Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda
6. ఇంద్రసోములారా! కళ్ళెము బలశాలి అశ్వమును పట్టిపెట్టినట్లు మా స్తుతులు మిమ్ము పట్టి ఉంచును గాక. ప్రశంసలు రాజును బంధించిన రీతి మా స్తుతులు మిమ్ము సంతోషపెట్టును గాక.
7. ఇంద్రసోములారా! మీరు జవనాశ్వములను ఆరోహించండి. ఇచటికి వచ్చి ద్రోహులగు రాక్షసులను వధించండి. దుష్కర్ములగు రాక్షసుల జీవనము సుఖమయము కాకుండును గాక. ద్రోహము తలచి మమ్ము ఒక్కసారి బాధించిన వాని జీవితము దుఃఖమయము అగును గాక.
8. ఇంద్రదేవా! మనసు పండి, మమ్ము అనృత భాషణమున శపించువారు దోసిలిలోని నీరు వేళ్ళ సందుల నుండి కారిపోయినట్లు వ్యర్దులు అగుదురు గాక.
9. నేను సత్యభాషిని నన్ను కువాక్యములచే నిందించువారు ఉన్నారు. నేను శుభంకరుడను. నన్ను అన్న విషయమున బాధించువారున్నారు. వారిని సోమదేవత సర్పముల పాలుచేయును గాక.
10. అగ్నీ! మా దేహశక్తిని నష్టపరచునట్టియు, మా గోవుల, అశ్వముల శక్తిని హరించదలచిన చోరులు హింసింప బడుదురు గాక. వారు దేహ, పుత్రరహితులు అగుదురు గాక.
అయిదవ సూక్తము - 10
వినియోగము :- తొలి సూక్తము వలె.
1. దేవతలారా! మమ్ము ద్వేషించి రాత్రింబవళ్ళు హింసించదలచిన వారు దేహ, పుత్రశూన్యులు అగుదురు గాక. వారు ముల్లోకముల క్రింద పడిపోవుదురు గాక. ఆ పాపుల కీర్తి ఏందీ పోవును గాక.
2. ప్రాజ్ఞుడు సత్యాసత్య వచనముల స్పర్ధను ఎరుంగును. వానిలో సత్యవచనము సౌమ్య మగును. అట్టి సత్యమును సోమదేవత రక్షించుచున్నాడు. అసత్య వచనమును హింసించుచున్నాడు.
3. సోమదేవత పాపిని విడువకున్నాడు. ఎంత బలవంతుడైన మిథ్యావాదినైనను విడువకున్నాడు. అతడు పాపరూపిని, మిథ్యాభాషిని అంతమొందించుచున్నాడు. ఉభయ దుష్టులు ఇంద్రుని పాశము లందు శయనించుచున్నారు.
4. అగ్నిదేవా! నేను అసత్యమాడి ఉండవచ్చును. దేవతాహీనుడను అయ్యుండవచ్చును. వ్యర్ధముగా దేవతలను ఆహ్వానించి ఉండవచ్చును. అట్లయినను ఏల నా మీద క్రోధింతువు? నాకు ద్రోహము తలపెట్టు వాని మీద నీ క్రోధము కనబరచుము.
5. నేను అన్యులకు బాధలు కలిగించు వారి జీవితములను దుర్భరము చేయు యాతుధానుడనని ఆరోపించుచున్నావు. అది నిజమైన నేను మరణింతును గాక. అబద్దమైన నీవు దశపుత్ర హీనుడవు అగుదువు గాక.
6. ఒకడు అరాక్షసుని రాక్షసుడు అనుచున్నాడు. ఒకడు రాక్షసుని అరాక్షసుడు అనుచున్నాడు. వారిరువురు అబద్దమాడిన వారు అగుచున్నారు. ఇంద్రుడు తన వజ్రాయుధమున వారిని హతమార్చును గాక. వారు ప్రాణులందు అధములై పతితులు అగుదురు గాక.
7. రాత్రిళ్ళు గుడ్లగూబ వలె మీద దుముకునదియు, అదృశ్యమానయై బాధించునదియు గుంతయందు బోర్లపడును గాక. సోమాభిషవ ధ్వని రాక్షసులను హతమార్చును గాక.
