Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam
ఒక విషయం గమనించాలి. స్వామీజీ వర్గంలో యువకులు, ప్రగతి వాదులు ఉన్నారు. వారు కమ్యూనిస్టుల సిద్ధాంతంతో కాదు కాని - కార్యక్రమంతో ఏకీభవించారు. బూర్గుల వర్గం కమ్యూనిస్టు వ్యతిరేకత మాత్రం ప్రదర్శించింది.
కాంగ్రెసులో గ్రూపులు - ముఠాలు - వేరు వేరు సిద్ధాంతాలు మార్గాలు సర్వసాధారణం. కాబట్టి అప్పటికి స్థూలంగా కాంగ్రెసులో రెండు వర్గాలు, వాదాలు ఏర్పడ్డాయి. స్వామీజీ వర్గం - బూర్గుల వర్గం.
నిజాం నవాబు - హైదరాబాదును ఇండియన్ యూనియన్ లో చేర్చాలనే ఉద్యమాన్ని కాంగ్రెస్ ప్రారంభించింది. సత్యాగ్రహం చేయాలని పిలుపు నిచ్చింది. బూర్గుల రామకృష్ణారావు - కొండా వెంకట రంగారెడ్డి యుక్తంగా అనేకమందిని ప్రభుత్వం నిర్బంధంలోకి తీసుకున్నది. తరువాత విడుదల చేసింది.
ఈ సందర్భంలో కాంగ్రెసువారు ప్రకటించిన కార్యక్రమాలను కమ్యూనిస్టులు కూడా - వేరుగా, ప్రత్యేకంగా అమలు జరిపారు. కాంగ్రెసువారు ఊరేగింపులు - సభలు - హర్తాళ్లు నిర్వహించారు. కమ్యూనిస్టులు సహితం కాంగ్రెస్, కమ్యూనిస్టు జండాలు పట్టుకొని సభలు సమావేశాలు జరిపారు.
1. కాంగ్రెస్ వారు విద్యార్థులను విద్యాలయాలని బహిష్కరించమని పిలుపు ఇచ్చారు. వేలకొలది విద్యార్థులు కళాశాలలు వదిలారు. రజాకార్ల దౌర్జన్యాల మూలంగా కాలేజీలు నడవడం కూడా కష్టం అయింది. ఈ కార్యక్రమాన్ని కమ్యూనిస్టులు కూడా బలపరిచారు. వాస్తవానికి విద్యార్థిలోకంలో కమ్యూనిస్టులకే పలుకుబడి ఎక్కువ. వారు కాలేజీలు వదిలిన విద్యార్థులను వలంటీర్లుగా, అనంతరం గెరిల్లాలుగా చేర్చుకున్నారు. ఉద్యమం జయప్రదం అయింది. ఇందుకు కాంగ్రెస్ కార్యక్రమం - రజాకార్ల దౌర్జన్యం - కమ్యూనిస్టు ఆర్గనైజేషను కలిసి ఉపకరించాయి.
2. నిజాం రాజ్యపు సరిహద్దుల్లో కరోడ్గిరి కచేరీలు - కస్టమ్స్ ఆఫీసులు ఉండేవి. అవి నిజాం స్వాత్రంత్యానికి చిహ్నాలు. కాంగ్రెస్ వాటిని స్తంభింపచేయాలని పిలుపు ఇచ్చింది. కమ్యూనిస్టులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తెలంగాణంలోని అనేక కరోడ్గిరి చౌకీలను - రికార్డులను ధ్వంసం చేశారు.
3. కాంగ్రెస్ వారు గ్రామోద్యోగులను తమ పదవులు వదల వలసిందని పిలుపు ఇచ్చారు. ఆనాటి గ్రామ పరిస్థితుల్లో పటేల్ పట్వారీలు పని చేసే స్థితిలో లేరు. గ్రామాల్లో ప్రభుత్వం లుప్తం అయిపోయింది. రజాకార్ల దౌర్జన్యాలు అధికం అయినాయి. గ్రామాలను సుమారు కమ్యూనిస్టులు వశపరచుకున్నారు. హిందూ పటేల్ - పట్వారీలు సుమారు అందరూ పదవులు వదలుకున్నారు. బస్తీలకో - యూనియన్ ప్రాంతాలకో - వలస పోయారు.
