ఫాలపుది వరము లిచ్చినది. ఓజస్సుగలది. దానిని అగ్ని ప్రతిముంచితము చేసినాడు. అది మాకు నిత్యము అనేక మారులు ఘ్రుతమును కలిగించునుగాక. 'తేన త్వం ద్విషతో జహి' దానితో నీవు శత్రువును వధించుము.
   
7.    ఈ మణిని బృహస్పతి కట్టినాడు. ఇది ఖాదిర ఫాలపుది. వరద. ఓజోవంత. ఇంద్రుడు దానిని ప్రతిముంచితము చేసినాడు. అది మాకు ఓజస్సు, వీర్యము నిత్యము అనేక మారులు బలమును ఇచ్చును గాక. 'తేన త్వం ద్విషతో జహి"
   
8.    ఈ ఖాదిర ఫాలమణిని బృహస్పతి కట్టినాడు. ఇది వరద. ఓజోవంత. శ్రోత్రము, చక్షువుల కొరకు సోముడు దానిని ప్రతిముంచితము చేసినాడు. అది మాకు నిత్యము అనేక మారులు వర్చస్సు కలిగించును గాక. "తేన త్వం ద్విషతో జహి"
   
9.    వరములిచ్చు, ఓజోవంతమగు ఈ ఖాదిర ఫాలమణిని బృహస్పతి కట్టినాడు. సూర్యుడు దానిని ప్రతిముంచితము చేసినాడు. అందువలన మేము దిశలను జయించినాము. అది మాకు నిత్యము అనేక మారులు విభూతిని కలిగించును గాక. "తేన త్వం ద్విషతో జహి"
   
10.    ఘ్రుతశ్చుతము, ఉగ్రమగు ఖాదిర ఫాలమణిని బృహస్పతి కట్టినాడు. ఆ మణిని ధరించియే అసురులను, దానవుల హిరణ్మయ పురములను దేవతలు జయించినారు. ఆ మణి ఇతనికి మాటి మాటికి లక్ష్మి కలిగించుచుండును గాక. "తేన త్వం ద్విషతో జహి"

11.    ఈ మణిని వేగము కొరకు గాను వాయువునకు బృహస్పతి కట్టినాడు. అట్టి మణి ఇతనికి మరల మరల శక్తిని ప్రసాదించును గాక. "తేన త్వం ద్విషతో జహి"
   
12.    ఈ మణిని బృహస్పతి అశ్వినులకు కట్టినాడు. దీని వలన అశ్వినులు కృషి రక్షకులు అయినారు. అది వారికి మరల మరల మహా వైద్యమును ప్రసాదించినది. "తేన త్వం ద్విషతో జహి"
   
13.    బృహస్పతి ఈ మణిని సవితకు కట్టినాడు. అందువలన అతడు స్వర్గమును జయించినాడు. ఆ మణి అతనికి మరల మరల సూనృతమును ప్రసాదించినది. "తేన త్వం ద్విషతో జహి"
   
14.    బృహస్పతి ఈ మణిని బలములకు కట్టినాడు. అందువలన జలములు అక్షయములు అయినవి. ఆ మణి జలములకు మరల మరల అమృతధారలు ప్రసాదించుచున్నది. "తేన త్వం ద్విషతో జహి"
   
15.    బృహస్పతి వరుణరాజునకు శుభప్రదమగు ఈ మణిని కట్టినాడు. ఈ మణి అతనికి మరల మరల సత్యమును కలిగించినది. "తేన త్వం ద్విషతో జహి"
   
16.    బృహస్పతి ఈ మణిని దేవతలకు కట్టినాడు. అందువలన వారు యుద్దమున లోకములను జయించినారు. అది వారికి విజయ పరంపర కలిగించినది. "తేన త్వం ద్విషతో జహి"
   
17.    బృహస్పతి వాయువునకు, శభములు కలుగుటకు, ఈ మణిని కట్టినాడు. దేవతలు ఈ మణిని కట్టుకొని శుభములు పొందినారు. అది దేవతలకు మరల, మరల విశ్వమును ప్రసాదించుచున్నది "తేన త్వం ద్విషతో జహి"
   
18.    ఋతువులు, ఋతువుల అవయవములగు మాసములు ఈ మణిని కట్టుకున్నవి. సంవత్సరము ఈ మణిని ధరించి సర్వబూతములను రక్షించుచున్నది.
   
