Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam
పోస్టుమార్టం తరువాత దొడ్డి కొమరయ్య శవాన్ని ప్రజలకు అప్పగించారు. వేల సంఖ్యలో అన్ని గ్రామాల ప్రజలు - బ్రహ్మాండం అయిన ఊరేగింపు తీశారు.
"దొడ్డి కొమరయ్య అమరహై"
"జోహార్ జోహార్ దొడ్డి కొమరయ్య"
"ప్రాణాలిస్తాం - దొరలకు లొంగం"
"దొరల దౌర్జన్యం నశించాలి"
"పోలీసుజులుం నశించాలి." నానాదాలతో దిక్కులు పిక్కటిల్లగా జన ప్రవాహం సాగింది. ప్రజల వెల్లువ పొర్లింది - పొంగింది.
"అమరజీవి నీవు కొమరయ్యా
అందుకో జోహార్లు కొమరయ్యా
నిన్ను బలిగొన్నట్టి నీచులను దునిమాడి
నిన్ను గన్నట్టి ఈ తెలుగుగడ్డను మేము
స్వాతంత్ర్యముగజేసి శాంతించెదమెగాని
నీ పేరు నిలుపకె కొమరయ్యా
నిదురైనబోమోయి కొమరయ్యా" అని ప్రతిజ్ఞ చేశారు.
దొడ్డి కొమరయ్య దేహాన్ని అగ్నికి ఆహుతి చేశారు.
కొమరయ్య అమరుడు అయినాడు. అతని ఆహుతి జ్వాలలు చైతన్యజ్వాలలు అయినాయి. కార్చిచ్చువలె గ్రామగ్రామాలకు పాకింది. తాలూకాలకు - జిల్లా అంతటా అలుముకొంది. ప్రజలు ఆత్మవిశ్వాసంతో కదిలారు. ఒక నూతన ఉద్యమం కొత్త రీతిలో ప్రారంభం అయింది.
ఒక ఊరి ప్రజలు గుత్పలు - దుడ్డుకర్రలు తీసుకుంటారు. పాటలు పాడుతూ - నినాదాలు చేస్తూ పక్క ఊరు చేరుకుంటారు. ఉభయ గ్రామాలవారు గడీ దగ్గర సభ పెడ్తారు. పాటలు- పద్యాలు - నినాదాలు - ఉపన్యాసాలు సాగుతాయి. తరవాత గడీగేటు ముందుకు వచ్చి గుత్పలను అరచేతుల్లో కొట్టి 'దొరలను అంతం చేస్తాం' అని అరుస్తారు. అందువల్ల దానికి "గుత్పల సంగం" అని పేరు వచ్చింది.
'గుత్పల సంగం' వచ్చిందంటే దొరలు గడీల్లో దాక్కుని తలుపులు బంధించుకున్నారు. మూడు నెలలవరకూ విసునూరు దొర పొలాల్లో పని సాగనివ్వలేదు.
బయటి ఊరునుంచి వచ్చినవారికి ఆ ఊరువారు భోజనాలు పెట్టేవారు. ఈ ఉద్యమంతో కుల మతాల గోడలు కూలిపోయాయి. ఇదొక పెద్ద సంఘ సంస్కరణ అయింది. మళ్లీ ఈ ఊరువారు పొరుగూరు వెళ్లేవారు. ఒక ప్రధాన విశేషం - మహిళలు సహితం పురుషుల సహితంగా బుజం బుజం కలిపి సాగడం. స్త్రీలు సాగడం ఒక మహత్తరం అయిన సాంఘిక ప్రగతి. యూరోపులో ఓటుహక్కు కోసం స్త్రీలు కలకాలం పోరాడారు. 'సంగం' పోరాటంలో స్త్రీలకు సమాన స్థానం కల్పించింది.
ఈ ఉద్యమ ఫలితంగా అనాదిగా సాగుతున్న 'వెట్టి' అంతం అయింది. దొరలు రైతులను భూములనుంచి 'బేదఖల్' - తొలగించడం నిలిచిపోయింది. బలవంతంగా 'లెవీ' వసూళ్లు ఆగిపోయాయి.
