Home » Dr Dasaradhi Rangacharya » Atharva Veda


 

1.    సంతానవతులగు గోవులారా! పచ్చిక బయళ్ళందు సంచరించండి. తృణభక్షణ చేయండి. సుఖముగా దిగగల జలాశయములందలి నీరు త్రాగండి. చోరులు మిమ్ము దొంగిలించకుందురు గాక. వ్యాఘ్రాదులు మీపై బడకుందురు గాక. రుద్రుని ఆయుధము మిమ్ము విడుచును గాక. (5)
   
2.    పాడియావులారా! మీ నామములు అనేకములు. మీరు అడవులకు స్వేచ్చగా చేరుకొనండి. ఇంటి నెరిగి తిరిగి రండి. దూడలను చక్కగా సాకండి. (6)
   
                                           --౦౦౦--
   
1.    గండమాలలో సదాచీముకారునది భార్య భాధను మించినది. ఇది మందుల, మంత్రముల ప్రభావమున కరిగిపోవును గాక. ఇవి అంత సారవంతములు కావు. మొదట కనుగొన్న అంత బాధించవు. అవి కూడ ఉప్పు వలె కరిగిపోవును గాక. (7)
   
2.    గొంతుకున్న గండమాలలు, చంకలు మున్నగు గుహ్య సంధులందున్నవి మందు, మంత్ర ప్రభావమున కరిగిపోవును గాక. (8)
   
3.    ఒక రాజయక్ష్మ ఎముకలకు వ్యాపించును. ఒకటి మాంసమును పీల్చివేయును. ఒకటి వెన్నును బాధించును. ఒకటి అతి సంభోగము వలన పీడించును. అవన్నియు నష్టపడును గాక. (9)
   
4.    'జయాస్య' అను క్షయ పక్షిమీద పడినట్లు పడును. పురుషుని దేహమునంతను తినివేయును. అది చిర, అచిర కాలములుండు రెండు విధములు ఈ మందు ఆ రెండింటిని నివారించునది అగుచున్నది. (10)
   
                                                 రెండవ సూక్తము - 20
   
వినియోగము :-

   
      1) 19. 9 వలె మొదటి మంత్రపు వినియోగము.
   
      2) 2వ మంత్రముచే మధ్యాహ్న సవనమున ద్రోణ కలశమున ఉన్న సోమమును బ్రహ్మ అనుమంత్రించునది.
   
      3) 3 - 5 మంత్రలుచే అభిచార కర్మమున పిడుగుపాటు చెట్టు సమిధను ఉంచునది. చాతుర్మాస్యపు సాకమేధ పర్వపు మధ్యాహ్నమున సంతాపన మరుద్యాగమును బ్రహ్మ వీనిచే అనుమంత్రించునది.
   
      4) సర్వ వ్యాధి చికిత్స యందు 6వ ఋక్కుచే జలపూర్ణ కుంభమును సంపాతన, అబిమంత్రణలు చేసి సూక్తోక్త రీతిని ఆ నీటిచే స్నానము చేయించునది లేదా దానిని పైన చల్లునది. దర్శపూర్ణ మాసమున త్రాటినుంచి వదలిన పత్నిని బ్రహ్మ దీనిచే అనుమంత్రించునది.
   
      5) 7వ మంత్రముచే దర్శపూర్ణమాసమున హవి ఆసాదనానంతరము ఇంధనమును ఉంచునది.
   
      6) 8 - 10 ఋక్కులచే అభిలషిత ఫలము కోరువాడు అమావాస్య యందు యజించునది లేక ఉపస్థానము  చేయునది.
   
      7) 8వ మంత్రముచే దర్శయాగమున పార్వణ హోమము చేయునది. దీనిచే కుహూ దేవతను పరిగ్రహించునది.
   
1.    జాయాన్య రోగమా! మేము నిన్ను ఎరుగుదుము. నీ ఉత్పత్తిని ఎరుంగుదుము. ఇది దేవతలకు హవిస్సులు అర్పించు గృహము కదా! ఇచట నీవెట్లు వధించుచున్నావు?
   
