Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda
2. జలము నన్ను శతపథ పాపము నుండి, అసత్య పాపము నుండి, వరుణ పాపము నుండి, యముని పాపము నుండి, సకల దేవ సంబంధ పాపముల నుండి విముక్తులను చేయును గాక. (10)
మూడవ సూక్తము - 28
వినియోగము :-
1) స్త్రీ పురుషులకు పరస్పరము ద్వేషము కలిగించుటకు 'బాణాపర్ణ' చూర్ణమును ఎర్రమేక మజ్జిగతో కలిపి 1, 2 మంత్రములచే అభిమంత్రించి మంచము మీద చల్లునది.
2) దౌర్భాగ్యము కలిగించుటకు 3వ మంత్రముచే అందు చెప్పిన అవయవములను తాకి అభిమంత్రించునది లేదా చూచుచు జపించునది.
3) రాక్షస గ్రహాది చికిత్స కొరకు 4వ మంత్రముచే 13 ద్రవ్యములలో ఒక దానిచే ఆహుతి ఇచ్చునది.
4) నైర్రుతి యొక్క చతుర్ధ కర్మమున కాకి కాలికి పురోడాశ సహిత ఇనుపముక్కను కట్టి 5వ ఋక్కుచే కాకిని వదులునది. అదే కర్మయొక్క పంచమ కర్మమున కర్త సూత్రమున చెప్పిన బట్టలు కట్టి ఇనుపముక్క సహితముగ తలగుడ్డను నీటిలో పారవేయునది.
5) 7వ ఋక్కుచే పై పంచెను ఇనుము సహితముగా నీటిలో పారవేయునది.
6) కామ్య కర్మమున దుస్స్వప్న దోషశాంతికి 5 - 8 మంత్రములచే చెడు కలకన్న వానికి స్నానము చేయించునది.
7) సర్వజ్వర చికిత్సకు సూత్రమున చెప్పినట్లు కప్పను కట్టి మంచము క్రిందవైచి మంచము మీద, రోగి మీద 9 ,10 మంత్రములచే నీటిని చల్లునది.
8) స్వస్త్యయనము కోరువాడు 11, 12 మంత్రములచే ఇంద్రుని యాగము లేక ఉపస్థానము చేయునది శవసంస్కారానంతరము స్వస్త్యయనమునకు కర్త ప్రతిరోజు 11, 12 మంత్రములను జపించునది. అగ్నిష్టోమమున హరియోజన గ్రహ హోమమును వీనిచే అభిమంత్రించునది. శత్రుసేనను బెదరించుటకు 12వ ఋక్కుచే కవచమును మంత్రించి రాజునకు ఇచ్చునది. మహా వ్రతమున దుందుభిని వాయించుచుదీనిచే రాజునకు కవచము ధరింపచేయునది.
1. బాణాపర్ణమను ఓషధీ! నీవు తాపము కలిగించు దానవు. ఆమెకు తాపము కలిగించి అతని నుంచి విడదీయుము.
కోపము కలిగించు ఓషధీ! అతనికి ఆమె మీద ద్వేషము, కోపము కలుగునట్లు చేయుము.
2. తృష్టికా! నీవు తాపము కలిగించుదానవు. విషస్వరూపవు. వంధ్యగోవు ఆబోతును అభిలషించని రీతి ఈమె అతనిని అభిలషించకుండును గాక. ఈమె అతనికి విషతుల్య అగును గాక.
--౦౦౦--
1. నారీ! నీ ఊరువుల, హృదయపు, ముఖమునందలి మరియు సర్వావయవములందలి వర్చస్సును హరించుచున్నాను. (3)
2. నీ మానసిక వ్యధలు తొలగును గాక. రాక్షస బాధ తొలగును గాక. అగ్ని రాక్షసులను హతమార్చును గాక. సామ దేవత ఇతరులకు హాని కలిగించు వారిని నష్ట పరచును గాక. (4)
--౦౦౦--
1. అలక్ష్మీ! ఇచటి నుంచి వెళ్ళిపొమ్ము. ఇచటనే పాడుబడుము. పోయినచో దూరము కన్న దూరదేశమునకు వెళ్ళిపొమ్ము. ఎంత దూరదేశమునకు పోవుదానివి అయినను నీకు ఇనుపముక్క కట్టి నిన్ను శత్రువునకు వప్పగించుచున్నాము. (5)
2. అలక్ష్మీ నన్ను నలువైపులా ఆవరించినది. చెట్టును ఎండగొట్టు 'వందనలత' వలె నన్ను శుష్కింప చేయుచున్నది.
సూర్యదేవా! నీవు హిరణ్యహస్తుడవై విచ్చేయుము. మాకు బంగారము ప్రసాదించుము. అలక్ష్మిని ఎరు చోటునకు పంపుము. (6)
3. మనిషి వెంట నూటొక్క లక్ష్ములు జన్మించుచున్నవి. వానిలో పాపలక్ష్మిని ఇచటి నుండి తరిమివేసినాము.
జాతవేదాగ్నీ! వాని యందు పరమ కళ్యాణకారి యగు లక్ష్మిని మా ఇంట నిలుపుము (7)
4. నేను ఈ లక్ష్ములను గోపాలుడు గోవులను వలె రెండుగా విభజించుచున్నాను. శుభములు కలిగించు లక్ష్ములు మా ఇంట ఆనందించుదురు గాక. కష్టపెట్టు లక్ష్ములు నశించును గాక. (18)
--౦౦౦--
1. చెమట పట్టించు, త్రిప్పట కలిగించు, తూలించు రురు - ఉష్ణ జ్వరమునకు - నమస్కారము. కోరికలను చిందర వందర చేయు చలి జ్వరమునకు నమస్కారము. (9)
2. ఈ వ్యక్తికి వచ్చు వరుస జ్వరము కప్పను చేరును గాక. (10)
3. ఇంద్రదేవా! నీవు బలిసినట్టియు, నెమలి ఈకల వంటి రోమములు గలట్టియు అశ్వముల మీద విచ్చేయుము. వ్యాధుడు పిట్టలను పట్టినట్లు ఇతర స్తోతలు నిన్ను పట్టకుండవలెను. దప్పిగొన్నవాడు ఎడారిని వేగముగ దాటినట్లు ఇతర స్తోతలను దాటి మా వద్దకు విచ్చేయుము. (11)
--౦౦౦--
1. రాజా! నీ మర్మస్థానములను కవచముచే ఆచ్చాదించుచున్నాను. తదుపరి సోమదేవత నీకు అమృతతేజము ప్రసాదించును గాక. వరుణుడు నీకు సకల సుఖములను ప్రసాదించును గాక. నీవు యుద్దము చేయునపుడు ఇంద్రాదులు నిన్ను ప్రోత్సహింతురు గాక. (12)
దాశరథి లక్ష్మణాచార్య బుచ్చమాంబల పౌత్రుండును, విద్వాన్, ఉపన్యాసరత్న దాశరథి వేంకటాచార్య వేంకటాంబల పుత్రుండును, ఆంధ్రప్రదేశ్ ఆస్థానకవి డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య అనుజుండును, కమలానామ్ని ధర్మపత్నీ సమేతుండును అయిన దాశరథి రంగాచార్య విరచిత శ్రీమదాంధ్ర వచన అథర్వవేద సంహిత యందలి ఏడవ కాండము సమాప్తము.





