Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam



    నిజాం సైన్యాల ప్రధానాధికారి మేజర్ జనరల్ అలీ అహమద్ ఎల్ - ఎడ్రోస్ ను మున్షీ పిలిపించారు. లొంగుబాటుకు సంబంధించిన పత్రం అతనికి అందించారు. దాన్ని నిజాముతో దక్కన్ రేడియోమీద చదివించే బాధ్యత ఎడ్రోసుకు అప్పగించారు.

 

    మేజర్ జనరల్ ఎడ్రూస్ కింగ్ కోటీ చేరుకున్నాడు. చదవాల్సిన పత్రం నిజాముకు సమర్పించాడు. నిజాం అందులోని ఒక్క అక్షరం మార్చలేదు. సోమాజీ గూడెంలోని దక్కన్ రేడియోకు చేరుకున్నాడు.

 

    నిజాం - బుద్ధిమంతుడయిన పిల్లవానివలె - చదవమన్నట్లు చదివాడు.

 

    నిజాం - తన పదవీచ్యుతి శాసనాన్ని - తానే చదివాడు!

 

    ఈలోగా మరొక ప్రహసనం జరిగింది:

 

    నవాబ్ మెయిన్ నవాజ్ జంగ్ - హైదరాబాదును గురించి విన్నవించడానికి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ U.N.O.కు బయలుదేరాడు. మెయిన్ నవాజ్ జంగ్ లండన్ చేరేవరకు హైదరాబాదు మీద పోలీసు చర్య ప్రారంభం అయింది. లండన్ చేరి, చివరి రక్తపు బొట్టు వగైరా డైలాగులు - హైదరాబాదు నుంచి లండన్ చేరవేశాడు!

 

    లండను చేరాడు జంగ్. హబీబ్ రహమతుల్లా - పాకిస్తాన్ హైకమీషనరు దగ్గరకి వెళ్లాడు. పదిలక్షల పౌనులు ఇస్తానన్నాడు. అంతమొత్తం విన్నాడు హైకమీషనర్. నాలుక ఎండిపోయింది. మంచినీళ్లు త్రాగాడు. పాకిస్తాన్ ప్రభుత్వ అనుమతి లేందే స్వీకరించలేను అన్నాడు.

 

    జంగ్ పాకిస్తాన్ విదేశాంగమంత్రి జప్రుల్లాఖానుతో మాట్లాడాడు. అతడు అనుమతించాడు. రహమ్ తుల్లా స్వీకరించాడు.

 

    మెయిన్ నవాజ్ జంగ్ పది లక్షల పౌనులు పాకిస్తానుకు సమర్పించుకున్నాడు. హైదరాబాదు స్వతంత్ర రాజ్యపు కేసు వాదించడానికి ఐక్యరాజ్య సమితికి వెళ్లాడు. సెప్టెంబర్ పదహారున భద్రతామండలికి అభ్యర్ధన అందజేశాడు. అప్పుడు సర్ అలగ్జాండర్ కేడోగాన్ బ్రిటెయిన్ పక్షాన అధ్యక్షుడు. ఎనిమిది దేశాలు హైదరాబాదును బలపరచాయి. ఎవరూ వ్యతిరేకించలేదు. చైనా - రష్యా - యుక్రెయన్ తటస్థంగా ఉండిపోయాయి.

 

    ఈలోగా పోలీసు చర్య జరిగింది. నిజాం నవాబు స్వచ్చందంగా లొంగిపోయాడు. అయినా జంగ్ అభ్యర్థనను ఉపసంహరించడానికి నిరాకరించాడు. ఆ తరువాత నిజాం స్వయంగా అభ్యర్థనను ఉపసంహరించుకున్నాడు!

 

    నాలుగు రోజుల్లో ఇంత వ్యవహారం జరిగిపోయింది. ఆజాద్ హైదరాబాదు పేరునుంచి ఆజాద్ విడాకులిచ్చింది. వట్టి హైదరాబాదు మిగిలిపోయింది.