4. కాంగ్రెస్ వారు తాటిచెట్లు - ఈతచెట్లు నరకి వేయవలసిందని - కల్లు దుకాణాలను నిషేధించవలసిందని తీర్మానించారు. ఇందుకు కొంతవరకు కమ్యూనిస్టులు తోడ్పడ్డారు. కాంగ్రెసువారు తమ తీర్మానం ద్వారా నిజాం రాబడిని నిలుపు చేయడానికి ప్రయత్నించారు. ప్రభుత్వ వ్యతిరేకం అయిన ఏ తీర్మానాన్ని అయినా అమలు చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. వేలకొలది ఈత - తాటిచెట్లను - కొట్టివేశారు.
ఈనాడు మనం చెట్లు కొట్టడాన్ని వ్యతిరేకిస్తున్నాం. అదికాక తాటి చెట్టు పల్లెప్రజల కల్పవృక్షం. అది కల్లుకు మాత్రమే కాదు - అనేక వాటికి ఉపకరిస్తుంది. తాటి ఆకులు ఇంటి కప్పులకు పనికి వస్తాయి. వాటితో చాపలు - బుట్టలు అల్లుతారు. తాటి చెట్టు ఇళ్లకు దూలాలుగా - కాలవలు దాటడానికి వంతెనగా, నీరు పారడానికి క్రెయినుగా ఉపకరిస్తుంది. వీటిని కొట్టి వేయడం సమంజసం అనిపించదు. అయితే, నాటి స్థితిగతులను - ఈనాటి దృక్పథంతో చూడడం సరికాదు.
రాజకీయులు - ఇంకా ఆలోచించే ఓపిక ఉంటే - కొన్ని విషయాలు గ్రహించాలి.
1. ప్రజలు ప్రభుత్వాన్ని వ్యతిరేకించడానికి - కూల్చడానికి సిద్ధంగా ఉన్నారు. ఇందుకు రాజకీయ పరిస్థితులే కారణం.
i) బ్రిటిషిండియాకు స్వాతంత్ర్యం వచ్చింది. దీనిని తెలంగాణ ప్రజల అందరూ - వర్ణవర్గ రాజకీయాలకు అతీతంగా గ్రహించారు. తాము స్వాతంత్ర్యం సముపార్జించుకోవాలని కృతనిశ్చయము అయినారు.
ii) నిజాం నవాబుల తరతరాల దోపిడిలు ప్రజలు సహించారు. కాని, నిజాం సర్వతంత్ర స్వతంత్రం ప్రకటించడాన్ని ప్రజలు సహించలేదు. దానిని సర్వవిధాలా వ్యతిరేకించ సంకల్పించారు.
iii) నిజాం రాజ్యాన్ని భారతదేశంనుంచి వేరు చేయడాన్ని ప్రజలు ఏమాత్రం సహించలేక పోయారు. భారత రాజ్యాంగం నుంచి నిజాం రాజ్యాన్ని విడదీయడం బిడ్డను తల్లినుంచి విడదీయడంగా - దూడను పశువునుంచి విడదీయడంగా భావించారు. భారత ప్రధాన ప్రవాహంలో కలవడానికి విశ్వనాథ 'కిన్నెరసాని'లా ఉరుకులు పెట్టారు. ఎంతటి త్యాగాల కయినా సిద్ధం అయినారు.
iv) నిజాం రాజ్యాన్ని పాకిస్తాన్ చేస్తాననే నిజాం పిశాచి నినాదం - తురకలను పెంచడానికి అతడు పడిన ఆతురత - చేసిన కర్చు - పిలిపించిన తురకలు - అవునన్నా - కాదన్నా మతపరంగా అత్యధిక సంఖ్యాకులయిన హిందువులను రెచ్చకొట్టింది. దొంగ పదవులు అధిష్టించిన కొందరు మంత్రులు సహితం నిజాం 'తురకీకరణ'ను మనసా వాచా కర్మణా వ్యతిరేకించారు. నిజాం దక్షిణ పాకిస్తాన్ కాకుండా రక్షించుకోవడానికి తమ ప్రాణాలు పణంగా పెట్టారు.
