Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam
రషీద్ బొర్రతాసిల్దారు కొడుకు. ప్రస్తుత తాసిల్దార్ తమ్ముడు. వాని కామం. కన్ను కానదు. వాడు అనుకున్న ఆడది వాని పక్కన చేరాల్సిందే! కాని, అంతటి రాక్షసుడు కూడా సంస్కారంగల కుటుంబాల జోలికి పోలేదు.
రషీద్ రజాకారుల్లో చేరాడు. వాడు సాలార్ అయినాడు. సాలార్ అంటే కమాండరు. అసలే దుష్టుడు. అధికారపు అండ లభించింది. చిచ్చురేగిపోయాడు.
ఆనాటి సాయంత్రం గేదె శ్రీరాముగారి ఇంటికి చేరలేదు. శ్రీరాముగారు గ్రామంలో లేరు - ఒక రజాకార్ వారి ఇంటికి వచ్చాడు. శ్రీమతి ఉన్నారు. వచ్చినవాడు వారి గేదె బందెలో పడ్డదని చెప్పాడు. వచ్చి విడిపించుకొమ్మన్నాడు. పాపం, పెద్ద మనిషి నమ్మింది. కసాయి వెంట గొర్రెవలె వాని వెంటసాగింది.
చీకటిపడింది. శ్రీమతి గుండెలో చీకట్లు లేవు. వాడు ఆమెను రషీదు ముందుకు తీసికెళ్లాడు. ఆమెకు తాసిల్దారు ఎలా ఉంటాడో తెలియదు. వాడే తాసిల్దారు అనుకుంది. బిడ్డముందు తల్లి నిలిచినంత నమ్మకంతో - విశ్వాసంతో - బెదురులేక నిలిచింది. తన బర్రెను వదలమని ధైర్యంగా అడిగింది.
రహీద్ దుర్మార్గుడు. తండ్రి 'నికా' చేసుకున్నదాన్ని తాను ఉంచుకున్నాడు. శ్రీమతిలో వాడికి తల్లి కనిపించలేదు. ఆమె వృద్ధ. వానిలో కామ ప్రకోపానికి పనికిరాదు. వానిలో మతపు మహాసర్పాలు బుసకొడుతున్నాయి. అప్పుడు వాడు వాడిన వాక్యాలు ఇప్పుడు వ్రాయడం సమంజసం కాదు.
దుశ్శాసనుడు ద్రౌపదిని వలె - దుష్టుడు శ్రీమతి వలువలు వలచాడు. ఆమెను దిగంబరం చేశాడు. ఇహ తదుపరివి వ్రాయలేము - కాని, ఆమెను సామూహికంగా చెరిచారు. మానం పోగొట్టుకున్న శ్రీమతి బయట చీకట్లు, గుండెలో చీకట్లతో ఇల్లు చేరింది.
శ్రీమతి ఇంటి తలుపు తీయలేదు.
పెరట్లో ప్రవేశించింది.
తిరిగి చూడలేదు.
బావిలో దూకింది.
ప్రాణాలు తీసుకుంది.
కన్యక మానం రక్షించుకున్నది. మంటల పాలయింది. శ్రీమతి మానం కోల్పోయింది. నీటిపాలయింది.
తెల్లవారిగాని వార్త పొక్కలేదు. వార్త తొలుత తెలిసింది నాకే. చెప్పినవాడు మస్తాన్. మస్తాను తాసిల్దారు మార్బలంలో వాడు. నా దగ్గర రాత్రి పాఠశాలలో చదువుకున్నాడు.
మస్తాన్ ఉదయమే మా ఇంటికి వచ్చాడు.
అతడు ప్రాణం ఉన్నట్లు లేడు. శవంలా నుంచున్నాడు. తలవంచుకున్నాడు. కన్నీరు కురిపించనున్నాడు.
కొండకూలబోతున్నట్లనిపించింది నాకు.
"బోలో - క్యాబాత్ హై?" అడిగాను.
"సాబ్ గజబ్ హోగయా! - విలయం జరిగిపోయింది" అన్నాడు. కూలబడి ఏడ్చాడు.
నేను అతణ్ణి ఓదార్చడానికి అతని తల నిమిరాను. "బోలో, కౌన్సీ ఆఫ్ త్ హై - ప్రమాదం ఏమిటో చెప్పు" అన్నాను.
