Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam



    ఒక విచిత్ర విషయం. అదేమంటే - కవులు కదల్లేదు. స్పందించలేదు. ప్రజాపోరాటంలో సాహిత్యం మిన్నంటింది. ప్రజా విజయ కవిత వచ్చినట్లు కనిపించదు! కవిత రాలేదని కాదు. నిలిచి ఉండే కవిత రాలేదు. కారణం కమ్యూనిస్టులు దీన్ని విజయంగా గుర్తించలేదు. వారు విచిత్రులు. కొంతకాలం భారత స్వాతంత్ర్యాన్నే గుర్తించలేదు!

 

    మరొక ముఖ్యం అయిన విషయం. ఇది దొరలకు వచ్చిన స్వాతంత్ర్యం. పంచుకున్న భూములు ఉండవు. పోతాయి. వెలసిన సోషలిజం అంతరిస్తుంది.

 

    ఈ విషయాన్ని వస్తువుగా తీసుకొన్నాను. 'జనపదం' అనే పెద్ద నవల వ్రాశాను. ఇది 740 పేజీల నవల. దొరలు మరల పెత్తనం సాగించాలనుకుంటారు. సాయుధ పోలీసు బలగంతో దిగుతారు. కథ మళ్ళీ మొదలు! దొరల దౌర్జన్యాలు, పెత్తనం, హింస.

 

    జనపదం పోలీసు చర్యనుంచి మరొక సాయుధ పోరాటం ఆరంభం వరకూ రెండు దశాబ్దాల కాలపు ప్రజా జీవితాన్ని చిత్రిస్తుంది. రెండు దశాబ్దాల కాలపు ప్రజా జీవితాన్ని చిత్రిస్తుంది. రెండు దశాబ్దాలలో వచ్చిన పరిణామాలను వివరిస్తుంది. చిత్రిస్తుంది.

 

    మరొక నగ్నసత్యం ఏమంటే - కమ్యూనిస్టులను అణచడానికి పోలీసుచర్య త్వరితంగా జరిగింది! వ్యక్తులను నిందించరాదు. భారత ప్రభుత్వమే ఇందుకు పూనుకుంది. ఇందుకు అచ్చం ప్రభుత్వాన్ని నిందించలేం. కమ్యూనిస్టులు అనేక తప్పులు చేశారు. తమ బలాన్ని అతిగా అంచనా వేశారు!

 

    నేను అమ్మా - చెల్లెళ్లను తీసుకున్నాను. కాస్త ఆలస్యంగా గార్ల చేరాను. అన్నయ్య అప్పటికి అక్కడ లేడు. నాయకులతో పట్నం చేరుకున్నారు.

 

    గార్ల మా ఇంట్లో ద్వార బంధాలు - ద్వారాలు మాత్రం మిగిలాయి. రజాకార్లు మొత్తం దోచుకున్నారు. గ్రామ ప్రజలు అడ్డుకున్నారు. అందువలన అదయినా మిగిలింది. కాకుంటే నీడ కూడా లేకుండా పోయేది. ఇంట్లో వంటకు పాత్ర లేదు. పంటకు మంచం లేదు. అదంతా పోయినందుకు అమ్మ దుఃఖించింది. ఏడ్చింది. ఇల్లు మిగిలినందుకు సంతోషించమన్నాను. అది నిజమే కాని దరిద్రం! చేతిలో పైసలేదు. చేయడానికి కొలువు లేదు. సామాజిక స్థితిగతులు మునుపు ఉన్నట్లు లేవు. ఇంతలో ఎంతమార్పు! మనిషికి విలువ చచ్చింది. డబ్బుకు విలువ హెచ్చింది.

 

    ఇంతకు ముందు భూమి బలం
        ఇప్పుడు ధన బలం
    ఇంతకు ముందు అధికారంలోంచి ధనం పుట్టింది.
        ఇప్పుడు ధనంలోంచి అధికారం పుడ్తున్నది.
    భూస్వామ్యం పోతున్నది. ధనస్వామ్యం వస్తున్నది.    

 

    "యస్యాస్తి విత్తం సనరః కులీనః స పండిత స్సశ్రుతవాన్ గుణజ్ఞః
    సఏవవక్తా స చ దర్శనీయః సర్వేగుణాః కాంచన మాశ్రయంతి -" అన్నాడు భర్తృహరి.

