Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda
12. నీ ఉదరము, క్లోమ్నము, నాభి, హృదయమునుండి సర్వ రోగముల విషమును తొలగించుచున్నాను.
13. సీమలను పీడించునవి, మూర్ధమునకు పాకునట్టి "అహింసంతీ రనామయా నిర్ధ్రవన్తు బహిర్భిలమ్" బాధించని రోగరహితుని చేయునవి. బిలము నుండి బయటికి ప్రవహింపకుండునుగాక.
14. హృదయమును ఏడిపించని, బాధించని కీకసమును "అహింసంతీ....."
15. పార్శ్వములందు ఉపర్షన్తి - అనునిక్షంతి పృష్ఠీః "అహింసంతీ....."
16. వంకర కలిగి, వక్షణలందు కలియు అస్థులు "అహింసంతీ....."
17. గుదమునకు వెనుక ఉండి ఆంత్రములను మోహింపచేయు అస్థులు "అహింసంతీ......"
18. మజ్జను శుభ్ర పరచునవియు, పురూషములను బాధించని అస్థికలను "అహింసంతీ....."
19. రోగములను తొలగించి, నీకు ఆనందము కలిగించురీతి సమస్త వ్యాధుల విషమును నీ నుంచి తొలగించినానని చెప్పుచున్నాను.
20. విసల్ప, విద్రధ, వాతీకారి, అలజ మున్నగు సమస్త వ్యాధుల విషమును నీ నుంచి తొలగించినానని చెప్పుచున్నాను.
21. నేను నీ పాదములు, జానువులు, శ్రోణులు, నడుము, అనూకము, ఉష్ణిహ, శిరస్సు నుండి రోగములను నష్టపరచినాను.
22. నీ హృదయము నుండి ఉదయించు సూర్యుడు తన కిరణములచే నీ వ్యాధులను తొలగించినాడు చంద్రుడు కపాల, హృదయ అంగ భేదములను శాంతింపచేసినాడు.
అయిదవ అనువాకము
మొదటి సూక్తము - 14
వినియోగము : ఈ అనువాకపు పాఠము సలిలగణములందున్నందున అచట వీని వినియోగము.
1. ఇతడు సూర్యుడు. స్తుతులచే పోషించబడువాడు. ఆహ్వాననీయుడు. ఇతని మధ్యమ భ్రాత వాయువు. మూడవ భ్రాత ఘ్రుత పృష్ఠ. ఈ ముగ్గురిలో సప్త కిరణుడగు సూర్యునే ప్రధానముగ దర్శించుచున్నాను.
2. సప్త కిరణములు, సప్త నామముల వాని ఏక చక్ర రథమును ఒకే అశ్వము లాగుచున్నది. ఆ రథము మూడు నాభులు కలిగి జరా రహితమైనది. దాని మీద సమస్త విశ్వములు ఆధారపడిఉన్నవి.
3. సప్త చక్ర రథమున ఉన్నవే సప్తాశ్వములు అవే రథమును లాగును. ఏడుగురు అక్కచెల్లెండ్రు ఈ రథము ముందు నడుతురు. ఇందు ఏడు కిరణములు ఉన్నవి.
4. తొలుత జన్మించిన వానిని ఎవడు చూచినాడు? అస్థిరహితములు, అస్థిసహితములు ఎపుడు కలిగినవి? ఎపుడు పృథివి నుండి రక్తము, ప్రాణములు పుట్టినవి? ఆత్మలు ఎచట నుండి ఉత్పన్నమైనవి? ఈ జిజ్ఞాసకు గాను ఎవడు విద్వాంసుని వద్దకు వెళ్ళును?
5. వేగవంతుడు, సుందరుడగు ఆదిత్యుని స్వరూపము అతి నిగూఢమైనది. అతని కిరణములు పాలు పితుకును. తేజః స్వరూపములు అగును. నీటిని పీల్చును. ఈ విషయములు తెలిసినవాడు వివరించవలెను.
6. నేను అజ్ఞానిని. నాకు ఏమియు అర్ధమగుటలేదు. అందుకే అడుగుచున్నాను. ఇవి సందిగ్ధములు దేవతలకు రహస్యములు. ఒక సంవత్సరపు సూర్యుని కొరకు ఏడు సోమ యజ్ఞములు చేసినారు. అవి ఏవి?
