Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda


 

15.    సకల మేఘ గర్జనలకు కారణమగు చ్యుతాచ్యుత విద్యుత్తు, ఉదయించుచు చీకట్లను పరాభవించు ఆదిత్యుడు తన తేజస్సులతో శత్రువును పడగొట్టెదరుగాక.
   
16.    కామదేవా! నీ కవచము బ్రహ్మమయము. అభేద్యము. దానితో మా శత్రువులను నష్టపరచండి. మా శత్రువును ప్రాణములు, పశువులు, జీవనము త్యజించునుగాక.
   
17.    కామదేవా! ఏ శక్తిచే దేవతలు అసురులను అణచినారో, ఇంద్రుడు దస్యులను మృత్యుముఖమున వేసి నాడో, ఆ శక్తిచే మా శత్రువులను ఈ లోకమునకు దూరముగా పంపుము.
   
18.    యథా దేవా అసురాన్ ప్రాణుదన్తః యథేంద్రో దస్యూ నధమంతమో బబాధే |
    తేన త్వం కామ మమాయే సపత్నాస్తానస్మాల్లోకాత్ ప్రణుదస్వ దూరమ్ ||

   
    (అర్ధమునకు 17 చూచునది.)
   
19.    కాముడు ప్రథమమున జన్మించినాడు. దేవతలు గాని, పితరులుగాని అతనికి సరికారు. అతడు సమస్త జ్యేష్ఠుడు, శ్రేష్ఠుడు అగుచున్నాడు. అతనికి నమస్కరించుచున్నాను.
   
20.    ద్యావాపృథ్వులు ఎంతటివో, అగ్ని జలములు ఎంత విశాలములో కాముడు అంతటివాడు. "తతస్త్వమసి జ్యాయాన్ విశ్వహా మహాంస్తస్మైతే కామ నమ ఇత్ కృణోమి" కామదేవా! అట్లగుటచే నీవు జ్యేష్టుడవు, శ్రేష్టుడవు, మహానుడవు. నీకు నమస్కారము.
   
21.    కామదేవా! నీవు దిశలు, ప్రదిశలంత వాడవు. స్వర్గము ఎంత దూరమో అంతటివాడవు. "తతస్త్వమసి జ్యాయాన్ విశ్వహా మహాంస్తస్మైతే కామ నమ ఇత్ కృణోమి"
   
22.    కామదేవా! భ్రుంగ, జతు, కురూరు, వృక్ష సర్పి వధ అంతటివాడవు.
   
    "తతస్త్వమసి జ్యాయాన్ విశ్వహా మహాంస్తస్మైతే కామ నమ ఇత్ కృణోమి"
   
23.    కామ, మన్యులారా! మీరు అనిమిషు లందు జ్యేష్టులు ఆసీనులందు జ్యేష్టులు సముద్రమున కన్న పెద్దవారు.
   
    "తతస్త్వమసి...."
   
24.    కామదేవా! అగ్ని, సూర్య, చంద్రులు నీకు సరి రాకున్నారు.
   
    "తతస్త్వమసి...."

   
25.    కామదేవా! నీది కళ్యాణ కర, మంగళమయ దేహము. నీవు వరించునది సత్యము. నీ దేహము మరియు సద్బుద్ధితో మా యందు ప్రవేశించుము మా దుర్చుద్దులను మా నుంచి తొలగించి మా శత్రువులందు ప్రవేశపెట్టుము.
   
                                           రెండవ అనువాకము
                                    మొదటి సూక్తము - 3

   
వినియోగము : స్వర్గకామి సవజ్ఞ విధానమున ఈ సూక్తముచే "శాలాసనం" ఇచ్చునది. దాత ప్రతి గృహీతునకు వెదురు బొంగులు మున్నగువానిచే కట్టిన ఇంటిని "ఉదఘాట్య" ఇచ్చునది.
   
1.    ఉపమిత, ప్రతిమిత, పరిమిత గృహమును విప్పుచున్నాము. ఇది అందరు కోరుకొను గృహము దీని ముడులను విప్పుచున్నాము.
   
2.    అందరు కోరుకొను విశ్వవారి శాలా! నీకు కట్లున్నవి. ముడులున్నవి. బృహస్పతి వంటి నేను శక్తివంత వాక్కుచే వానిని విప్పుచున్నాను.
   
