Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda


         

                      యస్య నిఃశ్వసితం వేదా యోవేదేభ్యో2ఖిలం జగత్|
                      నిర్మమే తమహం వన్డే విద్యాతీర్ధ మహేశ్వరమ్ ||

                             శ్రీ మదాంధ్ర వచన అథర్వవేద సంహిత
                                   ఎనిమిదవ కాండ
                                  మొదటి అనువాకము
                                     మొదటి సూక్తము

   
            అన్తకాయ మృత్యవే నమః ప్రాణా అపానా ఇహతే రమన్తామ్ |
          ఇహాయమస్తు పురుషః సహాసునా సూర్యస్య భాగే అమృతస్యలోకే ||

   
1.    అంతకుడగు మృత్యువునకు నమస్కారము. ప్రాణ, అపానములు నీ యందు ఆనంధించును గాక. ఈలోకము సూర్యుని భాగము. అమృతమయము. ఇచట అతడు ప్రాణసహితుడై ఉండును గాక.
   
వినియోగము :-
   
      1) 1, 2 సూక్తములు అర్ధసూక్తములు అనబడును.
   
1.    మొదటి సూక్తమును జపించుచు ఉపనయనమున ఆచార్యుడు బాలకుని నాభిని స్ప్రుశించునది. ఈ రెండు సూక్తములచే ఋషి హస్తముచే చిరంజీవి శరీరమును అభిమంత్రించునది. దీని పాఠము ఆయుష్య గణములందు ఉన్నందున ఆయుష్య, స్వస్త్యయన గణములందు, ఆజ్యాహుతులు ఇచ్చునది. ముప్పది మహాశాంతులందు ప్రధాన మహాశాంతి యందు మొదటి సూక్తమును జపించునది.
   
2.    ఇతడు మూర్చిల్లి ఉన్నాడు. అంధకారమున ఉన్నాడు. భగదేవత ఇతనిని మేల్కొల్పును గాక. కిరణ్మయ చంద్రుడు, మరుత్తులు, ఇంద్రాగ్నులు మేల్కొల్పుదురు గాక. వారందరు ఇతనికి శుభములు కలిగింతురు గాక.
       
3.    ఆయుష్కామీ ! దేవమంత్రములచే నిన్ను నిర్రుతి పాశబంధముల నుండి విముక్తుని చేయుచున్నాను. నీ ప్రాణము, ఆయువు, మనసు నీ యందే నిలుచును గాక.
   
4.    మృత్యు పాశముల నుండి లెమ్ము ఉత్తిష్ఠ లేచి పడిపోకుము. హింసక మృత్యుపాశ బంధములను ఛేదింపుము. అగ్ని, సూర్యుని దర్శించుచు ఇచటనే ఉండుము.
   
5.    నీ కొరకు 'మాతరిశ్వ' గాలిని వీచింపును గాక. జలములు అమృతవృష్టి కురిపించును గాక. సూర్యుడు తగిన రీతిని ఎండకాయించును గాక. మృత్యువు దయ దలచును గాక. నిన్ను చేరకుండును గాక.
   
6.    మానవా! లెమ్ము పడకుము నీవు జీవించుటకును, నీకు బలము కలుగుటకును ఔషధము ఇచ్చుచున్నాను. ఈ దేహము అమృత, సుఖమయ రథము వంటిది. దానిని ఆరోహించి 'నేను జాగృతుడను' అనుము.
   
7.    నీవు మనసున కూడ మృత్యువును తలచకుము.బంధువుల నుండి ప్రమాదములు తెచ్చికొనకుము. పితరుల వద్దకు వెళ్ళకుము. సమస్త దేవతలు నిన్ను అభిరక్షింతురు గాక.
   
8.    గతించిన వారిని తలచకుము. వారు నిన్ను మరలిరాని చోటునకు చేర్చగలరు! చీకటినుండి వెలువడి వెలుగు బాట పట్టుము. మేము నీకు చేయూత నివ్వగలము.
   