    (జాయాన్య - భార్య వలన కలిగిన రాజయక్ష్మ.)
   
2.    ఇంద్రా! నీవు వృత్రహంతవు. శూరుడవు. ద్రోణకలశమున సోమము ఉన్నది. సేవించుము. మమ్ము ధనవంతులను చేయుము. మధ్యాహ్న సవనమున సోమమును సేవించుము. మమ్ము ధనమునందు నిలుపుము. నీవు ధనపతివి కదా!
   
                                           --౦౦౦--
   
1.    సూర్య సంబంధ మరుత్తులారా! హవిని స్వీకరించండి. మమ్ము రక్షించుటకు గాను శత్రుసంహారకులగు మీరు హవిని సేవించండి. (3)
   
2.    ధనద మరుత్తులారా! చాటుగా మా మనసులను క్షోభింప చేయదలచిన వానిని వరుణ పాశములు బంధించును గాక. మా మీద దాడికి సంకల్పించిన నీ యొక్క తాపక ఆయుధముచే హతమార్చుము. (4)
   
3.    మరుద్గణములు ప్రతి సంవత్సరము ప్రాదుర్భవించువారు. చక్కని మంత్రములచే స్తుతించబడువారు. అంతరిక్షనివాసులు. వృష్టి కారకులు. మానవ హితైషులు. శత్రుసంతాపకులు. అందరకు ఆనంద దాయకులు. వారు మమ్ము పాప పాశ విముక్తులను చేయుదురు గాక. (5)
   
                                             --౦౦౦--
   
1.    నేను ప్రయోక్తను. నిన్ను పట్టిన అగ్ర, మధ్యమ, అధమ రోగ బంధనములను విప్పుచున్నాను. అగ్ని వలె దీపించుచు ఈ లోకమున సుఖించుము. (6)
   
2.    అగ్నిదేవా! ఇతనికి బలము, శక్తి ప్రసాదించుము. దేవతలకు హవిని చేర్చుటకు నిన్ను నియమించుచున్నాను. ఇతనికి ధనము లిమ్ము. ఇతనిని గురించి దేవతలకు ప్రియ వచనములు చెప్పుము. (7)
   
                                            --౦౦౦--
   
1.    అమావాస్యా! దేవతలు నీ మహత్తును గ్రహించినారు. నీకు హవిర్భాగము ఏర్పరచినారు. దానిని స్వీకరించుము. యజ్ఞమును పూర్తి చేయుము.
   
    అందరు వరించునట్టి సౌభాగ్యశాలి అమావాస్యా! మాకు ధనమును, వీరపుత్రులను ప్రసాదించుము. (8)
   
2.    నేనే అమావాస్యను. నాయందే దేవతలు ఉన్నారు. సుక్రుతులు నాయందే ఉన్నారు. సిద్దసాధ్యులు, ఇంద్రాదులు, ఉభయులు నాయందే నివసించుచున్నారు. (9)
   
3.    అమావాస్య రాత్రి ధనప్రద. మాకు ధనములు ఇచ్చుటకు వచ్చును గాక. అన్నరసమును, పుష్టిని వెంట తీసికొని మా వద్దకు రమ్ము. అన్న రసమును క్షీరాదులతో నింపుకొని రమ్ము. అమావాస్యను హవి అర్పించి సేవించుచున్నాము. (10)
   
                                           మూడవ సూక్తము - 21
   
వినియోగము :-

   
      1) మొదటి మంత్రపు వినియోగము 20 - 8 వంటిది.
   
      2) సర్వ ఫలకామి 2, 3, 5 ఋక్కులచే పౌర్ణమాసిని యజించునది. లేదా ఉపస్థానము చేయునది.  ఆ కర్మయందే 4వ మంత్రముచే ప్రజాపతిని యజించునది లేదా ఉపస్థానము చేయునది.
   
      3) పూర్ణమాస యాగమున 2వ మంత్రముచే పార్వణ హోమమున ఆహుతులు ఇచ్చునది.
   
