Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda


 

7.    దూడ ఆవు చుట్టు తిరిగి అవ్యక్త శబ్దము చేయును. ఆవు గోచర భూమి నుండి, 'అంబా' అనును. ఆవు పశు జ్ఞానముతో మానవులను లజ్జితులను చేయును. వ్యక్తమైన తన రూపమును ప్రకటించును.
   
8.    చంచలుడు, శ్వాస నిశ్వాసలు కలవాడు, కార్యము ముగియగనే నిశ్చలుడు అగును. అప్పుడు మర్త్యుని సహితముగ పుట్టిన ఆత్మ శ్రాద్ద భక్షణ చేయుచు విహరించుచుండును.
   
9.    విధమన శీల, దమన శీల, సలిల పృష్టము మీద యువకుడగు చంద్రుని, సూర్యుడు, మ్రింగుచున్నాడు. దేవతల చాతుర్యము చూడండి. నేడు చచ్చిన చంద్రుడు వారి మహిమచే రేపు ఊపిరి పీల్చుచున్నాడు.
   
10.    గర్భము కలిగించిన వాడు గర్భపు తవమును తెలియకున్నాడు. గర్భములో నున్నవాడు కూడ దర్శించజాలడు. గర్భమున మాయచే కప్పబడినవాడు మరల మరల పుట్టుచున్నాడు. దీని తత్త్వమెరిగినవాడు విముక్తుడు అగుచున్నాడు.
   
11.    ఆదిత్యుడు ప్రనస్సుడు, రక్షకుడు అతని రాకను దర్శించుచున్నాను. సర్వగమన, సహగమన కిరణ పుంజములచే అప్పుడప్పుడు ఆచ్చాదితుడగును. అయినను అతడు భువనములకు వచ్చుచు, పోవుచున్నాడు.
   
12.    స్వర్గము నన్ను పోషించుచు తండ్రియగుచున్నాడు. పృథి కక్ష నాకు మిత్రము. విశాల పృథ్వి నాకు తల్లి. ద్యావాపృథ్వుల మధ్య అంతరిక్షము ఉన్నది. దూరమున ఉన్న ద్యులోక రూపుడగు తండ్రి, దిగువనున్న పృథివి రూపమగు తల్లికి గర్భము కలిగించుచున్నాడు.
   
13.    భూమికి అంతమేది? లోకముల ఉత్పత్తి స్థానమేది? సేచన సమర్ధమగు అశ్వపు రేతస్సు ఏది? సమస్త వాక్యముల పరమస్థానమేది?
   
14.    వేదము పృథ్వికి అంతము. లోకముల ఉత్పత్తి స్థానము యజ్ఞము. సోమము సేచన సమర్ధ అశ్వపు రేతస్సు సమస్త వాక్యముల పరమ స్థానము ఋత్విక్కు.
   
15.    నేను ఉన్నవాడనో, లేనివాడనో తెలియనివాడను. మూఢుడను. చిత్తమును కప్పి ఉంచినాను. జ్ఞానపు ప్రథమ కిరణము నాలో వెలిగినపుడు వాక్యార్ధము గ్రహించగలను.
   
16.    నిత్యము, అనిత్యము కలిసి ఉండును. అవి శరీరమును చేరినపుడు ఒక్కొక్కసారి ఊర్ధ్వమునకు, ఒక్కొక్కసారి అధోముఖమునకు చేరుచున్నవి. అవి ఒకే చోట ఉండును. ఒకే చోట సంచరించును. లోకము అనిత్యమును గుర్తించును. నిత్యమును గుర్తించదు.
   
17.    సప్త కిరణములు సంవత్సరమునందు అర్ధభాగము గర్భము ధరించును. తదుపరి వర్షించి విష్ణు కార్యమును నిర్వహించుచున్నవి. అవి సర్వజ్ఞులు సర్వతో గమనలు. తమ ప్రజ్ఞచే జగత్తున అంతర్భూతలై ఉన్నవి.
   
18.    సర్వ దేవతలు మహదాకాశముతో సమానులై మంత్రాక్షరముల మీద ఉపవిష్టులై ఉన్నారు. ఇది తెలియనివాడు వేదములు చదివి ప్రయోజనమేమి? దీనిని తెలిసినవాడు సుఖించుచున్నాడు.
   
