Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam



    దేవరుప్పలలో సరిగ్గా పాతసూర్యాపేటవలె దాడి - ప్రతిదాడి జరిగాయి. మిలిటరీ కాల్పుల్లో కడివెండికి చెందిన మందడి సోమిరెడ్డి అమరుడయినాడు.

 

    మల్లారెడ్డి గూడెం:

 

    బాలెమ్ల - పాతసూర్యాపేట - దేవరుప్పల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని - పార్టీ పోరాట పద్ధతిని మార్చింది. సైనికులు దాడి చేసినప్పుడు ఎదిరించవద్దనీ - జాదుకొమ్మనీ ఆదేశాలు ఇచ్చింది. కాని, ఆ ఆదేశం సకాలంలో ప్రజలకు అందలేదు. మల్లారెడ్డి గూడెంలో అప్పిరెడ్డి అమరుడు కావలసి వచ్చింది.

 

    గ్రామ నాయకులు రాత్రిళ్లు అజ్ఞాతంలో ఉంటారు. 29 డిసెంబర్ 1946న మిలిటరీ మల్లారెడ్డి గూడేన్ని ముట్టడించింది. ప్రజలు మామూలు పద్ధతిలో దండోరా మ్రోగించారు. జనం మిద్దెలమీద, ఊరిబయట చేరారు. వడిసెలలు విసిరారు. ఊరు చుట్టూ మొక్కజొన్న పొలాలున్నాయి. మిలిటరీ ఎంత ఉన్నదో కనిపించడం లేదు. ఉభయసేనల మధ్యయుద్ధం జరిగింది. పొద్దు ఎక్కింది. ఉభయ పక్షాలూ స్థిరంగా ఉన్నాయి.

 

    మిలిటరీ అధికారులు - కలెక్టరు లొంగిపొమ్మని ప్రజలను హెచ్చరించారు. ప్రజలు ఖాతరు చేయలేరు. ప్రజల తరఫున ఒకరిని మధ్యవర్తిగా పంపవలసిందని కోరారు. ప్రజలు సంప్రదించుకున్నారు. అప్పిరెడ్డి - మరో నలుగురిని పంపారు.

 

    అప్పిరెడ్డి అలా సాగాడో లేదో మిలిటరీ కాల్పులు జరిపింది. అప్పిరెడ్డి అక్కడికి అక్కడే నేలకు ఒరిగాడు. ఎదురుగా ఉన్న మరొక వ్యక్తి - భర్త వడిసెలకు రాళ్లు అందిస్తుండిన మహిళ - హతులు అయినారు. అనేకమంది గాయపడ్డారు. మిలిటరీ గ్రామంమీద పడింది. ఇష్టారాజ్యంగా చిన్నా - పెద్ద, స్త్రీ - పురుష భేదం లేకుండా అందరినీ నానా హింసలు పెట్టింది.

 

    మిలిటరీవారు ప్రజలందరినీ ఒకచోట చేర్చారు. వారిని లారీలు ఎక్కించారు. తీరా లారీలు బయలుదేరేముందు ముస్లిముల్ను దింపారు. ముస్లిములు తాము దిగం అన్నారు. తామూ పోరాటం జరిపాం అన్నారు. అయినా వినలేదు. ముస్లిములను బలవంతంగా దింపారు. సుమారు 400 మందిని తీసికెళ్లారు.

 

    గ్రామం నిరామయం అయింది. ఎడారి అయింది. పాడుబడినట్లయింది. మిగిలిన వారిని ఓదార్చేవారు లేరు. ఆ ఉండిపోయిన తురకలు ఓదార్చారు. కాని, తురకలే దాడికి కారణం అని దుర్మార్గులు పుకారు పుట్టించారు, కాని, తదుపరి అది 'పుకారు'అని తెలిసిపోయింది.

 

    మతకలహాలు చెలరేగలేదు.

 

    ప్రజాపోరాటాల్లో మతకలహాలకు స్థానం ఉండదని నిరూపించబడింది.

