Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam
అమ్మ తలుపు తట్టింది. తీశాను. నాగేశ్వరరావు - దామినేని వెంకటేశ్వరరావు వచ్చారు. వారిని చూచి మస్తాన్ జంకాడు. వారికి సలాం చేశాడు. వెళ్లిపోయాడు.
"ఏమిటీ దురంతం?" నాగేశ్వరరావు నిప్పులు కక్కుతున్నాడు. అతనిని శాంత పరచడానికి నేను బాధలు పడాల్సివచ్చింది. వెంకటేశ్వరరావు అంతటి ఉద్రేకపరుడే! ఎందుకో అప్పుడు అంత ఆవేశ పడలేదు. వీళ్లిద్దరూ అండర్ గ్రౌండు కామ్రేడులే! గొంగళ్లు కప్పుకొని వచ్చారు.
అమ్మ చాయ్ తెచ్చి పెట్టింది. "నాయనలూ! మమ్ములను పంపించండి. మేము ఉండగా ఏ దురంతం తలపెట్టకండి" అని చెప్పి వెళ్లిపోయింది.
అమ్మ మాటలు వాళ్లిద్దరినీ ఈ లోకంలోకి తెచ్చాయి. "అమ్మ" అంటే వారికి ఎంతో అభిమానం. వాస్తవంగా వారు వచ్చింది రషీద్ మీద దాడికి పథకం సిద్ధం చేయడానికి! నేను పరిస్థితులు వివరించాను. దాడి జరుగుతే గ్రామం దగ్ధం అవుతుంది - నిర్దోషులు బలి అవుతారు అని వివరించాను.
వెంకటేశ్వరరావు నామీద ఎగబడ్డాడు. 'చేతులు ముడుచుక్కూర్చుంటే విప్లవం ఎలా వస్తుంది? విప్లవం అన్నాక కొందరికి హాని జరుగక తప్పదు' అన్నట్లు ఉపన్యసించాడు.
"మీరు అడవిలో లేరు. ఊళ్ల ఉన్నరు. కాస్త మెల్లగ మాట్లాడండి" అన్నది అమ్మ లోపలికి వచ్చి.
"ఫలితం గొప్పది అయినపుడు త్యాగానికి వెనుకాడరాదు. ఫలితం లేని త్యాగం నిష్ప్రయోజనం అవుతుంది" అని వివరించాను. నా మాటలు వాళ్లకు రుచించలేదు. కాని, అమ్మమాట కాదనలేక పథకం వాయిదా వేసుకున్నారు.
వాళ్లు అమ్మతో చెప్పి 'పచ్చిపులుసు' చేయించుకున్నారు. అమ్మచేసిన "పచ్చిపులుసు" అంటే వాళ్లకు ఎంతో ఇష్టం. ముగ్గురం కలిసి భోజనం చేయడం అదే చివరిసారి. అంతేకాదు. వాళ్లిద్దరినీ కలుసుకోలేకపోయాను. ఒకరి తరువాత ఒకరు బలి అయినారు!
దామినేని వెంకటేశ్వరరావు - పానుగంటి నాగేశ్వరరావును ఏరు దాటించి వచ్చాను.
అదేవారికి నేను ఇచ్చిన తుది వీడ్కోలు!
తరువాత శ్రీరాములుగారు వచ్చారు. పత్రికలు వార్తను ప్రముఖంగా ప్రకటించాయి. శవయాత్ర బాగా జరిగింది. నది ఒడ్డున దహన సంస్కారం జరిగింది. శ్రీరాములుగారు దరఖాస్తులు ఇచ్చారు. చాలమంది పెద్దలను కలిశారు. పైరవీలు చేశారు. కొందరు కార్ల వచ్చారు. విచారణ జరిపారు. కాని, రషీదును ఏమీ చేయలేకపోయారు.
అయితే దైవిక న్యాయం గొప్పది. రషీద్ ఒక స్త్రీ విషయంలోనే హతుడయినాడు!
2. రజాకార్ల దురంతాలు మితిమీరుతున్నాయి. రజాకార్లు "గొల్లచర్ల" గ్రామం మీద పడ్డారు. ఇళ్లు తగలపెట్టారు. తగలబడుతున్న ఒక ఇంట్లోంచి ఒక తల్లి పసిబిడ్డను బుజానవేసుకొని బయటపడింది. అది ఒక రజాకారు చూచాడు.
