Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam
అలా సాగుతూనే పోయినాయి సైన్యాలు. రెండోరోజు రజ్వీ జన్మస్థలం 'లాతూరు' ఆత్మసమర్పణ చేసింది.
మేజర్ 'ఫ్రెడ్డీఫ్రీ మాంటల్' జాల్నా- ఔరంగాబాదు సెక్టార్ లో నిరాటంకంగా -ఠీవిగా - దర్జాగా గూర్ఖాసేనతో సాగిపోతున్నాడు. తోవలో ఒక గ్రామం దర్శనం ఇచ్చింది. రక్షణ లేదు. దళాలు పలాయనం అయినాయి. కాని, పూరిండ్లు - మట్టి మిద్దెలు - ఆకలితోవున్న జనం- ముక్కు కారుతున్న పిల్లలూ కనిపించారు. అతనికి జాలి కలిగింది. తుపాకి పక్కన పెట్టాడు. దానితో అంత పని లేకుండా పోయింది. ఫ్రెడ్డీ గ్రామ సేవ, సమాజ సేవ ప్రారంభించాడు. అప్పటినుంచి ఆ గ్రామానికి 'ఫ్రెడ్డీనగర్' మారుపేరైంది.
ఇక్కడ 'విమాన విధ్వంసం'ని గురించి జనం చెప్పుకున్న ఒక కథ చెప్పాలి:
భారత విమానాలు హైదరాబాదు విమానాశ్రయం వైపు వస్తున్నాయి. వాటికి దూరం నుంచే విధ్వంసకి కనిపించింది. వారు కాస్త జాగ్రత్త పడ్డారు. గమనం తగ్గించారు. విధ్వంసకి ధ్వంస పరిధిలోకి విమానాలు వచ్చాయి. ధ్వంసకి కదల్లేదు. విమానాలు ధ్వంస పరిధి బయట తిరిగాయి. ధ్వంసకిలో కదలిక కనిపించలేదు. పరిధిలోకి వచ్చాయి. అయినా కదల్లేదు. అప్పుడు భారత విమానాలు దిగాయి. తీరా చూస్తే ధ్వంసకిలో మనిషి లేడు! విమానాశ్రయం నిర్మానుష్యం!!
ఇది జనం చెప్పుకునే కథ! అయితే ఇందులో కీలకం అయిన సత్యం ఉంది.
మర ఎంత గొప్పదయినా నడిపే మనిషి ముఖ్యం.
పరికరాలు సాధించడంకన్న వాడడం ముఖ్యం.
పోలీసు చర్యనుగురించి జానపదులు విచిత్రంగా చెప్పుకుంటారు.
సన్నాసాయన ఢిల్లీకి ఉరికిండు. సన్నాసాయన ఎవరయా అంటే రామానందతీర్థ. మల్లగాయన ఢిల్లీకెందుకు ఉరికె? అరె ఎరకయితలేదా? నైజమోడు మందిని నరకబట్టె - ఆడోల్లను చెరచబట్టె - కొంపలు దోచబట్టె, తగల పెట్టబట్టె - అవు ఎరకయితాంది! ఢిల్లీల యాడికి పోయిండా మల్ల! మాడికి పోతడే - పటేల్ తానికి పోయిండు. ఓర్యవ్వ ఊళ్లల్ల పటేల్ పట్వారీలందరు ఢిల్లీ చేరినారు! ధస్నియక్క - నీ తెల్వి దొంగల్తోల మన పటేళ్లు కారే - సర్దార్ వల్లభాయ్ పటేల్! ఈ కొత్త పటేల్ యాడికెల్లొచ్చె?
నీయవ్వ నీ దిమాక్ సరిగ్గలేదే! వల్లభాయ్ గారే కద భారత సైనికులను నడిపిచ్చేటిమంత్రి. అట్లు చెప్పరాదుమల్ల - పటేలంటే నాకు ఎర్కలేదు. సర్లే సన్నానాయన పటేల్ కాడికి పోయిండు. అటెన్క కథ చెప్పు.
సన్నాసాయిన పోయెటార్కల్ల పటేల్ పండి ఉన్నడు. ఏమన్న భీమారేమో పాపం! ఎహే పటేలంటే ఉక్కుమనిషి బీమార్ గీమారేం లేదు. ఆరాం చేస్తాండు. పెద్ద పెద్దోండ్లు ఆరామ్ చేయక పని చేస్తారె?
