Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda
1. అగ్ని బలశాలి రాక్షసహంత. అట్టి అగ్నిపై నలువైపులా నుండి ఘ్రుతము రాల్చుచున్నాను. మిత్రుడగు అగ్నిని సుఖముల కొరకు శరణు వేడుచున్నాను. అగ్ని జ్వలించి క్రతువులందు ప్రజ్వరిల్లుచున్నాడు. అట్టి అగ్ని రాత్రింబవళ్ళు హింసకుల నుండి రక్షించును గాక.
2. జాతవేదాగ్నీ! నిన్ను సమిద్దుని చేయుచున్నాము. నీ ఇనుప కోరలతో యాతుధానులను కొరికి వేయుము. అభిచారకులను నీ జ్వాలలచే భస్మము చేయుము. క్రవ్యాదులను నలిచి నోట పెట్టుము.
3. అగ్నీ! నీవు భక్షించువారలను, రక్షించు వారలను గుర్తించగలవాడవు. నీ జ్వాలలు తీక్షణములు, హింసకములు నీ కోరలచే మా పగతురను పరిమార్చుము. తదుపరి ఆకసమున సంచరించుచు నన్ను బాధించు యాతు ధానులను హతమార్చుము.
4. అగ్నిదేవా! యతు ధానుల తోలు వలుచుము. వజ్రపు నీ తేజమున యాతుధానుల కీళ్ళు సడలింపుము. క్రవ్యాదులు యాతుధానులను తరుముదురు గాక.
5. జాతవేద అగ్నీ! మాకు ఉపద్రవము కలిగించు యాతు ధానులు కూర్చున్నను, తిరుగుచున్నను, అంతరిక్షమున సంచరించుచున్నను వారిని పిప్పిచేయుము. నీ యొక్క తీక్ష్ణ జ్వాలలచే వారిని భస్మము చేయుము.
6. అగ్నీ! మా యజ్ఞములచే నీ బాణములను సరిచేసికొనుము. మా మంత్రములచే నీ అమ్ములకు పదను పెట్టుము. వానితో యత్నాలు పెట్టు యాతు ధానులను భస్మ పరచుము. వారి బాహువులను నరికి వేయుము.
7. జాతవేద అగ్నీ! మేము నిన్ను స్తుతించువారలము. మమ్ము పాలింపుము. కేకలుపెట్టు యాతుధానులను వధించుము. ప్రజ్వరిల్లి వారిని హతమార్చుము. పచ్చిమాంసము తిను 'క్ష్వంక' పక్షి వారి మాంసమును తినును గాక.
8. అగ్నిదేవా! మా శాంతికి భంగము కలిగించు వారిని, మమ్ము బాధించు వారిని హెచ్చరించుము. అట్టి యాతుధానులను నీ మంటలు అంటును గాక. కర్మ సాక్షి వగు నీవు నీ జ్వాలా దృక్కులతో వారిని వశపరచుకొనుము.
9. అగ్నిదేవా! నీ జ్వాలా నేత్రమున యజ్ఞములను రక్షింపుము. మా యజ్ఞమును ధనదులగు దేవతలకు వెంటనే చేర్చండి.
కర్మసాక్షీ! హింసక రాక్షసులను అంతమొందించుము. యాతుధానులు నీ శక్తిని బలహీన పరచకుందురు గాక.
10. అగ్నిదేవా! నీవు నిగ్రహానుగ్రహ సమర్దుడవు. నరులను హింసించు రక్కసుల కొరకు నలుదిక్కుల చూడుము. చూచి వారి దేహపు పై మూడు భాగములను తెగవేయుము. పాదములను మూడు ముక్కలుగా నరుకుము.
రెండవ సూక్తము - 7
వినియోగము :-
1) దీని వినియోగము మొదటి సూక్తమున చెప్పబదినది.
2) గోవులు నెత్తుటి పాలిచ్చిన శాంతికి 15 - 18 మంత్రములచే ఘ్రుతాహుతులు ఇచ్చునది.