3.    విద్వాంసుడగు శస్త గృహమా! నిన్ను చక్కగా విశాలముగ నిర్మించినాడు. గట్టిగా ముడులు వేసినాడు. వానిని మేము ఇంద్రునిచే విప్పించుచున్నాము.
   
4.    విశ్వ వరణీయమా! నీయొక్క వెదురు బొంగులను, వాటి కట్లను, గడ్డిని ప్రక్కలకు వేసిన ముడులను విప్పుచున్నాము.
   
5.    మానపత్ని ఫంబంధి సందంశముల, పలదముల, పరిష్వంజల్యముల బంధనములను విప్పుచున్నాము.
   
6.    మానపత్నీ! నీవు కళ్యాణకారివి. నీయందు సుఖకరమగుటకు కట్టిన మంచెలను విప్పుచున్నాము.
   
7.    గృహదేవతా! నీయందు హవిర్దాన అగ్నిశాల, భార్యలతో కూర్చుండు స్థలము, దేవతల ఆసనములు ఉన్నవి.
   
8.    విషూవతీ! నీవు వేల గవాక్షముల దానవు. శయన గృహపు మూసివున్నా అక్షములను మంత్రముచే తెరుచుచున్నాము.
   
9.    గృహమా! ఒకడు నిన్ను నిర్మించినాడు. ఒకడు పరిగ్రహించుచున్నాడు. మానపత్నీ! వారిద్దరను వార్ధక్యము వరకు జీవింపచేయుము.
   
10.    గృహమా! నీ అంగాంగములందును, సంధులందును ఉన్న బంధములను విప్పుచున్నాము. అంగాంగములు, సంధులందున ఉన్న బంధముల సహితముగా మాకు స్వర్గమున లభించుము.
   
11.    శాలా! ఒకడు కర్రలు తెచ్చినాడు. ఒకడు నిన్ను కట్టినాడు, పరమేష్టి యగు ప్రజాపతి నిన్ను ప్రజల కొరకు నిర్మించినాడు.
   
12.    దాతకు, గృహపతికి నమస్కరించుచున్నాను. అగ్నికి, సంచరించు నరులకు, గృహమునకు నమస్కరించుచున్నాను.
       
13.    శాలలో పుట్టిన గోవులకు, అశ్వములకు నమస్కారము విజావతీ! ప్రజావతీ! మేము మీ పాశములను విప్పుచున్నాము.
   
14.    గృహమా! ప్రజలు, పశువుల సహితముగ నీవు అగ్నిని ఆచ్చాదించినావు. విజావతీ! ప్రజావతీ! మీ పాశములను విప్పుచున్నాము.

15.    ద్యులోక, భూలోకముల లోన ఉవ్యచ, యజ్ఞాగ్నిజ్వాలచే గృహమును పరిగ్రహించుచున్నాను. పృథివ్యంతరిక్షములందు గల నిర్మాణశక్తిని నిధుల కొరకుగాను నేను కడుపున పెట్టుకొనుచున్నాను. అందుకొరకే నేను గృహమును పరిగ్రహించుచున్నాను.
   
16.    గృహమా! నీవు ఊర్జస్వతివి. పయస్వతివి. నేల మీద కొత్తగా నిర్మించబడినదానవు. విశ్వాన్నమును దరించగలదానవు. గృహీతను నష్టపరచకుము.
   
17.    గృహమా! నీవు తృణావృతవు. పలద ధారిణివి. రాత్రి వలె  జగత్తుకు ఆశ్రయమిచ్చుదానవు. పద్దతి హస్తినివలె నిర్మితవై నేల మీద నిలిచి ఉన్నావు.
   
18.    గడచిన సంవత్సరము వలె నీ సంధులను విడదీయుచు విప్పుచున్నాను. వరుణునిచే ప్రారంభించబడిన నిన్ను ప్రాతఃకాల సూర్యుడు ఆవిష్కరించునుగాక.
   
19.    ఈ గృహము మంత్రముల చేతను, విద్వాంసుల చేతను నిర్మించబడినది. సోమపాన స్థానమున ఆసీనులగు ఇంద్రాగ్నులు రక్షింతురుగాక.
   