9.    యమునకు 'శ్యామ' 'శబల' అను కుక్కలున్నవి. అవి నిన్ను బాధించకుండును గాక. కుక్కల బారిపడక, తప్పుకొని ఇటు రమ్ము. ఆ తలపు మానుము. ఇహమును తలచుము. కర్మలు చేయుము.

10.    మరణించిన వారి మార్గమును అనుసరించకుము. అది భయంకరము. అది చావకముందు వెళ్ళవలసిన మార్గము కాదు. భయంకరమగు తిమిర మార్గమును అనుసరించకుము. మా వైపునకు రమ్ము. ఇది అభయ మార్గము.
   
                                          రెండవ సూక్తము
   
వినియోగము :-

   
      1) ఉపనయనాదులందు దీని వినియోగము పూర్వ సూక్తమున చెప్పబడినది.
   
    హిరణ్య గర్భనామక మహా దానమున ఈ సూక్తముచే కర్తను రక్షించునది. అశ్వరథనామక మహా దానమున దీనిచే యజమానిని అభిమంత్రించునది.
   
1.    జలములందున్న అగ్ని నిన్ను రక్షించును గాక. మానవులు ప్రజ్వలింపచేయు అగ్ని రక్షించును గాక. జాతవేది వైశ్వానరాగ్ని నిన్ను రక్షించును గాక. ఆకాశమునందలి విద్యుతాగ్ని నీకు హాని కలిగించకుండును గాక.
   
2.    మాంస భక్షక క్రవ్యాదాగ్ని నిన్ను కోరకుండును గాక. నీవు శవభక్షక అగ్నికి దూరముగ ఉండుము.
   
    రక్షతు త్వా ద్యౌ రక్షతు పృథివీ సూర్యశ్చత్వా రక్షతాం చంద్రమాశ్చ అంతరిక్షం రక్షతు దేవహేత్యాః"
   
    (దేవహేత్యాః = దేవతల ఆయుధములు.)
   
3.    బోధులు, ప్రతిబోధులు, స్వప్న రహితులు, నిద్రారహితులు గోపాయనులు, జాగరణశీలురు నిన్ను రక్షింతురు గాక.
   
    (బోధులు నిత్య జ్ఞానులు. ప్రతి బోధులు ప్రతివస్తు, ప్రతిక్షణ జ్ఞానులు.)
   
4.    వారే నిన్ను పోషింతురు గాక. వారే నిన్ను రక్షింతురు గాక. వారికి నమస్సులతో స్వాహా.
   
5.    వాయువు, ఇంద్రుడు, ధాత నిన్ను రక్షింతురు గాక. సూర్యుడు నిన్ను మృత్యు ముఖము నుండిలాగి మీ వారికీ ఇచ్చును గాక. ప్రాణము, బలము నిన్ను విడువకుండును గాక. నీ ప్రాణములు నీకు అనుకూలమగునట్లు ఆహ్వానించుచున్నాము.
   
6.    జంభాసురునకు నీవు అందకుందువు గాక. అజ్ఞానము నిన్ను చేరకుండును గాక. దర్భవంటి పొడవైన రాక్షసుల నాలుకకు నీవు అందకుందువు గాక. ఆదిత్యులు, వసువులు, మరుత్తులు ఇంద్రాగ్నులు నీకు శుభములు కలిగింతురు గాక.
   
7.    నిన్ను ద్యులోకము, భూలోకము, అగ్రుడగు ప్రజాపతి మృత్యు ముఖము నుండి ఉద్దరింతురు గాక. సోమ పత్నులగు ఓషధులు నిన్ను రక్షించును గాక.
   
8.    దేవతలారా! ఇతడు భూలోకముననే ఉండును గాక. స్వర్గమునకు సాగకుండును గాక. ఇతనిని వేల ఉపాయములచే మృత్యు ముఖము నుండి తప్పించినాము.
   
