Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda


 

8.    దేని గర్భము జలమగునో, ఏది అగ్నికి భక్ష్యమగునో, ఏది మరల మరల నవనవోన్మేషమై ఆవిర్భవించునో, ఏది స్థిరముగా ఉండునో అట్టి 'సహస్ర' నమక ఓషధి ఇచటికి తేబడును గాక.
   
9.    జలము ఆత్మగను, సివారము గర్భవేష్టనముగను, ఉగ్రగంధము గల శృంగారకారము గల రెండు ఫలములుండు ఓషధులు రోగములను నష్టపరచునని అగుచున్నవి.
   
10.    ఓషధులు రోగవిమోచనములు ఉగ్రములు విషదూషకములు. జలోదర నివారకములు. కాసనాశకములు కృత్యాపహారకములు. అట్టి ఓషధులు ఇచటికి చేరునుగాక.
   
11.    ఖరీదు చేసినవి కాక స్వయముగా వచ్చిన వ్యాధులను అణచునట్టి ఓషధులు స్తుతించదగినవి. అవి గ్రామము నందలి గోవులు, అశ్వములు, జనులు, పశువులను రక్షించును గాక.
   
12.    ఓషధుల మూలము మధురము అగ్రము మధురము. మధ్యమము మధురము. పర్ణము మధుమంతము. పుష్పము మధుమంతము. వీని మధువు సేవించువాడు అమృతము సేవించువాడు అగుచున్నాడు. అతడు గోవును ముందుంచుకొని ఘ్రుత, అన్నాదులను అనుభవించుచున్నాడు.
   
13.    భూమి మీద ఉన్న ఓషధులన్నియు వేల కొలది ఆకులు గలవి. అవి మమ్ము మృత్యుదాయక పాపముల నుండి రక్షించును గాక.
   
14.    ఔషధములచే రక్షించబడు 'వైయాఘ్ర' మణి రోగములను పాపముల నుండి కాపాడును. అది వ్యాధులను, రక్కసులను మాకు దూరముననే రక్షించును గాక.
   
15.    సింహగర్జనకు దడుచుకున్నట్లు, అగ్ని మంటలకు గడగడలాడినట్లు తెచ్చి పెట్టిన ఔషధములు మనుష్యుల, జంతువుల వ్యాధులను నావ నదిని వలె దాటించును గాక.
   
16.    ఈ ఓషధుల రాజు వనస్పతి యగుచున్నాడు. ఇవి భూమిని ఆచ్చాదించుచున్నవి. రోగవిముక్తి కలిగించుటలో ఇవి వైశ్వానరాగ్నిని మించినవి.
   
17.    అంగిరుడు వర్ణించిన ఓషధులు పర్వతముల మీదను మైదానములందును మొలుచుచున్నవి. అవి దుగ్ధముల వలె రసవంతము, శుభప్రదములు అగుచున్నవి. అవి మా మనసులకు సుఖము నిచ్చును గాక.
   
18.    నాకు తెలిసినవియు, నేను కంటితో చూచినవియు, తెలియని వానిని తెలిసికొన్న ఓషధుల గుణములు మేము తెలిసికొందుము గాక.
   
19.    సమగ్ర ఓషధులారా! నా మాట వినండి. నేను ఇతనిని రోగరూప పాపముల నుండి విముక్తి కలిగింతును గాక.
   
20.    ఓషధులకు అశ్వత్థ దర్భ - రాజు సోముడు - హవి అమృతము అగుచున్నవి. ఓషధులగు ధాన్యము, యవలు అంతరిక్షపుత్రులు, అమర్త్యలు అగుచున్నవి.
   
21.    ఓషధులారా! మెరుపు మెరసి, మబ్బు ఉరిమి, గాలివీచి, పర్జన్యుడు వర్షించి మిమ్ము పోషించుచున్నారు. అప్పుడు మీరు అనేక విధముల చలింతురు.
   
22.    ఆ ఓషధుల అమృతరూప బలమును ఇతనిచే సేవింప జేయుచున్నాము. ఇతడు నూరేళ్ళు జీవించునట్లు చికిత్స చేయుచున్నాము.
   
23.    వరాహము ఎరిగిన ఓషధి, నకులము ఎగిరిన భేషజి, సర్పములు, గంధర్వులు ఎరిగిన ఓషధులను ఈ రోగి కొరకు ఆహ్వానించుచున్నాము.
   
