Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam



    న్యాయం చచ్చింది!

 

    గబగబా ఇంటికి పరిగెత్తాను. నాలుగు సిగరెట్లు కాల్చాను!

 

    ఒక ఊరి నుంచి జగడం తెంపమని వచ్చారు. రెండు రోజులు విన్నాను. నాకు తోచింది. చెప్పాను. సమంజసంగా ఉందన్నారు. ఉభయులూ సంతోషించారు. డబ్బు తెచ్చి దూరంగా పెట్టారు. తీసుకొమ్మన్నారు.

 

    "ఎందుకు?" అడిగాను.

 

    "సంతోషంగ ఇస్తున్నం."

 

    "డబ్బుతో సంతోషం వచ్చిందా?"

 

    "కాదు. మీరు చెప్పంగ వచ్చింది."

 

    "మరి నన్ను కొంటరా?"

 

    డబ్బు అందుకుని విచారంగా వెళ్లిపోయారు. ఏమిటో విసుగు, చికాకు, అసహ్యం. "ధనమూల మిదం జగత్" అన్నాడు వాల్మీకి!

 

    పోలీసు చర్య విషయంలో భారత ప్రభుత్వం ఎంతో జాగ్రత్తగా ప్రణాళిక సిద్ధం చేసింది. పరిపాలన భగ్నం అవుతుందని ఊహించారు. నిజాం అధికారుల మీద నమ్మకం ఉంచరాదనీ నిర్ణయించారు. జిల్లాలకు - తాలూకాలకు సివిల్ అధికారులను యూనియన్ కేడర్ నుంచి నియమించారు.

 

    వరంగల్లు జిల్లాకు పళనియప్పన్ I.C.S. జిల్లా అధికారిగానూ - కృష్ణమూర్తిగారు తాలూకా అధికారిగానూ వచ్చారు. అప్పటికి ఇంకా రైళ్లు సరిగ్గా నడుస్తున్నట్లు లేదు. ఒకే బోగీ బండిలో వారు ఇద్దరూ గార్లలో దిగారు. బండి డోర్నకల్లు వెళ్లింది. బొగ్గూ, నీరు వేసుకొని మళ్లీ వస్తుంది.

 

    పళనియప్పన్ - కృష్ణమూర్తి గార్లలో పాలన ఏర్పరచడానికి వచ్చారు. తాసీల్ కచ్చేరీలో సమావేశం ఏర్పరచారు. కొత్త కద్దరుదారులందరూ చేరారు. పేర్లు చెప్పను. అందరూ అపకీర్తిశేషులయినారు. చచ్చినవాణ్ణి బద్నాం చేయడం సంప్రదాయం కాదు. "మరణాంతాని వైరాణి" అంటాడు వాల్మీకి.

 

    పళనియప్పన్ తెలుగు బాగా మాట్లాడారు. తెలుగులో అధికారి మాట్లాడగా వినడం - తెలుగులో అధికారితో మాట్లాడ్డం ఇదే తొలిసారి!

 

    పళనియప్పన్ గ్రామ పరిస్థితులను గురించి అడిగారు. 'ఏమీ లేదు మహాప్రభో! మీ అనుగ్రహం వల్ల అంతా సవ్యంగా ఉంది' అన్నట్లు మాట్లాడారు అందరూ.

 

    నేను వెనుక బెంచిలో కూర్చున్నాను. నుంచుంటే కనిపించను. బెంచి ఎక్కాను.

 

    'జనాబ్' అని ప్రారంభించాను. "సార్" అనడం ఇంకా రాలేదు. ఇప్పటికీ రాలేదు. 'వీళ్లందరూ బ్లాక్ మార్కెటుదారులు. బియ్యం నిలువలు దాచారు. పేదలకు గింజ దొరక్కుండా చేశారు' అంటూ ఒక చిన్న ఆవేశపూరిత ఉపన్యాసం ఇచ్చాను.

 

    "ఇది ఏమిటి?" అన్నట్లు పెద్దలను చూచాడు అప్పన్.

