Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda
5. ఇతడు జీవించును గాక. మరణించకుండును గాక. మేము అట్టి ఏర్పాటు చేయుచున్నాము. ఇతనికి వైద్యము చేయుచున్నాము. "మృత్యో మా పురుషం వధీః" మృత్యువా! ఇతనిని వధించకుము.
6. పాఠనామక ఔషధము జీవనదాయి. కోపించినను నష్టపరచనిది. స్వయంజీవి రోగాపహర్తి. రోగమును అణచి వేయునది. అట్టి ఓషధిని ఆహ్వానించుచున్నాను. హింస ఇతనిని తాకకుండును గాక.
7. మృత్యువా! ఇతనిని అనుగ్రహింపుము. నీ వానిగ భావింపుము. ఇతని ప్రాణములు తీయకుము. ఇతడు నీ వాడు కదా! ఇతని ప్రాణములు విడువుము. ఇతడు సర్వవిధముల భూమి మీద జీవించును గాక.
భవ, శర్వులారా! ఇతని వ్యాధులు తొలగించండి. ఇతనికి ఆయువు, సుఖములు ప్రసాదించండి.
8. మృత్యువా! ఇతడు నీవాడగును. దయతలచుము. ఇతడు మృత్యువు నుండి ఉదయించును గాక. ఇతడు బాధలు లేనివాడై నేత్రములు మున్నగు సర్వాంగసంపన్నుడై, నూరేళ్ళవాడై స్వయంశక్తి తో జీవించును గాక.
9. దేవతల ఆయుధములు నిన్ను తాకకుండును గాక బాధించాకుండును గాక. అచేతనత నుండి నిన్ను జాగృతిని చేయుచున్నాను. మృత్యువు నుండి దాటించుచున్నాను. క్రవ్యాదాగ్నిని నీకు దూరముగ నిలుపుచున్నాను. నీకు అగ్ని ప్రాకారము నిర్మించి రక్షించుచున్నాను.
10. మృత్యువా! నీ మార్గము రజోమయము అనుల్లంఘనీయము ఇతనిని అట్టి మార్గము నుండి రక్షించుచున్నాను. ఇతనికి బ్రహ్మ - మంత్ర - కవచమును ఏర్పరచుచున్నాను.
నాలుగవ సూక్తము
వినియోగము :-
1) మొదటి మంత్రపు వినియోగము గత సూక్తమున చెప్పబడినది.
2) కలహ రూప పాపరాక్షసి పట్టిన వంశమున శాంతి చేయుటకు 2, 3 మంత్రములచే ఘ్రుతాహుతులిచ్చునది. నిర్రుతి కర్మమున శర్కరామిశ్రిత ఇంగిడాజ్యాదులను వీనిచే సంపాతిత, అభిమంత్రితములు చేసి ఆహుతులు ఇచ్చునది.
3) గోదానదులందు 4,5 మంత్రములచే వ్రీహి, యవ, శమిలను అభిమంత్రించి బాలకుని తలమీద పెట్టునది.
బాలకుని నిష్క్రమణ కర్మమున 4, 5 మంత్రములచే నిష్క్రమణ చేయునది.
4) అద్భుత మహా శాంతియందు 5వ ఋక్కుచే సూర్య చంద్రులను యజించునది. అసత్య అభిశాప నివృత్తికి దీనిచే సక్తుమంథము లేక అన్నమును అభిమంత్రించి అభ్యాఖ్యాతకు ఇచ్చునది. ఆ కర్మమునందే ద్రుఘణ మణిని చర్మము, ఇనుము, బంగారములలో ఒక దానిలో చుట్టి సంపాతిత, అభిమంత్రితములు చేసి నిందితునకు కట్టునది.
5) నామకరణమున 6వ మంత్రముచే బాలకునకు వస్త్రము కప్పునది.
6) గోదాన, చౌల, ఉపనయన కర్మలందు 7వ మంత్రముచే కత్తిని అభ్యుక్షణ, మార్జనములు చేయునది.
