Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam
కుంతి కర్ణుని దగ్గరికి వెళ్తుంది. 'నీవూ నా బిడ్డవే! నా బిడ్డలను - అంటే పాండవులను - రక్షించ'మంటుంది. "అమ్మా! నీ కొడుకుల్లో అర్జునుణ్ణి తప్ప మిగతా నలుగురిని చంపను. అర్జునుడో నేనో హతం కావడం నిశ్చయం. ఎట్లయినా నీకు అయిదుగురు పుత్రులు ఉంటారు" అంటాడు కర్ణుడు.
అమ్మ కూడా తల్లికదా! తన బిడ్డను - ముఖ్యంగా పసివాళ్లయిన ముగ్గురు కూతుళ్లను - కాపాడుకోవాలని ఆతురత! ఆమె తల్లి. తల్లికి ఉన్న తొందర ఎవరికి ఉంటుంది? కోడి తన పిల్లలను రెక్కలు కింద దాచుకుంటుంది. అమ్మ - చెల్లెళ్ళను అట్లా కాపాడుకుంటున్నది. కాలం అలా ఉంది. కాటేసేటట్లుంది.
"అమ్మా! అన్నయ్య జేల్లో భద్రం. నేను పోయినా నీకు ఒక కొడుకుంటాడు" అన్నాను.
ఆ మాట విన్నది. అమ్మ నన్ను పట్టుకొని పెద్దగా ఏడ్చింది. "అట్లనకు నాయనా! నాకు అయిదుగురు ఉండాలె. అయిదుగురి చేతుల్ల నేను పోవాలె" అన్నది. నేను పరిహాసానికి అన్నమాటే ఆమెను విలవిలలాడించింది.
అమ్మది అవితథవాక్కు. ఆమె ఆశీస్సులే నన్ను రక్షించినట్లున్నాయి. ఆమె సంకల్పం గట్టిది! 1960లో మా అయిదుగురి చేతుల్లోనే ఆమె పోయింది. అమ్మ కష్టాలకే పుట్టింది! సుఖం ఎరగదు!!
సూర్యనారాయణ, అమృతరెడ్డి - నేను ఒక పథకం సిద్ధం చేసుకున్నాం. తెల్లవారి - స్టేషనుముందున్న - తాసీల్ కచ్చేరీ మీద జండా ఎగరేయాలి!
ఆ సాహసం ఏమిటో తెలియదు. "పోతే ప్రాణమే కదా!" అనుకునేవాణ్ణి!
వాళ్లిద్దరూ వెళ్లిపోయారు. ఆ రోజు కార్తీక పౌర్ణమి. వెన్నెల విరబూసింది. చెల్లెళ్లు - అమ్మ భోజనాలు చేశారు. నాకు అజీర్ణం - కడుపునొప్పి. అన్నం పడదు. ఇన్ని టీ నీళ్లతో కాలం గడపడం. అట్లయినా కుండెడు వాంతి. ఈమధ్య రక్తం కూడా పడింది! తండ్రి పోషణ లేదు. తల్లి అసమర్థ. అన్న జైల్లో! మందులేదు. మాకులేదు. ఫిర్ భీ జీరహే హైఁ. అయినా జీవిస్తున్నాం.
బేభైప్ జిందగీహై జియెజారహాహూఁ
ర్షీషాహైఖాళీ - ఫిర్ భీ పియె జారహోహూఁ
జీవితంలో రుచిలేదు. అయినా బ్రతుకుతున్నాను.
సీసా ఖాళీగా ఉంది. అయినా తాగుతున్నాను.
ఆ రోజు కార్తీక పౌర్ణమి - 1948. వెన్నెల పాలు పారపోసినట్లుంది. వెన్నెల పిండి ఆరబోసినట్లుంది. వెన్నెల పుచ్చపూవులాగుంది. వెన్నెల పున్నమి వెన్నెల లాగుంది. పున్నమి పున్నమిని మించింది.
వెన్నెలంటే నాకు ఇష్టం. అందం అంటే ఇష్టం. అది అమ్మాయిలో ఉన్నా - అమనిలో ఉన్నా ఆనందించగలను. అందమే ఆనందం - ఆనందమే జీవిత మకరందం!
కార్తీకపు వెన్నెల. చలిగానే ఉంది. అయినా ఆరుబయట కూర్చున్నాను. చెల్లెళ్లు నిద్రపోయారు. అమ్మ ఇంకా నిద్రపోలేదు.