 

    "కమ్యూనిస్టు - అట్లనే మాట్లాడ్తాడు" అన్నారు అంతా.

 

    "మా ప్రభుత్వంలో కమ్యూనిస్టులకు స్థానం లేదు" అంటూ సమావేశం ముగించారు అప్పన్. రైల్వేస్టేషనులో రైలు రాక కోసం కూర్చున్నారు.

 


                   

 


    నేను వెంటనే ఒక మహజరు తయారుచేశాను. పేద ప్రజల సంతకాలు తీసుకున్నాను. జనాన్ని తీసుకొని ఊరేగింపుగా స్టేషనుకు చేరాను. మహజర్ పళని యప్పన్ కు ఇచ్చాను. వారికి తెలుగు చదువరాదు. కృష్ణమూర్తితో చదివించుకున్నారు. కుర్చీ తెప్పించారు. నన్ను కూర్చోమన్నారు. కూర్చున్నాను.

 

    "మీరు నా మాట నమ్మలేదు. జనం మా వెంట ఉన్నారు" అన్నాను.

 

    అప్పన్ చిరునవ్వు నవ్వాడు. 'పొరపాటే' అని నా వీపు నిమిరారు. "వీరు చెప్పినట్లు చేస్తాం. వెళ్లండి" అని జనాన్ని పంపించారు.

 

    "డియర్ రంగా! మీరు మాకు వాస్తవం చూపించారు. ఎంతో థాంక్స్. మేము ఇక్కడికి కొత్త. ఇలాంటి పొరపాట్లు జరుగుతాయి. ముందు జరగకుండా చూస్తాం. రేపు TCA గారు వస్తారు. మీరు చూపినచోట చవక దుకాణాలు పెట్టిస్తారు. మీరు ఏమీ అనుకోవద్దు" అన్నారు. బండి వచ్చింది. వెళ్లిపోయారు.

 

    జనం స్టేషను బయటనే ఉన్నారు. DCA గారి మాటలు విన్నారు. నాకు జయపెట్టారు. నన్ను ఎత్తుకొని ఆడారు.

 

    ICS అంటే ఇండియన్ సివిల్ సర్వీస్. వారికి బ్రిటిషు వాళ్లు శిక్షణ ఇచ్చారు. బ్రిటిషు ప్రజాస్వామ్యపు గొప్పదనం ఏమంటే - వాళ్లు వ్యతిరేకుల మాట విన్నారు. తమకు వ్యతిరేకంగా పోరాటానికి గాంధీ - నెహ్రూ వంటివారికి శిక్షణ ఇచ్చింది బ్రిటిష్ వ్యవస్థయే! ఆ వ్యవస్థలో ఔదార్యం ఉంది. సహనం ఉంది. సహకారం ఉంది.

 

    DCA - డిస్ట్రిక్డ్ సివిల్ అడ్మినిస్ట్రేటర్ - పళనిఅప్పన్ కు ఆ ఔదార్యం అబ్బింది. అతడు వాస్తవాన్ని ధిక్కరించలేదు. గుర్తించాడు. తెల్లవారి TCA కృష్ణమూర్తి గారు వచ్చారు. నన్ను పిలిపించారు. నాతో మాట్లాడారు. నేను చూపిన చోట్లు స్వయంగా చూశారు. అవి పేదల ప్రాంతాలని గుర్తించారు. తరువాత వారం రోజుల్లో గ్రామంలో మూడు చవుక ధరల దుకాణాలు ఏర్పడ్డాయి.

 

    స్వతంత్ర వ్యాసం:

 

    ఆ రోజుల్లో "తెలుగు స్వతంత్ర" - అనే వారపత్రిక వచ్చేది. దానికి ప్రఖ్యాత పత్రికా సంపాదకులు ఖాసా సుబ్బారావుగారు సంపాదకులు. పోలీసు చర్య జరిగింది. దాన్ని గురించీ తెలంగాణా విముక్తిని గురించీ ఒక సంపాదకీయం వ్రాశారు.

