Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda


     

                యస్య నిఃశ్వసితం వేదా యోవేదేభ్యో2ఖిలం జగత్ |
                  నిర్మమే తమహం వన్దే విద్యాతీర్ధ మహేశ్వరమ్ ||

   
          
          శ్రీమదాంధ్ర వచన అథర్వ వేద సంహిత
                                 పదవ కాండము
                             మొదటి అనువాకము   
                              మొదటి సూక్తము

   
    యాం కల్పయన్తి వహతౌ వధూమివ విశ్వరూపాం హస్తకృతాం చికిత్సవః |
                      సారాదేత్వపనుదామ ఏనామ్ ||
   

    చికిత్సకులు - విశ్వ రూపపు తమ చేతితో చేసిన కృత్యను వధువుగా భావించుచున్నారు. అది మా నుండి తొలగునట్లు దానిని గెంటి వేయుచున్నాము.
   
వినియోగము : కృత్యా ప్రతిహరణ గణమున దీని పాఠము ఉన్నందున కృత్యను దూరము చేయుశాంతి జలమున దీని వినియోగము.
   
2.    కృత్య మనిషి చేసినది. అది తల, ముక్కు, చెవులు గలది. అనేక బాధలు కలిగించునది. అది మా నుండి తొలగునట్లు గెంటి వేయుచున్నాము.
   
3.    శూద్రకృత, రాజకృత, స్త్రీకృత, మంత్ర కృత కృత్య భర్త పంపిన బంధువుల వరకు వెళ్ళిన నారి వలె కర్త మీదకు వెళ్ళును గాత.
   
4.    పొలములు, గోవులు, జనుల మీద చేసిన కృత్యలన్నింటిని ఈ ఔషధముచే పంపించుచున్నాను.
   
5.    హింస హింసించు వానిని, శాపము శపించువారిని చేరునుగాక. కృత్య ప్రయోగించువానినే వధించునట్లు కృత్యను ఎదురు పంపుచున్నాము.
   
6.    మా అధ్యక్ష పురోహితుడు అంగిరవంశీయుడు, పశ్చిమపువాడు. పురోహితా! నీవు ఎదురుగా వచ్చు కృత్యను ఖండించుము. పంపిన వానిని హతమార్చునట్లు చేయుము.
   
7.    కృత్యా! నిన్ను నా మీదకు ప్రయోగించిన వాని మీదకే పొమ్ము. మేము నిరపరాధులము. మమ్ము బాధించకుము.
   
8.    వడ్రంగి రథపు సంధులను బిగించినట్లు నీ కీళ్ళను సంధించిన వాని మీదకే పొమ్ము. అదే నీ స్థానము మేము అపరిచితులము. ఇటు రాకుము.
   
9.    కృత్యా! నిన్ను దుష్కార్యమునకు పంపిన అభిచారకుడు విద్వలుడు. నిన్ను శుద్ది చేయగలవాడు పునఃసరుడు అతనితో నీకు స్నానము చేయించుచున్నాము.   
   
10.    మమ్ము మృతవత్సరూప దౌర్భాగ్యము చుట్టుకున్నది. మాకు స్నానము చేయించగల కృత్య లభించినది. అందువలన నా సకల పాపములు దూరమై, ధనము నా వద్ద  స్థిరమగునుగాక.
   
11.    పితరుల నిమిత్తము ఇచ్చునపుడు, యజ్ఞము చేయునపుడు పెట్టుకున్న పేరు వలన గలిగిన సందేశ్యాది పాపములు ఈ ఓషధి వలన తొలగును గాక.
   
12.    దేవతలకు చేసిన అపరాధము పితరుల విషయమున, సందేశ్య, అభినిష్కృత పాపముల నుండి ఈ ఓషధులు, ఋషులు తపోబలము, మంత్రబలము ఋక్కులు నిన్ను విముక్తుని చేయునుగాక.
   
13.    గాలి నేల మీది దుమ్మును లేపినట్లు, అంతరిక్షమున మేఘమును చెదరగొట్టినట్లు, ఈ మంత్ర ప్రభావమున నా దౌర్భాగ్యము ఎగిరిపోవునుగాత.
   
14.    కృత్యా! కట్లు లేని గాడిద దెబ్బలు తిని పారిపోయినట్లు నీవు మంత్ర బలమున దెబ్బలు తిని ప్రయోగించిన వాని మీద పడుము.
   
