Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda
13. ఏ దేవత మానవుని యందు ప్రాణ, అపాన, వ్యాన, సమాన వాయువులను స్థాపించినాడు?
14. ఏ ప్రధాన దేవత ఇతని యందు యజ్ఞమును, సత్యమును, అసత్యమును, మృత్యువును, అమృతమును స్థాపించినాడు?
15. మానవుని దేహమును ఆచ్చాదించు చర్మమును ఎవడు ఏర్పరచినాడు? ఆయువును ఎవడు కల్పించినాడు? బలమును ఎవడిచ్చినాడు? వేగమును ఎవడు కల్పించినాడు?
16. ఎవని వలన ఇతని యందు జలము విస్తరిల్లినది? ఎవడు వెలుగు కొరకు పగలు ఏర్పరచినాడు? ఎవని వలన ఉష దీప్తమైనది? ఎవడు సాయంభవనమును ఇచ్చినాడు?
17. సృష్టి యొక్క అవిచ్చిన్నతకు ఇతని యందు వీర్యమును ఎవడు స్థాపించినాడు? మేధను ఎవడు ఏర్పరచినాడు? ఎవడు ఇతనిచే బాణము ధరింపచేసినాడు?
18. ఎవరి ప్రభావమున మానవుడు భూమిని ఆక్రమించినాడు? స్వర్గమును ఆరోహించినాడు? పర్వతములు ఎక్కినాడు? కర్మలు చేసినాడు?
19. ఎవరి వలన మానవునకు పర్జన్యుడు - విచక్షణ సోమము లభించినవి? ఎవరు అతని యందు యజ్ఞము, శ్రద్ద, మనస్సును ఏర్పరచినారు?
20. ఎవరి వలన ఇతడు శ్రోత్రియమును, పరమేష్టిని, అగ్నిని అందుకొనుచున్నాడు? ఎవని ద్వారమున ఇతడు సంవత్సరమును లెక్కించుచున్నాడు?
21. బ్రహ్మ వలన శ్రోత్రియమును, పరిమేష్టిని, అగ్నిని అందుకొనుచున్నాడు. బ్రహ్మ ద్వారముననే సంవత్సరమును లెక్కించుచున్నాడు.
22. ఏ కర్మ వలన దేవతలకు అనుకూల నివాసము చేయగలుగుచున్నాడు? ఏ ప్రాకారమున దేవా ప్రజకు అనుకూలుడై ఉండగలుగుచున్నాడు? ఎవరి ద్వారా క్షత్రము, సక్షత్రము కలుగుచున్నవి?
23. బ్రహ్మ వలన దేవతలకు అనుకూల నివాసము - బ్రహ్మ వలన దేవతలకు అనుకూలుడై ఉండుట జరుగుచున్నవి. బ్రహ్మయే క్షత్రము, అన్యము కాకున్నది. బ్రహ్మయే సక్షత్రము అగుచున్నది.
24. భూమిని, ఉత్తర ధృవమును ఎవడు స్థాపించినాడు? ఊర్ధ్వమును, తిర్యక్కును, ప్రాణులు సంచరించు అంతరిక్షమును ఎవరు కల్పించినారు?
25. బ్రహ్మ భూమిని, ఉత్తర ధ్రువమును స్థాపించినాడు. బ్రహ్మ ఊర్ధ్వమును, తిర్యక్కును, ప్రాణులు సంచరించు అంతరిక్షమును కల్పించినాడు.
26. అథర్వ ఇతని మూర్ధము, హృదయమును ఏర్పరచినాడు. ఊర్ధ్వ పవమానుడు మస్తిష్క శిరములకు ప్రేరణ కలిగించినాడు.
27. అథర్వుడు ఏర్పరచిన శిరస్సు చక్కగా నిలిచి ఉన్నది. కేశములు దేవతా రూపములై ప్రాణములు దానిని రక్షించుచున్నవి. అన్నము, మనస్సు సహితము శిరమును కాపాడుచున్నవి.
28. బ్రహ్మపురిని ఎరిగినవాడు పైన, క్రింద ఉన్న మాత్రమే కాదు - సకల దిశలందు వ్యక్తమగుచున్నాడు. పురుషుడు అగుచున్నాడు.
