Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda


 

1.    నేను దుస్స్వప్న నివారక మంత్రమును జపించినాను. దుస్స్వప్న పాపము తొలగినది. స్వప్న పాపము నుండియు, అసంపత్తి నుండియు విముక్తుడను అయినాను. (9)
   
                                           --౦౦౦--
   
1.    నేను రాత్రి కలలో తిన్న అన్నము ఉదయము కనిపించకున్నది. సకల స్వప్నములు నాకు శుభము లగునుగాక. అవి పగలు కనిపించకుండును గాక. (10)

                                           --౦౦౦--
   
1.    ద్యావాపృథ్వులకు, అంతరిక్షమునకు, మృత్యువునకు నమస్కరించుచున్నాను. నేను పై లోకములకు పోక ఇచటనే ఉందును గాక. ఏ దేవతలు నన్ను బాధించకుందురు గాక. (11)
   
                                         పదవ అనువాకము
                                      మొదటి సూక్తము - 26

   
వినియోగము :-

   
      1) సకల ఫలములు కోరువాడు 1, 2 మంత్రములచే ప్రజాపతిని యజించునది లేక ఉపస్థానము  చేయునది. 2వ మంత్రము ఉర్వ నామక సవయజ్ఞమున వినియోగము.
   
      2) ఉపనయనమున సూర్యుని దర్శించిన తరువాత 3వ మంత్రముచే బాలకుని తూర్పుముఖముగా కూర్చుండపెట్టునది.
   
      3) గ్రామ గృహాదులందు ఇతరులకు అందించవలసిన సందేశము అందించనందుకు ప్రాయశ్చిత్తముగ 4వ  ఋక్కుచే అగ్నిని ఉపస్థానము చేయునది. దర్శ మరియు పూర్ణమాసమున దీనిచే కర్మ విస్మరణ  ప్రాయశ్చిత్తమునకు గాను ఆహుతులు ఇచ్చునది. అగ్నిష్టోమమున దీక్షానియమ లోప ప్రాయశ్చిత్తమునకు దీనిచే అగ్నిని ఉపస్థానము చేయునది.
   
      4) దగ్గు మరియు కఫ నిరోధ చికిత్సకు అన్నము లేక సక్తు మంథమును 5వ మంత్రముచే అభిమంత్రితము చేసి  తినిపించునది. ఆచమనము చేయించునది. సూర్యోపస్థానము చేయునది.
   
      5) అభిచార కర్మము 6, 7 ఋక్కులచే పిడుగు పడిన చెట్టు పుల్లలను ఉంచునది.
   
      6) జూదమునందు గెలుపునకు పెరుగు, తేనెలో మూడు రాత్రులు నానిన పాచికలను 8 - 10  మంత్రములచే అభిమంత్రించి జూదమాడునది. అగ్న్యాధ్యానమున 8వ మంత్రముచే నేతిలో నానిన పాచికను  జూదరికి ఇచ్చునది.
   
1.    ఏరాజు నన్ను రక్షించగోరువాడై నన్ను నిందనీయమగు ఈ దుర్భర ద్రోహము నుంచి కాపాడగలడు? మేము అనుష్టించు ఈ యజ్ఞమును కోరువాడెవడు ? ఎవడు మాకు ధన పూర్తి కలిగించును? దేవతలందు ఎవడు మాకు దీర్ఘాయువు కలిగించును?
   
                                                  --౦౦౦--
   
1.    ధేనువు లోహితవర్ణ. మంచి పొదుగు గలది. దూడతో కూడినది. దానిని అథర్వుడు వరుణనకు ఇచ్చినాడు.
   
