Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda


 

1.       ఈ ఋషభము వేల గోవులకు గర్భము ధరింపచేయగలది. అందువలననే "పయస్వాన్" పాలు కలుగచేయువాడు అగుచున్నాడు. అతడు దూడల రూపమున అనేక రూపముల వాడు అగుచున్నాడు. కావుననే అతడు బృహస్పతి మంత్ర సంపన్నుడు అగుచున్నాడు. గోవులకు యోగ్యుడగు ఋషభుడు యజమానికి క్షేమము, సంతానము కలిగించునుగాక.
   
2.    నీటిముందు ప్రతిమ వలె నిలుచువాడు, పృథివి వలె అందరకు ప్రభువైన వాడు, దూడలకు తండ్రి, గోవులకు భర్త మాకు వేల విధముల పుష్టి కలిగించునుగాక.
   
3.    ఋషభము పుమాన్ - అన్తర్వాన్ - స్థవిర్ - పయస్వాన్ అగుచున్నాడు. అతడు వసువు యొక్క కబంధమును ధరించుచున్నాడు. జాతవేద అగ్ని అతనిని దేవయాన మార్గములనుండి ఇంద్రుని వద్దకు చేర్చునుగాక.
   
4.    ఋషభుడు వత్సములకు తండ్రి వధించగూడని గోవులకు పతి. గరగర శబ్దము చేయు మేఘముల పాలకుడు అగుచున్నాడు. ఇతని వీర్యము వలననే జరాయు, ప్రతిధుక్, పీయూష, అమిక్ష ఘ్రుతము కలుగుచున్నవి.
   
    (జరాయు మున్నగునవి పాల వలన సిద్దమగునవి.)
   
5.    ఇతడు ఉపనాహ దేవత భాగము - ఓషధి ఘ్రుత రసాదులు జలభాగము - ఇది సోముని భోజనము అగుచున్నది. పర్వతాకార శరీరమును ఇంద్రుడు వరించుచున్నాడు.
   
6.    స్వధితా! నీవు సోమపూర్ణ కలశధారివి, త్వష్టపు పశువుల రూపములు చేయువాడవు అగుచున్నావు. నీ సంతానమునకు శుభములు కలుగునుగాక. అట్టి నీ సంతానమును మాకు ప్రసాదించుము.
   
7.    ఇతడు ఆజ్యమును ధరించుచున్నాడు. ఇతని బలము అక్షయము. అది వేల శక్తులు కలది. దానినే యజ్ఞము అనుచున్నారు. ఋషభము ఇంద్ర రూపమగుచున్నది. దేవతలచే ఇవ్వబడిన ఋషభము మాకు శుభములు కలిగించునుగాక.
   
8.    ధీరులు, కవులు, మనీషులు ఇట్లనుచున్నారు. ఋషభుని బలము ఇంద్రుడు - బాహువులు వరుణుడు - తొడలు అశ్వినులు - కకుదము మరుద్గణములు - సంభ్రుతము బృహస్పతి యని.
   
9.    ఋషభమా! నీవు దేవతలకు పయస్వంతుడవు అగుచున్నావు. అందువలననే నిన్ను ఇంద్రుడు -సరస్వంతుడు అనుచున్నారు. సమంత్రకముగ ఋషభమును హవనము చేయువాడు ఏకముఖముగా వేయి ఆవులను దానము చేసినవాడు అగుచున్నాడు.
   
10.    ఋషభమా! నీ వయస్సు సవిత కాగా త్వష్ట, వాయువులు నిన్ను చుట్టు ముట్టి ఉన్నారు. నేను మానసా అంతరిక్షమున నిన్ను ఆహుతి ఇచ్చుచున్నాను. ద్యావాపృథ్వులు నీకు బర్హి అగుదురుగాక.
   
11.    ఇంద్రుడు దేవతల పక్షమున వచ్చినట్లు గోవుల పక్షమున ఋషభము వచ్చుచున్నాడు. ఇతని అవయవములను బ్రహ్మ తన శుభవాక్కున స్తుతించునుగాక.
   
12.    పార్శ్వము అనుమతివి, అనూ వృజములు భగునివి కాగా, అష్టీవములు నావి మాత్రమే అగునని మిత్రుడు అన్నాడు.
   
13.    కటి ఆదిత్యులది, శ్రోణి బృహస్పతిది కాగా, తోక వాయువుది అగుచున్నది. అందువలననే వాయువు చెట్లను తోకను వలె ఊపుచున్నాడు.
   
14.    ఋషభమును గురించి ఆలోచించినవారు గుదము సినీవాలిది, త్వచ సూర్యునిది, పదములు ఉత్దాతవి అనుచున్నారు.
   
