Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda
ఓం
శ్రీమదాంధ్రవచన
అథర్వవేద సంహిత
చరమ భాగము
--అక్షయ వాచస్పతి
డాక్టర్ దాశరథి రంగాచార్య
ఓం
శ్రీమదాంధ్ర వచన అథర్వ వేద సంహిత
చరమ భాగం
యస్య నిఃశ్వసితం వేదా యోవేదేభ్యో2ఖిలం జగత్ |
నిర్మమే తమహం వన్దే విద్యాతీర్ధ మహేశ్వరమ్ ||
తొమ్మిదవ కాండ
మొదటి అనువాకము
మొదటి సూక్తము - 1
1. దివస్పృథివ్యా అన్తరిక్షాత్ సముద్రాదగ్నేర్వాతాన్మధు కశాహి జజ్ఞే |
తాం చాయిత్వా2మృతం వసానాం హృద్భిః ప్రజాః ప్రతినన్దన్తి పర్యాః ||
స్వర్గము, పృథివి. అంతరిక్షము, సముద్రము, అగ్ని, వాయువు నుండి మధుకశగోవు ప్రకటితమైనది. అట్టి అమృతధారణిని అర్పించి సమస్త ప్రజా హృదయములందు ఆనందము నింపుకొనుచున్నారు.
వినియోగము : సంప్రదాయికులు ఈ అర్ధసూక్తమును మేధా జనన, వర్చస్కర్మలందు వినియోగించుచున్నారు. ఉత్సర్జన కర్మమున 11-24 మంత్రములు ఘ్రుత హోమమున విని యుక్తములు అగుచున్నవి.
ఈ సూక్తము సోమయాగమందు సోమసవనమున దీని వినియుక్తమగుచున్నది.
2. మహత్తుగల ఈ గోవు యొక్క విశ్వదుగ్ధమే సముద్రమగుచున్నది. ఏ దేశమున ఈ మధుకశ స్తుతించబడుచున్నదో అక్కడి ప్రజల ప్రాణములందు అమృతము ప్రతిష్టించబడుచున్నది.
3. నరులు ఈమె చరిత్రను అనేక విధములుగా చర్చించుచున్నారు. భూలోకమున అట్టి చరిత్రను బహు విధముల దర్శించుచున్నారు. ఈమె అగ్ని నుండి ఆవిర్భవించినదా? వాయువునుండి ఆవిర్భవించినదా? అని ఆలోచించుచున్నారు.
4. మధుకశ ఆదిత్యులకు తల్లి - వసువులకు పుత్రి - ప్రజల ప్రాణము - అమృతపు నాభి అగుచున్నది. ఆమె ఘ్రుతాచి - హిరణ్యవర్ణ - మహా తేజోవంతమై నరులందు ప్రవర్తించుచున్నది.
5. మధుకశను దేవతలు వెల్లడించినారు. ఆమె గర్భము విశ్వరూపమైనది. తరుణ ఉత్పన్నయగు ఆమెను తల్లి పోషించినది. ఆవిర్భవించునపుడే ఆమె సకల ప్రాణులను ప్రకాశింపచేసినది.
6. ఆమెను తెలిసిన వాడెవ్వడు? ఆమెను గ్రహించిన వాడెవ్వడు? ఆమె హృదయము సోమ కలశము, అక్షయము. సుజ్ఞాని యగు బ్రహ్మ ఆమెలో ఆనందించుచున్నాడు.
7. ఆమె స్తనములు అక్షయములు. సహస్రధారలవి. అవినాశ్యములు, బలప్రదలు. అవి అట్టి పాలు ఇచ్చుచున్నవి. ఇది ఆ బ్రహ్మయే ఎరుంగుచున్నాడు.
8. మాటిమాటికి ఉచ్చైస్వరమున అంబారావములు చేయుచు గోవు యజ్ఞ స్థలమునకు చేరుచున్నది. ఆ గోవు అగ్ని, సూర్య, చంద్రుల తేజములను నియంత్రించుచున్నది. దేవతలను శరణు కోరువారిని తన పాలిచ్చి వారి శబ్దమును శక్తి సంపన్నము చేయుచున్నది.
9. పుష్టిగల మధుకశ వద్దకు - తన కాంతులచే వెలిగించి, కోరికలు తీర్చుటకు వర్షించు - జలము చేరుచున్నది. మధుకశ జ్ఞానము గల వారికి ఆ జలము కోరికలు తీర్చి, బలము నిచ్చు వర్షమును వర్షించుచున్నది. వర్షింపజేయుచున్నది.
