Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam
నిజాం ప్రవేశపెట్టిన పాలనా సంస్కరణలను - మజ్లిస్ తప్ప - కాంగ్రెస్ సహితంగా అన్ని పార్టీలు త్రోసిపుచ్చాయి. వాటికి వ్యతిరేకంగా ఉద్యమాలు కూడా నడిపించాయి.
కాంగ్రెస్ వాది రామాచార్ కు ఇవేవీ పట్టలేదు. అతనికి మంత్రిపదవి ఆశ పుట్టింది. లాయకలీ మంత్రిమండలిలో చేరారు. అప్పటికి వారికి అర్థం అయింది - ఈ రాజ్యం నిలువదని. రానున్న మహా ఫలితం చేయి జారిపోతున్నట్లనిపించింది. రాజీనామా ఇచ్చారు. రాజ్యంలో అరాచక కారణం చూపి రాజీనామా చేశారు.
రామాచార్ వల్ల నిజాం ప్రభుత్వానికి మేలు కొంచెం - కీడు అపరిమితం అయింది. భారతదేశపు పత్రికలు దీనికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ప్రకటించాయి.
నిజాం ప్రతిష్ట ఎలాగూ నేలకూలింది. ఇప్పుడది పాతాళానికి క్రుంగిపోయింది.
3. "అహలె గరజ్ కో అఖల్ నహీఁ" అనేది ఉర్దూ సామెత. కార్యం గలవానికి బుద్ధి ఉండదు అనేది వాక్యానువాదం. కాని, ఒక ధోరణిలో ఉన్నవాడు మరొకటి ఆలోచించలేడు అనేది భావార్థం. నిజామూ - అతని తాబేదారు రజ్వీ రాజ్యం రక్షించుకోవాలనే పిచ్చిలో పడిపోయారు. వారికి ఆర్ధిక - రాజకీయ మున్నగు కారణాలు తోచనేలేదు. అర్థం కావడం - ఆచరించడం తరువాత.
గవర్నర్ జనరల్ మౌంట్ బాటన్ నిజాముకు శ్రేయోభిలాషి. అతడు 1948 జూన్ 25 న పదవి విరమిస్తారు. ఈలోగా ఉభయులకు ఆమోదయోగ్యం అయిన పరిష్కారం కనుగొనాలని వారి తాపత్రయం!
గవర్నర్ జనరల్ లాయకలీకి అయిదు గంటల ఇంటర్వ్యూ ఇచ్చారు. వారు భారతదేశంలో ఉండగా ఇన్ని గంటలు ఏ ఇతరులతో ఇంత సుదీర్ఘంగా మాట్లాడలేదు. హైదరాబాదు క్షేమం భారతదేశంలో కలిసి ఉండటమేనని వారు స్పష్టం చేశారు. నిజాం మొండిపట్టు వదలాలన్నారు. బాధ్యతాయుత ప్రభుత్వం ఏర్పరచాలని చెప్పారు. లాయకలీ అర్థం చేసుకున్నాడు!
1948 మే 26న మౌంట్ బాటన్ - జవహర్ లాల్ నెహ్రూ - మెనన్ - లాయకలీ సమావేశం అయినారు. ఒక ముసాయిదా సిద్ధం అయింది. లాయకలీకి ఆమోదయోగ్యం అయింది. ఆమోదముద్రకోసం హైద్రాబాదు చేరుకున్నాడు. లాయకలీ ప్రథమంగా రజ్వీని కలిశాడు. అతడు ఆమోదించలేదు.
నిజాం తొలుత తన ఆంగ్ల సలహాదారు మాంక్ టన్ను సంప్రదించాలన్నాడు. మాంక్ టన్ అంగీకరించాడు. మంత్రిమండలిని సంప్రదించాలన్నాడు. శాసనసభను సంప్రదించాలన్నాడు.
తుదకు తిరస్కరించాడు.
తనను తానే కూల్చుకున్నాడు.
పరిస్థితి ఇలా ఉండగా 'యథాతథపు ఒడంబడిక'ను నిజాం ప్రభుత్వం ఉల్లంఘిస్తున్నదనీ - ఉల్లంఘనలు నిలుపకుంటే గట్టి చర్య తీసుకోవలసి వస్తుందనీ భారత ప్రభుత్వం గట్టిగా హెచ్చరించింది.
నిజాం ప్రభుత్వం అదిరింది. కాని, మేకపోతుగాంభీర్యం ప్రదర్శించింది.