చెప్పనిస్తనా అడ్డపుల్ల లేస్తుంటవా? ఎర్క లేక అడుగుతాన్న - కోపమెందుకయితవు. జర సమ్జాయించి చెప్పు. సన్నాసాయన పటేల్ కాడికి పోయిండు. పటేల్ పన్నడు. అటెన్క కత చెప్పు.
సన్నాసాయన పన్న పటేల్ను చూసిండు. మండిపడ్డడు. సన్నాసోడికి సతకోపం వస్తదా? మల్ల లగాయించినవ్! నోర్ముస్తవా! అట్లెందుకంటవే ఎర్క లేక అడిగిన ఇడమర్చి చెప్పరాదు. ఇక అడగన్లే సన్నాసాయనకు కోపం వచ్చింది. అటెన్క కథ చెప్పు.
గది సర్లేవే! ఏమని దులిపిండో చెప్పకపోతివి. చెప్పమంటావా? ఇను. ఆడ నైజామోడు రక్కసుడయిండు. ఆడోల్లును చెరుస్తాండు. మునులను బందిస్తాండు యాగగుండాలల్ల సారపోస్తాండు. కళ్ళు పోస్తాండు. నువ్వేమో ఆ సామి పామ్మీద పన్నట్టు పన్నవ్. ఏమనుకుంటాన్నవ్ అన్నడు. దోసిల్ల నీళ్లు పట్టిండు శపించెటంద్కు.
ఎర్క లేక అడుగుత. ఇంక శపించెటోల్లున్నారె కలిఘ్రంల! మల్ల అడ్డమొస్తాన్నవ్. చెపుతే ఇంటలేవు. అరే ఆయన తాన అన్ని శక్తులుండబట్కె పటేల్ను గన్నిమాటలన్నడు? ఇంకొకలకు అంత తడాక ఉంటదా? సరె సన్నాసాయన దులిపిండయా - పటేలయన ఏం చేసిండు?
పటేలాయన దిగ్గున లేచి కూచున్నడు. కాల్మొక్త కోప్పడకుండి అన్నడు. సన్నాసాయన్ను కూకుండ పెట్టిండు. ఇంతకు నన్నేం చెయ్యమంటరు అనిడిగిండు. అంత గమ్మతుగున్నది. సన్నాసాయన దులుపుడు - పటేల్ కాల్పట్టుకొనుడు. కోప్పడకే అన్న అటెన్క చెప్పు.
సన్నాసాయన అన్నడు: పటేల! ఇంక నన్నే అడుగుతవ్. జల్ది చౌదరిని పిలిపిచ్చు. పట్నం పంపిచ్చు. నిజామును పట్టి తెప్పిచ్చు. సన్నాసి హుకుం జారీ చేసిండు. నోర్ముసుకుంట ముంగలి కత చెప్పు.
"గట్లనే బాంచెను" అన్నడు పటేల్. చవుదరిని పిలిపించిండు. చవుదరి బీడి తాగుతున్నడు. పారేసిండు. వచ్చిండు. చవుదరీ! నీ డ్రసు యాడున్నది అంట అడిగిండు పటేల్. చిలుకొయ్యకు తగిలించి వచ్చిన అంటన్నడు చౌదరి. జల్ది దిరస్సేసుక రమ్మంట చవుదరిని పటేల్ పంపిండు. ఒక్క మాటడుగుత ఏమనుకోకన్న! అంత పటేలు ముంగలికి చౌదరి దిరాస్సా లేకుండా ఎట్ల వచ్చె? బీడి తాక్కుంట ఎట్ల కూకునే?
అన్న! నీ భేజల పెండ ఉన్నదే! పటేల్ పండిండుగద! గందుకే చవుదరి దిరస్సు ఇడిచిండు - బీడి తాగుతున్నడు. ఇంకేమన్న అడిగెడిదుంటే గిప్పుడే అడుగు. అటెన్క చెప్ప. ఇప్పుడు ఎట్ల అడుగుతలేగని చవుదరి ముచ్చట చెప్పు.
చవుదురి దిరస్సు ఏసుకొని వచ్చిండు. పటేలుకు సలాం పెట్టిండు. నిక్కి నిలబడ్డడు. పటేల్ చవుదరితోని అన్నడు:- చెప్పెడిది బాగ ఇను. దిమాగ్ల ఎక్కించుకో. తీర ఆడ్కిపోయి గఫ్లత్ల ఇంకొకన్ని పట్టుకొచ్చెవు! ఫీరన్ హైద్రాబాద్ పో. గా నైజామ్ము ఈడికి గుంజ్క రా. ఈడ ఉన్నట్లు రావాలె. మేము చాయ్ తాగుతుంటం. నీయవ్వగా చవుదరి నా సొంటోడున్నట్లున్నడు. ఇంతకు వానికి దిమాగ్ కు ఎక్కిందంటవ్?