19.    ఋక్కు యొక్క పదమాత్రమున కల్పన జరిగినది. దాని అర్ధమున చరాచర జగత్తు కలిగినది. త్రిపాద బ్రహ్మ పురురూపమున నిలిచి ఉన్నాడు. అతని వలననే దిశలు నిలిచి ఉన్నవి.
   
20.    అవధ్య గోవు సస్యములు, తృణములు మేసి పాడియావు అగునుగాక. అందువలన మేము సంపన్నులము అగుదుముగాక. ఆ గోవు ఎల్లప్పుడు గడ్డి మేయుచు, సర్వత్ర సంచరించుచు, నిర్మల జలము త్రాగునుగాక.
   
21.    వాక్కు మేఘ నినదమై, అంతరిక్షమున విహరించుచున్నది. అది వర్షము కలిగించి శబ్దము సృష్టించుచున్నది. ఆ శబ్దము ఒకప్పుడు, ఏకపది, ఒకప్పుడు ద్విపది, ఒకప్పుడు చతుష్పది, ఒకప్పుడు సప్తపది, అష్టపది యగుచు సహస్రాక్షర వ్యాప్తమై అంతరిక్షమున నిలిచి శబ్దించుచున్నది.
   
22.    సూర్య కిరణములు జలములను గ్రహించి సూర్యునకు చేర్చుచున్నవి. అవే సూర్య కిరణములు జలస్థానమగు సూర్యమండలము నుంచి మరలి వర్షించి భూమిని తడుపుచున్నవి.
   
23.    పాదము లేని కిరణములు పాదములున్నవాని కన్న ముందు సాగించు ఈ మిత్రావరుణుల మహిమ నెరిగిన వాడెవ్వడు?
   
    కిరణముల గర్భ భారము భరించు భూదేవి సత్యమును రక్షించుచున్నది. అసత్యమును నష్టపరచుచున్నది.
   
24.    వాణి విరాట్ - పృథివి విరాట్ - అంతరిక్షము విరాట్ - ప్రజాపతి విరాట్. విరాట్ మృత్యువు. విరాట్టే సాధ్యులకు అధిరాజు. భూత భవిష్యత్తులు విరాట్టుని వశము నందున్నవి. అతడు భూత భవిష్యత్తులను నాకు వశపరచునుగాక.
   
25.    శకమయ దూమమును విషువత, ఏనావరణములందు దర్శించినాను. ధీరులగు వారు ఉక్షను పృశ్నిని వచనము చేసినారు. "తాని ధర్మాణి ప్రథమాన్యాసన్" ఆ ధర్మములే ప్రధానములు అయినవి.
   
26.    అగ్ని సూర్య వాయువులు లోకమును అనుగ్రహించుచున్నారు. వారిలో ఒకరు సంవత్సరమున ఒకసారి భూమిని కాల్చుచున్నారు. సూర్యుడు తన వెలుగున రక్షించుచున్నాడు. వాయువు కంటికి కనిపించకున్నాడు.
   
27.    వాక్కునకు నాలుగు పరిమిత స్థానములున్నవి. బుద్దిమంతులగు బ్రాహ్మణులే దానిని తెలియుచున్నారు. వానిలో మూడు స్థానములు కనిపించవు. నాలుగవ దానితోనే మానవుడు పలుకుచున్నాడు.
   
28.    ఒక్క అగ్నినే ఇంద్రుడు, మిత్రుడు, వరుణుడు ఆకాశమందున్న సూర్యుడు అనుచున్నారు. ఏకం సద్ విప్రా బహుధా వదన్తి - ఒకే సత్యమును విద్వాంసులు బహుధా వచించుచున్నారు. అగ్నినే యముడు, మాతరిశ్వ అనుచున్నారు.
   
   


                         దాశరథి రంగాచార్య విరచిత
                శ్రీమదాంధ్ర వచన అథర్వ వేద సంహితయందలి
                         తొమ్మిదవ కాండము సమాప్తము




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.