పసిపిల్లను - తల్లినుంచి గుంజుకున్నాడు. మంటల్లో విసరి వేశాడు. తల్లి బిడ్డకోసం మంటల్లోకి ఉరికింది. తల్లి - బిడ్డలు మసి అయ్యారు.
గొల్లచర్ల సాంతం దోచుకున్నారు. ఆడవాళ్ల మంగళసూత్రాలు కూడా గుంజుకున్నారు. నగలు - మంగళసూత్రాలూ బిందెలతో పట్టుకుపోయారు.
స్త్రీలను నానాహింసలు పెట్టారు. సామూహికంగా మానభంగాలు చేశారు. ఆడవాళ్ల చన్నులు కోసి ఆనందించారు. ఎంతమందిని హత్యచేశారో లెక్కలేదు. ఊరిని వల్లకాడు చేసి వెళ్లిపోయారు!
3. పెరుమాళ్ల సంకేస కమ్యూనిస్టుల తావరం. ఆ వూరి తుమ్మా శేషయ్య ప్రఖ్యాత కమ్యూనిస్టు. రజాకార్లు ఆ వూరిని ధ్వంసం చేయడలచాడు. మిడతల దండులా మీద పడ్డారు.
అల్లాహో అక్బర్
ఆజాద్ హైదరాబాద్ - జిందాబాద్
ఆలహజ్రత్ - పాయిందాబాద్ అనే నినాదాలతో ఊరిని ముట్టడించారు. తలుపులకు బయటినుంచి గొళ్లేలు పెట్టారు. ఇళ్లకు నిప్పంటించారు. ఇళ్లు తగలబడడం - ఇళ్లల్లో వారి హాహాకారాలు విన్నారు. దుర్మార్గులు ఆనందంతో నాట్యం చేశారు.
రజాకార్లు ఊరిబయట చితిపేర్చారు. బయట దొరికినవాళ్లను సజీవంగా అందులో పడేశారు. మంటల్లోంచి బయటికివచ్చారు కొందరు. వారిని మళ్లీ మంటల్లోకి నెట్టారు. దారుణాతిదారుణంగా కాల్చి చంపారు.
గ్రామంలోకి ప్రవేశించబోయిన ఒక తురకను పట్టారు. వాడు తాను తురకను అనే ధైర్యంతో వచ్చాడు. రజాకార్లు వాణ్ణి పట్టుకున్నారు. తాను తురకను అని చెప్పినా వినలేదు. మంటల్లోనికి విసిరారు. వాడు మూడుసార్లు మంటల్లోంచి ఉరికి వచ్చాడు. మూడుసార్లు వాణ్ణి మంటల్లోకి నెట్టారు.
జిహద్ జరిగిపోయిందని పట్టలేని ఆనందంతో పరుగులు పెట్టారు. చితిమంటల వెలుగులో తాగారు - తిన్నారు. తందనాలాడారు. ఊరిని బుగ్గి చేశారు. ఊరినుంచి కదిలారు.
4. బయ్యారం గ్రామం మీద రజాకార్లు దాడి చేశారు. ఇళ్లు లూటీ చేయడానికి బయల్దేరారు. మహిళలు కారం నీళ్ల ముంతలతో రజాకార్ల ముఖాలకు కొట్టారు. రోకళ్లు - పొరకలు పట్టుకుని రజాకార్ల వెంట పడ్డారు. గిరిజన మహికలు కొరకంచులు పట్టుకొని అంటించారు. పురుషులు కర్రలతోనూ - బరిశెలతోనూ ఎదిరించారు.
రజాకార్లు ఇలా జరుగుతుందని ఊహించి ఉండదు. ఖంగు తిన్నారు. చెట్టుకు ఒకడు - గుట్టకు ఒకడు అయి ఉరికారు. అలా పారిపోయేప్పుడు - ఎందరో గుర్తులేదు - ఒకరిద్దరు యువతులను ఎత్తుకుపోయారు. తరువాత వారి మృతదేహాలు కనిపించాయి.
రజాకార్లు వెళ్తూ - వెళ్తూ పంటలకు నిప్పంటించి పారిపోయారు. పంటసాంతం ధ్వంసం అయింది.