29. యోవైతాం బ్రాహ్మణో వేదామృతేనావృతాం పురమ్ |
తస్మై బ్రహ్మచ బ్రాహ్మాశ్చ చక్షుః ప్రాణం ప్రజాం దదుః ||
బ్రహ్మ యొక్క అమృతా వృత పురిని తెలిసిన వానికి బ్రహ్మయు, బ్రాహ్మయును చక్షువులు, ప్రాణము, ప్రజలను ఇచ్చుచున్నారు.
30. బ్రహ్మ పురిని తెలియువానిని పురుషుడు అనుచున్నాడు. అతని కనులు, ప్రాణము వార్ధక్యమునకు ముందు అతనిని విడువకున్నవి.
31. ఎనిమిది వక్రములు పన్నెండు ద్వారములు కలది దేవతల పురము అయోధ్య యగుచున్నది. అందు హిరణ్మయి కోశము గల స్వర్గము జ్యోతిషావృతమై ఉన్నది.
32. ఆ హిరణ్మయి కోశమున త్రి అరములు ప్రతిష్టితములు. అది ఆత్మ యొక్క స్థానమగుచున్నది. "తద్ వై బ్రహ్మ విదో విదుః" దానిని బ్రహ్మజ్ఞానులు మాత్రమే తెలియుచున్నారు.
33. బ్రహ్మపురి పాపనాశిని. యశో సంపన్నము. కాంతి మంతము. హిరణ్మయము అపరాజితము. అట్టి పురమునందు బ్రహ్మ వివేశ - ప్రవేశించుచున్నాడు.
రెండవ అనువాకము
మొదటి సూక్తము - 3
వినియోగము : శత్రుక్షయాదులు కోరువాడు ఈ అర్ధ సూక్తముచే వరణ మణిని మూడు రాత్రులు పెరుగు తేనెలో నానపెట్టి సంపాతన, అభిమంత్రణలు చేసి కట్టుకొనునది. అభయ నామక మహాశాంతి యొక్క వరణ మణి బంధనమున దీని వినియోగము.
1. ఇది వరణ మణి. శత్రువు క్షయ కారకము. వరప్రదము. దీనిచే ఆరంభించుము. దుష్ట శత్రువును పరిమార్చుము.
2. శత్రువులను అణచుట - అంతమొందించుటకు ఆరంభించుము. వరణ మణి నీ ముందు వెనుక నిలుచునుగాక. దేవతలు వరణమణి సాయమున మరునాడు కూడ అసురుల అభిచారమును దూరము చేసినారు.
3. ఈ వరణమణి సకల దుఃఖ నివారకము. సహస్రాక్ష పరాక్రమశాలి. హరితవర్ణ హిత రమణీయ ఇది నీ శత్రువును నేల కూల్చగలది. నిన్ను ద్వేషించువారిని మొదట హతమార్చుము.
4. ఇది ప్రయోగించిన సమస్త కృత్యలను నివారించుచు మానవుని వలన కలుగు భయములను దూరము చేయుచున్నది. ఈ వరణ మణి నిన్ను సకల పాప విముక్తుని చేయుచున్నది.
5. వరణమణి నివారించునది. దేవి. వనస్పతి. దాని సాయమున ఇతని యందు చేరిన సమస్త రోగములను దేవతలు నివారింతురుగాక.
6. దుస్స్వప్నము కలిగినను, మృగ దుశ్శకునము ఎదురైనను, దుర్నిమిత్తములు, తుమ్ము, పాపవాక్కుల నుండి ఈ మణి కాపాడుచున్నది.
7. మానవా! ఈ వరణమణి నిన్ను శత్రువు, నిర్రుతి, అభిచార భయము, బలమైన మృత్యువు నుండి రక్షించుచున్నది.
8. వనస్పతి దేవియగు ఈ మణి మాతల్లిదండ్రులు, సోదరులు, బంధువులు చేసిన పాపముల నుండి రక్షించుచున్నది.
9. వరణమణి వలన మా బంధు రూప శత్రువులు వ్యధితులగుదురుగాక. వారిని మహా రజస్సు చేరునుగాక. వారు భయంకర అంధకారమున పడెదరు గాక.
10. నేను హింసారహితుడను అయినాను శాంతుడనగుచున్నాను. నేను ప్రజావంతుడనగుదునుగాక. వరణమణి నన్ను సకల దిశ, ప్రదిశలందు రక్షించునుగాక.
11. వరణమణి వనస్పతిదేవి నా ఉరమున ఉన్నది. ఇంద్రుడు దస్యులను వలె - అది నా శత్రువులను హతమార్చునుగాక.