15.    క్రోడము జావిశంసునిదనియు, కలశమును సోముడు ధరించినాడనియు దేవతలు ఏకత్రితులయి ఋషభపు కల్పనా చేసినారు.
   
16.    వారు కుష్టికలను సరమకు కూర్మములను శఫమునకు ఏర్పరచినారు. ఊబధ్యము - నిత్యము నడచు - పురుగుల కొరకు ఏర్పరచినారు.
   
17.    అవధ్యలగు గోవుల భర్త కొమ్ములచే రాక్షసులను, నేత్రములచే దారిద్ర్యమును దూరము చేయుచు, చెవులతో శుభములను వినుచున్నాడు.
   
18.    ఏ బ్రాహ్మణుడు ఋషభమును దానము చేయుచున్నాడో అతడు శతయాజ యజ్ఞము చేసినవాడు అగుచున్నాడు. అగ్నులు అతనిని బాధింపవు. దేవతలు అతనికి తృప్తి కలిగించుచున్నారు.
   
19.    బ్రాహ్మణులకు ఉదారుడై ఋషభమును దానము చేయువాడు తన గోష్ఠమున గోవుల పుష్టి కలిగిన వాడగుచున్నాడు.
   
20.    ఋషభమును దానము చేయువానికి దేవతలు గోవులను, ప్రజలను, దేహబలము కలిగింతురుగాక.
   
21.    ఈ హవిని త్రావి ఇంద్రుడు సచేతన ధేనువును ఇచ్చునుగాక. ఇంద్రుడు ఋషభ దాతకు స్వర్గమున ఎల్లప్పుడు దూడగల, తేలికగా పితుకగల, అధీనమున ఉండి పాలిచ్చు గోవును ఇచ్చునుగాక.
   
22.    పిశంగ వర్ణుడు ఆకాశమంత అన్నము గల ఇంద్రుని శక్తి మమ్ము చేరుచున్నది. అతడు మాకు ఆయువు, సంతానము, ధనపుష్టిని కలిగించునుగాక.
   
23.    ఉపపర్చనా! విచ్చేయుము. మమ్ము గోవులు నిండిన గోష్ఠమున ప్రవేశపెట్టుము. ఇంద్రా! ఈ ఋషభము వీర్యము, నీ వీర్యమే యగుచున్నది.
   
24.    గోవులారా! ఈ ఋషభమును మీ కొరకు ఏర్పరచుచున్నాను. ఈ గోష్ఠమున ఇతనితో క్రీడించుచు, మీ మాట విను దూడల వెంట తిరుగండి. మాకు శుభములు కలిగించండి. మమ్ము విడువకండి. మమ్ము ధన, ధాన్య సంపన్నులను చేయండి.
   
వ్యాఖ్య -    ఇది గోక్షయము జరిగినపుడు ప్రవేశపెట్టిన విధానముగ తోచుచున్నది. నేటికిని ఈ విధానము మారలేదు. వలసినదానికి ప్రోత్సాహకములను ప్రభుత్వము, వాణిజ్యము ఇట్లే కలుగ చేయుచున్నది. పరిశీలించిన మరిన్ని తెలియును.
   
                                              మూడవ అనువాకము
                                          మొదటి సూక్తము - 5

   
వినియోగము :    పంచౌదన సవమున ఈ అర్ధ సూక్తపు వినియోగము. దీనిచే నిరుప్త హవిని అభిమర్సన, సంపాతన, దాత్రువాచన, దానము చేయునది. దీనిచే అపరాజిత నుండి ఆనీయమాన పశువును అనుమంత్రించునది.
   
    అనుచయనపు, పనశ్చితి యందు 17వ ఋక్కుచే గార్హ పత్యమందు చీయమాన ఇటుకను 'బ్రహ్మ' అనుమంత్రించునది. వైశ్వ కర్మణ హోమానుమంత్రణమున కూడ దీని వినియోగము కలదు.
   
1.    అలమును తెండి యజ్ఞము ఆరంభించండి. ఇది పుణ్య లోకములను ఎరింగి, అంధకారమును దాటి స్వర్గమునకు ఎక్కునుగాక.
       
2.    అజమా! నీవు విద్వాంసుడవు. నిన్ను ఇంద్రునకు అర్పించుటకు ఈ యజమాని యజ్ఞమునాకు తెచ్చుచున్నాను. మమ్ము ద్వేషించు వారిని త్రొక్కుము. ఈ యజమాని పుత్రులను పాపరహితులను చేయుము.
   