24.    అంగిరుడు, రఘటుడు కనుగొన్న సుందర పత్ర ఓషధులను హంస, సకల పక్షులు, పశువులకు తెలిసిన ఓషధులను ఇతని ఆరోగ్యము కొరకు ఆహ్వానించుచున్నాను.
   
25    అవధ్యగోవులు, మేకలు, గొర్రెలు తినునట్టి ఓషధులన్నియు నీకు కళ్యాణ కారకములు అగును గాక.
   
26    లతలందు భిషక్కు లెరిగిన ఎన్ని లతలున్నవో అట్టి సకల ఓషధులను నీకు శుభములు కలిగించుటకు గాను నీ ముందుకు తెచ్చినాము.
   
27    పుష్పవంతములు, ఆరోగ్యప్రదములు, ఫలవంతములు, ఫలరహితములగు ఓషధులు ఇతనికి శుభములు, ఆరోగ్యము కలిగించును గాక.
   
28    రోగీ! నిన్ను పంచశలాక, దశశలాక పాదబంధము నుంచి - యముని పాదబంధము నుండి, వ్యాధుల పాదబంధము నుండి విడిపించుచున్నాను.
   
                                         రెండవ సూక్తము - 18
   

వినియోగము :-
   

    ఈ అర్ధసూక్తపు వినియోగము శత్రుక్షయ, శత్రుభయనాశ, శత్రుంజయ, స్వబల వర్ధకములందు  వినియోగము. వీనిలో సేనాగ్ని సిద్ది కొరకు 2వ మంత్రముచే జీర్ణరజ్జువు నుంచి అశ్వత్ధ, బధక పుల్లలుంచి  మొదటి ఋక్కుచే అగ్నిని మథించునది.

    ఈ సూక్తమందలి ఒక్కొక్క మంత్రముచే అశ్వత్ధ సమిధలను ఉంచునది. అందువలన శత్రుక్షయమగును.  ఒక్కొక్క మంత్రముచే వేరువేరుగ అశ్వత్థ, బధక, పలాశ సమిధలను వేయునది. ప్రతిమంత్రముచే ఖాదిర  సమిధలు వేయుట వలన శత్రుభయ నివారణము, శత్రుక్షయకరము అగును.
   
    అభ్యాతానము వరకు చేసి ఈ సూక్తముచే భంగపు పాశములను సంపాతన, అభిమంత్రణలు చేసి సేన నడచు   మార్గము వేయునది. పాశాదులను క్రోధము నిండి అభిమంత్రించునది. తదుపరి ఉత్తర తంత్రమగును. ఈ     విధముగనే మూంజ పాశములను సంపాతిత అభిమంత్రితము చేసి సేన నడచు మార్గమున చల్లునది.  తంత్రము కూడ చేయునది. ఇట్లే బాధక దండములను, రావి పుల్లలను, నిషాదుల ప్రాణ బంధములను సంపాతన, అభిమంత్రణలు చేసి సేన సంచరించు మార్గమున చల్లునది, ఇట్లు జయకర్మలు ముగిసినవి.
   
    పూర్వోక్త కర్మములందు ప్రతి దానికి మూడు విధులు ఉన్నవి.
   
     1.    24వ మంత్రపు "స్వాహేభ్యః" అను పదములచే మిత్రుని బలవృద్దికి బాధక పుల్లచే మండు అగ్నిలో  కుడిచేతితో ఘ్రుతాహుతులు ఇచ్చునది.   
   
     2.    24వ మంత్రపు "దురాహామీభ్యః" 1న చెప్పిన అగ్నియందు ఎడమ చేతిచే బాధకాహుతి ఇచ్చునది.

     3.    కర్మాగ్ని యందు ఉత్తర దిశ ఎర్ర రావి కొమ్మకు భూమిరూప ఉదరమున చేర్చి ఎరుపు, నీలపు దారముతో   పూర్తి శాఖను చుట్టునది.
   
    సేనా కర్మలను గ్రామమున చేయరాదు. అరణ్యమున గాని యుద్దభూమి యందు గాని చేయించవలెను.
   
1.    ఇంద్రుడు శక్రుడు. శూరుడు. పురందరుడు. శత్రుసేనలను మథించువాడు. అతడు అగ్నిని మథించును గాక. అందువలన మేము సత్రుసేనాను బహువిధముల బాధింతుము గాక.
   
