Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda


 

19.    అగ్నిదేవా! నీవు ధనమును బ్రాహ్మణులందు, ప్రజలందు పంచౌదనమునందు స్థాపించినావు. అవి పుణ్యాత్ముల లోకమునందు నన్ను గురించి తెలియపరచునుగాక.
   
20.    తొలుత అగ్ని విక్రమించినది. అతని ఉరము ద్యులోక పృష్ఠము, అంతరిక్షము మధ్య భాగము, ప్రక్కటెముకలు దిశలు, సముద్రములు కుక్షి అయినవి.
   
21.    సత్యము, ఋతము నేత్రములు, విశ్వ సత్యము ప్రాణము, విరాట్టు శిరము అయినవి. కావుననే పంచౌదన అజము అపరిమిత యజ్ఞము అయినది.
   
22.    ఎవడు పంచౌదనమును జ్యోతిషాం దక్షిణ సహితముగా ఇచ్చుచున్నాడో అతడు అపరిమిత యజ్ఞ ఫలమును పొందుచున్నాడు. అపరిమిత లోకములను తన కొరకు ఆవిష్కరించుచున్నాడు.
   
23.    ఈ అజపు ఎముకలు విరుచరాదు. మెదడు కడుగరాదు. సర్వమును తీసికొని 'ఇదమ్, ఇదమ్" అని ప్రవేశించవలెను.
   
24.    ఇదమిదమేవాస్య రూపం భవతి, దీనితోనే అతడు ఫలప్రదుడు అగుచున్నాడు. పంచౌదన దక్షిణా జ్యోతిషమును ఇచ్చువానికి ఈ యజ్ఞము అన్నము, మహిమ, బలమును ప్రసాదించుచున్నది.
   
25.    పంచౌదన దక్షిణా జ్యోతిషమును ఇచ్చువానికి ఐదు సువర్ణములు, ఐదు నూతన వస్త్రములు, ఐదు ధేనువులు కోరికలు తీర్చుచుండును.
   
26.    పంచౌధన దక్షిణా జ్యోతిషమును ఇచ్చువాడు స్వర్గమును అనుభవించుచున్నాడు. పంచరుక్మజ్యోతి అతనిది అగుచున్నది. అతని శరీర ఆచ్చాదనమునకు వస్త్రము లభించుచున్నది.
   
27.    ఒక భర్త వుండగా మరొక భర్తను స్వీకరించినపుడు పంచౌధన అజదానమున ఆ ఇద్దరు భర్తలు విడిపోకుందురు.
   
28.    పంచౌదన దక్షిణా జ్యోతిషమును దానము చేసినచో 'పునర్భువాపరః పతిః" పతితో పాటు సమాన లోకమును పొందుచున్నాడు.

29.    అనుపూర్వ వత్సా ధేనువును, వృషభమును, సువర్ణ, వస్త్ర సహితముగ దానము చేయువాడు ఉత్తమ స్వర్గమునకు చేరుచున్నాడు.
   
30.    నేను నన్ను - పితను, పుత్రుని, పౌత్రుని, పితామహుని, భార్యను, తల్లిని - నాకు ప్రియులగు వారిని నావద్దకు ఆహ్వానించుచున్నాను.
   
31.    పంచౌదన అజమే గ్రీష్మ ఋతువు. గ్రీష్మ ర్తువును ఎరిగి పంచౌదన దక్షిణా జ్యోతిషమును దానము చేయువాడు "తన కృత్యలచే తన శత్రువు లక్ష్మిని భస్మము చేయుచున్నాడు" "నిరే వా ప్రియస్య భ్రాత్రువ్యస్య శ్రియం దహతి భవత్మాత్మనా"
   
32.    కుర్వన్త నామక ఋతువును ఎరిగినవాడు తనకు అప్రియుడైన శత్రువు యొక్క సిరిని గ్రహించుచున్నాడు.
   
    పంచౌదన అజమే కుర్వన్తము అగుచున్నది. దీనిని ఎరిగి పంచౌధన దక్షిణాజ్యోతిషమును దానము చేయువాడు "నిరేవా ప్రియస్య భ్రాత్రువ్యస్య శ్రియం దహతి భవత్యాత్మనా"
   
33.    సంయంత నామ ఋతువు నెరిగినవాడు తనకు అప్రియమైన శత్రువు యొక్క సిరిని హరించుచున్నాడు.
   
