Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda


 

19.    శత్రువులు మంత్రశక్తిచే పరాజితులగుదురు గాక. అలసిన శత్రువును మంత్రశక్తి ఈడ్చగా పారిపోవుదురు గాక. బృహస్పతి దండన నుంచి ఏ ఒక్కడు తప్పుకొనకుండును గాక.
   
20.    శత్రువుల ఆయుధములు పడిపోవును గాక. వారు మరొక శరము సంధించజాలకుందురు గాక. భయభీతులగు శత్రువుల అమ్ములు వారి మర్మ స్థానములను భేదించును గాక.
   
21.    ద్యావా, పృథ్వి, అంతరిక్షము శత్రువులను శపింతురు గాక. వారికి కీర్తి కలుగక, జ్ఞాని లభించక, విఘ్నములు కలిగి, వారు మృత్యువాత పడుదురు గాక.
   
22.    అగ్ని దేవుని రథమునకు దిశలే అశ్వములు పురోడాశము సుమము, అంతరిక్షము ఛత్రము, ద్యావాపృథ్వులు పక్షములు, ఋతువులు కళ్ళెము, అంతర్దేశము కింకరులు, వాణి పరిరథ్య అగుచున్నవి.
   
23.    ఇంద్రుడు ఎడమ ప్రక్క కూర్చుండు వాడు - చంద్రుడు సారథి - పరివత్సరము ఆసనము - విరాట్ ఈష - అగ్ని రథ ముఖము అగుచున్నవి.
   
24.    ఇతో జయేతో విజయ సంజయ జయ స్వాహా |
    ఇమే జయన్తు పరామీ జయన్తాం స్వాహైభ్యోదురాహా మీభ్యః
    నీలలోహితే నామూనభ్యవతనోమి ||
   

    ఇటునుండి జయము. విజయము. జయ జయ జయ స్వాహా. వీరు జయింతురు. శత్రువు పరాజితుడు  అగును గాక స్వాహా. శత్రువుది దుష్ట ఆహుతి అగును గాక. నీలలోహిత తంతువులచే వీరిని చుట్టుచున్నాను.
   
                                 అయిదవ అనువాకము
                                 మొదటి సూక్తము - 19
   

వినియోగము :-

   
    ఈ సూక్తముచే విరాడాది విషయ సంవాదము కలదు. స్వర్గము కోరువాడు 1,2 సూక్తములను  జపించునది.
   
    విరాటపు వత్సములు ఎచట జనించినవి? వాణి సమృద్ది ఏ లోకము నుండి, ఏ పృథివి నుండి కలిగినది?
   
1.    విరాటపు వత్సములు జలమునుంచి ఉద్భవించినవి. అవి ఏ విధముగ పితుకబడినవని నిన్ను అడుగుచున్నాను.
   
2.    త్రిభుజ రూపమున జలమున శయనించి, జలమును కారణము చేసి, జలమును క్రిందింప చేసిన వత్సము కోరికలు తీర్చుచున్నది. పరాఙ్ముఖ గమనమున దేహమును గుహను చేసినది.
   
3.    ఏ మూడు బృహంతములున్నవో వానియందు నాల్గవది వాణియగుచున్నది. దానిని తపస్సు మున్నగు వానిచేత ఏకాకి అయినవాడే చేరుచున్నాడు. అది బ్రహ్మకే తెలియవలెను.
       
4.    బృహత్తునుండి శ్రేష్ఠ పంచసామములు నిర్మితములైనవి. వానినుండి షష్టాత్ నిర్మితమైనది బృహత్తు నుండి బృహత్తు నిర్మితమైనపుడు బృహతి ఎచటనుండి మితమగును?
   
5.    బృహతి మాత్రనుండి, మాయ మాత్ర నుండి అధి నిర్మితము. మాయ నుండి మాయ, మాతలి మాయ నుండి పుట్టినారు.
   
6.    ద్యావాపృథ్వులున్నంతమేర అగ్ని బాధించకలుగుచున్నాడు. వైశ్వానరాగ్ని నిగ్రహము మీదనే ద్యులోకము నిలిచి ఉన్నది. దినము నందలి ఆరవ భాగమున స్తోమము అచటి నుండి షషాత్ ను చేరుచున్నాడు.
   