1. అగ్నిదేవా! రాక్షసులను నీ మంటలు మూడుసార్లు మాడ్చును గాక. నా యజ్ఞమును వంచించి నష్టపరచు వానిని, నిన్ను కీర్తించునట్టి నా ముందే మంటల పాలు చేయుము.
2. అగ్నిదేవా! యాతు ధానుల విషయమున స్త్రీ పురుషులు ఉగ్రులు అగుచున్నారు. స్తోతలు వారిని కటు వాక్కులచే నిందించుచున్నారు. నీ యొక్క మండుచున్న మనసుతో అట్టి వారి గుండెలందు చిచ్చుపెట్టుము.
3. అగ్నిదేవా! నీ జ్వాలలు తాపకములు. వానిచే యాతుధానుల తలలు వంచి హతమార్చుము. నీ జ్వాలలు ప్రాణాపహారకములు. వానితో యాతుధానుల తలలు వంచి ప్రాణములు తీయుము. అభిచారాకుల తలలు వంచి నీ జ్వాలలచే పరిమార్చుము. దూరము నుండియే మనసులను దహించు యాతుధానుల తలలు వంచి హతమార్చుము.
4. దేవతలు ప్రాణములు హరించు రాక్షసులను మరలి రాకుండునట్లు దండింతురు గాక. రాక్షసుల శాపములు మరలి వారికే తగులును గాక. అసత్య వాక్కులచే బాధించు వారి మర్మములందు దేవతల శరములు గ్రుచ్చుకొనును గాక.
5. నరమాంస, అశ్వమాంస భక్షకులను, ఆవుపాల దొంగల శిరస్సులను అగ్నిదేవా! నీ జ్వాలలచే చిన్నాభిన్నము చేయుము.
6. గోక్షీరము దొంగిలించు వారికి గోవిషము లభించును గాక. దుర్జనులు భూమి మీద నిలువకుందురు గాక. సూర్యుడు వారిని పరిహరించును గాక. ధాన్యాదులు వారికీ అందకుండును గాక.
7. నృచక్ష అగ్నీ! గోవులు మాకు సంవత్సరపర్యంతము ఇచ్చుపాలను యాతుధానులు హరించకుందురు గాక. గోవు యొక్క ఘ్రుతరూప హవిని తమ తృప్తికి వినియోగించు రాక్షసుల మర్మావయములను నీ జ్వాలలకు గురిచేయుము.
8. అగ్నిదేవా! నీవు చిరకాలముగా రాక్షసులను సంహరించుచున్నావు. అయినను నిన్ను ఎంతటి వాడును పరాజితుని చేయలేక పోయినాడు. కావున మాంస భక్షక రాక్షసులను సమూలముగ నిర్మూలించుము. వారు దైవత్వము గల నీ ఆయుధముల నుండి తప్పుకొనకుందురు గాక. నీకు వశవర్తులు అగుదురు గాక.
9. అగ్నిదేవా! నీవు మమ్ము దక్షిణమున ఉన్న, ఉత్తరమున ఉన్న, పశ్చిమమున ఉన్న, పూర్వదిశన ఉన్న రాక్షసుల నుండి రక్షింపుము. నీ యొక్క అజర జ్వాలాస్ఫులింగములు హింసక రాక్షసులను వధించును గాక.
10. అగ్నిదేవా! నీవు క్రాంత ప్రజ్ఞుడవు కావున నాలుగు దిశలందు మమ్ము రక్షింపుము. నీవు నాకు మిత్రుడవు. మిత్రుడనగు నన్ను రక్షించుము. నీవు అమరుడవు. మర్త్యుడనగు నన్ను రక్షింపుము.
మూడవ సూక్తము - 8
వినియోగము :-
1) మొదటి సూక్తమున చెప్పబడినది.
2) అగ్ని లేని చోట అగ్ని దర్శన శాంతికి 6వ మంత్రముచే ఘ్రుతాహుతులు ఇచ్చునది. శబ్దసహిత అగ్ని శాంతి కొరకు దీనిచే అగ్నిని ఉపస్థానము చేయునది. అగ్న్యాధానమున పావక గుణాగ్ని యాగమున బ్రహ్మ దీనిచే అనుమంత్రించునది.
