Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam
3. బాబాసాబ్ పేట దొర 10,000 ఎకరాలు
4. కాళ్లూది వారు లక్ష ఎకరాలు
5. జన్నారెడ్డి ప్రతాపరెడ్డి లక్షన్నర ఎకరాలు
ఆ కాలపు సంయుక్త పరగణాలు - బీహార్ - మధ్యపరగణాలు - ఒరిసా మున్నగు ప్రాంతాల్లో ఇంతకు మించి భూమి ఉన్న జమీందారులు ఉన్నారు. బీహారు మున్నగు రాష్ట్రాల్లో జమీందార్ల ఈనాటి దారుణాలు ఆనాటి తెలంగాణా ప్రాంతాన్ని తలతన్నినవి.
దేశీయ సంస్థానాధీశుల్లో నిరంకుశత్వంలో నిజామును తలదన్నినవారు ఉన్నారు.
కమ్యూనిస్టు పార్టీ భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లో - తెలంగాణాకన్నా అధ్వాన్న పరిస్థితులు ఉన్నచోట విప్లవం సృష్టించలేకపోయింది.
సాయుధ పోరాటాలు తెలంగాణా ప్రాంతంలోనే ఉద్భవించడం - నక్సలయిట్ల పోరాటంగా ఇంకా కొనసాగడానికి గల మూలసూత్రాన్ని రాజకీయ - సాంఘిక - సామాజిక శాస్త్రవేత్తలు పరిశోధించి నిర్ణయించాల్సి ఉంది.
నాది తెలంగాణం అని గర్వించేవాళ్లలో నేను ఒకణ్ణి. నేను తెలంగాణా గడ్డన పుట్టాను. తెలంగాణ మట్టిలో పెరిగాను. తెలంగాణ ప్రజకోసం - నాకు సాధ్యమయినంతలో - పోరాటపరంగా - సామాజికపరంగా - సాహిత్యపరంగా సేవ చేస్తున్నాను. నాకు అర్థం అయింది ఏమంటే -
తెలంగాణా విప్లవపథాల సీమ
తెలంగాణ ప్రజానీకంలో తిరుగుబాటు రక్తం ఉంది. వీరు తలలు తెంపగలరు. తడిబట్టలతో కోయలేరు.
తెలంగాణ ప్రజ సింహం వంటిది. అది నిద్రిస్తూనే ఉంటుంది. లేచిందా పంజాతో కొడ్తుంది.
తెలంగాణంలో - ఉద్యమం పుట్టని రోజుల్లోకూడా - ప్రజలు దొరలను పట్టపగలు - నడిబజారులో చిత్రవధ చేసిన సంఘటనలు కోకొల్లలు. ఈ స్థితిని నేను 'చిల్లరదేవుళ్లు" నవలలో వివరించాను.
ఇలాంటి సంఘటనలను గుదిగుచ్చి వ్రాయవలసిన బాధ్యత చరిత్రకారులకు - వ్రాయించవలసి బాధ్యత ప్రజాసంస్థలకు ఉన్నది.
అంతమాత్రాన కమ్యూనిస్టు పార్టీ విప్లవోన్ముఖతనుకాని - ఆ పార్టీ విప్లవ నాయకత్వాన్ని - దాని నిజాయితీనికాని కొంచెం చేయాలనికాని - కించపరచాలని కాని నా ఉద్దేశం కాదు.
కమ్యూనిస్టు పార్టీ 'ప్రజాయుద్ధ' విధానం కారణంగానే నిజాం ప్రభుత్వపు నిరంకుశ విధానం సడలింది.
కమ్యూనిస్టు పార్టీ ఈ సడలింపును ఉద్యమపరంగా వినియోగించుకున్నది.
కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ ప్రజను సమైక్యం చేసింది. సంఘటితపరచింది. పోరాటానికి నాయకత్వం వహించింది. అయితే, ఈనాడు అనేకంగా చీలిపోయిన కమ్యూనిస్టు పార్టీలు - ఆనాడు పార్టీ నిర్వహించిన విప్లవానికి వారసులు కావడానికి అర్హులు కారు. ఆనాటి పార్టీ వెలుగు కిరణం - ఒక్కటి కూడా వీటిలో లేదు.