'హైద్రాబాదు రాజ్యం రక్తసిక్తం అవుతుంది. భారతదేశాన్ని చెరిపేస్తాం. చివరి రక్తపు బొట్టు చిందిస్తాం. ఎర్రకోటమీద ఆసఫ్జాహీ పతాకం రెపరెపలాడుతుంది. మా కరవాలాలు బంగాళాఖాతంలోగాని కడగం' వంటి రజ్వీబ్రాండు బెదిరింపుల శతఘ్నులు పేలాయి. కేవలం వాగాడంబరంతో ఎర్రకోటమీద జండా ఎత్తదలచాడు ఖాసింరజ్వీ. వాగాడంబరం తనను, తన రాజ్యాన్ని రక్షిస్తుందనుకున్న మూర్ఖుడు మీర్ ఉస్మాన్ అలీఖాన్ - ఆసఫ్జాహీ వంశంలో చివరి ప్రభువు. మూర్ఖులను గురించి మహాకవి ఇక్బాల్ ఒక అందమయిన కవిత చెప్పారు.
ఫూల్ కి పత్తీసె కట్ సక్తాహై హీరేకా జిగర్
మర్దెనాదాఁపర్ కలామె - నర్శె - నాజూక్ బే అసర్
ఇక్బాల్ ఉర్దూకవితకు భర్తృహరి సంస్కృత మాతృకః
ఛేత్తుం వజ్రమణిం శిరీషకుసుమ ప్రాన్తేన సన్నహ్యతి
మూర్ఖాస్యః ప్రతినేతుమిచ్ఛతి బలాత్సూ క్తైః సుధాస్యదిభిః
వజ్రమును దిరిశన పూవుయొక్క రేకుతో చేధించవచ్చు. కాని, మూర్ఖుని మంచిమాటలతో మార్చడం అసాధ్యం.
అక్కడ భారతదేశంలో ఆపరేషన్ పోలో సన్నాహాలు పూర్తి అయినాయి. 1948 ఏప్రిల్ 6 న జనరల్ అటల్ అంచనా ప్రకారం సైన్యం రోజుకు 30 మైళ్లు పురోగమించడం సాధ్యం. హైదరాబాద్ పక్షం నుంచి గట్టి ఎదిరింపు ఉన్నా, ఆ పురోగత సాధ్యమవుతుంది. ఆ లెక్కన షోలాపూర్ - హైదరాబాదు మధ్యదూరం 186 మైళ్లు చొచ్చుకు పోవడానికి 15 రోజులు పడుతుంది.
మౌంట్ బాటన్ హైదరాబాదుకు మిత్రుడు. అట్లా అనలేం. హైదరాబాదు సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించదలచారు. పోలో వ్యూహం గవర్నర్ జనరల్ కు సహితం తెలియనంత రహస్యంగా ఉంచారు. అయితే, మవుంట్ బాటన్ కు 'పోలో' విషయం చూచాయగా తెలిసింది. తన పదవీ కాలంలో హైదరాబాదు మీద సాయుధ చర్య తీసుకోబోమని నెహ్రూ గవర్నర్ జనరల్ కు మాట ఇచ్చారు.
కాబట్టి మవుంట్ బాటన్ ఉండగా సైనికి చర్య సాధ్యపడదు.
జూలై చివరి వరకు ఆపరేషన్ పోలో ఏర్పాట్లు - ప్రణాళిక సర్వం సిద్ధం అయింది. 22,000 సైన్యానికి 22 రోజులకు సరిపడ పదార్థాలు సిద్ధం అయినాయి. మేజర్ జనరల్ జయంత్ నాధ్ చౌదరి సైనిక చర్య నిర్వహించడానికి నియమితులు అయినారు.
భారత సైన్యానికి సహితం ఒక చిన్న చిక్కు వచ్చింది. గూఢచారి దళం పటిష్టంగా లేదు. నిజాం సైనిక దళాలను గురించి సరియైన అంచనా వేయలేకపోయారు. ఈ పనిని ఏజంట్ జనరల్ K.M. మున్హీ సుగమం చేశారు. వారు హైదరాబాదు సైన్యంలో ఒక అధికారిని లోబరుచుకున్నారు. అతను హైదరాబాదు సైన్యపు వివరాలను స్పష్టంగానూ కచ్చితంగానూ తెలియపరచాడు. ఇది భారతసైన్యానికి ఎంతో ఉపకరించింది. అంతేకాదు. J.N. చౌదరికి హైదరాబాదు సునాయాసంగా జయించగలం అన్న సంపూర్ణ విశ్వాసం ఏర్పడింది.