7. నేను అజ్ఞానిని. ఏమియు తెలియనివాడను. తెలిసి కొనవలెనను ఆసక్తితో జ్ఞానులను అడుగుచున్నాను. ఆరు లోకములను నిలిపి ఉంచినవాడెవడు? జన్మరాహిత్యమున జీవించు వాడెవడు? వారు ఒక్కరేనా?
8. భూమాత తండ్రియగు ద్యులోకమునందున్న సూర్యుని స్వానుష్టానమున పూజించునది. అంతకు ముందే తండ్రి లోలోపల తల్లితో సంగమించినాడు. తల్లి గర్భము ధరించ దలచి రసమును దాల్చినది. వారిద్దరు సస్యములు ఫలింపచేయుటను గురించి మాట్లాడుకొనుచున్నారు.
9. ద్యులోకమను తండ్రి, కోరికలు తీర్చు పృథివి యొక్క భారము వహించుచున్నాడు. గర్భమున జలమును దాల్చిన మేఘము మధ్యన ఉన్నది. వర్ష జలము దబదబ కురిసినది. మేఘ, వాయు, కిరణ సంయోగము పృథ్విని సస్య శ్యామలము చేసినది.
10. ఏకమాత్ర ఆదిత్యునకు భూమి, ఆకాశము, అంతరిక్షము ముగ్గురు తల్లులు. అగ్ని, వాయువు, సూర్యుడు ముగ్గురు తండ్రులు. ఆదిత్యుడు తల్లితండ్రులతో ఊర్ధ్వమున ఉన్నాడు. అతడు అలసట ఎరుగడు. ద్యులోక పీఠము మీద దేవతలు సూర్యుని గురించి చర్చింతురు. దానిని ఎరిగినవాడులేడు. కాని వారు సర్వము చర్చింతురు.
11. నియమముగ ఆవర్తించు అయిదు ఋతువులను నట్టి ఆకుల చక్రమునందు భువనములన్నియు లీనములై ఉన్నవి. దాని ఇరుసు భువ భారము వహించును. అలసట ఎరుగదు. దాని నాభి సర్వదా సమానముగ ఉండును. చలించదు.
12. అయిదు ఋతువుల కాళ్ళు, పన్నెండు మాసముల రూపముగల ఆదిత్యుడు ద్యులోకపు పూర్వార్ధమున ఉన్నప్పుడు కొందరు అతనిని పురీష లేక జలదాత అందురు. ఆరు ఋతువుల ఆకులు, ఏడు కిరణముల చక్రము కలిగి ద్యులోకపు రెండవ సగమున ప్రకాశించు సూర్యుని మరికొందరు 'అర్పిత' అందురు.
13. సర్వాత్మకమగు ఆదిత్యుని పన్నెండు ఆకుల చక్రము స్వర్గము చుట్టు పరిభ్రమించుచుండును. అయినను అది పాత బడదు. అగ్ని ఆ చక్రమున 360 పగళ్ళు, 360 రాత్రుల రూపమున 720 అయి వసించును.
14. సమానమగు అంచులు గలిగి శిథిలము ఎరుగని కాలచక్రము నిరంతరము భ్రమించుచుండును. దీనితో అయిదుగురు లోకపాలురు, పంచజనులు పదిమంది కలిసి భూమండలమును వహింతురు. సూర్యుని నేత్ర రూపమగు మండలమున వర్ష జలము దాగినది. సమస్త జగములు, ప్రాణులు సహితము అమ్దుననే నిలిచినవి.
15. కిరణములు స్త్రీలయ్యు పురుషులు - కనులున్నవారే దీనిని చూడగలరు. చూపు మందగించినవారు కానలేరు. మేధావి యగు పుత్రుడు మాత్రమే వీనిని గ్రహించగలడు. వీనిని అన్నింటిని గ్రహించగలవాడే తండ్రులకు తండ్రియగును.
16. ఆదిత్యుని సహజాతమగు ఋతువులలో ఏడవది అధికమాసము వంటరిది. మిగిలిన ఆరు రుతువులు ఉభయములు, రెండు మాసములు గలవి. కదలిక గల ఈ ఋతువులను దేవతలు సృష్టించినారు. ఈ ఋతువులు అందరకు ఆనందకరములు. స్థాన భేదమున వేరు వేరుగా నిలుచును. రూప భేదమున విభిన్న ఆకృతులు కలిగి ఉండును. అవి తమ ప్రభువు కొరకు వంతులు వంతులుగా తిరుగుచుండును.