10. ప్రజాపతీ! ఉరుసు నీ వాక్కు అగుచున్నది. నీవు వర్షించి భూమికి బలము, శక్తి కలిగించుచున్నావు. అగ్ని నుండి, వాయువు నుండి మధుకశ వెలువడినది. ఉగ్రయగు మధుకశ మరుత్తులకు ప్రీతి అగుచున్నది.
11. ప్రాతస్సవనమున సోమము అశ్వినులకు ప్రియమగుచున్నది. అట్లే అశ్వినులు నన్ను అనుగ్రహించి నాకు వర్చస్సు కలిగింతురుగాక.
12. రెండవ సవనమున సోమము ఇంద్రాగ్నులకు ప్రియమగుచున్నది. వారు నిన్ను అనుగ్రహించి నాకు వర్చస్సు కలిగింతురుగాక.
13. మూడవ సవనమున సోమము ఋభువులకు ప్రియమగుచున్నది. వారు నన్ను అనుగ్రహించి నాకు వర్చస్సు కలిగింతురుగాక.
14. నేను మధువును ప్రకటింతునుగాక. మధువుచే కాంతిమంతుడను అగుదునుగాక. అగ్నిదేవా! నేను దుగ్దాది హవివంతుడనై వచ్చినాను. నీవు నాయందు వర్చస్సు ప్రవేశపెట్టుము.
15. అగ్నీ! నీవు నన్ను వర్చస్సుచే నింపుము. నాకు సంతానము, ఆయుష్యము కలిగించుము. ఇంద్రుడు, దేవతలు, ఋషులు నేను నీ సేవకుడనని గుర్తింతురుగాక.
16. మధువును చేయువారు మధువు మీదనే మధువును పోసినట్లు అశ్వినులు నాయందు వర్చస్సు స్థాపింతురుగాక.
17. తేనెటీగలు తేనె మీదనే తేనెను కూర్చిన రీతి అశ్వినులు వర్చస్సు, తేజస్సు, బలము శక్తి నాకు కలిగింతురుగాక.
18. గిరులందు, పర్వతములందు, గోవులందు, అశ్వములందు, సుర యందు గల మధువు నా యందు చేరునుగాక.
(మధువు శక్తి కావచ్చును.)
19. అశ్వినులారా! మీరు శుభస్పతులు. అలంకారులు. నాయందు తేనె తెట్టెలోని తేనెను నింపండి. అందువలన నేను మనుష్యులతో వర్చస్సు గల తీయని మాటలు మాట్లాడుదునుగాక.
20. ప్రజాపతీ! ఉరుము నీ పలుకు అగుచున్నది. నీవు ద్యావాపృథ్వులందు వర్షము కలిగించుచు అభీష్ట వృష్టి కలిగించుచున్నావు. దానితోనే సమస్త పశువులు జీవించుచున్నవి. అన్న, బల పుష్టి కలవి అగుచున్నవి.
21. పృథివి దండము, అంతరిక్షము గర్భము, ద్యౌకశ విద్యుత్తు ప్రకాశము, హిరణ్యము బిందువు అగుచున్నవి.
22. కశా సహితముగ సప్తమధువులను తెలియువాడు 'మధుమాన్ భవతి'. అతనికి బ్రాహ్మణుడు, రాజు, ధేనువు, ఎద్దు, ధాన్యము, యవలు ఏడవదగు మధువు లభించుచున్నది.
23. ఈ విషయములను గ్రహించినవాడు 'మధుమాన్ భవతి' అతని ఆహారము మధుమతి యగుచున్నది. అతడు మధుమాయ లోకమును జయించుచున్నాడు.
24. ఆకసమున ఏ మెరుపు మెరయుచున్నదో అదియే ప్రజాపతి యగుచున్నది. అదియే ప్రజలను ప్రాదుర్భవింపచేయుచున్నది. ఎడమ భుజము మీద యజ్ఞోపవీతముగల మమ్ము ప్రజాపతి తెలియునుగాక. ఈ విషయములు ఎరింగినవానిని ప్రజ ప్రజాపతి ప్రతిరూపముగ భావించుచున్నది.
