Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda
9. ద్యావాపృథ్వులు, సూర్యుడు మాకు కవచప్రదానము చేతురు గాక. అగ్ని, ధాత దేవతలు కూడ మాకు కవచమును ఇచ్చెదరు గాక.
10. ఈ మణి ఇంద్రాగ్ని దేవతారూపము ఇంద్రాదులు దానిని పాలించుచున్నారు. అది నా దేహమును సకల దిశలందు రక్షించును గాక. అది నాకు దీర్ఘాయువు కలిగించి వార్ధక్యము వరకు జీవింపచేయును గాక.
11. ఈ దేవమణి నాకు క్షేమము కలిగించుటకు నా భుజ దండమును అలంకరించినది. మానవులారా! మీరు సహితము శత్రునిర్మూలక, శరీర రక్షక, తిర్రావృత మణిని ధరించండి.
12. ఇంద్రుడు ఈ మణియందు అభిమత ఫలమును స్థాపించును గాక. దేవతలందరు ఈ మణిని అధిష్టింతురు గాక. ఇది దీర్ఘాయువు, శతశరత్తులు, జరావస్థ వరకు జీవింపచేయునది అగును గాక.
13. క్షేమంకరుడు, ప్రభువు, వృత్రహంత, యోద్ధ, వశంకరుడగు ఇంద్రుడు ఈ మణిని ధరింపచేయును గాక. విజయి, అపరాజిత, అభయ ప్రద, వరదుడగు ఇంద్రుడు రాత్రింబవళ్ళు రక్షించును గాక.
మూడవ సూక్తము - 14
వినియోగము :-
దీనితో మూడు సూక్తములు అర్ధసూక్తములు అనబడుచున్నవి. వీని పాఠము మాతృగణములందు ఉన్నందున శాంత్యుదక మంత్రణము, అద్బుత హోమశాంత్యాదులందు వినియోగము సీమంతోన్నయన కర్మమున దీనిచే పచ్చని, తెల్లని ఆవాలను సంపాతిత అభిమంత్రితములు చేసి గర్భిణికి కట్టునది.
1. గర్భిణీ! నీవు పుట్టగానే నీ పతికి బాధ కలిగించు వానిని నివారించుటకు నీ తల్లి ఉన్మార్జనము చేసినది. కావున 'దుర్నామ' 'అలిశ' 'వత్సప' వ్యాధులు నిన్ను చేరకుండును గాక.
2. పలాల, అనుపలాల, శర్కు, కోక, మలిమ్ముచ, పలీజక, ఆశ్రేష, వివ్రివాస, ఋక్షగ్రీవ, ప్రమీలనము అను వ్యాధులను నిర్మూలించుచున్నాను.
3. దుర్నామ వ్యాధీ! నేను ఈమెకు దుర్నామ చికిత్స చేయుచున్నాను. కావున ఈమె ఊరువుల మధ్య సంకోచము కలిగించకుము. లోనికి చేరకుము. ఊరువుల దిగువకు జరుగకుము.
4. దుర్నామ, సునామలు కలసి ఉండదలచును. వీనిలో ధనశూన్య దుర్నామాదులను నష్టపరచుచున్నాము. 'సునామ' స్త్రీల యందు నిలుచును గాక.
5. కృష్ణకేశ, స్తంభజ, తుండికాసురులు దుర్మార్గులు వారిని గర్భిణి యొక్క ముష్కము నుండి కటిసంధి ప్రదేశముల నుంచి తొలగించుచున్నాము.
6. వాసన చూచి నాశనము చేయు అనుజిఘ్రమును, స్పర్శించి హతమార్చు ప్రమృశను, మాంసభక్షక క్రవ్యాదులను, నాలుకతో నాకి నాశనము చేయు రేరిహమును, ఇవి కాక మిగిలిన అలక్ష్మి కారకములను, కిష్కిష శబ్దము చేయువారిని, పసుపు పచ్చని ఆవాలు ధ్వంసము చేయును గాక.
7. గర్బిణీ! భ్రాతగా, పితగా, మరొక బంధువుగా, నపుంసకునిగా, అంతర్దానముగా స్వప్నమందు వచ్చి నిన్ను బాధించు వారిని ఈ తెల్ల ఆవాలు నష్టపరచును గాక.