7) అన్న ప్రాశనమున 8, 9 మంత్రములచే ధాన్యము, యవల పిండిని అభిమంత్రించి బాలకునకు తినిపించునది. వీనితోనే ధాన్య, యవలను అభిమంత్రించి గోదానాదులందు కుమారుని మస్తకమున ఉంచునది.
10వ మంత్రము సహితము అందుకే వినియోగము.
1. ఆయుష్కామీ! నీ ప్రణాపానములను స్థిరపరచుచున్నాను. జరా మృత్యువులను తొలగించుచున్నాను. దీర్ఘమాయుః స్వస్తి కలిగించుచున్నాను. యముడు పంపిన దూతలు మొదలగు వారినందరను దూరము చేయుచున్నాను.
2. నిర్రుతి అదాత్రి. శత్రుభూత. కలహకారిణి. పాపదేవత. దానిని వధించుచున్నాను. మాంసభక్షి పిశాచములను వధించుచున్నాను. దుష్టచింతన రాక్షసులను దరిచేరకుండ హతమార్చుచున్నాము. తమస్సును తొలగించుచున్నాము.
3. నిర్రుత్యాదులు ప్రాణాపహరణ చేసినవాడా! జతవేది, అయుష్మంతుడగు అగ్నిని నీ ప్రాణములు యాచించుచున్నాను. నీవు బాధారహితుడవై, అమరుడవై, ప్రసన్నుడవై జీవించునట్లు శాంతికర్మ చేయుచున్నాను. అదే నిన్ను సమృద్దిని చేయుచున్నది.
4. ద్యావాపృథ్వులు నీకు మంగళకరములు అగును గాక. సంతాప కారకములు కాకుండును గాక. లక్ష్మీ ప్రదములు అగును గాక. సూర్యుడు నీకు సుఖము కలిగించునంత వెలుగును గాక. వాయువు హృదయానందకరముగ వీచును గాక. వర్షము శుభప్రదముగ వర్షించును గాక. నదులు కళ్యాణప్రదలై ప్రవహించును గాక.
5. ఓషధులు నీకు శివములు అగును గాక. నిన్ను అధోపృథ్వి నుండి ఉత్తర పృథ్వికి ఉద్దరించుచున్నాను. అచట నిన్ను ఆదిత్యులు, సూర్య చంద్రాదులు రక్షింతురు గాక.
6. బాలకా! నీవు మొలకు కట్టిన బట్ట పై పంచె నీకు శివములగునట్లు చేసినాము. అవి మృదువులై నీకు సుఖము కలిగించును గాక.
7. క్షురికా! తలవెంట్రుకలు, గడ్డము మీసము గొరుగుటకు పదునుగల దానవు. తేజొవంతవు అగుచున్నావు. నీవు ముఖమునకు అందము కలిగించుము. ఆయువును హరించకుము.
8. యవలు ధాన్యములు శుభప్రదము, బలకరములు, మధురములు అగును గాక. ఇవి వ్యాధులను బాధించునవి, పాప విమోచకములు అగును గాక.
9. నీవు తినుచున్నది, త్రాగుచున్నది - వాడుచున్న దాన్యము దుగ్ధములు, మెత్తని, గట్టి ఆహారము అన్నింటిని విషరహితము చేయుచున్నాను.
10. రాత్రింబవళ్ళు రెండును నిన్ను రక్షించునట్లు చేయుచున్నాము. దివంచర, రాత్రించర చోరుల నుండి దేవతలు రక్షింతురు గాక.
అయిదవ సూక్తము
వినియోగము :-
రెండవ సూక్తమున చెప్పబడినది. గోదానాదులందు ధాన్యము యవలను ఈ సూక్తముచే అభిమంత్రించి కుమారుని తలమీద పోయునది.
1. నీకు శత, ఆయుత వర్ష ఆయువు. రెండు, మూడు, నాలుగు యుగములు కల్పించుచున్నాము. ఇంద్రాగ్నులు, సమస్త దేవతలు క్రోధించక, లజ్జపడక దీనిని ఆమోదింతురు గాక.