19.    ఈ మణిని అంతర్దిశలు కట్టుకున్నవి. ప్రదిశలు కట్టుకున్నవి. ప్రజాపతిచే ఆవిష్కరించబడిన ఈ మణి మాశత్రువులకు దుర్గతి కలిగించును గాక.
   
20.    ఈ మణిని అథర్వులు కట్టుకున్నారు. అథర్వము కట్టుకున్నది. అంగిరసులు దీనిని కట్టుకొని దస్యుల నగరములను భిన్నము చేసినారు. "తేన త్వం ద్విషతో జహి"
   

21.    ఈ మణిని ధాత ధరించి ప్రాణులను కల్పించినాడు. "తేన త్వం ద్విషతో జహి"
   
22.    ఏ మణిని అసురుల నెదిరించుశక్తి కలుగుటకు బృహస్పతి దేవతలకు కట్టినాడో అది అగద, రసయుక్త వర్చస్సుతో నా వద్దకు వచ్చును గాక.
   
23.    ఏ మణిని అసురుల నెదిరించు శక్తి కలుగుటకు బృహస్పతి దేవతలకు    కట్టినాడో అది మేకలు, గొర్రెలు, గోవులు, అన్నము, ప్రజా సహితముగ నావద్దకు చేరినది.
   
24.    అసురులను వధించుశక్తి కలుగుటకు గాను దేవతలకు బృహస్పతి కట్టిన మణి ధాన్యము, యవలు మహాభూతి సహితముగ నావద్దకు వచ్చినది.
   
25.    అసురులను ఎదిరించు శక్తి కలుగుటకు గాను బృహస్పతి దేవతలకు కట్టిన మణి మధువు, ఘ్రుతధార, అన్న సహితమై నా వద్దకు చేరినది.

26.    అసురులను ఎదిరించు శక్తి కలుగుటకు గాను బృహస్పతి దేవతలకు కట్టిన ఖాదిర మణి అన్నము, ధనము, బలము శ్రీ సహితముగ నా వద్దకు చేరినది.
   
27.    అసురులను ఎదిరించు శక్తి కలుగుటకు గాను బృహస్పతి దేవతలకు కట్టిన ఖాదిరమణి తేజస్సు, దీప్తి, యశస్సు, కీర్తి సహితముగ మా వద్దకు చేరినది.
   
28.    అసురులను ఎదిరించు శక్తి కలుగుటకు గాను బృహస్పతి దేవతలకు కట్టిన మణి 'సర్వాభిభూతిభిః సహ" మా వద్దకు చేరినది.
   
29.    ఈ ఖాదిర మణి శత్రుం జయ. క్షాత్రవర్ధన. శత్రు హింసక. అట్టి మణి పుష్టి కలిగించుటకు గాను దేవతలు మాకు ప్రసాదించెదరు గాక.
   
30.    ఖాదిర మణీ! మంత్రము, తేజస్సు సహితముగ శుభములు కలిగించుమని నిన్ను ధరించుచున్నాను. నీవు శత్రు రహితవు. శత్రు సంహారకమవు. నా శత్రువులకు హీన దశ కలిగించుము.
   
31.    దేవతలచే ఆవిష్కరించబడిన ఈ మణి నన్ను శత్రువులను తలదన్నిన వానిని చేయును గాక. ముల్లోకములు పాలు, నీళ్ళు కలుగుటకు ఏ మణిని ఉపాసించుచున్నవో అట్టి మణి నాకు ఉత్తమత్వము కలిగించుటకు నా తలను అధిరోహించును గాక.
   
32.    ఏ మణి వలన దేవతలు, నరులు, పితరులు ఉపజీవించుచున్నారో అట్టి మణి నాకు ఉత్తమత్వము కలిగించుటకు నా తలమీద చేరును గాక.
   
33.    నాగలితో దున్ని విత్తనము వేసినపుడు పంట ఏపుగా పెరిగినట్లు నా ఇంట ప్రజ, పశువులు, అన్నము వర్ధిల్లును గాక.
   
34.    యజ్ఞవర్ధన మణీ! నేను ఏ శుభములు కలుగవలెనని నిన్ను ధరించుచున్నానో శతదక్షిణ మణీ! వాటిని నాకు కలిగింపుము.
   