    సంయంత నామక ఋతుచే అజమగుచున్నది. దీనిని తెలిసి పంచౌదన దక్షిణా జ్యోతిషమును దానము చేయువాడు "నిరేవా ప్రియస్య భ్రాత్రువ్యస్య శ్రియం దహతి భవత్యాత్మనా"
   
34.    పిన్వన్త నామ ఋతువు నెరిగినవాడు తనకు అప్రియమైన శత్రువు సిరిని హరించుచున్నాడు.
    పిన్వన్త నామ ఋతువే అజమగుచున్నది. (మిగిలినది పూర్వము వలెనె.)
   
35.    ఉద్వన్త నామ ఋతువు నెరిగినవాడు - (తదుపరి పూర్వము వలె.)
    ఉద్వన్త నామ ఋతువే అజమగుచున్నది. (మిగిలినది పూర్వము వలెనే.)
   
36.    అభిభూ నామక ఋతువు నెరిగినవాడు- (తదుపరి పూర్వము వలె.)
    అభిభూ నామక ఋతువే అజమగుచున్నది (మిగిలినది పూర్వము వలె.)
   
37.    అజమును పంచౌదమును పచనము చేయండి. అంతర్దిశల సహితముగ దిశలు ఏక మనస్కలై ఒకే విధముగా సత్కరింతురుగాక.
   
38.    ఆ దిశలన్నియు నిన్ను రక్షించునుగాక. వాని కొరకు నేను ఈ హవిని హోమము చేయుచున్నాను.
   
                                         రెండవ సూక్తము - 6
   
    స్వర్గము కోరువాడు సంప్రదాయానుసారము ఈ సూక్తమును జపించునదని వినియోగమాలలో చెప్పబడినది.
   
1.    అతిథి ప్రత్యక్ష బ్రహ్మ యగుచున్నాడు. అతని పురూషములు సంభారములు, అనూక్యములు ఋక్కులు అగుచున్నవి.
   
2.    అతని లోమములు సామము, హృదయము యజుః - పరిస్తరణం హవి అగుచున్నది.
   
3.    అతిధిపతి అతిథిని చూచినపుడు దేవా యజనమును చూచినావాడు అగుచున్నాడు.
   
4.    అతిథితో సంభాషించుంటే దీక్ష, ఉదక ప్రార్ధన ప్రణయనమగుచున్నది.
   
5.    ఆ జలము యజ్ఞమున ప్రణయనము చేయబడినది అగుచున్నది.
   
6.    తర్పణము అర్పించుట అగ్నిషోమీయ పశుబంధనము అగుచున్నది.
   
7.    ఆవస్థానమును కల్పించుటయే సదా హవిర్దాన కల్పన అగుచున్నది.
   
8.    ఉపస్త్రుణమే బర్హి అగుచున్నది.
   
9.    ఉపశయనమును ఆహరించినవాడు తనకొరకు స్వర్గ ద్వారములు తెరచినవాడు అగుచున్నాడు.
   
10.    కశిపు ఉపబర్హణమును ఆహరించుట పరిథి యగుచున్నది.
   
11.    అంజన, అభ్యంజనములు తెచ్చుట ఆజ్యమగుచున్నది.
   
12.    వడ్డించుటకు పదార్ధములను తెచ్చుట పురోడాశమును తెచ్చుట అగుచున్నది.
   
13.    భోజనమునకు ఆహ్వానించుట హవి అందుకొనుటకు ఆహ్వానించుట యగుచున్నది.
   
14.    అచట ధాన్యము, యవలు సోమము అగుచున్నవి.
   
15.    అచట రోలు, రోకళ్ళు సోమాభిషవ శిలలు అగుచున్నవి.
   
16.    శూర్పము పవిత్రము, తుష ఋజీషము. అభిషవణి జలము అగుచున్నవి.
   
17.    దర్వి స్రవము, పవిత్రము చేయుట ఆయవనము, కలశములు ద్రోణ కలశములు, కృష్ణ మృగ చర్మము వాయవ్య పాత్ర అగుచున్నవి.
   
                                          మూడవ సూక్తము -7
   
1.    అతిథిపతి ఇది విలక్షణము, ఇది సాధారణము అని పరిశీలించుట యాజమాన బ్రాహ్మణమును చేయుటయగుచున్నది.
   