 

    నాకు గుర్తున్నంత వరకు పదమూడు ఉదయం ఆకాశవాణి వార్తల్లో "సైనిక చర్య" అన్నారు. మధ్యాహ్నం వరకు 'పోలీసు చర్య' అన్నారు.

 

    హైదరాబాదు మీద చర్య అతి సున్నితం అయిన వ్యవహారం. సర్దార్ పటేల్ స్థిర సంకల్పం - రాజనీతిజ్ఞత - వ్యవహార కుశలత - కుశాగ్ర బుద్ధి ఈ వ్యవహారంలో భారత ప్రభుత్వానికి, ప్రజకు - హైదరాబాదు ప్రజకు విజయ పరంపరలు చేకూర్చాయి.

 

    అయితే, ఇందులో మొత్తంగా భారత ప్రభుత్వం, ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ హైదరాబాదు ప్రజా ఉద్యమ పాత్రను తక్కువ అంచనా వేయరాదు.

 

    భారత సైన్యానికి - అన్ని రంగాలలోనూ - హైదరాబాదు ప్రజ సహకరించింది. సైన్యానికి పూలదండలతోను - మంగళ హారతులతోనూ స్వాగతం పలికింది. హైదరాబాదు ప్రజా ఉద్యమం పోలీసు చర్య విజయానికి ఎంతో తోడ్పడింది. ప్రజా ఉద్యమం బలపడి ఉండకపోతే హైదరాబాదు మరొక కాశ్మీరం అయికూర్చునేది!

 

    ఇది అత్యంత సున్నితమయిన సమస్య. దీనిని పరిష్కరించిన తీరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.

 

    1. ఇది ఒక రాజ్యంమీద యుద్ధంకాదు.

 

    2. నిజాం ఒప్పందాన్ని భగ్నం చేశాడు. దాన్ని సరిచేయడానికి పోలీసు చర్య జరిగింది.

 

    3. హైదరాబాదును భారతసైన్యాలు ఆక్రమించనే లేదు.

 

    4. నిజాం నవాబు - తన ఇష్టపూర్తిగా లొంగిపోయాడు.

 

    5. ఇది నిజాం లొంగుబాటు అగును. భారత సేన విజయం కాదు!

 

    6. ఇది యుద్ధంకాదు - సరిచేయడం మాత్రమే!

 

    ఈ అనంత చర్యకు బాధ్యులయి, నిజాం రాజ్య ప్రజను విముక్తం చేసి - ఒక దురంత నియంత లొంగుబాటుకు కృషి చేసిన వారందరికి శతసహస్ర నమో వాకములు. నమో వాకములు. నమో వాకములు.

 

    మరుసటి రోజు మేజర్ జనరల్ జయంత్ నాథ్ చౌదరి హైదరాబాదు ప్రభుత్వ బాధ్యతలు స్వీకరించారు.

 

    రెండున్నర శతాబ్దాల ఆసిఫ్జాహీ పాలన అంతం అయింది.

 

    చార్మినార్ మీద త్రివర్ణ పతాకం సగర్వంగా రెపరెపలాడింది.

 

    ప్రాణములొడ్డి ఘోరగహ
    నాటవులన్ బడగొట్టి, మంచి మా
    గాణములన్ సృజించి, ఎము
    కల్ నుసిజేసి పొలాలు దున్ని, భో
    షాణములన్ నవాబునకు
    స్వర్ణము నింపిన రైతుదే, తెలం
    గాణము రైతుదే; ముసలి
    నక్కకు రాచరికంబు దక్కునే?

 

    ఓ నిజాము పిశాచమా! కానరాడు
    నిన్ను బోలిన రాజు మాకెన్నడేని
    తీగెలను తెంపి అగ్నిలో దింపినావు
    నా తెలంగాణ కోటి రత్నాలవీణ!  

                                                        _ దాశరథి "అగ్నిధార"నుంచి.