భారత సైన్యం దూకడానికి సిద్ధంగా ఉంది. అయిదువైపులనుంచి ముట్టడి చేయడానికి సిద్ధంగా ఉంది. నిరీక్షణ ఆదేశాల కోసమే!
రణభేరి:
భారత ప్రభుత్వ ఆదేశాలు అందాయి. 1948 సెప్టెంబరు 12 అర్దరాత్రి దాడి ప్రారంభం అయింది. పశ్చిమ వ్యూహపు సిక్కు సేన 13 సెప్టెంబరు తెల్లవారే వరకు 'జల్కోట'గ్రామం పట్టుకున్నారు. ఈ మొత్తం దారిలో ఎదిరించేవాడే లేకపోయాడు.
గ్రామం బయటకు ఒక ఫిరంగి కనిపించింది. అది పేలనే లేదు. అది పేల్చేవారు భయపడి పారిపోయారు.
'బోరి' నదిమీద 'నతదుర్గ్' వంతెన కీలకమైంది. దానికొరకు భీషణ సంగ్రామం జరుగుతుంది అనుకున్నారు. అంతేకాదు, దాన్ని పేల్చివేస్తే పురోగమనం మందగిస్తుంది. ఆశ్చర్యము - అదృష్టమూ ఏమంటే, ఆ వంతెనకు రక్షణ లేనేలేదు. భారతసైన్యాలు అవలీలగా దాన్ని వశపర్చుకున్నాయి.
భారత సిక్కు దళానికి పురోగమనం అనాయాసం అయిపోయింది. 13 సాయంకాలానికి 61 మైళ్లు లోపలికి చొచ్చుకు వచ్చింది. 'ఉమర్ గా'ను పట్టుకుంది. మరోవైపు నుంచి గూర్ఖాదళం. ఔరంగాబాదు - జాల్నామార్గం సుగమం చేసుకుంది.
2. తూర్పు వ్యూహం: గూర్ఖాసైనికులు 13 ఉదయం దాడి ప్రారంభించారు. ఈ ప్రాంతంలో గట్టి రక్షణ ఉంటుంది అనుకున్నారు. ఇక్కడి నిజాం సైన్యపు మోహరింపూను గురించి అంతకుముందు - మద్రాసు ప్రధాని రెడ్డియార్ బెదిరారు. కాని, తొలి మూడు గంటల్లో నామమాత్రపు ఎదిరింపు కూడా లేదు. మరింత ముందుకు సాగింది. మునగాల ఆక్రమించింది.
3. దక్షిణ వ్యూహ్యం: రాయ్ చూర్ ప్రాంతంలో ఒక తుంగభద్ర వంతెనను వశపర్చుకుంది. ఆలంపురం - కొప్పల్ రైల్వేస్టేషన్లను అందుకుని, 'జింగెరా' చేరుకున్నారు.
4. ఉత్తర వ్యూహం: ఈ ప్రాంతంలో నిజాం సైన్యం కనిపించనేలేదు. రజాకార్లు అల్లాహో అక్భర్ అని మిడుతల దండులా ఎదిరించారు. అంతవేగంగానే వెనుదిరిగారు. మధ్యాహ్నానికి జాల్నా - సాయంకాలానికి హింగోలీ చేరుకున్నారు.
5. వాయు వ్యూహం: హైదరాబాదు వాయుదళం పటిష్టమైంది అనుకున్నారు. కాని, ఏనుగు పిత్తినట్లయింది. పగటివేషగాని పగిదిగా మారింది. భారత విమానాలకు ఎక్కడా ఆటంకం కలగలేదు. నిరాటంకంగా - అనాయాసంగా - స్వేచ్చగా విహరించాయి. తొలి కొన్ని గంటల్లోనే 'గగనతలం' వశపర్చుకున్నారు.
నిజాం - రజ్వీ తమ వాయుదళాన్ని గురించి గుప్పించింది పదజాలం మాత్రం అని అర్థం అయింది. ఇంతకూ ఈ మహా వాయుదళంలో వరంగల్లులో ఒక్కటి - బిదర్ లో రెండు విమానాలున్నాయి. సిడ్నీ కాటన్ తెచ్చిన విమాన విధ్వంసకం మూట విప్పలేదు.
భారత వైమానికదళం వరంగల్లు విమానాన్ని తొలిదెబ్బకు - బిదర్ విమానాలను మలిదెబ్బకు ధ్వంసం చేశాయి హైదరాబాదు వైమానికదళం నిద్రలేవకముందే అంతా అయిపోయింది. నిద్రలేని వారు 'పరేడు'కు బయల్దేరారు. అది కూడా అవసరం లేకపోయింది.





