Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda
5. చంద్రదేవా! మమ్ము ద్వేషించువారిని, మేము ద్వేషించువారిని హతమార్చుము. మేము గోమంతులము, అశ్వమంతులము, ప్రజావంతులము, పశువంతులము, గృహస్వాములము అగుదుము గాక. (10)
6. సోమమును దేవతలు వర్ధిల్ల చేయుచున్నారు. అక్షయ సోమమును పిత్రుదేవతలు సేవించుచున్నారు. ఆ సోమ సహితముగ ఇంద్రుడు, వరుణుడు, బృహస్పతి, సకల దేవతలు మమ్ము వర్ధిల్ల చేయుదురు గాక. (11)
ఎనిమిదవ అనువాకము
మొదటి సూక్తము - 22
వినియోగము :-
1) 1 - 6 ఋక్కులచే సంపద లేక సర్వ ప్రకార ఫలములు కోరువాడు అగ్నిని యజించునది లేక ఉపస్థానము చేయునది.
2) అగ్ని చయనమున మొదటి ఋక్కుచే సామిధా దానము తరువాత బ్రహ్మ జపించునది లేక ఉపస్థానము చేయునది. వాస్తోత్పత్య మహాశాంతి యందు దీనిచే ఔదుంబరమణిని కట్టునది.
3) బ్రహ్మచారి తన అగ్నినాశ ప్రాయశ్చిత్తమునకు 2 - 6 మంత్రములచే అయిదు సమిధలు ఉంచునది. ఆధానమందు మధిత అగ్నిని వీనిచే నేతిలో ముంచునది.
4) ఆజ్య నిర్వాపన కాలమున బ్రహ్మ 6వ మంత్రముచే అనుమంత్రించునది.
5) జలోదర చికిత్స కొరకు రెండు నదుల సంగమ స్థానమందు మంటపము చేసి చల్లని నీటిని 7 - 10 మంత్రములచే సంపాతన అభిమంత్రణలు చేసి రోగికి స్నానము చేయించునది. అట్లే అభిమంత్రించి ఉష్ణజలము స్నానము చేయించునది.
6) ధూమకేతు దర్శన ప్రాయశ్చిత్తమునకు వారుణ పశు అవదానమందు 7 -10 మంత్రములలో ప్రతి మంత్రముచే ఆహుతులు ఇచ్చునది. పశు తంత్రమున హృదయ శూలో ద్వాసన తరువాత వీనిని జపించునది. అద్భుత మహాశాంతి యందు వీనిచే వరుణుని యజించునది.
7) శవ సంస్కారానంతరము నీటివద్ద బ్రహ్మ 9వ మంత్రమును జపించునది.
8) అంతేష్ట్యాదులందు స్వస్త్యయనమునకు 10 వ మంత్రమును జపించునది.
1. గోవులారా! మాకు గ్రోవ్రజము లభించునట్లు, స్తుతిపాత్రుడు, యుద్దములకు ఉరుకువాడగు అగ్నిని అర్చించండి. అస్మాసు భద్రాద్రవిణాని ధత్త. మాకు శుభప్రదములగు ధనములు ప్రసాదించండి. ఈ యజ్ఞమునకు దేవతలను కొనిరండి. మా యజ్ఞమున మధుమంతమగు మధుధారలు ప్రవహించును గాక.
2. తొలుత అగ్నిని నాయందు చేర్చుచున్నాను. ఆ అగ్ని క్షాత్రము, వర్చస్సు, బలసహితుడై నాలో చేరుచున్నాడు. నా యందు అగ్నిని, ప్రజను, ఆయుష్యమును చేర్చుచున్నాను. స్వాహా.
3. అగ్నిదేవా! ధనమును మాకే ప్రసాదించుము. మమ్ము ద్వేషించువారు మాకన్న ముందే నీ యజ్ఞమును తలపెట్టిన అది నిన్ను ప్రసన్నుని చేయకుండును గాక. స్వబాల సహితుడవై మాకు ప్రత్యక్షమగుము. ఈ యజమాని న్యూనభావము కలుగనివాడై యజ్ఞములు అనుష్టించుచు వర్దిల్లును గాక.