8. నిన్ను నిద్రించునపుడు, జాగృతవైనపుడు బాధించు వానిని ఈ ఆవాలు సూర్యుడు చీకట్లను వలె నశింపచేయును గాక.
9. సర్షప ఓషధీ! ఈమె గర్భస్థ శిశువును బాధించ, వధించ చూచు వారిని నష్టపరచి ఈమె గర్భ ద్వారమున అభివ్యక్తి వంతము చేయుము.
10. తెలుపు, పసుపు సర్షపములారా! గాడిదవలె ఓండ్ర పెట్టుచు ఇంటి యందు తిరుగునట్టి, కుసూల రూపమున నాట్యము చేయునట్టి, బానపొట్టల, భయంకరాకారుల, వివిధ రూపముల పిశాచములను నీ గంధమాత్రమున నిర్మూలించుము.
నాలుగవ సూక్తము - 15
వినియోగము :- మూడవ సూక్తము వలె.
1. కుకుంధ పిశాచము కోడివలె కూయుచు దుష్కర్మములు చేయును. మరొకటి పిచ్చిగా కాళ్ళు చేతులు ఊపుచు అడవులందు అరచుచు తిరుగుచుండును. ఆ రెంటిని గర్భిణి వద్దకు చేరుకుండ నష్టపరచుచున్నాము.
2. సూర్యుని వెలుగు చూడలేని రాత్రించరులను, మేకతోలు వస్త్రధారులను, దుర్గంధ దూషితులను, రక్తముఖులను, వికారాలంకారులను నాశనము చేయుచున్నాము.
3. ఇంద్రా! గర్భిణులను భుజము మీద వేసుకొని తిరుగునట్టియు, స్త్రీల కటి ప్రదేశములను బాధించునట్టియు పిశాచములను నష్టపరచుము.
4. స్త్రీల ముందు కొమ్ములతో తిరుగునట్టి, వంటింట అట్టహాసము చేయునట్టి, ధాన్యపు కంకులందు అగ్గి పుట్టించునట్టి పిశాచములను గర్భిణి ఇంటినుంచి పారద్రోలుచున్నాము.
5. బ్రహ్మణస్పతి! వెనుకకు ముఖము, కాలివ్రేళ్ళు, ముందునకు మడమలున్నట్టియు, పంటపొలము లందు, ఆవు పేడయందు, గుర్రపు లద్దియందు, ముటముటలాడునట్టి, కుండవంటి అండకోశములు గలట్టి, వాయువేగవంతులగు రాక్షసులను నాశము చేయుము.
6. ఉబ్బిన కన్నులు, చిక్కిన తొడలు గల రాక్షసులు సర్పములు అగుదురు గాక. సర్షపమా! నిద్రించు స్త్రీని చుట్టుముట్ట దలచు రక్కసులను ధ్వంసము చేయుము.
7. ముని వంటి జడలు గల "మునికేశుని" బాధించు 'మరీమృశు' ని గర్భిణి కొరకు గాలించు 'ఉదుమ్బలు' ని పెద్ద తొండములు గల 'శాలుడు' ని సర్షపములు - ఆవులు తాను పాలిచ్చి ఆకుండను తన్నినట్లు - తన్నును గాక.
8. గర్భిణీ! నీ గర్భమును పీడించదలచు వానిని పుట్టిన బిడ్డను చంపదలచిన వానిని ఈ ఓషధి హతమార్చును గాక. గౌరసర్షపమా! అట్టి వానిని నీవు ఉగ్రమవై వాణి గుండెలో తన్నుము.
9. సగము పుట్టిన బిడ్డను చంపునట్టియు, పురిటింట చేరి శయనించునట్టియు, గర్భిణిని తన సొత్తుగా భావించునట్టియు గంధర్వ, రాక్షస, పిశాచాదులను గౌరసర్షపము వాయువు మేఘమును జలశూన్యము చేసినట్లు శూన్యులను చేయును గాక.
10. హోమ శేషములగు రెండు రకముల సర్షపములను గర్భిణి విడువకుండవలెను. దరించవలెను. గర్భిణీ! ఈ రెండును ప్రచండములు వీనిని నీవిలో ఉంచుకొనుము. అని నిన్ను రక్షించును గాక.