    బృహస్పతితో మైత్రిగల ఏదేవత భూతములను సృష్టించుచున్నాడు ? (2)   

                                             --౦౦౦--
   
1.    బ్రహ్మచారీ! నీవు జనహితకారివి. ఆహారాది నియమములు కలవాడవు. వేదాభ్యాసము కొరకు సమస్త మిత్రులతో ఆచార్యుని ఆశ్రయింపుము. (3)
   
                                             --౦౦౦--
   
1.    జాతవేద అగ్నీ! మేము అస్మ్రుతి కారణముగ కొన్ని పనులు చేయలేదు. అజ్ఞానమున యజ్ఞము నందలి కొన్ని విధులను విస్మరించినాము. అట్టి దోషమును నివారించుము. శుభకర్మముల మిత్రుల సహవాసము కలిగించుము. "అమృతత్వమస్తు నః" మాకు అమృతత్వము కలుగును గాత. (4)
   
                                              --౦౦౦--
   
1.    సూర్యుని సప్త కిరణములు ఆకసము నుండి జలము దించును గాక. అట్టి వర్షము శల్యము వంటి దగ్గు, శ్లేషమును నివారించును గాత. (5)
   
                                             --౦౦౦--
   
1.    అగ్నీ! మమ్ము మాయము చేయు శత్రువులున్నారు. మమ్ము హతమార్చ దలచిన వారున్నారు. మా కీర్తిని భంగ పరచగల వారున్నారు. బంధువులందు, ఇతరులందును మమ్ము హతమార్చదలచువారున్నారు. నీవు అట్టి శత్రువులను ఇల్లు వాకిలి లేని వారిని, పిల్లా పాపలు లేని వారిని చేయుము. (6)
   
2.    మేము నిద్రించునపుడు, మేల్కొని ఉన్నపుడు, కూర్చున్నపుడు, తిరుగనపుడు బాధించు శత్రువులు ఉన్నారు. వారి జఠరాగ్నిని ఆర్పి వారిని భస్మము చేయుము. (7)
   
1.    ఉగ్రుడగు బభ్రుదేవతకు నమస్కారము. అతడు జూదమున విజయము కలిగించువాడు. 'కలి' యను పాచికను ఘ్రుతమున తడుపుచున్నాను. అది మాకు విజయ సుఖము కలిగించును గాక. (8)
   
2.    అగ్నీ! ఘ్రుతమును అప్సరసలకు చేర్చుము. మా ప్రతి ద్వంద్వుల ముఖమున ఇసుక, నీళ్ళు కొట్టుము. ఉభయ హవ్యములను దేవతలు ఆనందింతురు గాక. (9)
   
3.    జూధమునకు అధిదేవతలహు అప్సరసలు భూలోక, ద్యులోక, అంతరిక్షములందు ఆనందించుచుందురు. వారు నాచేతికి నేతిని అందించి, ప్రతిపక్షిని నా వశీవర్తుని చేయుదురు గాక. (10)
   
                                            రెండవ సూక్తము - 27
   
వినియోగము :-

   
      1) జూదమందు జయమునకు గాను 1 - 4 సహితముగా 10 - 8, 9, 10 వినియోగము  చెప్పబడినది.
   
      2) శత్రుసేనను జయించుటకు 5, 6 మంత్రములచే కొత్త రథమును సంపాతిత, అభిమంత్రితములు చేసి సారథి సహితముగా రాజును ఆ రథముపైకి ఎక్కించునది. సర్వఫలకామి  5 - 7 ఋక్కులచే అగ్నిని, ఇంద్రుని యజించునది లేక ఉపస్థానము చేయునది. 5వ మంత్రముచే అగ్నీంద్ర పురోడాశయాగమును   అనుమంత్రించునది.
   
      3) వృషోత్సర్జనము 8వ మంత్రముచే వృషభమును సంపాతన, అభిమంత్రణలు చేసి విడుచునది. అగ్నిష్టోమపు ప్రాతస్సవనమున సోమ సహిత పూత భ్రుత పాత్రను దీనిచే బ్రహ్మ అనుమంత్రించునది.
   