ఈ ఉద్యమం ఇన్ని సాధించింది. అన్నింటినీ మించి ప్రజాభిమానం సాధించింది. ప్రజలను అయిక్యం చేసింది. ప్రజల్లో ఆత్మవిశ్వాసం కలిగించి, విశేషంగా దొరల్లో దడ పుట్టించింది. వారు ఊరికి వేరయి వంటరి జీవితం గడపాల్సి వచ్చింది.
ప్రభుత్వాలు - ఎల్లవేళలా - ఉన్నవాని పక్షమే. ప్రభుత్వాల ప్రధాన బాధ్యత ఆస్తులను రక్షించడం. ప్రభుత్వం దొరలను రక్షించడానికి కదిలింది. విచక్షణారహితంగా 'సంగం' కార్యకర్తలను అరెస్టులు చేసింది. కేసులు పెట్టింది. కోర్టులకు తిప్పింది.
కమ్యూనిస్టు పార్టీ ఎత్తుగడ మార్చింది. కార్యకర్తలను అరెస్టు కావద్దని ఆదేశించింది.అజ్ఞాతానికి వెళ్లిపొమ్మన్నది. గ్రామాలలో ఉంటే పోలీసులు వచ్చినప్పుడు తప్పుకొమ్మన్నది. ఉద్యమానికి తిరుగులేని - ప్రజల సహకారం అందింది. ప్రజలు తమ నాయకులను కంటికి రెప్పవలె కాపాడుకున్నారు.
ప్రజల చైతన్యం ప్రభుత్వాన్ని హడలగొట్టింది. అది తన పశుబలాన్ని ప్రయోగించింది. సైన్యాన్ని రంగంలోకి దింపింది. ప్రజలు సైన్యంతో సహితం హోరాహోరీ పోరారు. అలాంటి కొన్ని పోరాటాలను పేర్కొనడం అత్యవసరం.
బాలెమ్ల:
కామ్రేడ్ మట్టారెడ్డి బాలెమ్లలో ఉన్నాడని పోలీసులకు తెలిసింది. పోలీసులు రాత్రిపూట - మట్టారెడ్డి ఇంటిని చుట్టుముట్టారు. ఆ సందడికి మట్టారెడ్డి లేచాడు. గుత్ప పట్టుకొని బయటికి వచ్చాడు. పొలికేక పెట్టాడు. గ్రామం సాంతం మేలుకొన్నది. చేతికి అందిన గుత్ప - రోకలి - వడిసెల - పొరక అందుకొని స్త్రీ పురుషులు పోలీసుల మీద దూకారు. ఒక సబిన్ స్పెక్టరు చేయి విరిచారు. ఒక కానిస్టేబుల్ తల పగిలింది. సర్కిల్ ఇన్ స్పెక్టర్ మట్టారెడ్డి తలకు తుపాకి పెట్టి కాల్చాడు.
'ఆంధ్రమహాసభకూ జై - సంగానికి జై' అంటూ మట్టారెడ్డి ఒరిగాడు. పోలీసులు తృటిలో మట్టారెడ్డి దేహాన్ని వ్యానులో వేసుకొని పారిపోయారు. ప్రజలు వెంబడించారు. కాని, వ్యానును అందుకోలేకపోయారు.
తెల్లవారి సూర్యాపేట జనసాగరం అయింది. ప్రజలు మట్టారెడ్డి దేహాన్ని తీసుకున్నారు. వేల సంఖ్యలో సాగారు. వారి దుఃఖానికి, ఆవేశానికి హద్దులు కనిపించలేదు. మట్టారెడ్డికి జోహార్ పలికే నినాదాలు అందని ఆకాశాన్ని అంటేయి. మట్టారెడ్డి చితి ముందు మట్టారెడ్డి భార్య 'పగ తీర్చుకుంటా'నని ప్రతిన బూనింది.
మట్టారెడ్డి భార్య ప్రతిన చూచారు జనం. వారిలో ఆవేశం పొంగింది. ఉద్రేకంలో ఉర్రూతలూగారు. నిజామును హతమారుస్తామన్నారు.
