Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda
3. శ్వేత పదమా! కుడి, ఎడమ పాదములచే త్రొక్కుము. కూలునట్టి చెట్టు వలె సర్పపు ఉగ్ర విషమును దింపుము.
4. అరంఘషము నీట మునిగి, లేచి చెప్పినది. 'కూలిన చెట్టువలె సర్పముల విషము నీరసమైనది'
5. పైద్వ కసర్ణిల, స్విత్ర నామక సర్పములను నష్ట పరచును. రథస్య, పృదాకుల తలలు బద్దలు చేయును.
6. పైద్వమా! నీవు అతిముఖ్యవు. నిన్ను ప్రార్ధించుచున్నాము. మేము నడచు మార్గములనుండి సర్పములను విసరివేయుము.
7. సర్వనాశక పైద్వము లభించినది. అది తన కాళ్ళచే బలము, వేగము గల వంకర నడకల వానిని నలిచివేయును. అది దాని గుణము.
8. తెరచిన నోరు మూత పడకుండునుగాక. మూత పడిన నోరు తెరవకుండునుగాక. ఈ క్షేత్రమున ఆడ, మగ పాములున్నవి. అవి నిర్వీర్యములు అగునుగాక.
9. దూరమున ఉన్న, దగ్గర ఉన్న సర్పములు విష రహితములు అగునుగాక. నేను తేలును ముద్గరములతోను, పామును దండముతోను కొట్టుచున్నాను.
10. అఘాస్య, స్వజము ఈ రెండింటికి ఇదే మందు. చంపునట్టి పాపము చేయు పామును వశపరచుకొను పైద్వమును ఇంద్రుడు నాకు ఇచ్చినాడు.
11. పైద్వము స్థిరము. దానిది స్థిర స్వభావము. దానిముందు పాములకు కన్నీరే మిగిలును.
12. వజ్రధారి ఇంద్రుడు సర్పముల విషమును, ప్రాణములను తీసినాడు. అతడు చంపిన వానినే మనము మరల చంపుచున్నాము.
13. తిరశ్చిరాజయములు, నిపిష్టాసములు, పృదకములు చచ్చినవి. కరిక్రిత, శ్విత్ర, అసితములను, దర్భలతో చంపుము.
14. కైరాతిక, కుమారిక, సకయను పనిముట్లచే వెరుల కొరకు త్రవ్వుచున్నాము. బంగారము కొరకు త్రవ్వువానిచే గిరిసానువులను త్రవ్వుచున్నాము.
15. అపరాజితుడగు యుషభిషగ్వరుడు విచ్చేసినాడు. ఇతడు స్వజ సర్పము, వృశ్చికము రెండింటిని నాశము చేయగలవాడు.
16. ఇంద్రుడు, మిత్రావరుణులు, వాయువు, పర్జన్యుడు, నా శత్రువగు సర్పమును వశపరచుకున్నారు.
17. పృదాకు, పృదాక్వము, స్వజము, తిరశ్చిరాజి, కసర్ణిల, దశోనసి సర్పములను ఇంద్రుడు తన వశము నందుంచినాడు.
18. సర్పమా! ఇంద్రుడు నిన్ను పుట్టుకతోనే హతమార్చినాడు. అప్పుడు చచ్చిపడి ఏ సర్పము బలముతో బయటపడినది?
19. పౌంజిష్టము కుర్వరపు మెడను పట్టినట్లు నేను సింధు మధ్యము నుండి మరలి సర్ప విషమును శుద్ది చేసినాను.
20. నదులందు సకల సర్పముల విషము కొట్టుకొని పోవునుగాత్. తిరశ్చిరాజ, పృదాకు సర్పములు చచ్చినవి.
21. భూమి వంటి ఓర్పున నేను ఔషధములు సాధించినాను. వానిని వేగవతులగు నదులందు చేర్చినాను. సర్ప విషము హరించునుగాక.
22. అగ్నియందు, సూర్యుని యందు, పృథివి యందు, ఓషధులందు, కాందవిషమందు, కనక్నకమందు గల విషములు పూర్తిగా విషమునందు చేరునుగాక.
(విషమునకు విషమే విరుగుడు.)
23. సర్పములందు అగ్నిజములు, జలజములు, ఓషధిజములు, విద్యుతములు ఉన్నవి. వానిలో బహుజాతములు, మహిమాన్వితములు ఉన్నవి. వానికి నమస్కరించుచున్నాము.
24. ఓషధీ! నీవు తౌది, ఘ్రుతాచీ నామక కమనీయవు. కాళ్ళు క్రిందకు పెట్టి నీ యందున్న విష దూషణ స్థానమును పట్టుకున్నాను.
25. గుండెను కాపాడుచు, అవయవములందలి విషము దిగుచు, విషపు బలము దిగువకు దించి నష్టపడునుగాక.
26. విషము విడిపోయినది. నవ విషము విషమున కలిసినది. అగ్ని విషమును విడదీసినాడు. సోముడు దానిని కొనిపోయినాడు. విషము కాటు వేసిన సర్పమును చేరినది. ఆ సర్పము చచ్చినది.
మూడవ అనువాకము
మొదటి సూక్తము - 5
వినియోగము :
ఇది అభిచార కర్మము. శత్రునాశక సమర్ధ బలమును జలమునందు ప్రవేశపెట్టి వజ్రసమము చేసి వానిని శత్రులక్ష్యము వైపు విసరునది. దాని విధానము ఇది :-
తొలుత జలమును ఇట్లు సంబోధించునది :- "నీవు ఇంద్రుని బలమవు. ఇంద్రుని పరాభవ శక్తివి. కావున నిన్ను ఇంద్రుని బలసంపన్నను చేయుచున్నాను".