17. వత్స రూపమగు అగ్ని పృష్ఠ భాగము ముందరి కాళ్ళతోను, ముఖ భాగము వెనుక కాళ్ళతోను ధరించిన గోరూపమగు రశ్మి ఊర్ధ్వమునకు పోవును. అది ఎచటికి పోవును? ఎవరి కొరకు నడిమి నుండి తిరిగి వచ్చును? దళ మధ్యమున ప్రసవించదు? అది ఎచట ప్రసవించును?
18. భూలోకమున ఉన్న అగ్నిని ఊర్ధ్వ లోకమున ఉన్న అగ్నిని, ఊర్ధ్వ లోకమున ఉన్న సూర్యుని భూలోకమున ఉన్న అగ్ని యుక్తముగ ఎవరు పూజింతురో వారే మేధావి వంటి ఆచరణ గలవారలని చెప్పినవాడెవడు? అలౌకికమగు మనసు ఎచట పుట్టినది?
19. కొందరిని విద్వాందులు అధోముఖులు అందురు. వారినే ఊర్ధ్వ ముఖులని కూడ అందురు. ఊర్ద్వ ముఖులు అన్న వారిని అధోముఖులని కూడ అందురు. సోమ, ఇంద్రులు మండల ద్వయమును ఏర్పరచినారు. యుగళ అశ్వాదుల వలె ఆ మండలములు విశ్వ భారము వహించుచున్నవి.
20. జీవాత్మ, పరమాత్మయను పక్షులు రెండు ఒకే దేహమున లేక వృక్షమున నివసించును. జీవాత్మ రుచికరములగు రావి ఫలములను తినును. పరమాత్మ దేనిని అనుభవించడు. అతడు ద్రష్ట మాత్రమే.
21. వృక్షమున రుచికరములగు రావి పండ్లున్న చోట మధు మక్షికములు వసించును. అవి సృష్టిని విస్తరింపచేయుచున్నవి. ఈ కారణము తెలియని వాని జీవితము నశించదు.
22. సూర్య మండలము నుండి రమ్య కిరణములు కర్తవ్య జ్ఞాన యుక్తమగు అమృతాంశమున బయల్వెడలును. ఐ సాహసోపేతముగ సకల భువనములను రక్షించును. నాది అపరిపక్వబుద్ది అయినను ఆ కిరనములే నన్ను నిలిపినవి.
రెండవ సూక్తము - 15
వినియోగము : పూర్వ సూక్తము వలె.
1. భూమి మీది అగ్ని స్థానము తెలిసినవారు, దేవతలు అంతరిక్షమున వాయువును సృష్టించినారని తెలిసినవారు, ఊర్ధ్వతమ ప్రదేశమున సూర్యుని స్థానము తెలిసినవారు అమృతత్వమును పొందుదురు. "అమృతత్వమానశుః"
2. అతడు గాయత్రి ఛందమున పూజా మంత్రము సృష్టించినాడు. అర్చన మంత్రమున సామమును కల్పించినాడు. త్రిష్టుప్ ద్వారా ద్రుచ, త్రుచ రూప వాక్కును చేసినాడు. ద్విపాద, చతుష్పాత్తులతో అనువాక రచన చేసినాడు. అట్లే అక్షర ప్రణాళిక ప్రకారము ఏడు ఛందస్సులను కల్పించినాడు.
3. జగతీ ఛందమున ద్యులోకమున వృష్టిని స్తంభింపచేసినాడు. రథంతర సామమున సూర్యుని దర్శించినాడు. పండితులు గాయత్రికి మూడు పదములందురు. అందువలన గాయత్రి మహత్తులోను, తేజస్సులోను అన్నింటిని అధిగమించును.
4. నేను పాడి యావును పిలుతును. పితుకువాడు పితుకును. ఈ సామము నందలి శ్రేష్ఠ భాగమును సవిత గ్రహించవలెను. అందువలన అతని తేజస్సు వర్ధిల్లును. సవితను ఆహ్వానించుచున్నాను.
5. ధనము గల ధేనువు దూడ కొరకు మనసులో మసలుచు అంబా అని వచ్చును. అది అశ్వినులకు పాలు ఇవ్వవలెను. సౌభాగ్య లాభమున వర్ధిల్ల వలెను.
6. ఆవు కళ్ళు మూసుకొని దూడ కొరకు 'అంబా' అనును. దూడ మూతి నాకి 'అంబా' అనును. దూడ మూతి నురుగు చూచి 'అంబా' అనును. దూడకు కడుపు నిండ పాలు త్రాగించి తృప్తి చెందును.