8. మరుత్తులారా! మీరు ప్రజల పక్షమున నిలువండి. రాక్షసులను వధించుటకు సమాయత్తులు కండి. వారిని పట్టి పిండి కొట్టండి. రాత్రులందు పక్షి రూపమున తిరుగు రాక్షసులను, యాగాములను హింసించు వారిని చూర్ణము చేయండి.
9. మఘవా! అంతరిక్షమున అశనికి ప్రేరణ కలిగించుము. దానికి సోమముచే పదను పెట్టుము. పదునెక్కిన వజ్రమున పూర్వ, పశ్చిమ, ఉత్తర దిశలందలి రాక్షసులను సంహరింపుము.
10. రాక్షసులు కుక్క వలె తినువారు. వారు హింసింపశక్యము కాని ఇంద్రుని హింసింపదలతురు. అట్టి రాక్షసులను వధించుటకు ఇంద్రుడు వజ్రమును తీక్ష్ణము చేయుచున్నాడు. ఇంద్రుడు రాక్షసుల మీద వజ్రమును ప్రయోగించును గాక.
ఆరవ సూక్తము - 11
వినియోగము :- మొదటి సూక్తము వలె.
1. హవిని మథించుటను ఆటంకపరచు రాక్షసులను ఇంద్రుడు బాణములు వేసి హతమార్చును గాక. గొడ్డలి చెట్లను కొట్టినట్లు కర్రతో కుండలను పగుల కొట్టినట్లు ఇంద్రుడు రాక్షసులను వధించుచు వచ్చును గాక.
2. ఇంద్రదేవా! గుడ్లగూబ, పిల్లగుడ్లగూబ, కుక్క, చక్రవాక, గరుడ రూపములతో వచ్చు రాక్షసులను రాళ్ళతో కుండలను బద్దలు చేసినట్లు హతమార్చుము.
3. మమ్ము యాతనల పాల్జేయు రాక్షసులు మమ్ము చేరకుందురు గాక . స్త్రీ పురుష కిమీదినులు దూరమగుదురు గాక. భూదేవి భూసంబంధ బాధల నుండి, అంతరిక్షము అంతరిక్షసంబంధ బాధల నుండి రక్షించును గాక.
4. ఇంద్రా! పురుష యాతుధానులను, మాయలు చేయు స్త్రీ యాతుధానులను వధింపుము. అభిచారకుల తలలు తెగి పడును గాక. వారు సూర్యోదయమును దర్శించకుందురు గాక.
5. ఇంద్రసోములారా! అప్రమత్తులై ఉండండి. రాక్షసుల మీద మీ ప్రతికూల దృష్టి ప్రసరింపచేయండి. యాతుధానులను మీ వజ్రముచే వధించండి.
మూడవ అనువాకము
మొదటి సూక్తము - 12
వినియోగము :-
ఈ సూక్తము అభిలషిత ప్రయోజన సిద్ది కొరకు ప్రయోగించబడును. పెరుగు తేనెలో మూడు రాత్రులు నానబెట్టిన తిలకమణిని సంపాతన, అభిమంత్రణలు చేసి కట్టునది.
దీని పాఠము కృత్యా ప్రతిహరణమున ఉన్నందున శాంతిజల అభిమంత్రణాదులందు వినియోగము. రౌద్రీ మహాశాంతి యందు వినియోగము పిష్ఠ రాత్రి విధానపు ప్రతిసర బంధమున దీని పాఠము కలదు.
1. ఈ మణి కృత్యా విరోధి. వీరులకు కట్టబడునది. ఇది వీరత్వము కలది. శత్రుసంహారకము. శూరవీరము. రక్షించునది. శుభములు కలిగించునది.
2. ఈ మణి శత్రుసంహారక. వీరపుత్ర, అన్నప్రద. సాహసి. బలవతి. ఉగ్ర కృత్యకారుని నశింపచేయుటకు వచ్చుచున్నది.
3. ఇంద్రుడు ఈ మణి ప్రభావముననే వృత్రుని జయించినాడు. విద్వాంసుడై అసురులను హతమార్చినాడు. దీని ప్రభావముననే ఇంద్రుడు ద్యావాపృథ్వులకు అధిపతి అయినాడు. నాలుగు దిశలను గెలిచినాడు.