తదుపరి ఇట్లనునది :-
"నీవు ఇంద్ర, సోమ, మిత్రావరుణుల, యముని, దేవతల, పితరుల భాగమువై ఉన్నావు"
తరువాత ఇట్లనునది :-
"త్రిలోకములందున్న సకల జలములు, అపాన్నపాత వైద్యుతాగ్ని, మహా బల వృషభ పశువు, జల మధ్యమున ఆవిర్బవించిన హిరణ్యగర్భుడను ఆదిదేవుడు, జలములందున్న బహువర్ణ పర్వతాకార మేఘము, జలములందున్న అగ్ని, వీనిలో ఒక్కొక్క దానిని నేను శత్రువు మీదకు ప్రయోగించుచున్నాను. ఆ శత్రువును నేను హతమార్తును గాక. వానిని ఈ మంత్రమున, ఈ కర్మమున, ఈ జలరూప వజ్రమున విదీర్ణుని చేయుదును గాక."
పిదప గత మూడు సంవత్సరముల అసత్య భాషణ నుంచి రక్షణకు ప్రార్ధించునది.
అనంతరము శత్రువు మీద జలవజ్రము ప్రయోగించుటకు కాలు ఎత్తునది. ఎత్తిన కాలును ఇట్లు సంబోధించునది.
"నీవు విష్ణువు యొక్క క్రమమవు. విష్ణువు మూడు లోకములను ఆక్రమించినంత బలశాలివి. నీవు భూమి స్వయముగా తీక్ష్ణము చేసిన శస్త్రమవు. నీచే శత్రువును భూమినుంచి పంపుచున్నాను. నీవు అంతరిక్షముచే తీక్ష్ణీ కృతము చేయబడిన దానవు. నీవు ద్యౌ శంసితవు. దిక్ శంసితవు. ఆశా శంసితవు. ఋక్ శంసితవు. యజ్ఞ శంసితవు. ఓషధి శంసితవు. అప్సంసితవు. కృషి శంసితవు. ప్రాణ శంసితవు.కావున ఆయా దేవతల స్థానము నుండి శత్రువును పంపించుచున్నాను."
తదుపరి దక్షిణమునకు కొద్దిగా జరుగునది. దక్షిణమునకు ముఖము పెట్టునది. అట్లే అన్ని దిశలకు, సప్తర్షి మండలమునకు, బ్రాహ్మణుల వైపునకు తిరిగి ఒక్కొక్కరిని ధనము యాచించుచు ఇట్లనునది :-
"నేను ఏ శత్రువును వెదకుచున్నానో వానిని హతమార్చెదను. ఈ సమిధ ఆయుధమై వానిని తినును గాక."
తరువాత భువస్పతిని అన్నము యాచించునది. అగ్నిని వర్చస్సు, ప్రజ, ఆయువు యాచించునది. అగ్నిని రాక్షసులందు విభేదములు కల్పించుమని ప్రార్దించునది. చివరకు పూర్వోక్త ఉదకమును చతుర్భ్రుష్టి వజ్రముగ భావించి శత్రువు తల నరకుటకు విసరునది. ఇట్లని ఆశించునది.
ఇది శత్రువుల అవయవములను నరకును గాక. సమస్త దేవతలు ఈ కార్యమునకు నన్ను అనుమతింతురు గాక.
అసత్య భాషణ పాపమును తొలగించుకొన దలచు వానికి 26వ ఋక్కుచే ఆచమనము చేయించునది.
అగ్ని తంత్రములందు 23వ మంత్రముచే భార్య దోసిలి యందు జలపాత్రను పెట్టునది. సకల తంత్రములందును 39 -41 ఋక్కులచే ప్రదక్షిణము చేయునది.
1. జలమా! నీవు ఇంద్రుని ఓజస్సువు. బలమవు. అభిభవ శక్తివి. వీర్యమవు. ధనమవు. అట్టి నిన్ను జయశీల యోగము కొరకు బ్రహ్మయోగముచే యుక్తము చేయుచున్నాను.
2 - 5 వరకు అదే మంత్రము.
6. ఇంద్రునకు ఓజస్సు, అభిభవ శక్తి బలము, వీర్యము, ధనము కలుగును గాక. జయశీల యోగము కొరకు సకల భూతములు నావద్ద ఉండును గాక. జలము నా వద్ద తగిన రూపమున ఉండును గాక.
7. అగ్నే ర్భాగ స్థ |
అసాం శుక్రమాసో దేవీర్వర్చో అస్మాసు ధత్త |
ప్రజాపతే ర్వో ధామ్నాస్మై లోకాయ సాదయే ||
జలమా! నీవు అగ్ని యొక్క భాగము అగుచున్నావు.
జలముల తేజస్సు, దివ్యత్వము వర్చస్సు నాయందు చేర్చుము.
ప్రజాపతీ నీ స్థానములను ఈ లోకము కొరకు ప్రసాదించుము.
(దేవతల భాగము తప్ప 14 వరకు దీనివలెనే.)
8. "ఇంద్రస్య భాగస్థ |
"అపాంశుక్ర మాపో....."
9. "సోమస్య భాగ స్థ |
"అపాంశుక్ర మాపో....."
10. "వరుణస్య భాగ స్థ |
"అపాంశుక్ర మాపో....."
11. మిత్రా వరుణ యోర్భాగ స్థ |
"అపాంశుక్ర మాపో....."