5. రంగాపురానికి పోలీసులు గుర్రాలమీద వచ్చారు. వారు దామినేని వేంకటేశ్వరరావు కోసం వచ్చారు. దామినేనిని చూపించమని అనేకమందిని కట్టారు. కొట్టారు. ఆడవాళ్ల జుట్లు కోశారు. వాళ్లను దిగంబరంగా తిప్పారు. మానభంగాలు చేశారు. నానా బీభత్సం సృష్టించారు.
వెంకటేశ్వరరావు ఊళ్లోనే ఉన్నాడు. అయినా ఒక్కరూ అతని జాడ చెప్పలేదు.
దామినేని తప్పించుకోవడానికి ఉరికాడు.
గుర్రంమీది పోలీసు చూచాడు.
గురిపెట్టి కాల్చాడు.
దామినేని కూలాడు
రెడ్ శాల్యూట్ దామినేని!
విప్లవజోహార్ దామినేని!!
జీవితంలో తొలిసారి మిత్రుణ్ణి కోల్పోయాను. కనీసం శవాన్ని చూడలేకపోయాను. నేను మనిషిని కావడానికి వారం పట్టింది. కనీసం రంగాపురం వెళ్లలేదు. అది నా బలహీనతో - భయమో చెప్పలేను!
6. అప్పటికి దళాలు స్థిరపడ్డాయి. 'దళం' పోలీసులకు - రజాకార్లకు సింహస్వప్నం అయింది. ఒకనాటి వార్త:
ఒక పోలీసు స్టేషను. రాత్రి పూట. స్టేషనును ఇద్దరు పోలీసులు - సాయుధులయి - కాపలా కాస్తున్నారు. ఒకడు స్టూలుమీద కూర్చున్నాడు. తుపాకిని పట్టుకొని కునికిపాట్లు పడుతున్నాడు. ఒకడు సావధానుడై 'పహరా' ఇస్తున్నాడు.
కునికిపాట్లు పడుతున్న పోలీసుకు దళం దాడి చేసినట్లు కల వచ్చినట్లున్నది. తుపాకి అందుకున్నాడు. తోటవాణ్ణి కాల్చాడు. 'పహరా' వాడు తనను కమ్యూనిస్టులు కాల్చారనుకున్నాడు. వాడు వీణ్ణి కాల్చాడు.
ఇద్దరూ చచ్చారు.
ఇద్దరి తుపాకులూ కమ్యూనిస్టులు గుంజుకుపోయారు!
7. గూడా సూర్యనారాయణ మా మిత్రబృందంలోనివాడే. కాని, రాజకీయాలకు కాస్తదూరం. సర్కారీ కొలువు చేస్తున్నాడు. టీచరు ఉద్యోగం. ఆ విలయకాలంలో రాజకీయాలకు దూరంగా ఉన్నవారు కూడా - ఉద్యమంలో దూకారు. సూర్యనారాయణ దూకలేదు. హైదరాబాదునుంచి త్రివర్ణ పతాకం తెచ్చాడు.
కాంగ్రెస్ వారు జాతీయ పతాకం ఎగురవేసే కార్యక్రమం చేపట్టారు. ఆ కార్యక్రమానికి ప్రభావితుడయి సూర్యనారాయణ పతాకం తెచ్చాడు. అది ఎగురవేసే పథకం కోసం మా ఇంటికి వచ్చాడు.
బీరోలు అమృతరెడ్డి - నేను చదివిన ఆరో తరగతి వరకూ - నాకు క్లాస్ మేటు. పెద్ద భూస్వామి - గార్ల జాగీరులో దొరలు లేరు - భూస్వామి కొడుకు ఉద్యమంలో భాగంగా కాలేజీ వదిలాడు. విశాఖపట్టణంలో చేరాలని సంకల్పం. అతడూ మా ఇంటికి వచ్చాడు.
పతాక ఆవిష్కరణను గురించి ముగ్గురం చర్చించుకున్నాం. రాజకీయాలూ చర్చకు వచ్చాయి. అమ్మ టీ చేసి ఇచ్చింది. ఆమెకు ఊరు వదిలి వెళ్లాలని ఆతురత ఎక్కువయింది. పరిస్థితులు క్రూరంగా - ఘోరంగా - దారుణంగా ఉన్నాయి. అమ్మ తన మాట బయటపెట్టింది.