ఒక్క విషయం - ఆనాటి పార్టీ - మితవాదులుగా ముద్రవేసిన వారి పాత్రను విస్మరించరాదు. వారు నిర్మించిన ఆంధ్రమహాసభలోనే వీరు మొలిచి మహావృక్షం అయినారు. మితవాదుల భుజాలమీద ఎక్కి అతివాదులు అయినారు. మితవాదం మనం ఎక్కిన నిచ్చెన!
అమరజీవి కొమరయ్య:
భువనగిరి ఆంధ్రమహాసభల పోరాట స్ఫూర్తి ఖమ్మం సభలతో విప్లవస్ఫూర్తిగా జ్వలించింది.
కమ్యూనిస్టు పార్టీ - ఆంధ్రమహాసభ - అఖిల హైదరాబాద్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ల తరఫున కామ్రేడ్స్ మక్దూం మొహియొద్దీన్, రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి గారలు సాయుధ ప్రతిఘటనకై పిలుపునిచ్చారు. హైదరాబాద్ విద్యార్థి యూనియన్ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ఓంకార్ ప్రసాద్, సహాయ కార్యదర్శి కామ్రేడ్ రఫీ అహమద్ పిలుపునిచ్చారు.
ఈ పిలుపు హైదరాబాద్ కమ్యూనిస్టులు - తమంతతాముగా - ఇచ్చింది మాత్రం కాదు. దీనికి కమ్యూనిస్టు పార్టీ పాలిట్ బ్యూరో, అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమ ఆమోదముద్ర ఉంది. ఈ నిర్ణయం ఎంతవరకు సరియైంది అని ఈనాటి పరిస్థితుల దృష్టితో పరిశీలించడం సమంజసం కాదు. ఆనాడు తెలంగాణంలో ఉండిన నాజీ నియంతృత్వాన్ని ఎదుర్కోవడానికి అది అవసరం - తప్పనిసరి. 'నైజాం సర్కరోడా! నాజీల మించినోడా!' అని ప్రజలు పాడుకున్న రోజులవి!
ఇంతటి మహావిప్లవానికి ఎక్కడో నిప్పురవ్వ రాలాలి కదా! అది జనగాం తాలూకా పాలకుర్తిలో రాలింది. యాదృచ్చికమే అయినా 'పాలకుర్తి' శివకవి - ప్రజాకవి - తెలుగుకవి పాల్కురికి సోమనాథుని పుట్టిల్లు!
పాకుర్తిలో అయిలమ్మ రజక మహిళ - చాకలి ఆడది. ఆమెకు చారెడు నేల చెక్క ఉంది. ఆమె అందులో పంట పండించుకుంటోంది. అంతవరకు బాగానే ఉంది. ఆమె 'సంగం' కార్యకర్త. అది విసునూరి రామచంద్రారెడ్డి కళ్లల్లో నిప్పులు పోసింది. దొర కోప్పడ్డడు. అయిలమ్మ పొలం పంట కాజెయ్యాలెననుకున్నడు. నూరుగురు పైల్వాన్లను అయిలమ్మ పొలం మీదికి తోలిండు.
అయిలమ్మ ఎన్క సంగమున్నది. ప్రజలున్నరు. ప్రజలు గుత్పలు పట్టిన్రు. గుండాలమీదికి ఉరికిన్రు. గుండాలు మందిని చూచిన్రు. వారి మార్బలం చూచిన్రు. ఉచ్ఛ పోసుకున్నరు. విసునూర్ల పడేదన్క ఉరికిన్రు!
అయితే దొర ఊరుకున్నడనుకున్రా! ఆర్గురు కార్యకర్తల్ను పోలీసులకు పట్టిచ్చిండు. పోలీసోల్లు కార్యకర్తలను చచ్చెటట్లు కొట్టిన్రు. నోళ్లల్ల ఉచ్ఛ పోసిన్రు. ముడ్ల కారం ముద్దలు నూకిన్రు.
ఎట్లయితే ఏమి? అయిలమ్మకు గింజ దక్కింది. దొర ఓడిండు! ఎవరు ఓడిండు? దొర ఓడిండు! దొరోడు ఓడిపోయిండు. దొరోడు ఓడినందుకు మంది పొంగిపోయిన్రు. సంబరం చేసుకున్నరు. బడితెలు - వడిసెల్లు - బరిశలు తీసుకున్నరు. పెద్ద ఊరేగింపు తీసిన్రు. దొరల దౌర్జన్యాలను తిట్టిపోసిన్రు.