      4) సర్వవ్యాధి చికిత్సకు 9, 10 మంత్రములచే జలపూర్ణ పాత్రను సంపాతన, అభిమంత్రణలు చేసి రోగి కీళ్ళను మాంజ పాశములచే కట్టునది. తదుపరి దర్భకట్టచే నీటిని చల్లునది. లేదా స్నానము  చేయించునది. 9వ మంత్రము అంహోలింగ గణమున వినియోగము. వివాహమందు దీనిచే  ఘ్రుతాహుతులిచ్చి వధూవరుల తలల మీదకు సంపాతములు తెచ్చునది. దానితోనే వధూవరుల చేతుల     జలపూర్ణ పాత్రనుండి జలము పోయునది.
   
1.    దేవా! నేను ప్రతిపక్షిని ఓడించుటకు ఆడుచున్నాను. నన్ను ఘ్రుతము కలవానిని చేయుము. మాతో ఆడ దలచిన వానిని పిడుగు చెట్టును వలె ధ్వంసము చేయుము.
   
2.    ఎవడు మాకు జూదమందు ధనము ఇప్పించినాడో, ఎవడు మా అక్షములచే పరుల అక్షములను ఓడింప చేసినాడో ఆ దేవత మేము అందించు హవిస్సులు స్వీకరించును గాక. మేము గంధర్వుల సహితముగా ఆనందింతుము గాక.
   
3.    పాచికలారా! మీ పేరు 'సంవసవ' అయి ఉన్నది. ఈ పాచికలు 'ఉగ్రంపశ్య' "రాష్ట్రభ్రుత్" నామకములు. అట్టి పాచికలను మేము హవి అర్పించి సేవించుచున్నాము. "వయంస్యామ పతయో రయీణామ్" మేము ధనపతులము అగుదుము గాక.
   
    ('సంప్రాప్త ధనాః సంప్రాపిత ధనాయతో భవథ అతో సంవసవ ఇతినామధేయం' అని సాయణాచార్యులు ధనము కలిగినవి. కలిగించునవి కావున సంవసవ నామకములు.)
   
4.    నేను ధనము కొరకు తపించువాడను. ధనము కలిగించుమని దేవతలను ఆహ్వానించుచున్నాను. మేము బ్రహ్మచర్యము ఆచరించినాము. బభ్రుదేవత ఆవేశించిన పాచికలను పట్టుచున్నాము. ఆ దేవతలు మాకు విజయానందము కలిగింతురు గాక.
   
                                          --౦౦౦--
   
1.    ఇంద్రాగ్నులారా! మీరు యజమానుల వృత్రరూప పాపములను హతమార్చండి. మీరిద్దరు వృత్రహంతలు కదా! (5)
   
2.    ఇంద్రాగ్నులే దేవతల కొరకు స్వర్గమును ఏర్పరచినారు. ఇంద్రాగ్నులే తమ మహిమచే సర్వభూతములందు వ్యాపించినారు. వజ్రబాహువులగు ఇంద్రాగ్నులు స్తుతించు వారికి వరదులు. అట్టి ఇంద్రాగ్నులను ఆహ్వానించుచున్నాను. (6)
   
3.    ఇంద్రా! బృహస్పతి సోమపాత్రయగు చమసముతో నిన్ను పట్టుకున్నాడు. సోమాభిషవము చేసిన యజమాని స్తుతులు వినుటకు అగ్ని సహితుడవై విచ్చేయుము. (7)
   
                                                       --౦౦౦--
   
1.    నీవు సోమమును వహించుదానవు. ఇంద్రుని కుక్షివి. దేవతల, మానవుల ఆత్మవై ఉన్నావు. ఈ లోకమున ప్రజలను సృష్టించుము. ఇచట, ఇతరత్ర ఉన్న ప్రజా సుఖించును గాక. (8)

                                         --౦౦౦--
   
1.    ద్యావాప్రుథ్వులు శోభాయమానములు. విశ్వమందు అజ్ఞానావృతులగు జనులు ఉన్నారు. అచట సప్త సింధువులు ప్రవహించుచున్నవి. ఆ ద్యావాప్రుథ్వులును, సింధువులు మమ్ము పాపవిముక్తులను చేయును గాక. (9)




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.