Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda
1. విషమా! నీవు కాటు వేసిన వానినుండి బయట పడుము. ఏలనన నీవు ఇతనికి శత్రువవు. అంతే కాదు నీవు అందరకు శత్రువవు. కావున నీవు విష సర్పమున చేరుము. విషమును విషమున చేర్చుము.
విషమా! నీవు ఏ సర్పమునకు చెందిన దానివో దానియందు చేరి ఆ సర్పమును చంపుము.(7)
--౦౦౦--
1. నేను ఆకాశమందలి జలమును పూజించుచున్నాను. ఆ జలముల శక్తి నా యందు చేరును గాక. దుగ్ధముల హవిస్సుతో అగ్ని ముందుకు వచ్చినాను. అగ్ని నా యందు తేజస్సును ప్రవేశపెట్టును గాక. (8)
2. అగ్నిదేవా! నన్ను బలసంపన్నుని చేయుము. పుత్ర పౌత్రాదులను కలిగించుము.
ఇంద్రుని సహితముగ దేవతలు, ఋషులు నన్ను పవిత్రునిగా భావింతురు గాక. (9)
3. జలమా! నా పాపములను కడిగివేయుము. నిందా రూప మలమును, దురితమును, ద్రోహమును, అసత్యమును, రుణము తీసికొని దూషించిన దోషమును తొలగించుము. (10)
4. అగ్నిదేవా! నీవు జ్వాలా రూపివి. నాకు సమృద్ది కలిగించుము. నీవు సమిధా జ్వలితుడవు. నాకు సమృద్ది కలిగించుము. నీవు తేజస్సువు. నన్ను తేజోవంతుని చేయుము. (11)
--౦౦౦--
1. అగ్నిదేవా! పురాతన శత్రువు వంటి ఈ జార రూప శత్రువును తీవలను వలె నరుకుము. శత్రువు యొక్క జార వీర్యమును నష్ట పరచుము. (12)
2. ఈ జార శత్రువు కూడబెట్టిన ధనమును ఇంద్రుని సాయమున లాగుచున్నాను. సంతానము కలిగించు శక్తి గల ఇంద్రియమును వరుణుని సాయమున నష్టపరచుచున్నాను. (13)
3. దేవతలారా! జారుని వీర్యము వారినుంచి దూరము చేయండి. అది స్త్రీని చేరకుండును గాక. స్త్రీ యోని యందు ప్రవేశించు అంగమును, దాని స్తంభమును నష్టపరచండి. (14)
తొమ్మిదవ అనువాకము
మొదటి సూక్తము - 24
వినియోగము :-
1) గ్రామార్ధి మొదటి ఋక్కుచే ఇంద్రుని యజించునది లేదా ఉపస్థానము చేయునది. ఆ కర్మమునందే ఊదుంబర, పలాశ, కర్కంధు సమిధలను సమిదాధాన సభోపస్తరణ హోమాదులు దీనిచే చేయునది. ఇంద్రమహ ఉత్సవమున దీనిచే ఘ్రుతాహుతులిచ్చునది.
2) 4వ మంత్రముచే పల్లకి మీది సోమరాజును అనుమంత్రించునది. అగ్నిష్టోమమున అగ్ని మారుత శస్త్రావ సానమున ఆహవనీయ ధృవ పాత్రయందున్న సోమమును బ్రహ్మ దీనిచే అనుమంత్రించునది.
3) అభిచార కర్మమున 5 - 8 మంత్రములచే ఘ్రుతాహుతులు ఇచ్చునది.
4) అభిచార కర్మమున రక్తశాలి తండులములచే క్షీరాన్నము వండి సంపాతిత, అభిమంత్రితములు చేసి ద్వేష్యునకు ఇచ్చునది.
5) దర్శ మరియు పూర్ణ మాసములందు 9, 10 మంత్రములచే అష్టర్చ సంస్థిత హోమము చేయునది.
6) ఉపనయన కర్మయందు 10వ మంత్రముచే అష్టర్చ అభిమంత్రిత జలపూర్ణ పాత్రను బ్రహ్మచారికి చూపునది.
1. ఇంద్రుడు రక్షకుడు. ధనపతి. అతడు మమ్ము రక్షించి సుఖములు కలిగించును గాక. మహా విద్వాంసుడగు ఇంద్రుడు మా శత్రువులను సంహరించును గాక. మాకు అభయ మిచ్చి మమ్ము శూరులకు దొరను చేయును గాక.