7.    కశ్యపా! నీవు యుక్త, యోగములను తగురీతి యోగము చేయుట ఎరుంగుదువు. అందువలన మేము ఆరుగురము ఋషులము అడుగుచున్నాము. మిత్రులమగు మా కొరకు వివరించండి :-
   
    "విరాట్టు బ్రహ్మకు తండ్రి అనుచున్నారు. యతుల రీతిలో విరాట్టుని గురించి వివరించండి"       
   
8.    విరాట్టు కలిగినపుడు యజ్ఞము కలుగుచున్నది. విరాట్టు కలగనపుడు యజ్ఞము కలుగకున్నది. ఎవని వ్రతము, స్తుతి యందు పూజ్యభావము కలుగుచున్నదో - ఋషులారా! - అట్టి విరాట్టు పరమాకాశమున ఉన్నాడు.
   
9.    ఋషులారా! అప్రాణవిరాట్టు ప్రాణరూప ప్రజలందు ప్రాణరూపమున ప్రవేశించుచున్నాడు. విశ్వమంతను స్ప్రుశించు అభిరూపము గల విరాట్టును నీలోనే దర్శించవచ్చును. దర్శించక పోవచ్చును.
   
10.    ప్రజాపతి మాత్రమే విరాట్టు మిధునత్వమగు ఋతు, కల్పములను తెలియుచున్నాడు. అతడే విరాట్టు క్రమములను, విదుగ్దులను, ధామములను, తమోవివాసనమును ఎరుంగును.
   
11.    ఇతడు తొలుత ఉషారూపమున ఆవిర్భవించుచున్నాడు. ఇతడే అన్య ఉషస్సులందు ప్రవేశించి ఉదయించుచున్నాడు. అతని మహ్మలు మహంతములు, దినపు తొమ్మిది భాగములందుండు నట్టి సూర్యపత్ని ఉష ప్రాణులకు వెలుగు ప్రసాదించుచున్నది.
   
12.    ఛందః పక్షముల ఉష ప్రకటితమైనపుడు సకల భూతములకు సమానముగా దర్శన మిచ్చుచున్నది. సూర్యపత్ని, జ్ఞానవతి ప్రకాశరూపమునను, తన మహాబలమునను వారిని తెలియుచున్నది.
   
13.    అగ్ని, సూర్య, చంద్రులు ముగ్గురు సత్యమార్గగాములు అగుచున్నారు. వీరిలో ఒకరి శక్తి ఋత్విజులకు తృప్తి కలిగించును. రెండవశక్తి బలమున పుష్టి కలిగించుచున్నది. మూడవ శక్తి దేశమును రక్షించుచున్నది.
   
14.    నాలుగవ శక్తిని అగ్ని, సోమ, ఋష్యాదులు ధరించినారు. ఋషులు యజ్ఞ పక్షములను కల్పించినారు. యజమానికి స్వర్గము కలిగించు గాయత్రి, త్రిష్టుభ, జగతి, అనుష్టుప్, బృహతీ చందస్సులను కల్పించినారు.
   
15.    పంచ తమోవివాసినీ శక్తులకు అనుకూలముగ పంచ దోహలు ఉన్నవి. పంచనామ్ని గోవుకు అనుకూలముగ పంచదిశలు ఉన్నవి. పంచ దిశలు పంచ దశలై యోగి కొరకు ఒకే రూపము గలుగుచున్నవి.
   
16.    తొలుత ఋతము నుండి ఆరు ప్రాణులు జనించినవి. ఆరు సామములు దినపు ఆరు భాగములను వహించుచున్నవి. షడ్ యోగములు సీరము ననుసరించి సామ సామములగుచున్నవి. ద్యావా పృథ్వుల ఉర్వుల ఆరు భేదముల వర్ణన విద్వాంసులు తెలియుచున్నారు.   
   
17.    ఆరు నెలలను చలికాలము ఆరు నెలలను ఎండకాలము అనుచున్నారు. మిగిలినవి మాకు తెలియును. ఏడు సువర్ణములు - ఏడు ఛందములు, ఏడు దీక్షలు విద్వాంసులు తెలియుచున్నారు.
   
18.    సప్త హోమములు, సప్తమధువులు, సప్త రుతువులు, సప్త ఘ్రుతములను నరుడు తెలియుచున్నాడు. సప్త గృధ్రములు ఉన్నవని వినుచున్నాము.
   