మీసాల సర్వర్ - జమేదార్ - వచ్చాడు. గొంతు సవరించుకుని దగ్గాడు. వాడు రాక్షసుడు. దగ్గాడంటే ఎవనికో మూడినట్లే! ద్దగ్గు విన్నది. అమ్మ బయటికి వచ్చింది.
"మోజిమీమ్ సాబ్ బులారైఁ - పోలీసు సూపర్నెంటు పిలుస్తున్నాడు అన్నాడు" సర్వర్.
నాకు అర్థం అయింది. ఇది జీవితాంతం! రేపటి వెలుగు చోదను౧ నేను తప్పించుకోగలను. సర్వర్ చేతిలో దండా తప్ప ఏదీలేదు. తాగి ఉన్నాడు. తప్పుకోవడం చాల తేలిక! కాని, అమ్మా - చెల్లెళ్లు? తరువాత పరిణామాలు?
అమ్మ వాకిట్లో నుంచొని ఉంది. సరిగ్గా ఇలాగే అన్నయ్యను తీసికెళ్లారు. జేబుకు పంపారు. అప్పుడు అమ్మ పెద్దగా ఏడ్చింది. ఇప్పుడు నన్ను తీసికెళ్లడానికి వచ్చాడు. పరిణామం అమ్మకు తెలుసు. అయినా ఆమె ఏడ్వలేదు. శిలావిగ్రహంలా నుంచుంది.
"ఛలియే" అన్నాను. నేను ఇంట్లోకి కూడా వెళ్లలేదు. నిక్కరు - హాఫ్ షర్టుతో బయల్దేరాను. సర్వర్ ముందు - వెనుక నేను వెళ్తున్నాం.
పూసాల నారాయణగారు అరుగుమీద నుంచున్నారు. వారు సర్వర్ను గమనించలేదు. "ఎక్కడికి?" అని నన్ను అడిగారు. అది సర్వర్ విన్నాడు.
"అబె సునార్! తూభీ చల్ - అరె కంసాలీ, నువ్వూనడువ్" అన్నాడు సర్వర్.
"నేనేం చేసిన సర్కార్! నన్నెందుకు పట్కపోతరు?" అన్నాడు నారాయణ.
"చల్తా క్యానైఁ - నడుస్తావా లేదా" అని దండా ఎత్తాడు సర్వర్.
నారాయణగారు మెట్లు దిగి వచ్చారు. వారి భార్య సర్వర్ను చూచింది. గొల్లుమని ఏడ్చింది. గుమ్మంలో పడిపోయింది. నారాయణగారిని వెనుతిరుగ నివ్వలేదు సర్వర్.
ఎదురుగా సూర్యనారాయణగారు పులిహోర తెస్తున్నారు మా ఇంటికి - కార్తీక పౌర్ణమికదా!
"అబె బొమ్మన్! తూభీ చల్ - ఒరే బాపడా! నువ్వూ నడువు" అన్నాడు సర్వర్ - దగ్గాడు.
"మైఁ సర్కారీ ములాజమ్ హూఁ మైఁక్యౌఁ, నేను సర్కారీ ఉద్యోగిని. నేనెందుకు?" అడిగారు సూర్యనారాయణ.
"ములాజిమ్ కే బచ్చె! చల్తా క్యానై" అని సర్వర్ సూర్యనారాయణను తోశాడు. పులిహోర సాంతం నేలమీద పడిపోయింది. పై పంచెతో సూర్యనారాయణ సాగాడు.
కొంతదూరం సాగాం. అమృతారెడ్డి పక్క చుట్ట చంకన పెట్టుకుని మా ఇంటికి వస్తున్నాడు.
"రెడ్డీసాబ్! ఆప్ భీ చలియే, రెడ్డిగారూ! మీరూ నడవండి" అన్నాడు సర్వర్ - దగ్గలేదు.
"అరే భయి, మైఁ క్యోఁ" అడిగాడు అమృతన్న.
"మోతిమీమ్ సాబ్! బతాతైఁ - మొహతమీర్ తెలియపరుస్తారు" అన్నాడు సర్వర్.
అమృతారెడ్డిగారు సాగారు.