2.    మరొకటి, ఇంకొంచెము అనుట ప్రాణములను పొడిగించుకొనుట అగుచున్నది.
   
3.    ఉపహరణము హవిస్సులను అందించుట అగుచున్నది.
   
4.    వడ్డించిన పదార్ధములను అతిథి తనలోనే హోమము చేయుచున్నాడు.
   
5.    అతడు హస్తమను స్రవముచే ప్రాణ రూపయూపముచే వషట్కార రూప "సృక్కారేణ" (ఆత్మ యందు హవనము చేయుచున్నాడు.)
   
6.    ప్రియులైనను, అప్రియులైనను అతిథి రూప ఋత్విజులను స్వర్గములను చేర్చవలసి ఉండును.
   
7.    తను ద్వేషించు వారి, తనను ద్వేషించువారి, తనను పరిశీలించుకొని, ఇతరులను పరిశీలించని వాని అన్నము తినరాదు.
   
8.    అన్నము తినువాడు పెట్టినవాని సకల పాపములను భక్షించుచున్నాడు.
   
9.    ఎవని అన్నము తినకున్నాడో అతని ఏ పాపమును కూడ భక్షించకున్నాడు.
   
10.    సర్వదా అతిథులను ఆదరించువాడు యుక్తగ్రావ, ఆర్ద్ర పవిత్ర, వితతాధ్వరుడు అగుచున్నాడు.
   
11.    అతిథికి అన్నము పెట్టుట ప్రాజాపత్య యజ్ఞమగుచున్నది.
   
12.    అతిథి సత్కారము చేయువాడు ప్రజాపతి అడుగు మీద అడుగు వేసినవాడు అగుచున్నాడు.
   
13.    అతిథిని ఆహ్వానించుట ఆహవనీయాగ్ని, గృహమునందున్నది గార్హపత్యాగ్ని, వంట చేయునది దక్షిణాగ్ని యగుచున్నది.
   
                                     నాలుగవ సూక్తము - 8
   
1.    అతిథి కన్న ముందు తినువాడు యజ్ఞఫలమును, కర్మ ఫలమును నష్టపరచుకొనుచున్నాడు.
   
2.    అతిథి కన్న ముందు తినువాడు తన ఇంటి పాడిని నష్టపరచుకొనుచున్నాడు.
   
3.    అతిథి కన్న ముందు తినువాడు తన ఇంటి బలమును వృద్దిని నష్ట పరచుకొనుచున్నాడు.
   
4.    అతిథి కన్న ముందు తినువాడు తన సంతానమును, పశువులను నష్టపరచుకొనుచున్నాడు.
   
5.    అతిథి కన్న ముందు తినువాడు కీర్తి, ప్రతిష్టలను నష్ట పరచుకున్నవాడు అగుచున్నాడు.
   
6.    అతిథి కన్న ముందు తిన్నవాడు ఇంటి లక్ష్మిని, సమైక్యతను నష్టపరచు కొనుచున్నాడు.
   
7.    శ్రోత్రియుడు, వాస్తవికుడగు అతిథి కన్న ముందు భోజనము చేయరాదు.
   
8.    అతిథి భోజనము చేసిన తరువాత గృహస్థుడు చేయుటయే యజ్ఞపు సార్ధకత మరియు అవిచ్చిన్నత అగుచున్నది.
   
9.    స్వాదిష్ఠ వస్తువులు ఆవుపాలు, మాంసము వంటి వాటిని తినరాదు. (తొలుత కావచ్చును.)
   
                                    ఐదవ సూక్తము - 9
   
1.    ఆ విషయము గ్రహించినవాడు పాలను శుద్ది చేసి భక్ష్య పదార్ధములను అతిథికి అందించుచున్నాడు.
   
2.    సుసమృద్ద అగ్నిష్టోమము చేయుట వలన స్వర్గమునందు తన కొరకు ఎన్ని ద్వారములను తెరచుచున్నాడో అతిథి సత్కారము వలన కూడా అన్ని స్వర్గ ద్వారములను తెరచుచున్నాడు.
   
3.    ఈ విషయము గ్రహించి ఘ్రుతమును శుద్ది చేసి భక్ష్య పదార్ధములను అతిథికి అర్పించువాడు. (మిగులు పూర్వము వలె.)




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.