19.    సప్త ఛందములు చతురుత్తరములు. అవి ఒకదానికి ఒకటి అర్పితమై ఉన్నవి. స్తోమములు వానిలో ఎట్లు ప్రతిష్టితములగు చున్నవి?అవి స్తోమములకు ఎట్లు అర్పితములు అగుచున్నవి?
   
20.    గాయత్రి తివృతమున ఎట్లు వ్యాప్త మగుచున్నది? త్రిష్టుప్ పంచదశమున ఎట్లు సమర్ధమగుచున్నది? త్రయస్త్రింశము నుండి జగతి, అనుష్టుప్, ఏక వింశము ఎట్లు సమర్దమగు చున్నవి?
   
21.    ఇంద్రా! తొలుత అష్టభూతములు పుట్టినవి. సత్యమునకు అష్టరూపములున్నవి. ఋత్విజులు ఎనిమిది మంది. అదితికి అష్టపుత్రులు. అందువలననే అష్టమి రాత్రి హవిస్సులు స్వీకరించుచున్నది.
   
22.    ఇట్లు శ్రేయస్సు కోరుచు మీకు మిత్రుడనై, మీ తోబుట్టువు వంటి నేను సుఖముగా ఉన్నాను. క్రతువే మీకు కళ్యాణ కారి యగుచున్నది. క్రతువు సర్వజ్ఞయై సంచరించుచున్నది.
   
23.    ఇంద్రునకు ఎనిమిది, యమునకు ఆరు, ఋషులకు డెబ్బది ఏడు ఓషధులున్నవి. మానవులను మరియు ఓషధులను పంచ జలములు బ్రతికించుచున్నవి.
   
24.    తొలి ఈత ఆవు కాంతిమయ దుగ్ధములను ఇంద్రునకే ఇచ్చినది. తదుపరి దేవతలు, మనుష్యులు, అసురులు ఋషులను నాలుగు విధములుగా తృప్తి చెందించినది.
   
25.    ఆ గోవు ఏది? ఆ ఒక్క ఋషి ఎవరు? ధామ మేమి? ఆశీర్వచనమేమి? పృథివి యందు ఏకవృతమే పూజ్యము. ఆ ఏక ఋతువు ఏది?
   
26    ఆ గోవు ఒక్కటే. ఋషి ఒక్కడే. ధామము ఒక్కటే. ఆశీర్వచనము ఒక్కటే. పృథివి యందు ఏకవృతమే పూజనీయము. ఒకే ఋతువు - అది వర్ధిల్లదు.
   
                                           రెండవ సూక్తము - 20
   
వినియోగము :-
మొదటి సూక్తము వలె.
   
1.    సృష్టి ముందు విరాట్పురుషుడే ఉండెను. అతడు వెలువడగానే ఇతడే జగత్తు అగునని భీతిల్లినారు.
   
2.    అప్పుడు అతడు విక్రమించినాడు. గార్హపత్యమున ప్రవేశించినాడు.
   
3.    దీనిని ఎరింగిన గృహమేథి గృహపతి అగుచున్నాడు.
   
4.    అతడు మరల విక్రమించినాడు. సాహవనీయమున ప్రవేశించినాడు.
   
5.    ఈ విషయము తెలిసి ఆహ్వానించినచో దేవతలు వచ్చుచున్నాడు. అతడు దేవప్రియుడు అగుచున్నాడు.
   
6.    అతడు విక్రమించి దక్షిణాగ్ని యందు ప్రవేశించినాడు.
   
7.    ఈ విషయము గ్రహించిన వాడు యజ్ఞర్త దక్షిణీయ వాస్తేయుడగుచున్నాడు.
   
8.    అతడు విక్రమించి సభయందు ప్రవేశించినాడు.
   
9.    ఈ విషయము గ్రహించినవాడు సభయందు సభ్యుడు అగుచున్నాడు.
   
10.    అతడు విక్రమించి సమితి యందు ప్రవేశించినాడు.
   
11.    ఈ విషయము గ్రహించినవాడు సమితియందు కీర్తివంతుడు అగుచున్నాడు.
   
12.    అతడు విక్రమించి ఆహ్వానమున ప్రవేశించినాడు.
   
13.    ఈ విషయము గ్రహించినవాడు ఆహ్వాననీయుడు అగుచున్నాడు.
   
                                       మూడవ సూక్తము - 21
   
1.    ఆ విరాట్పురుషుడు విక్రమించినాడు. అంతరిక్షమును చతుర్విధముల ఆక్రమించినాడు. అచట స్థిరపడినాడు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.