(ఆశగా అధికము కోరుట. ఆయుతము పదివేలు. యుగములు త్రేత, ద్వాపర, కలి. తమది ఒక యుగము. బిడ్డలది రెండవ యుగము. బిడ్డల బిడ్డలది మూడవయుగము. వారి బిడ్డలది నాలుగవ యుగము కావచ్చును.)
2. శరత్తు, హేమంత, వసంత, గ్రీష్మ రుతువులు నిన్ను రక్షించును గాక. వర్షము నీకు శుభప్రదము అగును గాక. వర్షకాలముననే ఓషధులు వర్ధిల్లుచున్నవి.
3. మృత్యువు ద్విపాత్తులకు, చతుష్పాత్తులకు ప్రభువు అగుచున్నాడు. ఆ మృత్యువు నుండి నిన్ను విడిపించుచున్నాను. మాబిభౌః - భయపడకుము.
4. అరిష్టా! నీవు మరణింపవు. మరణింపవు. భయము విడువుము. అచట జనులు మరణించరు. అంధతమమునకు చేరుకొనరు.
5. ఎచ్చోట జీవన ప్రాకరమగు యజ్ఞము చేయబడుచున్నదో అచట సమస్తము - గోవులు, అశ్వములు, జనులు, పశువులు - జీవించుచున్నవి.
6. నేను ఆచరించిన శాంతి కర్మవలన నిన్ను సమస్త దిశలు రక్షించును గాక. సమానులు, అన్యులు చేసిన అభిచారాము నుండి రక్షించుచున్నాము. నీవు మరణమెరుగని అమృతుడవు అగుదువు గాక. సర్వావయవములు నిన్ను విడువకుండును గాక.
7. నూటొక్క మృత్యువులు, దాటరాని 'నాష్ట్ర' నుండి అగ్ని, వైశ్వానరాది దేవతలు నిన్ను విముక్తుని చేయుదురు గాక.
8. పూతద్రువృక్షమా! నీ దేహమందు అగ్ని ఉన్నది. నీవు రాక్షస మరియు శత్రుసంహారకమవు వ్యాధులను నివారించుదానవు. నీవు మా అభీష్టములను తీర్చుము.
రెండవ అనువాకము
మొదటి సూక్తము - 6
వినియోగము :-
1) రాక్షస, గ్రహ, పిశాచాది చికిత్సకు ఈ అనువకముచే ఫలీకరణ తుష వృక్ష శకలములలో ఒక దానిచే ఆహుతి ఇచ్చునది. పిశాచాదులు ఆవహించినవాడు పలికినపుడు దీనిని చదువునది. "అనేనాను వాకేన తరపుస ముస్ల ఖదిర సర్షపాణాం అన్యతమస్య సమిధ ఆదధ్యాత్" ఈ కర్మమునందే ఖాదిర, లోహ, తామ్రముల బేసిసంఖ్య ముక్కలను దీనిచే అభిమంత్రించునది. దీనియందే సూక్తోక్తరీతిగా యవల, సక్తుల ఆహుతులు ఇచ్చునది.
అసాధ్య గ్రహమును వశపరచుకొనుటకు వీరణతూల సహిత ఇంగుడాజ్యము మోదుగాకు వెనుక భాగముచే ఆహుతులిచ్చునది.
గృహదులందు పిశాచ శంక కలిగినపుడు ఆవకర్ర, శరమయబర్హిని ఈ అనువాకముచే అభిమంత్రించి గ్రహ పీడితునకు త్రాగించునది లేదా మీద చల్లునది - లేదా రాత్రిపూట రెండు ఉల్ముకములను అభిమంత్రించి సంఘర్షించునది.
శాంత్యుదక అభిమంత్రణమున ఈ అనువాకపు గుణప్రయుక్త వినియోగము చేయునది. దశాశమన కర్మమున పశు సంజ్ఞాపనానంతరము ఈ అనువాకము జపించునది - ఘ్రుత కంబలనామక మహాభిషేకమున అభిషేకానంతరము ఈ అనువాకము జపించునది.