1. అగ్నిదేవా! శబ్దించు రాక్షసులను నీ కంటి మంటలకు గురి చేయుము. పశురూపమున గోళ్ళతో బాధించు వారిని నీ నేత్రజ్వాలలకు ఆహుతి చేయుము. పూర్వము అథర్వమహర్షి అసురులను భస్మము చేసినాడు. అట్లే నీవును, పేరు లేని వారై హింసించు రాక్షసులను నిర్మూలించుము.
2. అగ్నిదేవా! నీవు బలపూర్వకముగ మథించుట వలన ఆవిర్భవించిన వాడవు. వరదుడవు. తృప్తి కలిగించువాడవు. ఘర్షక వర్ష సంపన్నుడవు. భంగత్వ స్వభావము గల రాక్షసులను సంహరించువాడవు.
3. అగ్ని! నీ తేజము తీక్ష్ణము. విషసమము. దానిచే భంగశీల రాక్షసులను వధింపుము. తాపక జ్వాలాగ్రములచే వారిని సమాప్తము చేయుము.
4. అగ్ని మహాతేజోవంతుడు. ప్రకాశకుడు. అగ్నీ! నీ కాంతిచే సమస్త భూతములను స్పష్టపరచుచున్నావు. నీవు దుఃఖమును సహించువారు, మాయావులగు అసురులను అంతమొందించువాడవు. నీ జ్వాలలను తీవ్ర పరచుము.
5. అగ్నిదేవా! నీ శృంగములు ప్రసిద్దములు. జరారహితములు. తీక్ష్ణ ఆయుధముల వంటివి. మా మంత్రములచే అవి మరింత తీక్ష్ణములైనవి. వానితో విద్వేష కిమీదినులను హతమార్చుము.
("కిమీదినమ్' కింఇదానీమ్ ఇతి వదన్తం రాక్షసాదికం కిమీదినం ఉచ్యతే" ఏమగుచున్నది - అని తిరుగు రాక్షసాదులు కిమీదినులు.)
6. అగ్ని దేవుడు అనేక విధములుగ పీడించు రాక్షసుల నివారకుడు. అగ్ని ప్రకాశము తేజోవంతము అమరము, పరిశుద్దము, పావకము అగుచున్నది.
నాలుగవ సూక్తము - 9
వినియోగము :- మొదటి సూక్తము వలె.
1. ఇంద్రసోములారా! రాక్షసులను తపింపచేయండి. వధించండి. మీరు వరదులు. రాత్రించరులను భస్మము చేయండి. రక్కసులను హతమార్చి, వారిని మా వైపునకు త్రోయండి. వారి పక్షమును క్షీణింప చేయండి.
2. ఇంద్రసోములారా! పాపులను పరాభవించండి. పురోడాశము అగ్నిలో కాలినట్లు రాక్షసులను మాడ్చండి. బ్రహ్మద్వేషి, మాంసభక్షక, రుద్రనేత్ర రాక్షసులందు పరస్పర ద్వేషభావము కలిగించండి.
3. ఇంద్రసోములారా! దుష్కర్మములు చేయు రాక్షసులను అంధకారమున దొబ్బి బాధించండి. అంధకారము నుండి ఒక్కడు సహితము ఉదయించకుండునట్లు చేయండి. వీరిని అంతమొందించుటకు మీ బలములు క్రోధమున మండిపడును గాక.
4. ఇంద్రసోములారా! మీ ఆయుధములు వధించునవి. పాపప్రశంసకులగు రాక్షసుల మీద అంతరిక్షము, పృథ్వి నుండి మీ ఆయుధములను ప్రయోగించండి. అట్టి ఆయుధము పర్వత, మేఘముల నుండి వెలువడు రాక్షసులను హతమార్చును గాక.
5. ఇంద్ర, సోములారా! అంతరిక్షమున మీ ఆయుధములను నలువైపుల త్రిప్పండి. అగ్నిలో కాలిన మీ ఇనుప ఆయుధములు అజరములై రాక్షసుల ఎముకలను విరుచును గాక. అందువలన రాక్షసుల శబ్దము అంతరించును గాక.