"బండిమీదబండికట్టి - పదహారుబండ్లుకట్టి
ఏబండ్లనున్నవుకొడుకో - నైజాముసర్కరోడ!
నైజాముసర్కరోడా - నాజీలమింటినోడ!
నీ అంతుచూస్తంకొడుకో - నైజాంసర్కరోడా" అని పిడుగులు కురిపించారు.
పాత సూర్యపేట:
బాలమ్ల పోరాటం కొన్ని అనుభవాలను అందించింది. ప్రజలు - తమ నాయకులను - రక్షించుకోవడానికి కృతనిశ్చయులు అయినారు. ప్రతి గ్రామంలో రాత్రి కాపలాలు ఏర్పరచారు. ఊరి మధ్యన ఒక దండోరా ఏర్పరచారు.
దొరలు - వారి తాబేదార్లు - గ్రామాలు విడిచారు. బస్తీలకు చేరారు. గ్రామాలన్నీ 'సంగం' కోటలే. ప్రజాద్రోహి ఒక్కడుకూడా లేడు. గ్రామాలు పెట్టని కోటలు అయినాయి.
ఒకనాటి తెల్లవారు జామున పాతసూర్యాపేట గ్రామం వెలుపల మిలిటరీ దిగింది. ఊరికి దూరంగా దిగింది. ప్రజలు తెలుసుకోకుండా దిగింది. గ్రామంలోనికి వచ్చేవాళ్లను - గ్రామంనుంచి బయటికి వెళ్లేవాళ్లను పట్టుకున్నది. తెల్లవారేవరకు గ్రామాన్ని మిలిటరీ చుట్టుముట్టింది.
అప్పుడు గ్రామానికి అది తెలిసింది. దండోరా మ్రోగింది. ఆడ - మగ - పిల్ల - పెద్ద అందరు వడిసెలలు తీసుకొని ఊరిబయటికి చేరుకున్నారు. ఆడవాళ్లు రాళ్లు అందించారు. మగవాళ్లు వడిసెలలు విసిరారు. రాళ్లు మిలిటరీ వాళ్లను తాకాయి. ఒక ఎత్తుగడగా మిలిటరీ - రాళ్లకు అందని దూరానికి వెనుకకు తగ్గింది.
ప్రజలు అది తమ విజయంగా భావించారు. వారు ముందుకు సాగారు. ఈలోగా చుట్టుపట్ల గ్రామాలనుంచి వేల సంఖ్యలో జనం కూడారు. మిలిటరీవాళ్లు జనాన్ని బయటనే నిలిపివుంచారు.
ప్రజలు ప్రత్యక్ష యుద్ధానికి దిగారు. అది సైనికులను సైతం చకితులను చేసింది. అధికారులు ప్రజలను లొంగిపొమ్మని హెచ్చరించారు. ఆయుధాలను, నాయకులను అప్పగించమని ఆదేశించారు.
'దొరలు - సర్కారు మమ్ములను సర్వనాశనం చేశారు. వారి మాటలు నమ్మం. మా చేతిలో వడిసెల ఉన్నంతకాలం మమ్ములను రుద్రుడు సహితం ఎదిరించలేరు" అన్నారు ప్రజలు. భర్మార్ తుపాకులు పేల్చారు. వడిసెలలు ఇంకా వేగంగా విసిరారు.
మిలిటరీ ముందుకు సాగింది. బ్రెన్ గన్ పేల్చింది. పాత సూర్యాపేట నరసయ్య - పాతర్లపాటికి చెందిన బిక్షమయ్య నేలకు ఒరిగారు.
అప్పటికి ప్రజలకు మిలిటరీ ఆయుధాలు తెలియవు. వాటిని చూచారు. ఒరిగిన కామ్రేడ్స్ ను చూచారు. చెదిరిపోయారు. పారిపోయారు. సైనికులు వారిని వెంబడించారు. ఆడ, మగ పిల్లాపాపను పట్టుకున్నారు. విచక్షణారహితంగా హింసించారు.
అదే రోజు బాలెమ్లపై దాడి చేసింది సైన్యం. 200 మందిని పట్టుకొని హింసించింది.