మా నలుగురినీ - భారత విభజన బాధితుడు - కాజిం అలీ - పోలీస్ మెహతమీమ్ ఇంటికి తీసికెళ్లాడు. కాజిమలీ ఇల్లు తాసిల్దారు బంగళాముందు, విశాలం అయిన విడిస్థలంలో వెన్నెల వళ్లు విరుచుకుంటున్నది. కాజిం నీడలో కుర్చీలో కూర్చున్నాడు. తాగినట్లున్నాడు. పిస్తోలు చేతులో ఉంది! మా కోసమే ఎదురు చూస్తున్నట్లున్నాడు.
సర్వర్ సలాం కొట్టాడు. మమ్ములను హాజరుపరచిన విషయం విన్నవించాడు.
"అబె! అఖల్ కె కచ్చే! ఇన్ సబకో క్యౌఁ లాయాబె! బేవకూఫ్ అరే! పచ్చి తెలివికాడా! వీళ్లందర్ని ఎందుకు తెచ్చావుర బేవకూఫ్?" అని సర్వర్ మీద అరచాడు.
అప్పుడు అర్థం అయింది. కాజిం నన్ను ఒక్కణ్ణే తీసుకురమ్మన్నాడు. తాగినమైకంలో సర్వర్ గాడు అందరిని పట్టుకొచ్చాడు. కాజిం ప్లాను పట్టాలు తప్పింది. నాకింకా ఆయుర్దాయం ఉంది!
"అరే! గాంధీ కె బచ్చే. ఇధరా," కాజిం పిలిచాడు. ఎవరిని అంటున్నాడో అర్థం కాలేదు. ఒకరిని ఒకరం చూసుకున్నాం.
"అబె ఆబే" అని నామీద లంఘించాడు. పిస్తోలు మడమతో తలమీద కొట్టాడు.
"అమ్మా!" అని కూలబడ్డాను. "అమ్మా! క్యాఁబోల్తా బే గాంధీ బోల్ - తేరా బావా గాంధీహైనా - అమ్మా ఎందుకంటావురా గాంధీ అను. మీ అయ్య గాంధీ కద" అని గొరగొర గుంజుకుపోయాడు.
అప్పుడు వాడన్నమాటలు వ్రాయడం అప్రస్తుతం. అనవసర ఆవేశకావేశాలకు కారణం అవుతాయి. ఒక్కటి మాత్రం చెపుతా. "బొమ్మన్ భీక్ మాంగ్యా! సర్కార్ చలాతా! దేఖ్తేరహో! సారాహిందుస్తాన్ పాకిస్తాన్ బన్ జాయెగా - బాపనోడు (నెహ్రూ) బిచ్చం అడుక్కోవాలి. రాజ్యం ఏలుతాడా? చూస్తుండు హిందుస్తాన్ సాంతం పాకిస్తాన్ అవుతుంది."
కాజిం దండా తీసుకొని నా మీద పడ్డాడు. ఎన్ని కొట్టాడో తెలియదు. మొదటి రెండు మూడు దెబ్బలు బాధ పెట్టాయి. తరువాత దెబ్బలు తగిలినట్లనిపించలేదు. నేను అరవలేదు. కేకలు పెట్టలేదు. ఏడవలేదు. కొట్టినంతసేపు కొట్టాడు. కర్ర అవతల పారేశాడు. కుర్చీలో కూలబడ్డాడు.
"జనాబ్!" సూర్యానారాయణ అన్నాడు "ముఝే పాయెఖానా అతాహై - నాకు దొడ్డికి వస్తున్నది."
"అబె! తూ యహీఁ హగ్నా. నికాత్ కేఫెంక్నా - అరే! నువ్వు ఇక్కడనే ఏరగాలి. ఎత్తివేయాలి" అన్నాడు కాజిం.
"నహీఁ జనాబ్ అబ్ బంద్ హోగయా!" అయ్యా! రావడం లేదు. బందైంది అన్నారు" సూ.నా.
"అబె సర్వర్! లేరా అఖల్ ఘట్నోఁమైఁహై. ఎహ్ కమీనిస్ మాదర్ చోడోఁ కూ హూలాల్ మెఁ బందకర్. అయీసమ్ ఝ్ మే - అరే సర్వర్! నీ తెలివి మోకాళ్ళో ఉంది. (బుర్రలో లేదు) కమ్యూనిస్టు కొడుకుల్ను కస్టడీలో నూకు. అర్థం అయిందా?" ఆర్డరు ఇచ్చాడు కాజిం.