15.    కృత్యా! ఇది నీ మార్గమని నీకు చూపుచున్నాను. నిన్ను ప్రయోగించిన శత్రువు మీదకే నిన్ను పంపుచున్నాను. నీవు రథ, గజ, తురగ, పదాతిసైన్యము వలె మా శత్రువును ముట్టడించుము.
   
16.    నీ జ్యోతి శత్రువులను చేరునుగాక. నీ దౌర్భాగ్యము తప్పుదారి పట్టునుగాక. మా వద్ద కాక ఇతరత్ర నీ నివాసము ఏర్పరచుకొనుము. దాటరాని నభ్య నదిని దాటిపొమ్ము. మమ్ము బాధించకుము. దూరమునకు తొలిగి పొమ్ము.
   
17.    పెనుగాలి చెట్లను వలె నీవు శత్రువులను కూల్చుము. వారి గో, అశ్వ, ప్రజను నిశ్శేషము చేయుము. కృత్యను పంపిన వారు నిస్సంతులైనారని చెప్పుము.
   
18.    అభిచారకులు నిన్ను అగ్ని యందు, శ్మశానమున, పొలములందు, గార్హపత్యాగ్ని యందు నిక్షేపించుచున్నారు. వారు 'మేము నిరపరాధులము, మాకీ గతి పట్టినది అనునట్లు చేయుము.
   
19.    ఉపహృత, అనుబద్ద, ఖనిత, కుటిల గమన వైరులను అభిచార కర్త మీదకు పంపుచున్నాము. బయలు దేరిన చోటునకే చేరిన అశ్వము వలె కృత్య తిరుగబడి ప్రయోగము చేసినవాని ప్రజను నష్టపరచునుగాక.
   
20.    కృత్యా! మా ఇంట కరవాలములున్నవి. మాకు నీ ఎముకల జాడ తెలియును. తిరిగిపొమ్ము. శత్రువు మీద పడుము. నీవు మా విషయమున అజ్ఞాతవు నీకు ఇచట పని ఏమి?
   
21.    కృత్యా! నేను నీ మెడ నరుకుదును - కాళ్ళు విరిచెదను. పారిపొమ్ము. ఇంద్రాగ్నులు మమ్ము రక్షింతురుగాక.
   
22.    సోముడు రాజు, అధిపతి ప్రాణుల రక్షకుడు మాకు స్వామి అతడు మమ్ము రక్షించునుగాక.
   
23.    కృత్యాకృతులు పాపులు - దుష్కర్ములు. వారి మీద భవ, శర్వులు పిడుగులు కురిపింతురుగాక.
   
24.    కృత్యా! నిన్ను ప్రయోగించువారు నిన్ను రెండు కాళ్ళ, నాలుగు కాళ్ళ దానినిగా చేసి పంపిన ఎనిమిది కాళ్ళ దానవై వారి మీదకే ఉరుకుము.
   
25.    ఘ్రుతయుక్త, అలంకృత, దుష్క్రుత్య కృత్యే! దూరము జరుగుము. బిడ్డ తండ్రిని ఎరిగినట్లు నిన్ను పుట్టించిన వానిని కనిపెట్టుము.
   
26.    కృత్యా! తొలగుము. నిలువకుము. వేటకాడు వలలోని మృగము వద్దకు పోయినట్లు నీవు శత్రువు మీదకు పొమ్ము. వాడు మృగము. నీవు వేటకత్తెవు. వాడు నిన్నేమి చేయకలడు?
   
27.    మొదటి వానిని రెండవ వాడు బాణము వేసి చంపును. రెండవ వానిని మూడవ వాడు హతమార్చుచున్నాడు.
   
28.    నా మాట వినుము. వచ్చిన చోటునకు చేరుము. ప్రయోగించిన వానివైపు సాగుము.
   
29.    కృత్యా! అనాగోహత్యావైభీమా - నిరపరాధుల హత్యా భయంకరము. నీవు గోవులను, అశ్వములను, ప్రజలను వధించకుము. నిన్ను ఏ ఏ స్థలములందు స్థాపించినారో అచటి నుంచి లేపుచున్నాము. నీవు ఆకు కన్న తేలికవగుము.
   
30.    కృత్యలారా! మీరు అంధకారావృతులూ, జాలావృతులైనను మిమ్ము ఇట నుండి మాయము చేయుచున్నాము. పంపినవారల మీదకు మరలిపొండి.
   