రెండవ సూక్తము - 2
వినియోగము : అభిచార కర్మయందు ఈ సూక్తముచే ఋషభమును సంపాతించి శత్రువు వైపునకు విడుచునది. ఆ కర్మయందే రాలిన రావి సమిధలను ఉంచునది. సోమయాగమున అపరాజిత అనూబన్ధ్య స్థితమైనంత కామదేవునకు నమస్కరించుట యందు దీని వినియోగము.
1. శత్రునాశక ఋషభమును, కాముని ఘ్రుతాహుతులచే సేవించుచున్నాను. ఋషభమా! నీవు మా స్తుతులు అందుకొని బలశాలివై మా శత్రువులను నేలకూల్చుము.
2. నా మనసునకు, కంటికి ప్రియము కానిదియు, నన్ను మ్రింగునట్టి దుస్వప్నమును కాముని స్తుతించి వైరుల మీదకు తోలుచున్నాను. దానిని బాధించుచున్నాను.
3. కామదేవా! నీవు ఉగ్రుడవు. ఈశానుడవు. నాకు కలుగు దుస్స్వప్నమును, దురితమును, సంతానహీనతను, అస్వగతమును, నిరుద్యోగమును, మమ్ము ఓడించుటకు కుట్ర పన్నువాని మీదకు పంపుము.
4. కామదేవా! వృత్తి హీనతను నానుంచి తొలగించుము - నా శత్రువునకు తగిలించుము. వీనిని మా వైరుల మీదకు తోలుము.
అగ్నిదేవా! మా వైరుల వస్తువులను తగులపెట్టుము. వారిని అంధకారమున తోయుము.
5. కామదేవా! కవులు ఏ వాక్కును ఓజస్విని అనుచున్నారో ఆ ధేనువు నీకు పుత్రియై యున్నది. ఆ వాణి నా శత్రువులు ప్రాణములను, పశువులను, జీవనమును పోగొట్టుకొందురుగాక.
6. ధీరుడు నీటిలో నావను నడిపినట్లు నేను కాముని, ఇంద్రుని, వరుణుని, సోముని, విష్ణువు బలము చేతను, సవిత్రు యజ్ఞము, అగ్నిహోత్రునితోను నా శత్రువును గెంటి వేయుచున్నాను.
7. కామదేవా! నీవు ఉగ్రనేత్రుడవగుము. నన్ను శత్రురహితుడను చేయుము. విశ్వే దేవతలు మాకు ప్రభువులు అగుదురుగాక. దేవతలు నా యజ్ఞమునకు విచ్చేయుదురుగాక.
8. కామప్రముఖ దేవతలారా! ఈ ఘ్రుతమును ఘ్రుత సమముగా సేవించండి. ఆనందించండి. మమ్ము శత్రు రహితులను చేయండి.
9. కామదేవా! ఇంద్రాగ్నులు రథారూఢులై మా శత్రువులను నేలకూల్చెదరు గాక. అగ్నిదేవా! కూలినవారిని అంధకారమున పడద్రోయుము. వారి వస్తువులను తగులపెట్టుము.
10. కామదేవా! నా శత్రువును హతమార్చుము. వారిని చీకట్లకు వప్పగించుము. వారు అంగహీనులు, శక్తి హీనులు అగుదురుగాక. వారు ఏ ఒక్క రోజు జీవించకుందురుగాక.
11. కామదేవుడు నా శత్రువులను హతమార్చినాడు. నన్ను వర్ధిల్ల చేయుటకు కాముడు నాకు మహా లోకములను ప్రసాదించినాడు. కావున సమస్త దిశలు, ప్రాణులు నాకు ప్రణమిల్లుదురుగాక. ఆరు లోకములు మాకు ఘ్రుతము ప్రసాదించునుగాక.
12. కట్టు తెగిన నావ దిగువకు పోయినట్లు నాశత్రువులు అధోగతులు అగుదురుగాక. విడిచిన బాణము తిరిగి రాదు కదా!
13. ఇంద్రాగ్ని సోములు శత్రువులను తొలగించువారలగుచున్నారు. మీరు శత్రువులను తొలగించి మమ్ము రక్షించండి దేవతలారా! మా శత్రువులను తొలగించండి.
14. మా శత్రువు పుత్ర, పౌత్రాది రహితుడై, దిక్కులేక తిరుగునుగాక. బంధువులు అతనిని త్యజింతురుగాక. పిడుగులు పడి అతడు ఖండఖండములగునుగాక. యజమానులారా! ఉగ్రదేవతలు మీ శత్రువులను మథింతురుగాక.