4. అగ్ని ఉషః కాలమున ఆవిర్భవించుచున్నాడు. అతడు ఉషస్సు నోటి నుండి వెడలుచున్నాడు. 'అగ్ని ఉషస్సులందును', పగళ్ళ యందును, ద్వారా పృథ్వులందును ప్రవేశించి ప్రకాశించుచున్నాడు.
5. జాతవేదాగ్ని తొలుత ఉషస్సునందు, తదుపరి రోజులందు ప్రకాశించుచున్నాడు. అగ్ని రూపములు అనేకములు అయినద్మ్హున సూర్య కిరణములందు చేరి ద్యావాపృథ్వులను ప్రకాశింపచేయుచున్నాడు.
6. అగ్నిదేవా! నీ యొక్క ఘ్రుతము దేవలోకమున ఉన్నది. మనువు మున్నగువారు నిన్ను ఘ్రుతముచే ప్రజ్వలింపచేసినారు. దీప్తవంతమై, నీ పౌత్రమగు జలము ఘ్రుతమును నీ ముందునకు తెచ్చును గాక. గోవులు నీ కొరకు ఘ్రుతమును పితుకుదురు గాక.
7. వరుణదేవా! జలములందు నీకు హిరణ్య గృహములున్నవి. కావున సత్యకర్ముడగు వరుణ రాజు జలోదర రూపమగు ఇతర గృహములను విడుచును గాక. (తన ఇంటనే ఉండి వ్యాధులు కలిగించకుండును గాక అని.)
8. వరుణరాజా! మా శరీరములందున్న సమస్త వ్యాధి స్థానములను విడువుము. జలమా! అఘ్న్యా! వరుణా! మేము దుర్భాషలాడినచో ఆ పాపము నుండి మాకు విముక్తి కలిగింపుము.
9. వరుణ దేవా! మా శరీరము మీది, దిగువ, మధ్యనున్న పాశములను ఛేదించుము. తదుపరి నీ వ్రతములు చేయుచు మేము నిర్భయులమై ఉందుము గాక.
10. వరుణ దేవా! నీ యొక్క సర్వ పాశముల నుండి విడిపించుము. నీకు సంబంధించిన ఉత్తమ, అధమ పాశముల నుండి విడిపింపుము. దుస్స్వప్న దురితము నుండి తప్పింపుము. అప్పుడు మేము పుణ్య లోకములకు చేరగలము.
రెండవ సూక్తము - 22
వినియోగము :-
1) మొదటి ఋక్కుచే అగ్ని దేవుని ఉపస్థానమున అంగాను సారము వినియోగము.
2) ఇంద్ర మహానామక ఉత్సవమున 2, 5 మంత్రములచే హవి ఆహుతులు ఇచ్చునది.
3) అగ్ని చయనమున పరిషాచ్చిన్నాచితిని బ్రహ్మ అనుమంత్రించునది.
4) స్వస్త్యయనము చేయుటకు 4, 5 మంత్రములలో ఒక్కొక్క దానిచే ఇంద్రుని యజించునది లేక ఉపస్థానము చేయునది. ఈ రెండింటి పాఠము స్వస్త్యయన గణములందు ఉన్నందున ఉపాకర్మ ఘ్రుతయోగము నందు వినియోగము అంత్యేష్టి యందు స్వస్త్యయనము చేయుటకు వీనిని జపించునది.
5) స్వస్త్యయనము కోరువాడు 6వ ఋక్కుచే రుద్రులను యజించునది లేక ఉపస్థానము చేయునది. అంత్యేష్టి యందు స్వస్త్యయనమునకు దీనిని జపించునది. దర్శ మరియు పూర్ణ మాసమున అగ్నీధ్రము నందు 6వ ఋక్కుచే సంమార్గమును అగ్నిలో వేయునది. చాతుర్మాస్యపు సాకమేధ పర్వము యొక్క త్రైయమ్బక కర్మమున దీని వినియోగము. అగ్నిష్టోమమున శాలా దహనానంతరము దీనిచే అగ్నికి నమస్కరించునది.
6) సర్వ విష చికిత్స కొరకు 7వ మంత్రముచే గడ్డిని కాల్చి పాము ముందు వేయునది.