 

    ఖాసావారి సంపాదకీయంలో తెలంగాణం గురించిన సమాచారం సరిగా లేదు. కాని సుబ్బారావుగారిది తప్పు అనే ధైర్యం లేదు. నేను పిల్లవాణ్ణి. అప్పటికి నాకు 19-20 ఏళ్లుంటాయి. అయితే తెలిసిన తప్పు తెలియపరచడం నా కర్తవ్యం. అలా అనుకున్నాను. వ్యాసం వ్రాశాను. 'స్వతంత్ర'కు - మద్రాసు పంపాను.

 

    ఖాసా వారు పెద్దలు. సహృదయులు. ఆ రోజుల్లో పెద్దలకు ఉదారత ఉండేది. వారు తమ తప్పులను గుర్తించేవారు. ఎదుటి వాదనను గ్రహించేవారు. మరుసటివారం స్వతంత్రలో నా వ్యాసం వచ్చింది. అదీ సరిగ్గా సంపాదకీయం తరువాత. అది ఖానా వారి విశాల హృదయం!

 

    "స్వతంత్ర"లో నా వ్యాసం రావడం నాకు ఎంతో ఉత్సాహం కలిగించింది. ఆత్మ విశ్వాసం ఏర్పడింది. భయం దూరం అయింది. ధైర్యం కలిగింది. నేను వ్రాయగలను. చక్కగా వ్రాయగలను. మెప్పించగలను అనిపించింది.

 

    "స్వతంత్ర"లో వ్యాసం - అందునా ఖాసావారి సంపాదకీయపు విమర్శ సామాన్య విషయం కాదు. అనేకులు మెచ్చుకున్నారు. అనేక ఉత్తరాలు వచ్చాయి. ఈ పరంపర నిరంతరం నెలవరకు సాగింది.

 

    అసలు విషయం ఏమంటే - తెలంగాణా గురించిన సమాచారం అందడం లేదు. అది ఖాసావారి పొరపాటుకు కారణం. ఆ పరిస్థితి ఇవ్వాళ్టికీ మారలేదు. ఈ తరం వారికి పోలీసు చర్య విషయం తెలియదు. 15 ఆగస్టునే స్వాతంత్ర్యం వచ్చింది అనుకుంటారు. తెలంగాణం గురించి సమాచారం అందని లోటు ఇప్పటికీ ఉంది.

 

    ధాన్యవితరణ:

 

    ఆ రోజుల్లో ఇప్పటి ధన, ధాన్య సమృద్ధి లేదు. ఆనకట్టలు తక్కువ. వర్షాలు అనిశ్చితం. రసాయనిక ఎరువులు లేవు. క్రిమిసంహారకాలు లేవు. రైతులకు ఇంతటి ప్రోత్సాహం లేదు. ధాన్యం దిగుమతులు అవసరం అయ్యేది. అయినా సరియైన వితరణ ప్రణాళిక లేదు.

 

    గింజ దొరకడం కష్టం. డబ్బు దొరకడం అంతకంటే. సరుకులు చవక. కల్తీలు అంతగా లేవు. అయినా డబ్బు దొరకదు. అందుకు తోడు వ్యాపారుల నల్లబజారు, ధాన్యం వగయిరాలు దాచేస్తారు. దొరకనివ్వరు. ధరలు పెంచి అమ్ముతారు! ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతారు. డబ్బండీ డబ్బు - దానికోసం ఏదయినా చేస్తారు!

 

    బ్లాకు మార్కెటును అరికట్టడానికి ప్రభుత్వ యంత్రాంగం లేదు. ప్రభుత్వం వాళ్లదే. చిత్తశుద్ధి లేదు. ప్రజలకు ధైర్యం లేదు. ప్రభుత్వం చర్య తీసుకుంటుందని నమ్మకం లేదు. ప్రజలు ముందుకు రారు. ప్రభుత్వం పట్టించుకోదు. పరిస్థితిలో ఇవ్వాల్టికీ పెద్ద తేడా లేదు. అయితే దేశం సమృద్ధం అయింది. కొనుగోలు శక్తి పెరిగింది. సరుకులు లభిస్తున్నాయి.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.