అయిదవ సూక్తము - 16
వినియోగము :- మూడవ సూక్తము వలె.
1. గర్భిణీ! నీవు పతికి అనుకూలవగునట్లును, బిడ్డలను కనునట్లును ఈ ఆవాలు చేయును గాక. అవి నిన్ను దీర్ఘనాసికాసురుని నుండి తంగల్వ, సాయక, నగ్న అసురుల నుండి రక్షించును గాక.
2. వెనకా ముందు ముఖములు గల - నాలుగు కనుల - ఐదుపాదముల - అంగుళి రహిత, తీవెల వంటి కాళ్ళు గల, తలవాల్చి నడుచునట్టి, సర్వాంగములందు వ్యాపించునట్టి రాక్షసుల నుండి రక్షింపుము.
3. పచ్చి మాంసము, నరమాంసము తినునట్టి, వెంట్రుకలు విరియ బోసుకొని అదృశ్యముగా గర్భమును తినునట్టి మూడు విధముల రాక్షసులను నాశనము చేయుచున్నాము.
4. బాధించుటకు సూర్యుని నుండి - మామ అనుమతిచే కోడలు పుట్టింటికి పోయినట్లు - భూలోకమునకు దిగివచ్చు రాక్షసులను తెలుపు, పసుపు ఆవాలు గుండెలందు తన్నును గాక.
5. గౌర సర్షపమా! నీవు గర్భమును, పుట్టిన బిడ్డను బాధించకుము. అండాదుడు గర్భపాతము చేయకుండును గాక. ఈ ఉభయ కిమీదినులను వధించుము.
6. గౌరసర్షపమా! ఈమె సంతాన హీనత, మృతవత్సదౌర్భాగ్యము, నిరంతర రోదన, పాప బాధలను - చెట్టు నుండి పూలను రాల్చినట్లు - రాల్పి వేయుము.
నాలుగవ అనువాకము
మొదటి సూక్తము - 17
వినియోగము :-
యక్ష్మాది సకల వ్యాధుల చికిత్సకు పదిచెట్ల ముక్కలను లక్క, బంగారముచే మడిచి మణిని చేసి సంపాతన అభిమంత్రణలు చేసి, సూక్తమును జపించి కట్టునది. సౌత్రామణి యాగమున ఓషధుల నుంచి తీసిన సురను అనుమంత్రించునది.
1. బభ్రు, శ్వేత, అరుణ వర్ణ ఓషధుల - పొట్టివి, నీల, కృష్ణ ఓషధుల ఎదుట నిలిచి ప్రార్ధించుచున్నాము.
2. ఏ ఓషధులకు ద్యులోకము పిత, భూలోకము మాత, సముద్రము మూలమై యున్నదో అవి దైవ ప్రేరిత యక్ష్మ నుండి ఇతనిని రక్షించును గాక.
3. ఎదుటనున్న జలము, దివ్య ఔషధములు ఇతని యక్ష్మను ప్రత్యంగము నుండి తొలగించును గాక.
4. వ్యాపించు, నిలుచు, ఆశ్రయించు, పాకునట్టి ఓషధులను ప్రార్ధించుచున్నాను. రెమ్మల, కొమ్మల, మూలముల, దేవతా సంబంధ, ప్రచండ బలవంత, జీవన ప్రధాత ఓషధులను రోగి కొరకు ఆహ్వానించుచున్నాను.
5. ఓషధులారా! నేను ఇతనికి చికిత్స చేయుచున్నాను. కావున మీలోని రోగ నిర్మూలన శక్తి, మీకున్న బలముతో ఇతనిని యక్ష్మ విముక్తుని చేయండి.
6. శుభములు కలిగించుమని జీవనప్రద, క్రోధము సహితము నష్టపరచని, మొక్కలను - పుష్పమతి, మధుమతి లలితను ఆహ్వానించుచున్నాను.
7. ప్రక్రుష్ణ జ్ఞానవంతములగు నా వాక్కులను స్నిగ్ధపరచు ఓషధులు విచ్చేయును గాక. వాని వలన ఈ రోగిని వ్యాధుల నుండి దాటింతుము గాక.