20.    గూటిలో - దేహమున -గూడు - గర్భాశయము ఉన్నది. దానినుంచి తలక్రిందుగా మర్త్యుడు పుట్టుచున్నాడు. దానినుంచే "విశ్వం ప్రజాయతే" సమస్తము జన్మించుచున్నది.
   
21.    రెండంతస్తుల, నాలుగంతస్తుల, ఆరుగదుల, ఎనిమిదిగదుల, పదిగదుల గృహము నిర్మించబడినది. అట్టి మానపత్ని యందు నేను - అగ్ని గర్భము వలె - శయనించుచున్నాను.
   
22.    గృహమా! నేను ప్రతీచీనా ఆహింసక ప్రతీచిశాల యందు ప్రవేశించుచున్నాను. నాతోపాటు ఋత ప్రథమమగు అగ్నియు, జలమును ప్రవేశించుచున్నవి.
   
23.    అక్షయములు, వ్యాధినివారక జలముతో కూడ వసించుచున్నాను. అమృతాగ్ని సహితముగ ఇంటి వద్ద కూర్చొనుచున్నాను.
   
24.    గృహమా! మేము నిన్ను వధువుగా భావించుచున్నాము. మావైపు పాశములు విసరకుము. నీ బరువు గురువై యున్నది. లఘువగుము.
   
25.    "ప్రాచ్యాదిశః శాలాయానమో మహిమ్నే |
    స్వాహా దేవేభ్యః స్వాహ్యేభ్యః ||"

   
    గృహపు పూర్వదిశ మహిమకు నమస్కారము. స్వాహాయోగ్య దేవతలకొరకు స్వాహా.
   
    (దిశలు మాత్రము మరి మిగిలినది యథాతథమగుటచే దిక్కులు మాత్రము చెప్పబడుచున్నవి.)
   
26.    దక్షిణాయా దిశః - దక్షిణ దిశ.
   
27.    ప్రతీచ్యా దిశః - పడమటి దిశ.
   
28.    ఉదీచ్యా దిశః - ఉత్తర దిశ.
   
29.    ధృవాయా దిశః - ధృవ దిశ.
   
30.    ఊర్ధ్వాయా దిశః - ఊర్ధ్వ దిశ.
   
31.    దిశో దిశః - దిశలకు దిశ.
   
వ్యాఖ్య : 1. గృహముల వివరములు చెప్పబడినవి.
   
      2. నిర్మాణ వస్తువులు చెప్పబడినవి.
   
      3. గృహ దానమును గురించి చెప్పబడినది.
   
      4. దానము కట్టిన ఇంటిని విప్పి ఇచ్చుటగా చెప్పబడినది. స్థలమునాకు కొదువలేనట్లున్నది. మరల     నిర్మించు కొనవచ్చును.
   
      5. గృహ ప్రవేశము చెప్పబడినది.
   
      6. అంతస్తులు, గదులు వివరముగా చెప్పబడిన దానిని గురించి పరిశీలించవలసి ఉన్నది.
   
      7. "రాత్రీవశాలా జగతో నివాశనీ" రాత్రి వలె జగత్తుకు విశ్రాంతి కలిగించునది గృహము అన్నాడు! ఎంత     సొగసుగ చెప్పినాడు !!
   
                                          రెండవ సూక్తము - 4
   
వినియోగము : వృషోత్సర్గమున ఈ అర్ధ సూక్తముచే వృషభమును సంపాతిత, అభిమంత్రితములు చేసి విడుచునది. 24వ మంత్రముచే వత్సమును అభిమంత్రించి, ప్రోక్షించునది. పుష్టికోరువాడు దీనిచే వశావిధానముచే ఋషభమును ఇంద్రునకు యజించునది. సంపద కోరువాడు పూర్ణిమనాడు వశా విధానమును అనుసరించి దీనిచే శ్వేత ఋషభమును ఇంద్రునకు యజించునది. ఋషభ సవనమున దీనిచే నిరుప్త హవియొక్క అభిమర్సన, సమ్సాత, దాతృవాచన దానము చేయునది. పరిశిష్టమున కూడ వృషోత్సర్గసమయమున దీని వినియోగము.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.