"శ్రీరామ్లూ సాబ్ కే జనానే కో.... శ్రీరాములు గారి భార్యను..."
"బోలో - క్యాహూవా?"
"రషీద్ నే -"
"రషీద్ నే క్యాకియా?" నాకు చమటలు పట్టాయి. కాళ్లూ, చేతులూ వణుకుతున్నాయి. నాలుక ఆరుకుపోతున్నది.
"ఔర్ క్యాబోలూఁ సాబ్! అస్మత్ దరికీ - ఇంకేం చెప్పమంటారు? చెరిచాడు."
తరువాత అతను నిలువలేదు. శవంలా నడిచి వెళ్లిపోయాడు.
నేను కూలబడ్డాను. అయోమయంలో ఉండిపోయాను. మొద్దుబారి పోయాను. ఏమీ తోచలేదు. ఏమీ అర్థం కాలేదు. ఆకాశం విరిగి నెత్తిన పడినట్లయింది.
అమ్మ ఉరికి వచ్చింది. నన్ను పట్టుకుని ఊపింది. అప్పుడు నాకు తెలివి వచ్చింది. ఎవరికో అప్పగిస్తున్నట్లు అన్నాను -
"శ్రీరాములుగారి భార్యను చెరిచారు!"
అమ్మ అయోమయంగా అడిగింది. ఏదో కథ వింటున్నట్లు అడిగింది.
"ఏ శ్రీరాములు? ఎక్కడి కథ?"
"చిలుకూరి శ్రీరాముగారి భార్యను రషీద్ చెరిచాడు!"
అమ్మ అది విన్నది. పెద్దగా ఏడ్చింది. కూలబడ్డది. ఆమెను చూచి చెల్లెళ్లు ఏడ్చారు. ఇంట్లో ఎవరో పోయినట్లున్నాయి ఏడ్పులు. చుట్టుపట్లవాళ్లు కూడారు.
"ఏం చెప్పాలేనమ్మా! చిలుకూరి శ్రీరాముగారి భార్యను చెరిచిన్రటనమ్మా!" అమ్మ ఏడుస్తున్నది.
అప్పుడు నాకు పరిస్థితి అర్థం అయింది. నేను అమ్మను వారించలేదు. కూడిన వాళ్లను ఏమీ అనలేదు. ఇంట్లోకి వెళ్లిపోయాను. వార్త సిద్ధం చేశాను - పత్రికలకు పంపడానికి.
ఇంతలో వార్త కార్చిచ్చులా ఊళ్లో పాకింది. మిత్రులంతా ఇంటికి వచ్చేశారు. నేను వారితో కదిలాను. దోవలో వార్త పోస్టు చేశాను. శ్రీరాములుగారింటికి వెళ్లాం. వాళ్లబ్బాయి గోపాలరావు వెర్రిచూపులు చూస్తున్నాడు. అతనిని అడిగి తెలుసుకున్నాం. శ్రీరాములు గారికి కబురు పంపాం.
అప్పటికే ఇల్లు జనంతో నిండిపోయింది. బావిలోకి దిగారు. శవాన్ని బయటికి తీశారు. అమ్మా మరికొందరు ఆమె బట్టలు మార్చారు. తుంగచాపమీద పడుకోపెట్టారు. తలాపున దీపం వెలిగించారు.
మేము వీధుల్లో బయలుదేరాం. ఎక్కువ ప్రయత్నం లేకుండానే దుకాణాలన్నీ మూసేశారు. జనం గుంపులు గుంపులు కూడారు. ఇదే ముచ్చట! ఊరంతా పాడుబడినట్లుంది! వెలవెల పోతున్నట్లున్నది! కళాహీనంగా ఉంది! తుపాను ముందటి ప్రశాంతలా ఉంది!!
అవి ఆంధ్రమహాసభ ఉధృతంగా ఉన్నరోజులవుతే వాస్తవంగా తుపాను వచ్చేది! రషీద్ ప్రాణాలతో బయటపడగలిగేవాడుకాడు. ప్రజా శత్రువులు దక్కేవారు కాదు!
కాలం మారింది. రజాకార్లకు హద్దు లేకుండా పోతుంది. ప్రజలలో ధైర్యం లేదు. బిక్కచచ్చి ఉన్నారు. అయినా తెలియదు. ఏమిటో ఆ సాహసం? అన్యాయాన్ని సహించలేను. ఆపదను గుర్తించలేను.