 

    డబ్బున్నవాడే కులవంతుడు. గుణవంతుడు. పండితుడు. వినదిగనవాడు. వక్త. దర్శనీయుడు. సర్వగుణాలూ బంగారాన్నే ఆశ్రయిస్తాయి!

 

    గార్లలో ఒక కాంగ్రెసు ఆఫీసు వెలిసింది. ఒక తురక పారిపోయాడు. వాడి ఇంటిని ఆక్రమించుకున్నారు!

 

    మేము కార్యాలయం లేకుండానే కార్యక్రమాలు నిర్వహించాం. ఇప్పడు కార్యాలయం పెట్టి పెత్తనం చేస్తున్నారు!

 

    భవనాలు లేనినాడే పార్టీలు పని చేశాయి. భవనాలు కట్టుకున్నారు. అంతే, పార్టీలు భవనాల్లోనే ఉండిపోయాయి!

 

    పోలీసు చర్య తరువాత ప్రభుత్వం లేకుండా పోయింది. తాసిల్దారు వగైరా అందరూ పారిపోయారు. పేష్కారు వంటి హిందువులు ఉన్నారు. కాని భయపడుతున్నారు.

 

    ఇప్పటి ప్రభుత్వం కాంగ్రెసు ఆఫీసుది. కాంగ్రెసు వారే తగువులు తీరుస్తున్నారు. శిక్షలు విధిస్తున్నారు. కాంగ్రెసు ఆఫీసులో ఉన్నవాళ్లు ఎవరు? నిన్నటి వరకు కుచ్చు టోపీ పెట్టుకున్న హిందువులు! ఇప్పుడు టోపీ మార్చారు. గాంధీ(కి) టోపీ పెడ్తున్నారు. తెల్లని కద్దరు తప్ప అన్యం ధరించడం లేదు. నిన్నటి ప్రజాద్రోహులు ఇవ్వాళ దొరలు! నిన్నటి ధనవంతులూ ఈనాటి దొరలు!! నిన్నటి దొరలే ఈనాటి దొరలు!!! వేషాలు మారాయి. అంతే!

 

    గార్లలో ఉద్యమం నిర్మించింది మేము. త్యాగాలు అవసరం అవుతే చేసింది మేము. ప్రజలు మా పక్షాన ఉన్నారు. అలా ఆనుకుని కాంగ్రెసు ఆఫీసుకు వెళ్లాను. ధనవంతులూ - భూపతులూ ఉన్నారు. నన్ను అనాదరణ చేయలేదు. చేయలేరు. అసహనంగా చూచారు. రాకూడని అతిథి వచ్చినట్లు చూచారు. తమ పెత్తనం హరించడానికి వచ్చినట్లుగా చూశారు. నేను అక్కడ పనికి రాను అన్నట్లు పలకరించారు.!

 

    నాకు ముళ్లమీద ఉన్నట్లున్నది. ఇక్కడ నా అవసరం లేదు. మనం 'వీళ్ల'కు పనికివచ్చేవాళ్ళం కాదు అనిపించింది. బయటపడ్డాను.

 

    ఇంట్లో కుండలో వండుకున్నాం. నేలమీద పడుకున్నాం. అందుతున్న వార్తలు మరింత బాధిస్తున్నాయి. కాంగ్రెసు వాళ్లు లంచాలు తింటున్నారు. అయిన వాణ్ణి, కానివాణ్ణి రజాకారుగా ముద్ర వేస్తున్నారు. పట్టుకుంటున్నారు. పంచాలు గుంజుతున్నారు. విడుస్తున్నారు. తగాదాల్లో ఉభయ పక్షాలనుంచి ఇద్దరు నాయకులు పుడుతున్నారు.

 

    నిన్నటి దాకా మేము ఉద్యమమే తప్ప "డబ్బు" అనే విషయం కనీసం ఆలోచనలోకి రానీయలేదు. ఇంతలో ఎంత మార్పు! 'డబ్బు' తప్ప అన్య ఆలోచన లేనేలేదు!

 

    ఎంత పతనం!

 

    ఇంతలో!!

 

    ఒక పేద బూబమ్మ ఇంటికి వచ్చింది. లబలబా మొత్తుకుంటూ వచ్చింది. గుండె బాదుకుంటూ వచ్చింది. కన్నీరు కారుస్తూ వచ్చింది. నా కాళ్లమీద పడింది. ఆమె భర్తను పట్టుకున్నారట! బంధించారట! రజాకారు అంటారట! డబ్బు అడుగుతున్నారట!