35.    అగ్నిదేవా! ఈ సమిధలను స్వీకరించుము. హోమములందు ప్రదీప్తుడవగుము. మంత్రశక్తి చే ప్రదీప్తుడగు జాతవేదాగ్ని సుమతిం స్వస్తిం. ప్రజాం చక్షుః పశువులను కలిగించును గాక.
   
                                      నాలుగవ అనువాకము
                                      మొదటి సూక్తము - 7
   

                      ఇది స్కంభ సూక్తము. ఇది స్కంభ దేవత వర్ణన.
   
1.    ఇతని ఏ అంగమున తపము, ఏ అంగమున ఋతము, ఏ అంగమున శ్రద్ద, ఏ అంగమున వ్రతము, ఏ అంగమున సత్యము అధిష్ఠించి ఉన్నవి?
   
2.    స్కంభదేవత యొక్క ఏ అంగము నుండి అగ్ని ప్రదీప్తుడు అగుచున్నాడు? వాయువు ఏ అంగము నుండి వీచుచున్నాడు? ఉత్సవరూప చంద్రుడు ఏ అంగము నుండి ప్రభవించుచున్నాడు? ఏ అంగము నుండి వెలుగుచున్నాడు?
   
3.    ఇతని ఏ అంగమున భూమి నిలిచి ఉన్నది? దేని యందు అంతరిక్షము, దేని యందు ద్యులోకము, దేనియందు ద్యులోకమున కన్న శ్రేష్ఠ స్థానము నిలిచిఉన్నవి?
   
4.    ఎటు పోవనుంకించి అగ్ని పై పైకి ఎగురుచున్నాడు? ఎటు పోవనుంకించి వాయువు వడి వడిగా వీచుచున్నాడు? పునరావర్తన చక్రమున పడిన ప్రాణులు ఎందుకని తిరుగుచున్నవి? "స్కంభం తం బ్రూహి కతమః స్విదేవ సః" అది ఏమిటో స్కంభునకు చెప్పండి.
   
5.    అర్ధ మాసములు, మాసములతో కూడిన సంవత్సరము ఎచటికి పోవుచున్నది? ఋతువులు, మాసములు ఎచటి కేగుచున్నవి? "స్కంభం తం బ్రూహి కతమః స్విదేవ సః"
   
6.    "యువతీ నిరూసే" అహోరాత్రులు ఎటు పోవలెనని ఉరుకుచున్నవి? జలము ఎటుచేరవలెనని పరుగులు పెట్టుచున్నది? "స్కంభం తం....."
   
7.    దేని యందు "స్తబ్దితుడై ప్రజాపతి సకల లోకములను "అధారయత్?" . "స్కంభం తం....."
   
8.    'యత్ పరమం? యత్ అనమం? యచ్చమధ్యమం? ప్రజాపతి సృజించిన విశ్వరూపములేవి? వానిలో స్కంభుడు ప్రవేశించిన అంశములెన్ని? ప్రవేశించని అంశము లెన్ని?       
   
9.    స్కంభుడు ఎన్ని అంశములచే భూతకాలమున ప్రవిష్టుడైనాడు? ఎన్ని అంశములచే భవిష్యత్కాలమున శయనించిఉన్నాడు? ఒక అంగమును సహస్ర ప్రకారములుగ చేయగల స్కంభుడు వానిలో ఎన్ని అంశములచే ప్రవేశించుచున్నాడు?
   
10.    నరులు ఏ లోకములను, కోశములను, జలములను తెలియుచున్నారో దేనియందు ఎంత సత్? ఎంత అసత్? ఉన్నదో "స్కంభం తం బ్రూహి కతమః స్విదేవ సః"
   
11.    తపము వ్రతములు ఆచరించినవాడు ఏ ఉత్తమ స్థానములకు చేరుచున్నాడో - ఎచట ఋతము, శ్రద్ద, జలము బ్రహ్మ ఉన్నారో "స్కంభం తం......."
   
12.    దేనియందు భూమి, అంతరిక్షము, ద్యులోకము నిలిచి ఉన్నవో, ఎచట సూర్య, చంద్ర, అగ్ని, వాయువులున్నవో "స్కంభం తం....."
   
13.    ఎవని అవయవమునందు ముప్పది ముగ్గురు దేవతలు 'సమాహితాః' "స్కంభం తం...."
   
14.    దేనియందు తొలుత పుట్టిన ఋషులు, ఋగ్యజుస్సాను వేదములు, భూమి, ఏకర్షి అర్పితములై ఉన్నారో "స్కంభం తం....."




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.