      4) దర్శపూర్ణ మాసమందు సంనతి హోమానంతరము 4వ మంత్రముచే ఘ్రుతాహుతులిచ్చునది. సకల శ్రౌతకర్మలందు అనుమంత్రణ మంత్రము లేనపుడు దీనిచే అనుమంత్రించునది. దర్శపూర్ణమాసమందు ప్రాజాపత్యాధానమును బ్రహ్మ దీనిచే అనుమంత్రించునది.
   
      5) వివాహ కర్మమందు 6వ మంత్రముచే ఘ్రుత, సమిధ, పురోడాశ ఆహుతు లిచ్చునది.
   
      6) మహా శాంతి గ్రహయజ్ఞమున 8 - 11 ఋక్కులచే 'బుధాయ' హవి. ఘ్రుత, సమిధా ధానము   - ఉపస్థానము చేయునది.
   
1.    అమావాస్య! నీవు కాక మరెవ్వడును విశ్వ ప్రాణులను సృష్టించలేదు. నీవే సృష్టికర్తవు. మేము ఏదికోరి నీకు ఆహుతులు అర్పించుచున్నామో అది మాకు లభించును గాక. "వయం స్యామ పతియో రయీణామ్" మేము ధనపతులము అగుదుము గాక.
   
                                                  --౦౦౦--
   

1.    పూర్ణిమ తూర్పున, పడమట, మధ్య ఆకాశమున వెలుగులు నింపుచున్నది. అట్టి పూర్ణిమ యందు దేవతల మహిమ కారణముగా వసించుచు 'నా కస్య పృష్టే సమీషా మదేమ' నాకమున అన్న సహితులమై ఆనందింతుము గాక. (2)
   
2.    పౌర్ణమాసి అన్నవంత. వరప్రద. ఆమెను మేము "యజామహే" ఆమె మాకు అక్షయము, ఆనందకరమగు ధనము ప్రసాదించును గాక. (3)
   
3.    ప్రజాపతీ! నీవు కాక అన్యుడు విశ్వప్రాణులను సృష్టించలేదు. నీవే సృష్టికర్తవు. మేము ఏది కోరి నీకు హవిస్సులు అర్పించుచున్నామో అది మాకు కలుగును గాక. "వయం స్యామ పతయో రయీణామ్" (4)
   
4.    పౌర్ణమాసి రాత్రింబవళ్ళలో ప్రముఖమైనది. అది యజ్ఞము చేయదగిన రోజు. ఆమెను యజ్ఞము నందు యజించువారు ఫలములు అనుభవించి "తే నాకే సుక్రుతః ప్రవిష్టాః" సుక్రుతులై నాకమున ప్రవేశించుచున్నారు. (5)
   
                                             --౦౦౦--
   
1.    సూర్య చంద్రులు శిశువులు వలె ఒకరి పిదప ఒకరు ఆకసమున పాకుచుందురు. సూర్యుడు సర్వసాక్షియై లోకములను చూచుచున్నాడు. చంద్రుడు ఋతువులు మున్నగు వానిని కలిగించుచున్నాడు. ఇరువురు నిత్యనూతనముగ అవతరించుచున్నారు. (6)
   
2.    చంద్రదేవా! నీవు నిత్యము నూతనుడవై అవతరించుచున్నావు. నీవు తిథులు తెలుపు కేతనమవు. దేవతలకు హవిర్భాగములు అందచేయుచున్నావు. చంద్రదేవా! మాకు దీర్ఘాయువు ప్రసాదించుము. (7)
   
3.    బుధగ్రహమా! నీవు చంద్రుని అంశమవు. యోద్ధలకు స్వామివి. అనూనవు. సంపూర్ణుడవు. నన్ను సంతాన వంతుని ధనవంతుని చేయుము. (8)
   
4.    చంద్రా! అమావాస్యనాడు సూర్య సహితముగా దర్శించతగిన వాడవు. పాడ్యమి నుంచి నీవే దర్శనీయుడవు అగుచున్నావు. తదుపరి పరిపూర్ణుడవు అగుచున్నావు. నీవు సమగ్రుడవు, సమంతుడవై మాకు అశ్వములు, ప్రజలు, పశువులను ప్రసాదించుము. (9)




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.