అరె నీఅఖల్లమన్నువడ! చవుదురి సామాన్నుడనుకున్నవ? పట్నం వచ్చిండు. నిజాంగల్ల పట్టిండు. వాడు ఉచ్చపోసుకున్నడు. చెప్పినట్లు ఇంటనన్నడు. అట్లయితే ముంగల పోయి పైజామ బద్లాయించ్క రమ్మన్నడు చవుదరి - వాసన పట్టలేకపోయిండు.
నైజామోడేమన్నడు ఇన్నవ? చెప్పకనే పోతివి. ఎట్లింట! నైజామన్నడంటే - నాకు ఒక్కటే పైజామున్నది. ఇట్లనే వస్తనన్నడు! ఓర్యవ్వ వీన్ని ఇట్లెట్ల పట్కపోదును అంట పాత పైజామ తెప్పిచ్చిచ్చిండు చవుదరి.
చవుదరి పదహారు బండ్లు కట్టిండు. ఎనక బండిల నిజామును కూకుండ పెట్టిండు. చవుదరి ముంగలిబండ్ల కూకున్నడు. అంతదూరంగంటె నిజామోడు పారిపోకుండుంటడా అని. మల్ల ఏం చేస్తడయ్యా గా నిజామోని షేర్వానీ వాసన పట్టలేకపోయింది. గదేంటే గమ్మతు గంటవు. గంతవాసనుంటాదే! నీయవ్వ నీకేమెర్క. వాడు గద్దెకెక్కిన్నాడు తొడిగిండు. ఇడ్వలేదు. ఉత్కలేదు. సరేగాని ఇంతకు నిజామోడు ఢిల్లీ చేరెనే.
చవుదరి చెవ్వుపట్టి గుంజ్కుపోయి పటేలు ముంగల నిలబెట్టాడు. నిజామోడు పట్నేల్ను చూచిండు- రొండు మూసుకున్నడు. చలి జరం వచ్చినట్లు వణికిండు. నిలబడ్డడు.
"ఏమ్రా! ఏమో శాన నఖ్రాలు చేస్తున్నవట!" అన్నడు పటేలు. అట్లనంగనే నిజాం పటేల్ కాల్లమీద పడ్డడు. "బాంచెను, కాల్మొక్త - గులాపొన్నయిత మానం పోయింది. పాపం దక్కించు" అని బతిమలాడిండు.
"అరె భడివె! మేం కూరగాయలు తినెటోల్లం. నిన్ను చంపి ఏం చేస్తం బే. గీ చవుదరి చెప్పినట్లు ఇనుకో. నువ్వు ఢిల్లీల వద్దు. లత్తుకోడ్తది. పట్నం పొ"మ్మన్నడు. చవుదరి 'తిరంగ' అందించిండు. చార్మినార్ మీద ఎగిరెయ్యమన్నడు పంపించిండు.
ఇంతకు నిజామోన్ని ఏం చేసెనో చెప్పకపోతివి. గది ఎర్క లేకనే చవుదరి మల్ల పటేల్ తానికి వచ్చిండు. సలాం పెట్టిండు. అడిగిండు.
"భాడ్ ఖావు, గాన్ని గద్దెమీద కూకుండపెట్టు. మెసుల్తే నాతోని చెప్పు" అన్నడు.
పటేలు సన్నాసాయన ఇరగబడినవ్విన్రనుకో!
అన్న! కత బలె బాగ చెప్పినవ్. కల్నీలు తాగుదం పా. అట్లనే నైజామోడు దిగిపాయె. మల్ల మనం కల్లన్న తాగొద్దా?...
17 వ తేదీవరకు ఉత్తర వ్యూహపు సైన్యం హింగోలి అసిఫాబాదు చేరుకుంది. సైన్యం ఇంకా నగరానికి చాల దూరంలో ఉంది.
నిజాం దాసోహం అన్నాడు.
అంతకుముందే సేనలు లొంగాయి.
లొంగిపోవలసిందని నిజాం ఫర్మాను జారీ చేశాడు.
అది అతని చరమ ఫర్మాను.
దక్షిణ సదన్ తో సంచలనం ఎక్కువయింది. నిజాం లొంగుబాటుకు సంబంధించిన పత్రం సిద్ధం అయింది. అది J.N. చౌదరి తీసి కెళ్లాల్సింది. కాని, మున్షీ రాజకీయజ్ఞుడు.