4. ఈ 'స్రాక్త్య మణి వ్యతిరేక ప్రభావము కలదు. రోగములను నిరోధించునది. ఓజస్వి యుద్దములందు శత్రువును వెన్నంటునది. వశపరచుకొనునది. "సో అస్మాన్ పాతు పర్వతః" అది మమ్ము సర్వత్ర రక్షించును గాక.
5. ఈ మణి కృత్యా వ్యతిరేకి అని అగ్ని, సోముడు, బృహస్పతి, సవిత, ఇంద్రుడు అన్నారు. ఆ దేవతలు, పురోహితులు అభిచారకులను అటు త్రిప్పి పంపుదురు గాక.
6. నాకు కృత్యకు మధ్య ద్యావాపృథ్వులను నిలుపుచున్నాను. కృత్యకు అడ్డముగా సూర్యుని నిలుపుచున్నాను. దేవతలు, పురోహితుడు కృత్యను మెడవంచి గెంటి వేయుదురు గాక.
7. 'స్రాక్త్య' మణిని కవచముగ ధరించువారు - సూర్యుడు చీకట్లను వలె - కృత్యాదులను తరుముచున్నారు.
8. 'స్రాక్త్య' మణి ఋషి వంటిది. మనీషి వంటిది. దానిచే సకల శత్రుసేనను జయించినాను. ప్రమాదకారులగు రాక్షసులను వధించినాను.
9. అంగిరసునిచే, అసురులచే కల్పించబడిన స్వయంకృత, అన్యకృత కృత్యలు, నావల మీద మాత్రమే దాటగల తొమ్మిది నదుల ఆవలకు వెళ్ళిపోవును గాక.
10. పరక్రుత కృత్యాది ప్రహార పరిహారక మణిని ఇతనికి కవచరూపమున ఇంద్రుడు, విష్ణువు, సవిత, ప్రజాపతి, విరాట్, వైశ్వానర దేవతలు, ఋషులు ధరింపచేయుదురు గాక.
రెండవ సూక్తము - 13
వినియోగము :- పూర్వ సూక్తము వలె.
1. మణీ! చతుష్పాత్తులందు ఎద్దు, కుక్క మున్నగు వానియందు వ్యాఘ్రము వలె నీవు ఓషధులందు శ్రేష్ఠమవు. నీ ప్రభావమున అభిచారకులను, ద్వేషించువారిని తొలగించినాము.
2. ఈ మణిని ధరించిన వాడు వ్యాఘ్రము, సింహము, వృషభము వంటి బలశాలి అగుచున్నాడు. శత్రుసంహారకుడు అగుచున్నాడు.
3. ఈ మణిని ధరించిన వానిని అప్సరసలు, గంధర్వులు, నరులు బాధింపజాలరు. అతడు సమస్త దిశలందు విరాజిల్లుచున్నాడు - "సర్వాదిశో విరాజతి"
4. మణీ! నిన్ను కశ్యపుడు కనుగొన్నాడు. అతడే నిన్ను సర్వోపకారము కొరకు నియమించినాడు. ఇంద్రుడు దీని వలననే విజయుడైనాడు. మానవులు యుద్దము లందు జయించుచున్నారు.
5. వేల శక్తులు గల ఈ మణిని దేవతలు కవచముగా ధరించినారు.
6. కృత్యచే గాని, దీక్షవలన గాని, యజ్ఞములచే గని హింసించ దలచిన వానిని ఇంద్రుడు తన శతపర్వ వజ్రమున హతమార్చును గాక.
7. ఈ మణి కృత్యాదులను త్రిప్పికొట్టునది. బలప్రదము. జయప్రదము. ఇది మా ప్రజను, ధనమును రక్షించును గాక. ఇది మాకు సకల దిశా రక్షకము, మంగళప్రదము అగును గాక.
8. శూర ఇంద్రా! మాకు ఉత్తర, పశ్చిమ, దక్షిణ దిశలందు శత్రుంజయ జ్యోతి నిలుచును గాక. మా ముందు జ్యోతిని నిలుపుము.