7) పరిమోక్ష విధియందు 8 - 11 మంత్రములచే శాంతి జలమును అనుమంత్రించునది. వేద వ్రతాదులందు 8 ,9 ,11 మంత్రములచే మూడు సమిధలను ఉంచునది. ఆచార్య మరణమున సంస్కారానంతరము 8 - 11 ఋక్కులచే బ్రహ్మచారి స్నానము చేయునది. దర్శ మరియు పూర్ణమాస యాగమున ఇడా భాగ ప్రాశానంతరాము 8 - 10 ఋక్కులచే ప్రస్తరమున మార్జనము చేయునది. అగ్నిష్టోమమున అవభ్రుత స్నానానంతరము 8 వ మంత్రముచే ఆహవనీయమును ఉపస్థానము చేయునది.
8) అగ్ని కర్మమున బ్రహ్మచారి 10వ మంత్రముచే హస్త ప్రక్షాళనము చేయునది. చాతుర్మాస్యమున వరుణ ప్రసాధన పర్వమందు దీనిచే మార్జనము చేయునది.
9) దర్శ మరియు పూర్ణమాసమున సంస్రావ హోమానంతరము 11 వ మంత్రములోని మూడు భాగములచే మూడు సమిధల ముఖములను శుద్దిచేయునది. అదే కర్మమున దక్షిణ ప్రతిగ్రహానంతరము దీనిచే సమిధలను ఉంచునది. అగ్ని కార్యమున బ్రహ్మచారి దీనిచే చేతులను అగ్నితో కాపి ఊష్మమును భక్షించునది.
10) జారోచ్చాటనకు 12 - 14 మంత్రములను జారను చూచి చదువునది. దీనిచే రాతిని అభిమంత్రించి జార సంగమ స్థానమున వేయునది.
1. అగ్నీ! నీవు అనాధృష్యుడవు. జాతవేదివి. అమరుడవు. దేవతవు. బలసంపన్నుడవు. ఈ కర్మమందు ప్రజ్వరిల్లుము. ప్రజ్వరిల్లి సమస్త వ్యాధులను దహించుము. తదుపరి మానవ కళ్యాణకర రక్షణలతో మా ఇంటిని రక్షింపుము.
2. ఇంద్రదేవా! నీవు క్షాత్రమును రక్షించ గల శక్తితో ఆవిర్భవించినావు.
అగ్నిదేవా! నీవు కోరికలు తీర్చువాడవు. నీవు శత్రువు వలె ఆచరించు జనసమూహములను దూరము చేయుము. దేవతల కొరకు ఒక లోకమును నిర్మించుము.
3. ఇంద్రుడు కుచరుడు. పర్వతమందుండు సింహము వంటి భయంకరుడు. అతడు దూర ద్యులోకము నుండి వచ్చి వాడియైన వజ్రాయుధముచే వైరులను సంహరించును గాక. యుద్దసన్నద్దులగు అన్య శత్రువులను నివారించును గాక.
--౦౦౦--
1. త్రుక్షపుత్రుడు సుపర్ణుడు ఈ యజ్ఞమునకు శుభములు కలిగించుచు వచ్చును గాక. ఈ సుపర్ణుడు బలశాలి. సోమము తెచ్చుటకు దేవతలు ఇతనిని నియమించినారు. ఇతనికి ధిక్కరించు శక్తి గలదు. ఇతడు జగములను జయించగలవాడు. ఇతడు అరిష్టనేమికి తండ్రి. శత్రుంజయుడు. శీఘ్రగామి. అట్టి సుపర్ణుని ఆహ్వానించుచున్నాము. (4)
--౦౦౦--
1. రక్షకుడగు ఇంద్రుని ఆహ్వానించుచున్నాము. అభయమిచ్చు ఇంద్రుని ఆహ్వానించుచున్నాము. సకల సంగ్రామములకు ఆహ్వానించబడు ఇంద్రుని ఆహ్వానించుచున్నాము. శూరుడగు ఇంద్రుని, శక్రుని, పురుహూత ఇంద్రుని ఆహ్వానించుచున్నాము. మఘవుడగు ఇంద్రుడు మాకు శుభములు కలిగించును గాక. (5)
1. రుద్రుడు అగ్నులందు, జలములమ్దు, ఓషధులందు, లతలందు ప్రవేశించి ఉన్నాడు. రుద్రుడు ఈ సమస్త భువనములను సృష్టించ సమర్దుడై ఉన్నాడు. అట్టి రుద్రునకు నమస్కారము అగ్నికి వందనము. (6)
--౦౦౦--