 

    అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ.

 

                                                        ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః.

 


                             ఇరవయి నాలుగు


    ధనమూలం:

 

        ఒక తిమిరగోళం పగిలింది.
        ఒక జ్యోతిర్గోళం వెలిసింది.
        ఒక ప్రజాశక్తి విజృంభించింది.
        ఒక ముసలి నక్క మూలిగింది.
        ఒక చైతన్య స్రవంతి ఉప్పొంగింది.
        ఒక ప్రజా కంటకుడు అంతరించాడు.
        ఒక ఇంద్ర ధనువు వెలిసింది.
        ఒక రంగుల వాన కురిసింది.    

 

    భారత స్వాతంత్ర్య సమరం వందేళ్లు సాగింది. అంగ్రేజులు దేశం వదిలి వెళ్లారు. నయంగా వెళ్లారు. ఎక్కువ హింసాప్రయోగం లేకుండా వెళ్లారు.

 

    నిజాం నవాబు జన్మ జన్మాల బూజు; వాడు వదలడు. వేళ్లాడ్తాడు. కదలడు. ఏమీ లేకున్నా బూకరిస్తాడు. గ్రామ సింహం భారత సింహాన్ని బెదిరిస్తుంది. భారత సింహం గర్జించింది. అంతే. అంతే. నిజాం గద్దె దిగాడు. కూలబడ్డాడు. చేతులు జోడించాడు. బేల అయినాడు. ప్రాణభిక్ష కోరాడు. సర్దార్ పటేల్ ఉదారంగా వ్యవహరించాడు. శరణాగతునికి ప్రాణదానం చేశాడు!

 

    నిజాం, మతాన్ని ఆయుధంగా చేసుకున్నాడు. మతం రక్షిస్తుంది అనుకున్నాడు. తన మనుగడ సాగుతుంది అనుకున్నాడు. మతం ఎదురు తిరిగింది! మతాన్ని వదిలాడు! పాదాలు ఆశ్రయించాడు!

 

    నిజాం ప్రజ ఉదారులూ, సహనశీలురు, ఉత్తములు. మతరక్కసి కలకాలం రాజ్యం చేసింది. అయినా ప్రజ ప్రతీకారం తీసుకోలేదు. చెదురు మదురు సంఘటనలు జరగక పోలేదు. అవి స్వప్రయోజనపరుల ఆగడం. తురకలు సంపన్నులు తప్ప గ్రామాలు వదల్లేదు. హిందువులు మహమ్మదీయ సోదరులకు తమ ఇళ్లల్లో తావరం కల్పించారు. ఇక్కడిది నిజమైన ప్రజా ఉద్యమం.

 

    అందువల్లనే అది సాధ్యం అయింది.

 

    హిందువులు తురకల మీద ప్రతీకారం తీర్చుకోలేదు. అక్కడక్కడా జరిగిన మాట నిజం. కాదనను. కాని రజాకార్లు చేసినట్లు ఒక ఉద్యమంగా హింస చెలరేగలేదు.

 

    ఇది భారతదేశంలోనే సాధ్యం!

 

    అదీ ఒక్క హిందూ సమాజానికే సాధ్యం!!

 

    అభినవ పోతన వానమామలై వరదాచార్యులవారు ఈ సందర్భాన్ని వస్తువుగా గ్రహించారు. "విప్రలబ్ధ" అనే కావ్యం రచించారు. పోలీసుచర్య కల్లోలాల్లో ఒక తురక పసిపిల్ల ఒక విప్రునికి లభిస్తుంది. విప్రునికి లభించింది - అందువలన "విప్రలబ్ధ." ఆమె విప్రలబ్ధ నాయిక కూడ! శ్లేషలో వరదన్న మిన్న. విప్రుడు ఆమెను పెంచి పెద్దచేస్తాడు. తరువాత వలపు కథ. ఆ కావ్యానికి వరదన్న నాతో పీఠిక వ్రాయించుకున్నాడు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.