 

    భారతదేశంలో మతకలహాలు జరగలేదని నా నమ్మకం. జరిగినవన్నీ మతం పేర జరిగిన రాజకీయ కల్లోలాలే. పాకిస్తాన్ కావాలని జిన్నా జరిపిన మారణ హోమాలు - నర సంహారాలు - మూగ హత్యలు సైతం మతకలహాలు కావు. రాజకీయ ఆధిపత్యంకోసం మతపు మసిపులిమిన క్షుద్ర రాజకీయాలు మాత్రమే. నిజాం నవాబు "అనల్ మలిక్" నినాదం కూడా తన పెత్తనం నిలుపుకోవడానికే తప్ప ఇస్లాంను ఉద్ధరించడానికి కాదు.

 

    మతం నరుని - మానవుని చేసి - అతని అంతస్తును దైవత్వానికి దగ్గరకు చేర్చడానికి ఉపకరిస్తుంది. మతానికి ఈర్ష్య లేదు. ద్వేషం లేదు. శత్రుత్వం లేదు. మతానికి సత్యం - సహనం - ప్రేమ - క్షమ ఉన్నాయి.

 

    నరుడు స్వప్రయోజనం కోసం తాను రాక్షసుడు అవుతున్నాడు. మతానికి రాక్షసపురంగు పులుముతున్నాడు. మతాన్ని రాక్షసం చేసి, తాను రాక్షస రాజ్యం ఏలుతున్నాడు!

 

    "మైఖద్ ముసహఫ్ బసోజ్ ఆతిష్ అందర్ కా బజన్
    సాకిన్ బుత్ ఖానాబాష్ వ మర్దుమ్ ఆ జారీమకున్." ఇది ఫార్సీకవి ఖాజా హాఫిజ్ కవిత.

 

    "త్రాగు మధువు, కాల్చు ఖురాను
    కూల్చు మక్కాను, పూజించు ప్రతిమల
    హింసించకు మనిషిని మాత్రం!" ఇది హాఫిజ్ ఫార్సీకవితకు తెనిగింపు.

 

    పశుబలం - ప్రజాబలం:

 

    నిజాం ప్రభుత్వం - దొరలు అంతటితో ఆగలేదు. నల్లగొండ వరంగల్లు జిల్లాలలో మార్షల్ లా ప్రకటించారు - సైన్యానికి వప్పగించారు. నిజాం నవాబుకు ఉన్న మొత్తం సైన్యం 50,000. అందులో 20,000 సైన్యాన్ని ఈ జిల్లాలలో దింపింది.

 

    గ్రామాలనుంచి పిల్లులవలె పారిపోయారు దొరలు - పటేల్ పట్వారీలు - గుండాలు - వారి తాబేదార్లు. వారందరూ మళ్లీ పులులు అయినారు. గ్రామాలకు తిరిగి వచ్చారు. కక్ష సాధించసాగారు.

 

    వారు యువకులను పట్టుకున్నారు. నాయకులను చూపవలసిందని, వారి జాడ తెలుప వలసిందని నానాయాతనలు పెట్టారు.

 

    గోళ్లలో సూదులు గుచ్చారు.

 

    స్తంభానికి వారిని జనపనారతో కట్టి, పైనుంచి నీళ్లు గుమ్మరించారు. నీళ్లు పడుతుంటే నార బిగుసుకుంటుంది. యాతన పెడ్తుంది.

 

    అరిచేతులమీద మంచం కోళ్లు పెట్టారు. మంచంమీద ఎగిరారు.

 

    కారం పూసిన కర్రలు ఆసనాల్లో దూర్చారు.

 

    నోళ్లలో కారం కొట్టారు. అరికాళ్లను కత్తులతో చీరారు.

 

    ఇలాంటివి ఇంకా అనేక హింసలు పెట్టారు. అయినా, చాల సందర్భాలలో నాయకుల జాడలు వెల్లడించలేదు.

 

    దొరలు - పటేల్ పట్వారీలు గుండాలను వెంటపెట్టుకుని ఇళ్లు దోచారు. ఇళ్లు తగలబెట్టారు. పంటలు కాల్చారు. హింస పురివిప్పి నాట్యం చేసింది.