--౦౦౦--
1. రక్షకుడు, ధనశాలియగు ఇంద్రుడు మా శత్రువులను దూరముండగనే తరిమివేయును గాక. మేము యజ్ఞయుడగు ఇంద్రుని అనుగ్రహమున నిలుతుము గాక. మేము ఇంద్రుని సౌ మనస్యమున ఉందుము గాక. (2)
--౦౦౦--
1. ఇంద్రుడు ప్రదీప్తుడు. అతని అనుగ్రహమున మేము శత్రువును అణచి వేయుచున్నాము. శత్రువును నిశ్సేషముగా సమాప్తము చేయుచున్నాము. (3)
--౦౦౦--
1. స్థిరమగు సోమమును రాజుల పల్లకి మీద తెచ్చుచున్నాము. ఇంద్రుడు మా ప్రజను అసాధారణ సమాన మనస్కులను చేయును గాక. (4)
--౦౦౦--
1. మండూకపు నోరు చీరుట వలన దాని ప్రాణము గద్ద ఆకసమునకు ఎగిరినట్లు, ఎగిరిపోయిన రీతి శత్రువు ప్రాణములు ఎగిరి పోవును గాక. మండూకపు గుండె సంకోచ, వ్యాకోచములు కోల్పోయినట్లు - శత్రువు హృదయములు అగును గాక. (5)
2. పడకున్న ఎద్దును లేపినట్లు, మొరుగు కుక్కను తరిమినట్లు, దూడను అందుకున్న తోడేలును గెంటివేసినట్లు శత్రువుల ప్రాణములను బలవంతముగ వేరుచేయుచున్నాను. (6)
3. శత్రువు సకల అవయవములను బాధించి, సకల అవయవముల ఒకేసారి బాధపడునట్లు చేసి ప్రాణములు తీయుచున్నాను. మాధనమును హరించు స్త్రీని గాని పురుషుని గాని మర్మావయవములు కట్టివేయుచున్నాము. (7)
--౦౦౦--
1. గోవులు గోష్ఠమందు వలె, గూటికి చేరు పక్షుల వలె, చలనము లేక నిలుచు పర్వతము వలె నేను వృకమును శత్రువు ఇంట నిలుపుచున్నాను. (8)
(ఇక ఎన్నటికి లేవకుండ అని.)
--౦౦౦--
1. అగ్నిదేవా! నీవు జ్ఞానవంతుడవు. దేవతల ఆహ్వాతవి. ఇది అవిచ్చిన్న యజ్ఞము, దీనికి నిన్ను హోతగా వరించుచున్నాము. నిన్ను సర్వ హోతగా వరించుచున్నాము. కావున నీవు దేవతలను యజించుము. దోషములను నివారించుము. మాకు వరములిచ్చువాడవై మా హవిని స్వీకరింపుము. (9)
2. ఇంద్రదేవా! మమ్ము మనస్వినులను, గోమంతులను, విద్వాంసుల మిత్రులను, శుభములు గల వారిని చేయుము. మాకు వేదములను, దేవహితమును కూర్చుము. మేము యజ్ఞియులగు దేవతల సుమనస్సులందందుము గాక. (10)
రెండవ సూక్తము - 25
వినియోగము :-
1) దర్శ మరియు పూర్ణ మాస సంస్థితి హోమమందు 1 - 6 మంత్రముల వినియోగము. శ్రౌత దర్శపూర్ణ యాగమున షడ్రుచ సంస్థిత హోమము నందు వీనిచే ఆహుతులు ఇచ్చునది.
2) దర్శ మరియు పూర్ణమాస ప్రహ్లియమాణ ప్రస్తరమును 7వ మంత్రముచే అనుమంత్రించునది. ఇదే కర్మ స్మార్త ప్రకారమందు దీనిచే బర్హి ప్రహరణము చేయునది.
3) శ్రౌత దర్శపూర్ణ మాసమున వేది పరిస్తరణము చేయు అధ్వర్యును 8 వ మంత్రముచే బ్రహ్మ అనుమంత్రించునది.
4) దుస్స్వప్న దోషనివారణార్ధము 9వ మంత్రమును జపించుచు పర్యావర్తనము చేయునది. స్వప్నమున అన్నభక్షణ దోష నివారణార్ధము దీనిని జపించునది.
5) స్వస్త్యయనము కొరకు మంత్రమున పేర్కొన్న దేవతలకు నమస్కరించునది.
1. అగ్నిదేవా! నీవు ఆహ్వానించిన దేవతలను వారి వారి స్థానములందుండునట్లు చేయుము.
వసువులారా! మీరు హవి, మధురస సంపన్న ఘ్రుత భక్షకులు, ఈ యజమానికి ధనము ప్రసాదించండి.
2. హవికి ప్రసన్నమగు దేవతలారా! మీరు ఇచటికి వచ్చినారు. మాకు ధనములు ప్రసాదించండి. మీకు స్థానములు ఏర్పరచినాము. ఆదిత్యుని చేరి స్వర్గమునాకు చేరుకొనండి.
3. యజ్ఞము యజ్ఞమును చేరును గాక. యజ్ఞము యజ్ఞపతిని చేరుకొనును గాక. యజ్ఞము యజ్ఞయోనిని చేరును గాక. స్వాహా.
4. యజ్ఞపతీ! ఈ యజ్ఞముమంత్ర సహితమై కళ్యాణ ప్రదమై ఉన్నది. స్వాహా.
5. అర్చించిన దేవతలకు ఘ్రుతాహుతులు అర్చించని వారికి ఘ్రుతాహుతులు.
దేవతలారా! మీరుమార్గములు తెలిసినవారు. వచ్చిన మార్గముననే స్వస్థానములకు చేరుకొనండి.
6. మనస్పతీ! మా యజ్ఞమును దివి యందలి దేవతలకు చేర్చుము. స్వాహా. స్వాహా దివి. స్వాహా పృథివ్యాం. స్వాహా అన్తరిక్షే. స్వాహావాతే. ధాంస్వాహా.
--౦౦౦--
1. బర్హిఘ్రుత యుక్తము - ఇంద్ర, వసు, మరుత్, విశ్వదేవతా యుక్తమైనది. అది ఇంద్రుని చేరును గాక. స్వాహా. (7)
--౦౦౦--
1. బర్హిస్తంభనా! వేదిపై పరచుకొనుము. వేదిని కప్పివేయుము. వెదికి బిడ్డవంటి యజమానిని నష్టపరచకుము.
దర్భ హోతల ఆసనము. హరితవర్ణ హిరణ్మయము. ఈ దర్భ యజమాని గృహమును స్వర్ణముతో నింపును గాక. (8)
--౦౦౦--