12. శతశరదాయుష్యము కొరకు వరణమణిని ధరించుచున్నాను. అది నాకు రాజ్యమును - క్షాత్రమును, పశువులను, ఓజస్సును కలిగించునుగాక.
13. పెనుగాలి తన బలమున వృక్షములను కూల్చిన రీతి వరణమణి పుట్టిన, పుట్టనున్న మా శత్రువులను కూల్చుచు మమ్ము రక్షించునుగాక.
14. వాయువు, అగ్ని మహా వృక్షములను కాల్చికూల్చినరీతి వరణమణి పుట్టిన, పుట్టనున్న మా శత్రువులను కూల్చుచు మమ్ము రక్షించునుగాక.
15. ఎట్లు గాలి వలన ఎండిన చెట్లు పడిపోవుచున్నవో అట్లే వరణమణి పుట్టిన, పుట్టనున్న మా శత్రువులను కూల్చి మమ్ము రక్షించునుగాక.
16. వరణమణీ! ఇతని రాజ్యమును, పశువులను హరించదలచిన వారిని వారి ప్రారబ్ధము, ఆయువున కన్న మున్నే నష్ట పరచుము.
17. సూర్యుడు ఎట్లు అతిగా ప్రకాశించునో. ఎట్లు అతని యందు ఎంతో తేజము నిలిచి ఉన్నదో "ఏవా మే వరణో మణిః కీర్తిం భూతిం నియచ్చతు. తేజసా మా సముక్షతు యశసా సమనక్తుమా" అట్లే వరణమణి నాకు కీర్తిని. భూతిని ప్రసాదించునుగాక. నన్ను తేజోసంపన్నుని యశస్సంపన్నుని చేయును గాక.
18. చంద్రుని యందును, సూర్యుని యందును యశస్సు ప్రతిష్టితమై ఉన్నట్లు "ఏవా మే...."
19. భూమి యందును అగ్ని యందును నిక్షిప్తమైన యశస్సు వంటిది. "ఏవా మే....."
20. "యథా యశః కన్యాయాం యథా అస్మిన్ సంభ్రుతే రథే". "ఏవామే...."
21. "యథా యశః సోమపీథే మధు పర్కే యథా యశః". "ఏ వామే...."
22. "యథా యశః అగ్నిహోత్రే వషట్కారే యథాయశః". "ఏవా మే....."
23. యథాయశో యజమానే యథాస్మిన్ యజ్ఞ ఆహితమ్". "ఏవామే....."
24. యథా యశః ప్రజాపతౌ యథాస్మిన్ పరమేష్ఠిని". "ఏవామే...."
25. ఎట్లు దేవతలందు అమృతము, సత్యము నిలిచి ఉన్నవో "ఏ వామే....."
రెండవ సూక్తము - 4
వినియోగము : విష చికిత్సకు ఈ సూక్తమున 4వ కాండపు 6వ సూక్త సహితముగ వినియోగించునది. "పైద్వ" మును నూరి అభిమంత్రితము చేసి కుడి అంగుళితో కుడి ముక్కులోనికి పీల్పించునది. పైద్వము కీటకమగును. అది లోకమున 'తిలిణి' నామమున ప్రసిద్దము. సర్ప భయము కలిగినపుడు పైద్వమును తెల్లని వస్త్రములో చుట్టి దీనిచే అభిమంత్రించి సర్ప భయ స్థానమున పాతిపెట్టునది. అట్లే దానిని ఇంటిలో పెట్టునది.
శంకా విషభైషజ్య కర్మమున 25వ మంత్రముచే సర్పదష్టుని తల నుంచి పాదముల వరకు చేతితో రాయునది. ఆ కర్మము నందే కట్టెను కాల్చి 26వ ఋక్కుచే అభిమంత్రించి విషవ్రణమునకు చూపి అటువైపు విసరునది. సర్పము కనిపించకున్న కాటువేసిన వైపు విసరునది.
1. రథములందు మొదటిది ఇంద్రునిది. రెండవది దేవతలది. మూడవది వరుణునిది. ఆ తరువాతది సర్పములది. అది స్థాణువయ్య పాకును. తదుపరి పారిపోవును.
2. ఇది దర్భ ఇది సర్పములకు దుఃఖము కలిగించునది. ఇది అశ్వ, పరుష సర్పముల విషమును తొలగించునది. ఇది 'రథస్య బంధురమ్"