అందరం మందగా తాసిల్దారు ఇంటికి వెళ్లాం. "మందగా" అని ఎందుకు అన్నానంటే మూగ గొర్రెలవలె వెళ్లాం! శక్తిహీనులంగా వెళ్ళాం!! ఇంత దారుణాన్ని గురించి తాసిల్దారుకు విన్నవించడానికి వెళ్లాం!!! అదీ చేయకుంటే మానవత సహించదని వెళ్లాం!! రానున్న తరాలవాళ్లు మమ్ములను మన్నించరని వెళ్లాం!!!
తాసిల్దారు ఇంటిముందు మౌనంగా నుంచున్నాం. పిట్ట పీచుమంటే వినిపించేట్లుంది. తాసిల్దారు కూడా అంత భారంగా - నిశ్శబ్దాన్ని మోసుకుని వచ్చాడు. తలవంచుకొని నుంచున్నాడు. అపరాధిలా నుంచున్నాడు.
"హైఁ షర్మిందాహోఁ. సారే కాయెనాత్ షర్మిందాహై. మైఁ మజ్బూర్ హుఁ. మదద్ నహీఁ కర్ సక్తా" - నేను సిగ్గుపడుతున్నాను. సమస్త ప్రకృతి సిగ్గుపడుతున్నది. నేను నిస్సహాయుణ్ణి. ఏమీ చేయలేను. అని బోనులో నేరస్థునిలా నుంచున్నాడు.
ప్రధాని "చిత్తారినవాబ్" నోట్లో ఊసిన రజాకార్లను మందలించలేని నిజాం నవాబు గుర్తుకు వచ్చాడు. నిజాం నవాబులో స్వార్థం ఉంది. అతను చేయగలిగీ చేయలేదు. తాసిల్దార్ అట్లా కనిపించలేదు. వాస్తవం అయిన శక్తిహీనుడుగా కనిపించాడు!
నాకొక రోగం. నేను ఊరుకోలేను. "బద్ హోనా - బద్నాం నహీఁహోనా" పంచదార కథలో అతడు నాకు బోధించిందాన్ని గుర్తు చేశాను. తాసిల్దారు తట్టుకోలేక పోయాడు.
"జీనహీఁ అగర్ ఇన్సానియత్ హైతో బద్ భీ నహీఁ హోనా - బద్నాం భీ నహీఁ హోనా" - అట్లా కాదు. మానవత్వం (ఇంకా) ఉంటే చెడు చేయవద్దు చెడు పేరు తెచ్చుకోవద్దు" అన్నాడు. గిరుక్కున తిరిగి వెళ్లిపోయాడు.
తాసిల్దారు మీద జాలి చూపే దౌర్భాగ్యదశకు చేరుకున్నారు జనం!
ఆ రాత్రి మస్తాన్ ఇంటికి వచ్చాడు. తలుపులు వేసుకుని గదిలో కూర్చున్నాం. జరిగిందంతా చెప్పాడు. ఒక రహస్యం బయటపెట్టాడు.
నిజాం నవాబు శరణార్థులను రప్పించాడన్నాను. వారిలో పోలీసు ఉద్యోగం ఊడిన "కాజి" అనే కాందిశీకునికి గార్ల జాగీర్దార్ పోలీసు సూపరింటెండెంటు ఉద్యోగం ఇచ్చాడు. వాడు హిందువులచేత దెబ్బ తిన్నవాడు. బహుశః పంజాబీ. వాడు గార్లలో ప్రతీకారం తలపెట్టాడు. రషీద్ తో కలిసి ఈ దారుణం తలపెట్టాడు!
"వహ్ ఔర్ బహుత్ బద్మాషీ సోచ్ రహా హై. ఆప్ కా యహాఁ రహనా అచ్ఛానహీఁ. కుఛ్ బీ హోసక్తా హై" అని మస్తాన్ కంట తడిపెట్టాడు. "వాడు మరిన్ని దుర్మార్గాలు ఆలోచిస్తున్నాడు. మీరు ఇక్కడ ఉండడం మంచిది కాదు. ఏదయినా జరగవచ్చు."