3.    అజమా! నీవు చేసిన దుశ్చరిత నివారణకు కాళ్ళు కడుక్కొనుము. పరిశుద్దములగు గిట్టలచే అంధలోకమును దాటి, అనేకమును చూచుచు, మూడవదగు నాకమును చేరుము.
   
4.    విశస్తా! ఈ 'శ్యామము' చే దీని తోలు వలుచుము. కత్తి దానిని బాధించకుండునుగాక. ద్రోహము చేయకుము. కీళ్ళు సడలించుము. దీనిని మూడవ లోకమగు స్వర్గమున వండుము.
   
5.    మంత్రముచే 'కుమ్భి'ని నిప్పు మీద పెట్టుచున్నాను. నీళ్ళు చల్లుము.
   
    శమితలారా! దీనిని వండండి. నిప్పులచే ఉడికి ఇది పుణ్య లోకములకు చేరునుగాక.
   
6.    నీవు పూర్తిగ ఉడకకున్నను ఉడికిన చరుతో స్వర్గమునకు ఉత్క్రమణము చేయుము. నీవు అగ్నిలో అగ్నివి అయినావు. జ్యోతిష్మంత లోకములను జయించుము.
   
7.    అజము అగ్ని, అజము జ్యోతి అనుచున్నారు. సజీవుడు అజమును సమంత్రకముగ దానము చేయవలెననుచున్నారు. ఈ లోకమున శ్రద్దాళువులచే దానము చేయబడిన అజము అంధలోకపు చీకట్లను తొలగించుచున్నది.
   
8.    పంచ ఓదనము ఐదు విధములుగ విక్రమించును గాక. అందు త్రిజ్యోతులు చేరునుగాక. పంచౌదనమా! నీవు సుక్రుతుల మధ్యకు చేరుము. స్వర్గమున విశ్రమింపుము.
   
9.    అజమా! నీవు పుణ్యలోకములను ఆరోహించుము. స్వర్గము దుర్గమ మార్గములది అయినందున శరభాము అచటికి చేరజాలదు. బ్రహ్మకు అర్పించబడిన పంచౌదనము దాతకు తృప్తిని మించిన తృప్తి కలిగించుచున్నది.
   
10.    అజము దాతను 'త్రినాక' 'త్రిదివ' 'త్రిపుష్ఠ' నాకమునకు ఎక్కించుచున్నది.
   
    బ్రహ్మకు అర్పించిన పంచౌదనము దాతకు కామధేనువు అగుచున్నది.
   
11.    పితరులారా! తృతీయ పంచౌదనమగు అజమును బ్రహ్మకు అర్పించగా అది మీకు జ్యోతియగుచున్నది. ఈ లోకమున భక్తులచే దానము చేయబడిన అజము దూరలోకపు చీకట్లను అంతమొందించుచున్నది.
   
12.    పుణ్య లోకములను ఆశించి బ్రహ్మకు అజమును దానము చేయువానికి అజము స్వర్గమును జయించి శుభములు కలిగించునుగాక.
   
13.    అగ్ని జ్వాలల నుండి అజము ఆవిర్భవించినది. అది బ్రాహ్మణుని ఎరుగును. శక్తిని ఎరుగును. దేవతలు ఇష్టాపూర్తియగు వషత్క్రుతిని ఋతువుల ప్రకారము ఏర్పరతురుగాక.
   
14.    ఎవడు బట్టలో చుట్టిన స్వర్గమును దానము చేయునో వాడు ఇహ, పర సుఖములను పొందుచున్నాడు.
   
15.    అజమా! ఈ సోమధారలు "దేవీః ఘ్రుతపృష్టా మధుశ్చుతః" ఇవి నిన్ను చేరునుగాక. ద్యావాపృథ్వులను సప్తరశ్మియైన సూర్యుని మీది స్వర్గముపైన నిలుపుము.
   
16.    అజమా! నీవు అజస్వర్గమవు. నీవలననే అంగిరులు స్వర్గ లోకమును తెలిసికొన్నారు. అట్టి పుణ్య లోకమును నేను కూడ తెలిసికొన్నాను.
   
17.    అగ్నిదేవా! నీవు ధనమును వేల ప్రకారములుగ దేవతలకు చేర్చుచున్నావు. అట్లే మాకు స్వర్గము లభించునట్లు ఈ యజ్ఞమును దేవతలకు చేర్చుము.
   
18.    పంచౌదన అజము పక్వమై స్వర్గమును నిలుపుచున్నది. నిర్రుతిని బాధించుచున్నది. "తేన లోకాన్సూర్యవతో జయేమ" అట్టి అజముచే సూర్యవంత లోకములను జయించుచున్నాము.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.