 

    స్త్రీలను హింసించారు. వారిని దిగంబరంగా తిప్పారు. మానభంగాలు చేశారు. భర్తముందు భార్యను - బావముందు మరదలును అమానుషంగా చెరిచారు. ఆ గ్రామాలను పర్యటించిన కుమారి పద్మజనాయుడు ఇలా అన్నారు:-

 

    "స్త్రీలను మానభంగం చేయడంలో నాజీలను తలతన్నారు. ఒక పదహారేళ్ల పసిదాన్ని మానభంగం చేయబోయారు. భర్త అడ్డు తగిలాడు. అతని తలకు తుపాకి పెట్టి నిలిపి పెట్టారు. భర్తముందే భార్యను అమానుషంగా అత్యాచారం చేశారు.

 

    ఆ గ్రామాల్లో దోచుకోని ఇల్లులేదు. అవమానం లజ్జల బరువుతో క్రుంగని స్త్రీ లేదు. బావను స్తంభానికి కట్టారు. బావముందు మరదలును రాక్షసంగా చెరిచారు. గర్భిణీ స్త్రీలు - బాలెంతలు కూడా అవమానం పాలయ్యారు. ఇంతకన్న ఘోరాలు జరిగాయి. కాని, నేను స్త్రీని. ఇంతకన్న చెప్పడం కష్టం."

 

    హైదరాబాదు స్టేట్ కాంగ్రెస్ అధ్యక్షులు స్వామి రామానంద తీర్థ నవంబర్ 28, 1946న చేసిన పత్రికా ప్రకటన సంగ్రహం:-

 

    'సూర్యాపేట మిలిటరీ కాంపువలె ఉన్నది. మిలిటరీ లారీలు జోరుగా తిరుగుతున్నాయి. ఉదయం గ్రామాలకు వెళ్తున్నాయి. లారీలలో జనాన్ని ఎక్కించుకొని తిరిగి వస్తున్నాయి.

 

    "నేను బాలెమ్ల వెళ్లాను. ఒక చిన్నపోలీసు అధికారి ఇద్దరు రైతులను కాల్చి చంపాడు. ఇది దారుణం. ఈ కాల్పులపై బహిరంగ విచారణ జరిపించాలి.

 

    "మేము పాత సూర్యాపేట వెళ్లాం. మాకు ఒక స్త్రీ - గుండెలు పగిలిన - ఏడ్పులు వినిపించాయి. మేము లోనికి వెళ్లి చూచాం. ఆమె - అంతకు ముందు పోలీసు కాల్పులలో కూలిన వ్యక్తి - భార్య! ఆ గ్రామంనుంచి 170 మందిని - మిలిటరీవాళ్లు - తీసికెళ్లారు. అనేక మంది స్త్రీ పురుషుల శరీరాలపై గాయాలున్నాయి.

 

    "గత కొద్ది కాలంగా కమ్యూనిస్టులు ప్రజలతో కలిసి జీవిస్తున్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. వారు ప్రజల్లో చైతన్యం ఆత్మవిశ్వాసం కలిగించారు.

 

    "ప్రభుత్వం ఈ మిలిటరీ చర్యలను వెంటనే నిలుపుచేయాలి. అది జరక్కుంటే పరిస్థితులు విషమిస్తాయి."

 

    ఇలాంటి దారుణ పరిస్థితుల్లో ఒక ప్రహసనం:

 

    1. స్టేట్ కాంగ్రెస్ మీద నిషేధం తొలగించారు.

 

    2. జాతీయ భావాలు గలవాడనిపించుకొన్న మిర్జా ఇస్మాయిల్ ప్రధాని అయినాడు.

 

    3. నిజాం పుత్రుడు ముకర్రం జాహ్ కల్లోలిత ప్రాంతాలను దర్శించాడు. 'ప్రజలు నా బిడ్డలు. వారి బాధలు నా బాధలు' అని బట్టలు పంచి పెట్టాడు!

 

    4. ప్రధాని మిర్జా ఇస్మాయిల్ కూడా ఆడంబరంగా పర్యటించాడు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.