ఊరేగింపు గడీముంగలికెల్లి పోతాంది. దొర ఓడించు! ఎవరు ఓడిండు? దొర ఓడిండు! దొరోడు ఓడిపోయిండు. దొరోడు ఓడినందుకు మంది పొంగిపోయిన్రు. సంబరం చేసుకున్నరు. బడితెలు - వడిసెల్లు - బరిశలు తీసుకున్నరు. పెద్ద ఊరేగింపు తీసిన్రు. దొరల దౌర్జన్యాలను తిట్టిపోసిన్రు.
ఊరేగింపు గడీముంగలికెల్లి పోతాంది. దొర చెప్పిండు. గుండాలు బందూకులు కాల్చిన్రు. ఊరేగింపు ముంగల నడిచిన దొడ్డి కొమరయ్య పొట్టలకెల్లి తూట దూస్క పోయింది.
దొడ్డి కొమరయ్య ఒరిగిండు. కూలిండు.
కొమరయ్య బలి అయినాడు. ప్రజలు బెదరలేదు. పారిపోలేదు. కోటవంటి గడీని చుట్టుముట్టారు. వార్త కార్చిచ్చువలె పాకింది. పొరుగు గ్రామాల ప్రజలు వందలు వేలు వచ్చారు. రెండు వేలకుపైగా జనం కూడారు.
"ప్రాణానికి ప్రాణం - దొర ప్రాణం తీస్తాం" అని చేసిన నినాదాలే దొర గుండెల్లో తూటాలయినవి.
ప్రజలు నాయకులు లేనివారు కారు. 'సంగం' నాయకత్వం ఉంది. 'సంగం' పథకం ఉంది. 'సంగం' ఎత్తుగడ ఉంది. రెగ్యులర్ ముట్టడి ప్రారంభం అయింది. కొందరు గడీని చుట్టుముట్టారు. కొందరు ఊరిబయట కాపలా కాశారు. కొన్ని జట్లు వీథుల్లో 'పహరా' చేశాయి.
దొర కొడుకు విసునూరు నుంచి రెండువందల మంది గుండాలను వెంటపెట్టుకున్నాడు. తండ్రిని రక్షించడానికి - బండ్లమీద - కడివెండికి బయలుదేరాడు. ఊరి పొలిమేరలో కాపున్న ప్రజలు వారిని చూచారు. ఆకాశం చిల్లులు పడేటట్లు నినాదాలు చేశారు. వడిసెలలతో వందల వేల రాళ్లు రువ్వారు. దొర కొడుకు బెదిరిండు. అడుగుముందుకు వేయలేకపోయిండు.
ప్రజలు 'పొలో'మణి వారి వెంట పడ్డారు. దొరకొడుకు, దుండగులు - ప్రాణాలు దక్కించుకోవడానికి - పలాయన మంత్రం పఠించారు. ప్రజలు కేకలు - పెడబొబ్బలు - వడిసెలలతో వారిని తరిమారు. పారిపోతూ - ప్రాణభయంతో - మాధారం తండాలో దాక్కున్నారు. లంబాడీలు పొరకలతో -రోకళ్లతో తరిమికొట్టారు. అనుముల రామిరెడ్డి అనే దుండగుని ప్రజలు పట్టుకున్నారు. వాడే కార్యకర్తల నోళ్లలో మూత్రించింది. వాణ్ణి చావగొట్టి - కొన ఊపిరితో వదిలిపెట్టారు. గుండాలు వచ్చిన బండ్లను చెక్క పేళ్లకింద విరక్కొట్టారు. దొర మామిడి తోటమీద పడ్డారు. ఒక్క చెట్టు లేకుండా నరికి కుప్పపెట్టారు. తగలపెట్టారు.
సరిగ్గా ఆ సమయానికి పోలీసులు దిగారు. ప్రజాబలం చూచారు. వారూ బెదిరారు. ప్రజలతో మంతనాలు సాగించారు. గుండాలను పట్టుకుంటామన్నారు. వారిమీద చర్య తీసుకుంటామన్నారు. ప్రజలు - సంగం - పోలీసులను నమ్మింది. ప్రజలు విడిపోయారు. ఎవరి ఊళ్లకు వారు వెళ్లిపోయారు.
ఏకాలపు పోలీసులయినా 'ద్రోహం' చేయడం వారి ప్రధాన బాధ్యత. వారుతమ బాధ్యత నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలమీద కేసులు పెట్టారు. గూండాలను విచ్చల విడిగా వదిలారు.