9.    ఆయుష్కామీ! అన్నము, ఆయుష్యము కలిగించు దేవతలు నిన్ను అనుగ్రహింతురు గాక. నీ కొరకు నీ బంధువుల స్త్రీలు వెంట్రుకలు విరబోసుకొని ఏడవకుందురు గాక. బంధువులు సహితము నీ కొరకు ఏడవకుందురు గాక.
   
10.    నిన్ను మృత్యు ముఖము నుండి గుంజి తెచ్చినాను. నీవు మరల పుట్టినందున నవ్యుడవైనావు. నీకు సర్వాంగములు, సర్వచక్షువులు కలిగినవి. నీకు పూర్ణాయువు కలిగించినాను.
   
11.    అచేతనా! నీవు వెలుగులోనికి వచ్చినావు. చీకట్లు తొలగినవి. నీ నుంచి మృత్యువును, నిర్రుతిని దూరము చేసినాము. రోగమును నిర్మూలించినాము.
   
                                        మూడవ సూక్తము
 

వినియోగము :-
   
    3 - 5 సూక్తములు అర్ధసూక్తములు. ఉపనయనమున ఆచార్యుడు మాణవకుని నాభిని స్పృశించి దీనిని జపించునది. ఆయుష్కామి ఈ మూడు సూక్తములచే శరీరమును అభిమంత్రించునది. ఋషి తన  హస్తమున ఆయుష్కామి శరీరమును వీనిచే అభిమంత్రించునది.
   
    ఈ అర్ధసూక్తపు పాఠము ఆయుష్గణములందు ఉన్నందున 'విశ్వకర్మభిరాయుష్వైః స్వస్త్యయనైరాజ్యం జుహూయాత్'. నామకరణమున శిశువు చేతిలో దీనిచే అవిచ్చిన్న జలధార పోయునది. దేవదారు మణిని సంపాతిత అభిమంత్రితములు చేసి కట్టునది. ఆ మణిని అరగదీసి త్రాగించునది.
   
    అన్తేష్టియందు ఈ మూడు సూక్తములచే ప్రేతాగ్నిని ప్రజ్వలింపచేయునది.
   
    ముప్పది మహాశాంతులందు ప్రధానశాంతి యందు ఈ అర్ధసూక్తమును జపించునది. వైశ్వదేవీ మహాశాంతి యందు దీనిచే దేవదారు మణిని కట్టునది.
   
1.    ఆయుష్కామీ! మేము పోయు అవిచ్చిన్న జలధార యొక్క అనుభూతిని పొందుము. ఈ ధార అన్యులు ఆటంకపరచరానిది, వార్ధక్యము వరకు కొనసాగునది అగును గాక. మృత్యువు హరించిన నీ ప్రాణములను, ఆయువును తిరిగి తెచ్చుచున్నాను. నీవు రజస్తమస్సులను రానీయకుము. హింస నిన్ను చేరకుండుము గాక.
   
2.    జ్ఞాన జీవితము చిరకాలము కొనసాగించుటకు మా ముందునకు రమ్ము. మృత్యుపాశములను, నిందలను వదిలించుకొని రమ్ము. నేను నీకు శతశరదాయుష్యమును ప్రవేశపెట్టుచున్నాను.
   
3.    వాయువు నుండి నీ ప్రాణమును, సూర్యుని నుండి నీ నేత్రములను తెచ్చినాను. నీ మనసును నీయందు చేర్చినాను. నీవు పరిపూర్ణాంగుడవై నాలుకతో స్పష్టముగా పలుకుము.
   
4.    క్షీణప్రాణీ! ద్విపద, చతుష్పదుల ప్రాణములతో -చిన్నమంటను ఊది పెద్దది చేసినట్లు నీ ఆయుర్దాయమును పెంచుచున్నాను.
   
    మృత్యువా! క్రూరమగు నీ నేత్రమునకు నమస్కారము. నీ ప్రాణ బలమునకు నమస్కరించుచున్నాము.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.