 

    నేను ఆవేశపరుణ్ణి. ఆవేదన భరించలేను. కాంగ్రెసాఫీసుకు ఉరికాను. నేను ఉద్రేకంగా ఉండవచ్చు. రుద్రునిలా ఉండవచ్చు. నన్ను చూశారు. అక్కడ ఉన్నవాళ్లు లేచారు. బొమ్మల్లా చూచారు. అంతా నిశ్శబ్దం. ఒక్కడూ కిక్కురు మనలేదు. వెనుకకు చూచాను. బూబమ్మ ఉరికి వస్తున్నది. వచ్చింది. గది చూపింది. తలుపులు తెరిచాను.

 

    నా కళ్లను నమ్మలేకపోయాను!

 

    ఎవరు అక్కడున్నది?

 

    మస్తాన్! మన మస్తాన్!!

 

    "మస్తాన్ మేరా భాయీ!" అన్నాను.

 

    "సాబ్!" అని మౌనంగా నుంచున్నాడు మస్తాన్. నా భుజం మస్తాన్ కన్నీటితో తడిసింది. ఇతడే నన్ను పోలీసు స్టేషన్నుంచి తప్పించింది!

 

    మస్తాన్ భార్య ఆనందం పట్టలేకపోయింది. కూలబడ్డది. ఏడ్చింది.

 

    అందరూ నివ్వెరబోయి చూస్తున్నారు.

 

    "సాబ్! ఆప్ ఖైరియత్ సే ఆయే. హమేఁ బహుత్ ఖుషీ హై" (మీరు క్షేమంగా తిరిగి వచ్చారు. మాకు ఆనందంగా ఉంది) అని మస్తాన్ నా పాదాలను కన్నీటితో కడిగాడు. బూబమ్మ కాళ్లమీదపడి ఏడ్చింది.

 

    నా గుండె నిండిపోయింది. గండి కొట్టింది. కన్నీరు రాలింది! ఆ అనుభూతి విలువ ఎంతో! ఎందరికి ఇలాంటివి లభిస్తాయి? నేను ఈ విషయంలో సంపన్నుణ్ణి!

 

    నేను వాళ్లిద్దరినీ తీసుకొని బయటికి వచ్చాను. ఒక్కడు మాట్లాడలేదు. మెసల్లేదు, కదల్లేదు!

 

    మంచికి చెడు జంకుతుంది!


    వెలుగుకు చీకటి బెదురుతుంది!!

 

    మరొకసారి ఇంకో బూజమ్మ వచ్చింది. డబ్బు తీసుకుని వచ్చింది. నాతో బేరం పెట్టింది. జీవితంలో బేరాలు తెలియనివాణ్ణి! నాకేం అర్థం అవుతుంది? డబ్బు ఇవ్వడానికి నా దగ్గరికే ఎందుకు వచ్చావు? అడిగాను. వాళ్లు ఎక్కువ డబ్బు అడుగుతున్నారట! ఇదంతా విచిత్రంగా ఉంది నాకు! ఈ బేరాల రాజ్యం కోసమేనా ఇంత చేసింది?

 

    సరె. ఆమెను వెంట తీసుకుని నడిచాను. ఈ తడవ నాకు ఆవేశం లేదు. ఉద్రేకం లేదు.

 

    డబ్బు చప్పటిది. అందులో ఏమీలేదు.

 

    అనుభూతి గొప్పది. అందులో అన్నీ ఉన్నాయి!

 

    నన్ను చూచారు. ఎవరూ లేవలేదు. ముచ్చట్లు పెట్టారు. గది తలుపు తీశాను. చూచాను. ఎవడు?

 

    "సర్వర్! జమేదార్!"

 

    వీడే మమ్ముల పట్టుకున్నవాడు! వీడే అందరిని బెదిరించినవాడు. వీడే అందరిని దోచినవాడు. వీడే అసలు "రజాకార్!" 'వీణ్ణి వదలుతారా?' అడిగాను. ఎవరూ మాట్లాడలేదు. నాకు ఈ వ్యవస్థమీదనే అసహ్యం పుట్టింది! కాని నిన్నటి శక్తి ఇవ్వాళ లేదు! నిన్న శక్తివంతుణ్ణి. ఇవ్వాళ శక్తిహీనుణ్ణి.

 

    సత్యం చచ్చింది!




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.