31.    కృత్యా! కృత్యాకృతుని - వలగిని, అభినిష్క్రుతుని సంతానమును నాశము చేయుము. కృత్యాకృతుని హతమార్చుము.
   
32.    సూర్యుడు రాహు విముక్తుడైనట్లు, ఉషః కిరణములు రాత్రిని విముక్తము చేసినట్లు, ఏనుగు దుమ్మును లేపినట్లు నేను కృత్యాకృతుని దుష్క్రుత్యములను తుడిచివేయుచున్నాను.
   
                                      రెండవ సూక్తము
   
వినియోగము :
పురుష మేధమున స్నానాలంకారములు చేసిన ఉత్సృజ్య మాన పురుష పశువును ఈ అర్ధ సూక్తముచే అనుమంత్రణము చేయబడును. శని దేవతకు హవి ఆజ్య హోమము, సమిదా ధానము, ఉపస్థానమున దీని వినియోగము.
   
1.    మానవుని పార్ష్ణియులను, మాంసమును, కీళ్ళను, ఎవరు ఏర్పరచినారు? సుందర అంగుళులకు ఎవరు పుష్టి కలిగించినారు? శ్లంఖములను, మధ్య స్థానమును ఎవరు నిర్మించినారు?   

2.    పురుషుని గుల్ఫములను, అధరములను, అష్టీవంతములను ఎవడు కల్పించినాడు? జంఘలను ఎవరి నుంచి ఏర్పరచినారు? జానుసంధి ఎచట కలదు? దానిని ఎవడు ఎరుంగును?
   
3.    సంహితాంతము, జానువుల ఉపరి భాగము, శిథిరము, కబంధము ఈ నాలుగు కలిసి ఉండును. వాని వలన 'కుసంధి' బలపడును. శ్రోణి ఊరువులను ఎవరు ఎరుంగుదురు?
   
4.    గ్రీవము, ఉరః స్థలమును తెలిసిన దేవతలు ఎందరు? వారు ఎన్ని ప్రకారముల వారు? స్తనములను, కఫోడములను ఎందరు దేవతలు చేసినారు? స్కంధములను ఎందరు చేసినారు? పుష్టియులను ఎందరు సరిచేసినారు?
   
5.    ఎవరు అతని భుజములకు పుష్టి కలిగించినారు? ఎవరు వీర్యమును ఏర్పరచినారు? అంసములను ఎవడు చేసినాడు? కుసంధిని ఎవడు పైన అమర్చినాడు?
   
6.    ముఖము తొలిచి ఎవడు 2 కన్నులు + రెండు చెవులు + రెండు నాసికారంధ్రములు + ఒక నోరు ఏడు రంద్రములను ఏర్పరచినాడు? ఏ దేవతల విజయ మహిమ వలన ద్విపాద, చతుష్పాద ప్రాణులు యమ సదనమునకు చేరుచున్నవి?
   
7.    బహుకదలిక గల నాలుకను దవడల మధ్య ఎవడు పెట్టినాడు? దానియందు మహావాణిని ఎవడు ప్రతిష్టించినాడు? ప్రాణులందు భ్రమించు జల దేవతను ఎవరు ఎరుంగుదురు?
   
8.    తొలుత మానవుని మస్తిష్కము, లలాటము, కకాటిక, హనువులను ఏర్పరచి స్వర్గమును ఆరోహించిన దేవత ఎవరు?
   
9.    మానవుడు బహుళ ప్రియా ప్రియములను, స్వప్నములను, సంబంధములను, తంద్రతను, ఆనందమును, హర్షమును, ఉగ్రమును ఎవరి వలన పొందినాడు?
   
10.    మానవునకు ఆర్తి, అవర్తి, నిర్రుతి, మతి, రాద్ది, సమృద్ది, అవిరుద్ది, అమతి, ఉదితి ఎచటి నుండి చేరుచున్నవి?
   
11.    జలము సాగర గమన అందరు కోరునది. సర్వత్ర ఉన్నది. ఆ జలమును తీవ్ర అరుణ, లోహిత, తామ్ర ధూమ్ర వర్ణములు గలిగి మానవులందు పైకి, క్రిందకు, వంకరగ సాగునట్లు చేసినవాడెవ్వడు?
   
12.    మానవుని యందు రూపమును, మహిమను, నామమును, జ్ఞానమును, చరిత్రలను, గతులను ఏర్పరచినవారెవ్వరు?




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.