2. రాజకీయవాదులు - రాజకీయ పార్టీలు - రాజకీయ సిద్ధాంతాలు ఎంత పటిష్టమయినవి అయినా - ఎంత బలవంతములు అయినా ప్రజల మూడ్ ను అనుసరించి ఉద్యమాలు నిర్వహించవలసిందే. అంతేకాని, స్వంతబలంతో ఉద్యమాలు నిర్మించడం అసాధ్యం మాత్రమే కాదు -అసంభవం.
i) వర్తక - వాణిజ్య - వ్యాపార సంస్థలు - పారిశ్రామిక వేత్తలు తమకున్న ప్రకటనల సామర్థ్యంతో వారి ఉత్పత్తులకు ప్రజలను బానిసలను చేయగలరు. కాని, రాజకీయ పక్షాలు వాగాడంబరం - ప్రచార స్తోమత - తాత్కాలిక ఆవేశాలతో ఉద్యమాలు నిర్మించలేవు. ఒక్కొక్కసారి తాత్కాలికంగా - రాజకీయ పక్షాలు - ఇంజెక్టు చేసిన ఆవేశాలు - ఉద్రేకాలు - దొంగకావేషాలు - అలజడులను సృష్టించవచ్చు. వాటికి - అల్ప దృష్టిగల రాజకీయ పార్టీలు - విజయంగా భ్రమపడి విర్రవీగుతాయి. కాని, స్పష్టంగా గుర్తుంచుకోవలసిన విషయం ఏమంటే - అలజడులు ఉద్యమాలు కావు.
ii) ప్రజలకు తెలివి లేదనుకోవడం రాజకీయ పక్షాల మూర్ఖత్వం - బుద్ధిహీనత - మూఢత్వం. ఎలాంటి రాజకీయ చైతన్యం లేనివారు - బాంచెను దొరా, గులాపోణ్ణి అని పడివున్న జనం - మధ్యయుగాలనాటి దోపిడీకి అలవాటుపడిన జనం తెగిన తీవల కోటిరతనాలవీణ - తెలంగాణ జనం తమ మంచిని తెలుసుకోగలిగారు.
ప్రజలా సర్వవేళలు తమ మంచిని నిర్ణయించగలరు. తమకు మేలు చేసే పక్షాన్ని గుర్తించగలరు. దుష్టులను ఎదిరించగలరు. దుష్టులను శిక్షించగలరు. ధర్మమును స్థాపించగలరు. వారు జనతా జనార్దనులు.
"పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగేయుగే."
అన్న శ్రీమద్భగవద్గీతలోని 'చేతావని'ని రాజకీయ పక్షాలు గుర్తించడం వాటికి క్షేమకరం!
iii) ఉద్యమాలు విజయవంతం కావడానికి రాజకీయ - సాంఘిక - సామాజిక - ఆర్ధిక పరిస్థితులు ప్రధాన కారణాలు. రాజకీయ పక్షాలది పాక్షిక బాధ్యత మాత్రమే.
అరాచకం:
నిజాంలో పరిస్థితులు అతివేగంగా మారుతున్నాయి. అతి దారుణంగా పరిణమిస్తున్నాయి. ప్రజల ప్రాణ ధన మానాలకు ఏమాత్రం రక్షణ లేకుండా పోయింది. అలాంటి పరిస్థితులలో గార్ల జాగీరులో అనేక దారుణాలు జరిగాయి.
1. చిలుకూరి శ్రీరాములు గారు సౌమ్యులు - విద్వాంసులు - ఆనందరామాయణ కర్త. గార్లలో మంచి పలుకుబడి గలవారు. కొంతకాలం జాగీరు బడిలో ఉపాధ్యాయులుగా పనిచేశారు. వారికి ప్రభుత్వ అధికారులలోనూ - వర్తకులలోనూ మంచి ఆడరాభిమానాలున్నాయి.
శ్రీరాముగారి శ్రీమతి పెద్ద ముత్తెదువు, ఆదరణీయురాలు - వదాన్య - శీలవతి. ఆమె మీదనే దారుణం జరిగింది. అత్యాచారం జరిగింది. ఆమెను రేప్ చేశారు. చెరిచారు. ఆమె అభిమానవతి - శీలవతి - గుణవతి - తక్షణం బావిలో పడి ఆత్మహత్య చేసుకున్నది.
ఇలాంటి దారుణం గార్ల జాగీరు చరిత్రలో జరగలేదు. చరచటాలూ మానభంగాలు ఆనాటి దొరతనానికి - ఈనాటి సభ్యసమాజానికి - అత్యంత సాధారణముము. కాని, ఇటువంటి మానహాని కనీ - వినీ ఎరుగనిది! ఇది రక్కసి మతదురహంకారంతో జరిగింది.