2.    అగ్ని సంయోగము గల జీర్ణరజ్జువు శత్రుసేనను జీర్ణము చేయును గాక. అగ్ని, ధూమమును చూచి శత్రుసేనకు గుబులు పుట్టును గాక.
   
3.    అశ్వత్థమా! నీవు ఈ శత్రువులను వధింపుము. ఖాదిరమా! ఈ శత్రువులందు ప్రముఖులను మ్రింగుము. వీరు 'తాజాద్భంగము' వలె విరుగుదురు గాక. బధక కర్ర వీరిని దెబ్బలచే అంతము చేయును గాక.
   
4.    'పరుష' వీనిని ప్రాణహీనులను చేసి కట్టెను వలె చేయును గాక. 'బధకము' వారిని హింసించి వధించును గాక. బాణము వలను వలె శత్రువును కూల్చును గాక.
   
5.    అంతరిక్షము వల కాగా దిశలు వలను నిలుపు కర్రలైనవి. ఇంద్రుడు దస్యుల సేనను అందున పట్టి ఖండించినాడు.
   
6.    శక్రుని దల బృహత్తమము. ఇంద్రుడు శత్రువులను బోర్ల వేసి వలలో పట్టి ఒక్కరు సహితము మిగులకుండ చేయును గాక.
   
7.    ఇంద్రా! నీవు సహస్రార్దుడవు. శత వీర్యుడవు. నీ జాలము బృహత్తు. ఆ జాలమునందే పట్టి వందల, వేల, లక్షల, అర్బుదముల దస్యులను హతమార్చినావు.
   
8.    మహా లోకమే మహితాత్ముడగు ఇంద్రుని మహాజాలమగు చున్నది. ఈ ఇంద్రజాలమున పట్టి శత్రుమూకలను చీకట్లలో పడవేయుచున్నాను.
   
9.    నిర్రుతి - వ్యధ - ఆర్తి - నింద - శ్రమ - తంద్రత - మోహము వీనిచే శత్రువును అంతమొందించుచున్నాను.
   
10.    శత్రువులను మృత్యువునకు వప్పగించుచున్నాను. వారు మృత్యు పాశములందు కట్టుబడినారు. ఈ శత్రువులను కట్టకట్టి దుఃఖములు కలిగించు మృత్యు దూతలకు ఇచ్చుచున్నాను.
   
11.    మృత్యుదూతలారా! వీరిని కొనిపొండి. యమ దూతలారా! వీరిచే నరకమును నింపండి. వేల మందిని హతమార్చండి. రుద్ర సంహారము వీరిని హతమార్చును గాక.
   
12.    సాధ్యులు జాలదండము గైకొని బలశాలి మీదకు సాగుచున్నారు. రుద్రులు, వసువులు, ఆదిత్యులు ఒక్కొక్క దండము అందుకున్నారు.
   
13.    విశ్వేదేవతలు పైనుండియే బలపూర్వకముగ వధించుచు పోవుదురు గాక. రుద్రులు శత్రువులను మధ్యనే హతమార్చుచు నేల మీద వేయుదురు గాక.
   
14.    వనస్పతులను, వానిచే చేయబడిన ఔషధములను, లతలను, ద్విపాత్తులను, చతుష్పాత్తులను శత్రుహననార్ధము ప్రేరణ కలిగించుచున్నాను.
   
15.    గంధర్వ, అప్సరస, సర్ప దేవతలను, పుణ్యజనులగు పితరులను, కనిపించి, కనిపించని దేవతలను శత్రుసేనాహననమునకు ప్రేరేపించుచున్నాను.

16.    శత్రువు దాటి రాకుండ వేల మృత్యుపాశములను పరచినాము. ఈ కూటము శత్రుసేనను సహస్ర విధముల పరిమార్చును గాక.
   
17.    హర్మహవి అగ్నియందు హోమించబడుచున్నది. ఇది సహస్ర శత్రు వినాశక శక్తి యగుచున్నది. శ్వేతభుజభవుడు, శర్వ దేవతలు శత్రుసేనను హతమార్తుడు గాక.
   
18.    శత్రువు మృత్యు ముఖమునకు చేరును గాక. అతనిని ఆకలి, అలసట, అలక్ష్మి, బాధ, భయము ఆవహించును గాక. ఇంద్ర, శర్వులు శత్రుసేనను హతమార్తురు గాక.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.